‘ఉస్మానియా’కు రాజకీయం జబ్బు

‘ఉస్మానియా’కు రాజకీయం జబ్బు - Sakshi


ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాలు కూడా ప్రకటనలకు పరిమితం కాకుంటే మంచిది. అదే ఆవరణలో, లేదా మరో అనువైన చోట మంచి భవన సముదాయాన్ని నిర్మించి అక్కడికి దానిని తరలించి, పాత భవనాలకు మరమ్మతులు చేసి నిజాం నిర్మించిన ఆ భవనాన్ని పర్యాటక స్థలంగా మారిస్తే ప్రభుత్వానికి పేరూ వస్తుంది, వివాదాలకూ తావుండదు. అయినా నిరంకుశ నిజాం ప్రభువును పొగిడినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మీద కన్నెర్ర చేసిన వారికి ఇప్పుడు ఆ నిజాం కట్టిన భవనాలను కూల్చేస్తామంటే అభ్యంతరమెందుకో?

 

 మనుషుల ప్రాణాలకు, అందులోనూ కదలలేని స్థితిలోని రోగుల ప్రాణా లకు ముప్పు ఉందనుకున్నప్పుడు, వారిని రక్షించడానికి ప్రభుత్వం ఎటు వంటి చర్యలు తీసుకున్నా అభినందించాల్సిందే. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని పేద రోగులకు ఉస్మానియా దవాఖానా ఎంతో కాలంగా పెద్ద దిక్కుగా ఉంది. హైదరాబాద్ చుట్ట్టు పక్కల నుంచేగాక, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చే వేలాది మంది రోగులకు, ముఖ్యంగా పేదలు, మధ్య తరగతి జీవులకు అది ఎంతో ఉపయోగ పడుతోంది.

 

 ఇప్పుడు దానికే ‘జబ్బు’ చేసింది. ఇప్పుడో అప్పుడో కూలిపోయేట్టుగా ఉంది కాబట్టి, ఉస్మానియా ఆసుపత్రిని కూల్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైద రాబాద్ సంస్కృతికి చిహ్నంగా నిలిచే ఆ భవనాలను ఎట్లా కూల్చే స్తారని ప్రతిపక్షాలు, పౌర సంఘాలు, కొందరు మేధావులూ ప్రశ్నిస్తున్నారు. కూల్చడానికి వీల్లేదని ఉద్యమమూ మొదలు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేదనే అనుకుందాం. పాతదై, శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా దవాఖానా భవనాలు... జరగరానిదే జరిగి, ఎప్పుడో కూలితే ఏమిటి పరిస్థితి? స్వయం రక్షణ చేసుకోలేని రోగుల గతి ఏం కాను?  దురదృష్టవశాత్తూ నిజంగానే అలాంటి దుర్ఘటనేదైనా జరిగితే ప్రభు త్వం పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఉస్మానియాను ముట్టడానికి వీల్లేదంటున్న ప్రతిపక్షాలు, పౌర సంఘాలు, మేధావులు దాన్ని బతకనిస్తారా? అసలు ప్రభుత్వం ఉంటుందా?

 

 తెలంగాణ సంస్కృతంటే ఆ భవనాలేనా?

 ఉస్మానియా ఆసుపత్రి భవనాలను కూలగొట్టి అక్కడ జంట ఆకాశ హర్మ్యా లను (ట్విన్ టవర్స్) నిర్మించాలని ప్రభుత్వం అనుకుంటున్నది. ఇది ఎంత వరకు సబబు? ఇందులో వేరే మతలబులు ఏమయినా ఉన్నాయా? ప్రభుత్వ నిర్ణయం ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడుతుంది? అన్న విషయాలను చర్చిస్తే మంచిది. ఇప్పటికైతే ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని కొంత కాలం పాటూ వాయిదా వేసుకున్నట్టు కనిపిస్తున్నది. నిపుణుల కమిటీ సిఫార్సుల కోసం వేచి చూస్తున్నట్టు వార్తలొచ్చాయి. మంచిదే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు నిజంగానే అవసరమైతే, ఆ భవనాలు పూర్తిగానే శిథిలమై ఇప్పుడో, అప్పుడో కూలే పెద్ద ఉపద్రవానికి అవకాశం ఉందంటే వద్దని ఎవరూ అనరు. అంటే అది మూర్ఖత్వమే అవుతుంది. అలాంటి వారిని ప్రభుత్వం లెక్క చెయ్యాల్సిన పనే లేదు.

 

 కానీ ఉస్మానియా దవాఖానా భవనాల విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. నిపుణులు సైతం పరస్పర విరుద్ధమైన అభిప్రా యాలను వ్యక్తం చేస్తున్నారు. వారిలో పురాతన కట్టడాల నాణ్యతను బేరీజు వెయ్యగల సంస్థలూ, వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ భవన సముదాయం ఇంకా ఎంతకాలం మనగలుగుతుంది? ఎప్పట్లోగా కూలిపోతుంది? అనే అంశాలపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఒకరు అయిదేళ్ళ కంటే ఉండదంటుంటే, మరొకరు మరమ్మతులు చేస్తే మరి కొన్ని వందల ఏళ్లపాటూ ఢోకా లేదం టున్నారు.

 

 ప్రభుత్వం ఏం చెయ్యాలి? ఎవరి మాట వినాలి? రోగులకు మెరు గైన సేవలు అందించడానికి, రోగులు, సిబ్బంది సురక్షితంగా ఉండటానికి ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా ఆహ్వానించాల్సిందే. ఉస్మానియా దవాఖానా భవనాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నాలేమీ కావు, వాటిని కూల్చేసినందు వల్ల తెలంగాణ సంస్కృతికి వచ్చే నష్టం ఏమీ ఉండదు అని ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిసున్నవారి వాదన. ఆ నిర్ణయాన్ని సమర్థించే మీడియాలోని ఒక వర్గం గాంధీ ఆస్పత్రి భవనాలను ముషీరాబాద్ జైలు ఆవరణకు తరలించిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్పుడు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు మాట్లాడటం ఏమిటి? అంటున్నారు. అప్పుడు మాట్లాడని వ్వనందుకే కదా తెలంగాణ కావాలంది. ఇప్పుడు కూడా మాట్లాడనివ్వం అంటే అప్పటికి, తెలంగాణ రాష్ర్టం సాధించాక ఇప్పటికి తేడా ఏమిటి?

 

 తరలింపుతో కాదు..ఏకపక్ష నిర్ణయంతోనే తంటా

 సరైన చోట లేదనుకుంటే, వైద్య సదుపాయాలకు అనువుగా లేదనుకుంటే, చికిత్స కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందికరంగా ఉందనుకుంటే... ఏ ఆసుప త్రినైనా మరింత మెరుగైన చోటికి మారుస్తామంటే ఎవరూ అభ్యంతర పెట్టకూడదు. గాంధీ ఆసుపత్రి తరలింపును అలాగే చూడాలి. అంతేగానీ సమైక్య రాష్ర్టంలో తరలిస్తే తప్పు, తెలంగాణలో తరలిస్తే ఒప్పు అని వేర్వే రుగా ఉండదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నప్పటికి, ముషీరాబాద్ జైలు ఆవరణలోని కొత్త భవనాలకు మారినప్పటికీ గాంధీ ఆసుపత్రిలో ఎంత తేడా వచ్చిందో గమనించిన వారు ఉస్మానియాను మరో చోటికి మార్చడాన్ని వ్యతిరేకించరు. అసలు ముషీరాబాద్ జైలు తరలింపునే ఇంకొందరు తప్పు పడుతున్నారు. ఆ జైలుకో గొప్ప చరిత్ర ఉందంటున్నారు. ఈ వాదన చేస్తున్న వారు ఒకసారి చర్లపల్లి జైలును చూసి వస్తే బాగుంటుంది. అంతెందుకు, బేగంపేట విమానాశ్రయాన్ని శంషాబాద్‌కు తరలించినప్పుడూ ఊరి మధ్యలో నుంచి ఎక్కడికో దూరంగా తరలిస్తారా? అని విమర్శించిన వారు న్నారు. నగరం విస్తరిస్త్తున్నది, జనాభాతో బాటు అవసరాలూ పెరుగుతు న్నాయి. ఎన్నో మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవసర మనుకుంటే ఉస్మానియా దవాఖానాను ఆ భవనాల నుంచి మార్చొచ్చు. అదే ఆవరణలోని ఖాళీ స్థలాల్లో కొత్త భవనాలను నిర్మించవొచ్చు. సరిపోదను కుంటే దగ్గరలోనే ప్రత్యామ్నాయ స్థలంలో కొత్త భవనాలను నిర్మించి శాశ్వతంగా ఉస్మానియా దవాఖానాను వాటిలోకి తరలించవొచ్చు.

 

 అందు కోసం ఇప్పుడున్న ఉస్మానియా దవాఖానా భవన సముదాయాన్ని శాశ్వ తంగా కూల్చేయనక్కర లేదు. మన ప్రభుత్వం ఎంతో అభిమానించే నిజాం రాజుల నజారానాను మర మ్మతులు చేసి పర్యాటకుల సందర్శన స్థలంగా ఉండనివ్వవచ్చు. ఎవరూ ఆక్షేపించరు. మరి ఎందుకీ వ్యతిరేకత? ఉస్మానియా దవాఖానా భవనాలు ప్రమాదకరస్థితిలో ఉన్నాయి, వాటిని మరమ్మతు చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి ఉందని ప్రభుత్వం.. ప్రతిపక్షాలు, నిపుణులు సహా నలుగురితో చర్చించి ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. ప్రభుత్వం అటువంటి పని చెయ్యకపోవడం వల్లనే సందే హాలు. పైగా ఏ నిమిషానికి ఏమి తోస్తే అది ప్రకటించేయడం ఈ ప్రభు త్వానికి అలవాటైందన్న అభి ప్రాయమూ ప్రజల్లో బలంగా ఉంది.

 

 ‘ఉస్మానియా’ కారాదు ఊహా సౌధం

 ఇప్పటికే తెలంగాణ రాష్ర్టం ఏర్పడి, కొత్త ప్రభుత్వం వచ్చాక బోలెడన్ని భవనాలను కూల్చేయడం, కొత్తవి కట్టేయడం అంటూ ఎన్నో ప్రతి పాదనలు వినీ ఉన్నాం. మరునాటికే అవి అటక ఎక్కడమూ చూశాం. సచివాలయాన్ని ఎర్రగడ్డకు మారుస్తామన్నారు. ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రి సముదాయాన్ని వికారాబాద్ దగ్గరి అనంతగిరికి తరలిస్తామన్నారు. రవీంద్ర భారతిని కూలగొట్టి, మరో కొత్త భారతిని నిర్మిస్తామన్నారు. హుస్సేన్ సాగర్‌లోని నీళ్లన్నీ తోడి. అవతల పారబోసి దాన్ని స్వచ్ఛమైన మంటి నీటి సరస్సుగా చేసేస్తామన్నారు.

 

 వినాయక నిమజ్జనం దగ్గరికొస్తున్నదిగానీ, అందుకోసం ఇందిరా పార్క్‌లో తవ్విస్తామన్న కొత్త సరస్సు ఊసే లేదు. ఇక సంజీవయ్య పార్క్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్స్‌ను నిర్మి స్తామన్నారు. ట్యాంక్ బండ్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు నిర్మించి హైదరా బాద్‌ను డల్లస్ నగరం చేస్తామన్నారు. ఈ ఏడాదికాలంలో ఇలాంటి ప్రకట నలు చాలానే వచ్చాయి. అన్నీ ఒక్క రోజులో అయిపోయేవి కావు నిజమే. కానీ అవి కనీసం ప్రతిపాదనల దశకైనా చేరక పోవడంతో ప్రభుత్వం నవ్వుల పాలవుతోంది. ఉస్మానియా దవాఖానాకు కొత్త భవనాలను సమకూర్చే పథకం కూడా వాటిలా ప్రకటనలకు పరిమితం కాకుంటే మంచిది.

 

అదే ఆవరణలో, లేదా మరో అనువైన చోట మంచి భవన సముదాయాన్ని నిర్మిం చి అక్కడికి ఉస్మానియా దవాఖానాను తరలించి, పాత భవనాలకు మరమ్మ తులు చేసి ఒకప్పటి నిజాం నిర్మించిన దవాఖానాగా పర్యాటకుల సందర్శ నార్థం ఉంచితే ప్రభుత్వానికి మంచి పేరూ వస్తుంది, వివాదాలకూ తావుం డదు. చివరగా ఒక్క మాట నిరంకుశ నిజాం ప్రభువును పొగిడినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మీద కన్నెర్ర చేసిన వారికి ఇప్పుడు ఆ నిజాం కట్టిన భవనాలను కూల్చేస్తామంటే అభ్యంతరమెందుకో?

 datelinehyderabad@gmail.com

 - దేవులపల్లి అమర్


 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top