దొంగదూతకి రాజకీయ హారతి

దొంగదూతకి రాజకీయ హారతి - Sakshi


వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాదులు, నిజానికి సమస్త శాస్త్రాలు మనుషుల్ని చీకటి నుంచి వెలుతురు వైపు నడిపించాలి. ఇదేమీ చిత్రమో..! శాస్త్ర విజ్ఞానం పెరిగి ఆకాశం ఆవలి దిక్కు గుట్టు విప్పుతున్న వేళ అంధ విశ్వాస్వాలు చెలరేగి మనిషిని అధఃపాతాళానికి తొక్కేస్తున్నాయి. ఎంత దౌర్భాగ్యం కాకపోతే ఈడొచ్చిన ఆడపిల్లకు పెళ్లి చేసి కాపురానికి పంపాల్సింది పోయి మూఢభక్తితో సాధ్వీని చేసి నయవంచక బాబా చేతిలో పెట్టడం, ఆ బాబా మృగంలా చెలరేగి లేడిపిల్లను వేటాడినట్టుగా మన బిడ్డల వెంటబడి చెరుస్తుంటే కండ్లు మూసుకొని తన్మయత్వంతో భజన చేయడం, పాలకులు భార్యబిడ్డలతో వెళ్లి బాబాల కాళ్లు కడిగి నెత్తిన పోసుకొని పరవశించి పోవటం చూస్తుంటే... భవిష్యత్తులో దొంగలు, ఖూనీకోర్లు, రేపిస్టులు దర్జాగా బాబాల   రూపందాల్చే ప్రమాదం కనిపిస్తోంది.



ఎట్టకేలకు డేరా సచ్చ సౌదా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ బాబా పాపం పండింది. పదో తరగతి కూడా ఉత్తీర్ణుడు కానీ మానవ మృగం దైవాంశ సంభూతునిగా, రాజకీయ ప్రభావశీలిగా ఎదగటం అబ్బురమేమీ కాదు. ఉత్తర భారత రాజకీయ పునాదుల మీద సిర్సా జిల్లాలోని డేరా సచ్చా సౌదా నిలబడింది. వందల మంది దళిత, నిరుపేద జనాల భూములపై డేరా వేస్తే అక్కడి ప్రభుత్వాలు వారి ఎర్ర తివాచీలు పరిచాయి. తెలంగాణలో నయీం, పంజాబ్, హరియాణాలో డేరా బాబా ఇద్దరూ ఒక్కటే. కాలుష్యపు రాజకీయ సాగులో ఎదిగిన వటవృక్షాలే. రాజ్యహింసకు, దుర్మార్గపు ఆలోచనకు, అక్రమ సంపాదనకు కార్యరూపం ఇచ్చేందుకు అప్పట్లో చంద్రబాబునాయుడు నయీం అనే విషనాగును పొంచి పోషించి, దాన్ని ప్రజల మీదకు వదిలాడు. కేసీఆర్‌ ప్రభుత్వం ఆ రాబందును వధించే నాటికి ఎంత మందిని చంపాడో.. ఎంత మంది భూములు గుంజుకున్నడో లెక్కే లేదు.



గుర్మీత్‌సింగ్‌ ఆధ్యాత్మిక ముసుగు కప్పుకున్న నయా నయీం. సాధ్వీలుగా చేరిన 300 మంది బాలికల్లో 250 మందిపైగా బాలికలపై అత్యాచారం చేశాడు. ఎదురు తిరిగిన దాదాపు 300 మంది పురుషుల వృషణాలను ఛిద్రం చేసి నపుంసకులుగా మార్చాడు. సచ్చ సౌదా అంటే ‘సత్యం పలికే స్థలం’. కానీ ఇదే స్థలంలో పదుల సంఖ్యలో యవతీయువకులను హత్య చేసి పాతి పెట్టిన ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరిగినా అక్కడి పాలకులు ఆయన మీద ఈగ వాలనీయలేదు. ఎందుకంటే దళిత, ముస్లిం, క్రిస్టియన్‌ అణగారిన వర్గాల ఆరాధ్యదైవంగా ఎదిగిన గుర్మీత్‌ పంజాబ్‌ , హరియాణా రాష్ట్రాల్లో అత్యంత రాజకీయ ప్రభావశీల వ్యక్తిగా మారాడు. డేరా బాబా అనుగ్రహం ఉన్న వాళ్లదే ఆధికారం పీఠం అనే వాతావరణం సృష్టించాడు. అంతెందుకు, ఒకవైపు ఆయన మీద రేప్‌ కేసు విచారణ జరుగుతుండగా.. 2014లో ఎన్డీఏ ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ సిర్సా బహిరంగ సభలో గుర్మీత్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, పంజాబ్‌ సీఎం( కాంగ్రెస్‌) అమరీందర్‌సింగ్‌ అయన డేరాకు వెళ్లి మొకరిల్లి వచ్చినవారే.



ప్రజారోగ్యాన్ని విస్మరించి, ప్రజా ఉద్వేగాలను అణ చి వేసే సంస్కృతి ఉన్న మన దేశంలో బాబాలు, బాణామతులు అంతకంతకు ఎదుగుతూనే ఉంటాయి. భారతావనిలో∙లైంగిక దాడులకు పాల్పడిన సన్యాసులలో డేరా బాబాయే మొదటివాడు కాదు. ధ్యానపీఠ ఆశ్రమ అధిపతి నిత్యానంద, జబల్‌పూర్‌ ఆశ్రమ అధిపతి వికాసానంద, హరియాణాలో సంత్‌ రాంపాల్, తిరుచురాపల్లి ఆశ్రమ పీఠాధిపతి ప్రేమానంద, గుజరాత్‌లో ఆశారాం బాబా ఇలా చెప్పుకుంటూ చాంతాండంత జాబితా ఉంది. దేశంలో వందమందిలో 70 మంది ప్రజలకు ఆరోగ్యం అందుబాటులో లేదు. ఉత్తరభారతదేశంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ప్రజలకు ప్రభుత్వ వైద్యం మీద నమ్మకం లేదు. ఇటీవల ఆక్సిజన్‌కు డబ్బులు చెల్లించలేదని కాంట్రాక్టర్‌ బీఆర్‌డీ ఆసుపత్రికి నిర్దాక్షిణ్యంగా ఆక్సిజన్‌ సరఫరా నిలిపివేస్తే 70 మంది పసికందులు చనిపోయిన దుర్ఘటన జరిగింది. జార్ఖండ్‌ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్‌ ఎంజీఎం (మహాత్మగాం«ధీ మెమోరియల్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌)లో ఇంక్యుబేటర్లు పని చేయకపోవటం వలన 52 మంది చిన్నారులు ప్రాణాలు విడిచిన సంఘటనలు ప్రభుత్వ వైద్యంపై ఉన్న అపనమ్మకాన్ని మరింత పెంచేవే. దీనితో ప్రజలు బాబాల వైపు మళ్లుతున్నారు. భక్తి ప్రవచనాలు, ప్రేత పిశాచ వినాశక మంత్రాలు, కొద్దిపాటి ఆసుపత్రుల నిర్మాణంతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇటువంటి విద్యతోనే గుర్మీత్‌ బాబా దళితులను, అణగారిన వర్గాల వారిని ఆకర్షించాడు. వారినే మానవ కవచంగా ఉపయోగించుకొని కోట్లకు పడగలెత్తాడు. అటు కోట్లు, ఇటు నిమ్నజాతుల ప్రజల అండదండతో అంతులేని అరాచకాలకు తెగబడ్డాడు. బతికి ఉండగానే స్వర్గంలో సీటు రిజర్వ్‌ చేసే బాబాలు, పిల్లలు పుట్టించే బాబాలు, ముద్దుపెట్టి రోగం నయం చేసే బాబాలు చాలా మందే ఉన్నారు. ప్రజలు అజ్ఞానంతో ఉన్నంత కాలం బాబాలు పుట్టుకొస్తూనే ఉంటారు.. అలాంటివాళ్ల ముందు పాలకులు మోకరిల్లుతారనేది దాచేస్తే దాగని సత్యం.



వ్యాసకర్త దుబ్బాక ఎమ్మెల్యే, సెల్‌ 9440380141

సోలిపేట రామలింగారెడ్డి

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top