‘ఏకీకృత’ సమాఖ్య దిశగా...

‘ఏకీకృత’ సమాఖ్య దిశగా...


త్రికాలమ్‌

పార్లమెంటులో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో కలిసి జేగంట మోగించి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమలుకు శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి చరిత్ర పుటలలో పీవీ నరసింహారావు  శాశ్వత స్థానం సంపాదిం చుకున్న విధంగానే మోదీ విజయం సైతం చరిత్రాత్మకం. ఈ సందర్భంగా  శుక్రవారం అర్ధరాత్రి పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో ప్రత్యేక సమావేశంలో  మోదీ చేసిన ప్రసంగంలో సంయమనం ప్రదర్శించారు. జీఎస్టీ స్వప్నం సాకారం కావడంలో ఇతర ప్రధానుల, ఆర్థిక మంత్రుల, ముఖ్యమంత్రుల సహకారం ఉందంటూ వారికి అభివాదాలు చెప్పారు.



శనివారం సాయంత్రం చార్డర్డ్‌ అకౌంటెంట్ల (సీఏ) సభలో ప్రసంగించిన ప్పుడు మాత్రం మోదీ యథావిధిగా విశ్వరూపం ప్రదర్శించారు. ప్రచారార్భ టిలో మోదీని మించిన ప్రధాని లేరు. ప్రతి కార్యక్రమాన్నీ ఘనవిజయంగా అభివర్ణించడం, ప్రతి విజయాన్నీ మరో విజయానికి సోపానంగా పరిగణించడం ఆయన ప్రత్యేకత. తాను తీసుకున్న నిర్ణయాన్ని బలంగా సమర్థించడం, తన సంకల్పాన్ని హృదయాలకు హత్తుకునే విధంగా వివరించి మెప్పించడం, సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం మోదీ వ్యక్తిత్వంలోని విశేషాలు. సీఏల సభలో మోదీ జీఎస్టీ వల్ల కలిగే సత్ఫలితాలను వల్లించడమే కాకుండా పెద్ద నోట్ల రద్దును గొప్ప సాహసోపేతమైన చర్యగా, నల్లధనంపైన సర్జికల్‌ స్ట్రయిక్‌ గా అభివర్ణించారు. పెద్దనోట్ల నిర్ణయం ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ, జీఎస్టీ అమలు ఎట్లా ఉండబోతున్నప్పటికీ ఈ రెండు విధానాలనూ ఎవ్వరూ ప్రశ్నించలేని విధంగా ప్రజలకు చెప్పి ఒప్పించే ప్రతిభ ప్రధాని సొంతం.



జీఎస్టీ గురించి ప్రధాని ఏమి చెప్పారు? ఇది నల్లధనాన్ని రూపుమాపు తుంది. కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఆర్థిక పురోగతిని కొత్త పుంతలు తొక్కిస్తుంది. పన్ను ఉగ్రవాదాన్ని అంతం చేస్తుంది. పన్ను ఎగవేతదారుల భరతం పడుతుంది. పన్నుల వ్యవస్థను సరళీకృతం చేస్తుంది. ఏకీకృతం చేస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తుంది. ఉపయోగాలు చెబుతూ హెచ్చరికలు కూడా చేశారు. మూడు లక్షల సంస్థల జాతకాలను ప్రభుత్వ శాఖలు పరిశీలిస్తున్నాయని చెప్పారు.



అన్నీ సంభవమే

జీఎస్టీ సక్రమంగా అమలైతే ప్రధాని చెప్పినవన్నీ సగటు ప్రజలకు అనుభవంలోకి వస్తాయి. అమలులో సమస్యలు ఖాయంగా ఉంటాయని ప్రవీణులు చెబుతు న్నారు. ఇప్పుడు అమలు జరుగుతున్న జీఎస్టీ ముందుగా అనుకున్న జీఎస్టీ కంటే బలహీనమైనదనీ, కనుక స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు ఒకటి లేదా ఒక టిన్నర శాతం పెరుగుతుందంటూ పాలకపక్షం చేస్తున్న వాదనలో పసలేదనీ ఆర్థికవేత్త,  నీతి ఆయోగ్‌ సభ్యుడు వివేక్‌ దేవ్‌రాయ్‌ స్పష్టం చేస్తున్నారు. ఆయన మోదీ ప్రభుత్వాన్ని బలపరిచే మేధావి. ఈ విషయంలో మాత్రం తీవ్రంగా విభేది స్తున్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా జీఎస్టీని అమలు చేయడం అవసరం. అమలు ప్రారంభించిన అనంతరమే దానిలోని లాభనష్టాలూ, సాధకబాధకాలూ, లోటు పాట్లూ తెలిసివస్తాయి. సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కరించుకోవచ్చు, విధా నంలో సర్దుబాట్లు చేసుకోవచ్చు. జీఎస్టీలో మార్పులు చేయడానికి రాజ్యాంగ సవరణ అక్కరలేదు. జీఎస్టీ మండలికి సంపూర్ణ అధికారాలు ఉంటాయి. ఈ మండలిలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఉంటారు.



జీఎస్టీని  రూపొందించే క్రమంలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం సంభవించింది. రాజకీయంగా ఎంత కీచులాడుకున్నప్పటికీ ఆర్థికంగా దాదాపు అన్ని రాష్ట్రాల మధ్యా ఏకాభిప్రాయం కుదిరింది. ఆర్థిక సంస్కరణల విషయంలో యూపీఏకీ, ఎన్డీయేకీ పెద్దగా అభిప్రాయభేదాలు లేవనేది స్పష్టమే. కానీ 2000లో వ్యాట్‌కు సంబంధించి సుదీర్ఘంగా కొనసాగిన చర్చలు ఒక కొలిక్కి రాక పోవడానికి ప్రధాన కారణం రాష్ట్రాలు తమ ఆదాయాలను తగ్గించుకోవడానికి ఇష్టపడకపోవడమే. పన్నులు విధించేందుకు తమకున్న  అధికారాన్ని వదులు కోలేకపోవడం. పన్ను విధానంలో రాష్ట్రాల మధ్య విభేదాలూ, ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడటం. ఈ వాతావరణానికి పూర్తి భిన్నంగా జీఎస్టీ ప్రయాణం సామరస్యంగా సాగింది. దాదాపు అన్ని పక్షాలూ జీఎస్టీ ఆవశ్యకతను గుర్తించాయి.



2000లో నాటి ఎన్డీయే సారథి వాజపేయి చొరవతో ముగ్గురు ఆర్థిక వేత్తల–సి రంగరాజన్, ఐజి పటేల్, బిమల్‌ జలాన్‌–తో ఒక ఆర్థిక సలహా సంఘాన్ని నియమించడంతో జీఎస్టీకి నాందీప్రస్తావన జరిగింది. ఏకీకృత పన్ను విధానం సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మార్క్సిస్టు పార్టీ నాయకుడు, పశ్చిమబెంగాల్‌ వామపక్ష సంఘటన ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రి అశిమ్‌దాస్‌ గుప్తా నాయకత్వంలో ఒక కమిటీని నియమించారు. 2003లో నియమించిన విజయ్‌ కేల్కర్‌ కమిటీ జీఎస్టీని  రూపొందించాలని సిఫార్సు చేసింది. కమిటీ అధ్యక్ష పదవికి అశిమ్‌దాస్‌గుప్తా తర్వాత కేరళ ఆర్థికమంత్రి కెఎం మణి నియుక్తులైనారు. అనంతరం కాలంలో బీజేపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్, తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులు స్వీకరించారు.



లక్ష్యశుద్ధి ప్రశంసనీయం

విభిన్న దృక్పథాలు ఉన్న వేర్వేరు పక్షాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు అధ్యక్షులుగా ఉన్నప్పటికీ జీఎస్టీ కమిటీ పని సజావుగా సాగడం, లక్ష్యశుద్ధితో కమిటీ వ్యవహరించడం చెప్పుకోదగిన అంశం.  పదవిలో ఉన్నప్పుడు బలపరి చిన విధానాన్ని పదవిలో లేనప్పుడు వ్యతిరేకించడం రాజకీయ పక్షాలకు అలవా టైన కపట రాజకీయ వ్యవస్థలో ఇంతటి సామరస్యం వెల్లివిరియడం శుభపరిణామం. యూపీఏ, ఎన్డీయేల ఆర్థిక సంస్కరణలను వ్యతిరేకించే వామపక్షాలు సైతం జీఎస్టీ విషయంలో కలసిరావడం మంచి మలుపు. ఇది ఇప్పుడిప్పుడే అబ్బుతున్న సుగుణం. 2011లో మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఈ సద్భావం లేదు. బీజేపీ అడ్డుపడింది. వామపక్షాలూ వ్యతిరేకించాయి. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ససేమిరా అన్నారు. 2013లో యూపీఏ చేసిన ప్రయత్నానికి కూడా మోదీ గండి కొట్టారు.



అందుకే జీఎస్టీని సొంతం చేసుకొని, అంతా తన నిర్వాకమే అన్నట్టు మోదీ ప్రచారం చేసుకోవడంతో కినిసిన కాంగ్రెస్‌ పార్టీ ఏదో ఒక సాకు చూపించి అర్ధరాత్రి సభకు గైర్హాజరైంది. పండిట్‌ నెహ్రూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ప్పడు చేసిన ‘ట్రిస్ట్‌ విత్‌ డెస్టినీ’ ప్రసంగాన్ని తలపిస్తూ అదే స్థాయిలో జీఎస్టీ ప్రారంభ సంరంభం చేయడాన్ని కాంగ్రెస్‌ పెద్దలు ఆమోదించలేకపోయారు. ఇందులో మోదీ ప్రచారయావ ఉండవచ్చును కానీ కాంగ్రెస్‌ వైఖరి సంకుచిత మనస్తత్వానికి అద్దం పడుతోంది. అధికార పార్టీలూ,  కూటములూ వస్తూపోతూ ఉంటాయి. ప్రభుత్వం కొనసాగుతుంది. విధానాల రూపకల్పన కూడా అంతే. ఉదాహరణకు 1998 మేలో వాజపేయి పాలనలో పోఖ్రాన్‌లో అణుబాంబు విస్ఫోటనం నిర్వహించాం.



ఈ బాంబులు పీవీ హయాంలోనే అబ్దుల్‌ కలాం పర్యవేక్షణలో  తయారైనాయి. క్లింటన్‌ ఒత్తిడి కారణంగా పీవీ ప్రభుత్వం అణు పరీక్ష నిర్వహించలేకపోయింది. వాజపేయి ప్రధానిగా ప్రమాణం స్వీకరించిన తర్వాత ఆయనను పీవీ కలుసుకొని ‘సామగ్రి అంతా సిద్ధంగా ఉంది. పరీక్ష నిర్వహించడమే తరువాయి’ అని చెప్పారు. అణుపరీక్ష నిర్వహించిన ఖ్యాతి వాజపేయికే వచ్చింది. అదే విధంగా వ్యాట్‌ రూపకల్పనలో నూటికి తొంభైశాతం పని చేసింది వాజపేయి ప్రభుత్వంలోని ఆర్థికమంత్రి యశ్వంత్‌సిన్హా. కానీ దాన్ని ప్రవేశపెట్టిన ఖ్యాతి మన్మోహన్‌సింగ్‌కు వచ్చింది. అదే విధంగా ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (ఎఫ్‌ఆర్‌బిఎం యాక్ట్‌) రూప కల్పన కృషి అంతా యశ్వంత్‌సిన్హాదే. ఖ్యాతి యూపీఏ ఆర్థికమంత్రికి దక్కింది.



జీఎస్టీ నిర్మాణానికి 17 సంవత్సరాలు పడితే అందులో పది సంవత్సరాలు యూపీఏ అధికారంలో ఉంది. మూడేళ్ళు మోదీవీ, నాలుగేమో వాజపేయివీ. ఈ లోగా రాష్ట్రాలలో అనేక రాజకీయ పక్షాలు అధికారంలోకి వచ్చాయి. ప్రతి పక్షంలోకి పోయాయి. అయినప్పటికీ జీఎస్టీ పని ఆగలేదు. 2015లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ జీఎస్టీ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదం  సాధించారు. 2016లో రాజ్యసభ ఎన్డీయే కూటమికి సంఖ్యాబలం లేకపోయినప్పటికీ ప్రతి పక్షాలు ప్రతిపాదించిన సవరణలలో కొన్నిటికి సమ్మతించి బిల్లుపైన ఆమోదముద్ర వేయించుకోలిగారు.



సమాఖ్య స్ఫూర్తికి కొత్త నిర్వచనం

జీఎస్టీ ఆరంభ సభలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, ప్రధాని మోదీ చెప్పినట్టు జీఎస్టీ మండలి సమావేశం 18 సార్లు జరిగినప్పటికీ ఒక్క సమావేశంలో కూడా  ఏ అంశంపైనా ఓటింగ్‌ జరగవలసిన పరిస్థితి రాలేదు. సమాఖ్యస్ఫూర్తిని వదులుకోవడానికీ, ఆర్థిక స్వేచ్ఛ విషయంలో కొంచెం  రాజీపడటానికీ రాష్ట్రాలు సమ్మతించాయి. ఒక రకంగా సమాఖ్యస్ఫూర్తికి కొత్త నిర్వచనం చెప్పుకున్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు స్వీయనిర్ణయాధికారాలపైన పట్టింపు అధికం. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తన పన్ను విధానం నిర్ణయించుకుంటుంది. ఆ దేశంలో వ్యాపారం చేయడం సులువు. పన్నులు సరళంగా ఉంటాయి. జీఎస్టీ లేదు. రాష్ట్రాలు ఒప్పుకోవు. ఇండియాలో జీఎస్టీ అమలులో మొదట కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ  భవిష్యత్తులో పన్ను రాబడి ద్వారా తమ ఆదాయం పెరుగుతుందనే విషయంలో రాష్ట్రాలకు పూర్తి విశ్వాసం ఉంది.



పరోక్ష పన్నులు విధించే ఆస్కారం లేనప్పుడు ఆర్థిక మంత్రుల బడ్జెట్‌ ప్రసంగాలు జమాఖర్చుల చిట్టాలుగా మారిపోతాయి. రహస్యం అంటూ ఉండదు. అంతా బహిరంగమే. జీఎస్టీ విధానంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగినకొద్దీ పన్నుల స్థాయిని తగ్గించాలని సంకల్పం. ఆచరణలో అది జరుగుతుందో, లేదో చూడవలసిందే. పెరిగిన ఆదాయాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధపడతాయా?  కేంద్రం, రాష్ట్రాలు అత్యాశ వదులుకొని ఉంటే పన్నుల స్థాయి ఇంకాస్త తగ్గి ఉండేది. తాత్కాలికంగానైనా ఆదాయం తగ్గించుకోవడానికి ఏ ప్రభుత్వమూ సిద్ధంగా లేదు. దేశభక్తి కారణంగానే ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నామంటూ ప్రధాని చెప్పారు. ఇందులో సాహసం పాలు తక్కువ. నిజంగా సాహసకార్యం చేయాలంటే పన్నుల స్థాయిని 18శాతం మించకుండా చేయవలసింది. దానివల్ల ప్రారంభంలో కొంత ఆదాయం తగ్గినప్పటికీ రానురాను పెరుగుతుంది.



జీఎస్టీని చూసి భయపడకుండా స్వాగతించడానికి అవసరమైన ప్రోత్సాహం ప్రజలకు లభించేది. యూరప్‌ దేశాలలో సగటున 19 శాతానికి మించకుండా పన్నులు ఉన్నాయి. తూర్పు ఆసియా దేశాలలో ఇది 12 శాతమే. సింగపూర్‌లో అయితే అన్ని వస్తువులకూ, సేవలకూ ఒకే పన్ను శాతం. అది చిన్న దేశమైన సింగపూర్‌లో సాధ్యం కానీ, విస్తారమైన, వైవిధ్యభరితమైన భారతదేశంలో సాధ్యం కాదు. నిత్యావసర వస్తువులను పన్నుల వ్యవస్థ నుంచి మినహాయించవలసి ఉంటుంది. కొన్ని వస్తువులపైన 5 శాతం కంటే ఎక్కువ పన్ను వేయకూడదు.



కొన్ని వస్తువులకూ, సర్వీసులకూ 12 శాతం లేదా 18 శాతం పన్ను ఫర్వాలేదు. కానీ 28 శాతం, 40 శాతం పన్ను విధించడం మంచిది కాదని మోదీ ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణ్యం సైతం స్పష్టం చేశారు. కానీ కేంద్రం, రాష్ట్రాలూ సృజనాత్మకంగా ఆలోచించి ధైర్యం చేయవలసిందిపోయి పన్ను స్థాయి యథాతథంగా కొనసాగాలని పట్టుపట్టడం వల్ల ఇన్ని దొంతరల పన్ను విధానం అమలులోకి వచ్చింది. ఆచరణలో జీఎస్టీని మరింత సులభతరం, సరళతరం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతదూరం వచ్చిన తర్వాత జీఎస్టీని వ్యతిరేకించడం అవివేకం. జీఎస్టీని అనుభవం ప్రాతిపదికగా ఉత్తరోత్తరా ఎట్లా సంస్కరించుకోవాలో ఆలోచించాలి.



కె. రామచంద్రమూర్తి

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top