ఆ షో చేయలేక పోవడానికి రాజకీయాలే కారణం

ఆ షో చేయలేక పోవడానికి రాజకీయాలే కారణం


నిజమే. నేను ఆ షో చేయలేక పోవడానికి ప్రధానంగా రాజకీయాలే కారణం. అధికారంలోకి వచ్చిన కొందరు పెద్దలు సహజంగానే... నన్ను ఆ షో నుంచి తప్పించాలని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒత్తిడి చేశారు. మిత్రులందరికీ ముందుగా క్షమాపణలు. గత ఏభై రోజులుగా ఎందరో మెస్సేజీలు ఇస్తున్నా, మెయిల్స్ పంపుతున్నా సమాధానం ఇవ్వనందుకు మన్నించాలని కోరుతున్నాను. 


కావాలనే  నేను ఎవరికీ సమాధానం ఇవ్వలేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎన్టీవీలో రోజూ ఉదయం వచ్చే కేఎస్సార్ లైవ్ షో లో ఎందుకు మీరు కనిపించడం లేదని చాలామంది అడుగుతున్నారు. కొద్దికాలం ఆగి సమాధానం ఇవ్వాలని అనుకోవడం వల్ల రిప్లై ఇవ్వలేదు తప్ప, వేరే కాదు. చాలామంది నా పట్ల ఎంతో అభిమానం చూపుతూ మాట్లాడుతున్నారు. వారందరికీ ధన్యవాదాలు.

 

నిజమే. నేను ఆ షో చేయలేక పోవడానికి ప్రధానంగా రాజకీయాలే కారణం. అధికారంలోకి వచ్చిన కొందరు పెద్దలు సహజంగానే తమ ప్రభావం చూపాలని అనుకున్నారు. అందులో భాగంగానే నన్ను ఆ షో నుంచి తప్పించాలని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒత్తిడి చేశారు. ప్రజాస్వామ్యంలో అన్ని అభిప్రాయాలకు అవకాశం ఉంటుందని నమ్మేవారిలో నేను ఒకడిని, నాకుగా నేను తెలిసి ఎవరికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో వ్యవహరించాలని అనుకోను. ఎప్పుడైనా పొరపాట్లు జరిగితే జరిగి ఉండవచ్చు. కానీ నిజాయితీగా, నిర్మొహమాటంగా, నిష్పక్షపాతంగా ఉండాలన్నదే నా అభిప్రాయం. అందుకు అనుగుణంగానే టీవీ డిబేట్‌లు ఉండాలన్నది నా లక్ష్యం. అందువల్ల పలు సమస్యలు వచ్చే మాట వాస్తవమే.

 

అయినా వాటిని తట్టుకుని ముందుకు సాగాలి. కాని ప్రభుత్వాలకు ఉండే అపరిమితమైన అధికార బలం ముందు వ్యక్తులు నిలబడటం కష్టం. అదే సమయంలో ఒక వ్యక్తి కోసం సంస్థలు దెబ్బతినరాదని నేను భావిస్తాను. వందల మంది ఆధారపడే సంస్థలు బాగుండాలి. అందుకే నేను ఎన్టీవీ నుంచి తప్పుకోవడానికి సిద్ధమయ్యాను. ఇప్పటికే ఒకసారి మూడు నెలలపాటు ఏపీలో టీవీని బంద్ చేశారు. మళ్లీ నా కారణంగా టీవీ ఆగిపోయే పరిస్థితి రాకూడదు. ఆ ఉద్దేశంతో బాధ్యతల నుంచి తప్పుకోవడానికి నిర్ణయించుకున్నాను. కానీ ఎన్టీవీ యాజమాన్యం, చైర్మన్ చౌదరిగారు నాపట్ల సహృదయతతో, గౌరవంతో అందుకు ఒప్పుకోలేదు. దాంతో కొంతకాలం టీవీ షో నుంచి తప్పుకోవాలని అనుకున్నాము.

 

కొద్దికాలం తర్వాత పరిస్థితులు మారతాయని, అప్పుడు తిరిగి షో చేయాలని అనుకున్నాము. ఆ క్రమంలో నేను కొంత కాలం యాజమాన్యం సహకారంతోనే కెనడా వెళ్లి వచ్చాను. అయితే తిరిగి వచ్చాక కూడా ఇంకా సమస్య ఒక కొలిక్కి రాలేదు. సంప్రదింపులు జరుగుతున్నాయని యాజమాన్యం వారు చెప్పారు. మళ్లీ ఉద్యోగం నుంచి తప్పుకుంటానని, సంస్థ నా వల్ల ఇబ్బంది పడవద్దని యాజమాన్యానికి తెలిపాను. కానీ వారు అంగీకరించలేదు. మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. దాంతో నేను కూడా మరీ మొండిగా ఉండరాదన్న ఉద్దేశంతో యాజమాన్యం నాపట్ల చూపిన ఆదరణకు కృతజ్ఞతగా ఉండాలని భావించాను.


బహుశా మరి కొంతకాలం షో లోకి రాలేక పోవచ్చని అనుకుంటున్నాను. ఒకందుకు సంతోషంగా ఉంది. నేను ఎక్కడా ఆత్మ గౌరవాన్ని వదలుకోలేదు. ఎవరు తప్పు చేసినా, ప్రజల పక్షాన మాట్లాడే బాట నుంచి వైదొలగలేదు. నా అభిప్రాయాలు కొందరికి నచ్చకపోవచ్చు. కాని ఒక జర్నలిస్టు చేసే వ్యాఖ్యలకే ప్రభుత్వంలో అగ్రస్థానంలో ఉన్నవారు భయపడతారా? వాడి ఉద్యోగం తీయించుతారా? అని అనుకుంటుండేవాడిని.

 

 కొందరు గొప్ప జర్నలిస్టులకు ఎదురైన అనుభవాలు తెలుసు. నిజానికి నేను అంత గొప్ప వాడినేమీ కాదు. ఆ విషయంలో నాకు స్పష్టత ఉంది. కానీ నేను ఎక్కడా రాజీపడకుండా ఉద్యోగం పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడి నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అలాగే ఒక పార్టీ పట్ల అభిమానమో, ద్వేషమో లేవు. వ్యక్తులపై ఎలాంటి అగౌరవం లేదు. పరిస్థితులు మారతాయని, అధికారంలో ఉన్నవారు ప్రజాస్వామ్య విలువలకు ఎప్పటికైనా గౌరవం ఇస్తారని ఆశిస్తున్నాను.  డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కొమ్మినేని.ఇన్ఫో సౌజన్యంతో..




 - కొమ్మినేని శ్రీనివాసరావు

 వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top