మాట మరిస్తే ప్రజలు క్షమించరు

మాట మరిస్తే ప్రజలు క్షమించరు


కేంద్ర ప్రత్యేక నిధులు, గ్రాంట్లు, పన్నుల రాయితీలు, తగ్గింపులే స్వదేశీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలుగుతాయి. బాబు సింగపూర్ మాయాజాలాన్ని మెచ్చి వచ్చేది రాజధాని పేరిట సేకరిస్తున్న లక్షల ఎకరాల భూములను రియల్ ఎస్టేట్ ఆస్తులుగా సొంతం చేసుకునే మాయావులే తప్ప, నిజమైన పెట్టుబడిదారులు కారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తే.. కేంద్రానికి ఎదురు నిలిచి పోరాడి ప్రత్యేక హోదాను సాధించడానికి కృషి చేసి ఉండేది.  

 

 భారత పార్లమెంటు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 విభజనానంతర అంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చట్టపరమైన హామీనిచ్చింది. దాన్ని ఇంతకాలం అమలు చేయకపోవడమే అర్థరహితమంటే, దాదాపు ఏడాది తర్వాత 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులు ఏపీకి ప్రత్యేక హోదాను కల్పించడానికి అడ్డంకిగా మారా యంటూ బట్టతలకీ మోకాలుకీ ముడివేసే కుతర్కం మరింత అర్థరహితం. ఆ తర్కాన్ని ప్రదర్శిస్తున్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావడం దురదృష్టకరం. ఎందుకంటే నేటి ప్రధాని నరేంద్ర మోదీ, ఆయనకు ఆంతరంగికునిగా పేరుమోసిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వంటి బీజేపీ అగ్రనేతలు గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదాకు హామీని ఇవ్వడమే కాదు, కనీసం పదేళ్లు ఆ హోదాను కొనసాగించడం అవసరమని చెప్పారు.

 

 విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోతోందని అత్యంత విస్పష్టంగా ప్రకటించారు, తాము అధికారంలోకి వస్తే ఆదుకుంటామని అభయహస్త మిచ్చారు. అందుకే నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దగా పడ్డామని భావిస్తున్నారు, ప్రత్యేక హోదా మా జన్మహక్కని నినదిస్తున్నారు. అయినా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీల అగ్రనేతలకు సన్నిహితులైనవారి నోట ప్రత్యేక హోదా అసాధ్యం, అనవసరం అనే మాటలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఆర్థికాభివృద్ధి-ప్రత్యేక హోదాల మధ్య ఉన్న సంబం ధాన్ని చర్చించాల్సి వస్తోంది.

 

కఠోర సత్యాన్ని కప్పిపుచ్చే యత్నం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి తీవ్ర వ్యత్యాసాలతో, విపరీత ఆర్థిక, పారిశ్రామిక కేంద్రీకరణతో సాగింది. ఫలితంగానే నేటి ఏపీలోని ఉత్తరాంధ్ర, రాయలసీమలతో పాటూ కోస్తాలోని కొన్ని ప్రాంతాలు అన్ని రంగాల్లోనూ పూర్తిగా వెనుకబడిపోయాయి. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర, రాయలసీమలకు వెనుకబాటుతనం దీర్ఘకాలిక రుగ్మతగా మారింది. అయినా ఉమ్మడి రాష్ట్రం ఒకే ఆర్థిక యూనిట్‌గా ఉండటం వల్ల రాష్ట్ర, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కొంత సమంజసమైన స్థితిలోనే ఉండేది. కానీ విభజనానంతరం ఏపీ ఆర్థిక దుస్థితి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూలో హైదరాబాద్ వాటాను చూస్తే స్పష్టమవుతుంది. 2012-13లో రాష్ర్ట మొత్తం రాబడి రూ.70,548 కోట్లు కాగా పరిశ్రమలు, వ్యాపారం, సేవలు అన్నీ కేంద్రీకృతమైన హైదరాబాద్ వాటా అందులో రూ.34,000 కోట్లకు పైగా ఉంది.

 

 విభజనానంతరం హైదరాబాద్ రాబడిలో ఏపీకి ఎలాంటి వాటా లేదు. కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి హఠాత్తుగా దివాలా తీసిన స్థితికి చేరింది. అందుకే పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రత్యేక హోదాను ఇచ్చింది. ఏపీకి సువిశాల తీరప్రాంతం ఉండటం వంటి సానుకూల అంశాలను భూతద్దాల్లో చూపిస్తున్నారు. ప్రత్యేక హోదా లేకుండానే ఏపీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీలు స్వర్గసీమగా మార్చేస్తారనీ, సింగపూర్, మలేసియా, జపాన్‌ల నుంచి ‘అభివృద్ధి’ని నేరుగా దిగుమతి చేసేస్తారనీ ప్రచారం చేస్తున్నారు. తద్వారా మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగం నామమాత్రావశిష్టంగా ఉన్న ఏపీని తిరిగి అభివృద్ధి పట్టాలెక్కించడమంటే మాటలు కాదనే కఠోర సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

 

 ప్రత్యేక హోదాకు అర్హత లేదా?

 ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలుగా గుర్తించడానికి కేంద్రం కొన్ని నిర్దిష్ట పరిస్థితులను సూచించింది. వాటిలో మొదటిది, మైదాన ప్రాంతం తక్కువగా ఉండి పర్వత ప్రాంతం ఎక్కువగా ఉండటం. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు తప్ప మిగిలిన ఏపీ జిల్లాలన్నిటిలోనూ మైదాన ప్రాంతాలు తక్కువే. ఇక రెండవది, జనసాంద్రత తక్కువగా ఉండి, గిరిజన జనాభా ఎక్కువగా ఉండటం. ఉత్తరాంధ్రలో గిరిజన జనాభా ఎక్కువగా ఉంది. ఎత్తై పర్వత ప్రాంతం కూడా ఎక్కువ. మూడవది సరిహద్దుల వెంబడి ఉండే వ్యూహాత్మక కీలక ప్రాంతం.

 

 ఏపీకి ఉన్న 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఆర్థికాభివృద్ధికి తోడ్పడం సంగతి ఎలా ఉన్నా, భవిష్యత్తులో రక్షణ పరంగా పెద్ద సవాలుగా మారనుంది. ఇక నాలుగవది, ఆర్థికంగా వెనకబడి, మౌలిక వసతులు లేని ప్రాంతం కావడం. రాష్ట్రంలోని ఏడు జిల్లాలు సరైన రవాణా సౌకర్యాలు సహా మౌలిక వసతుల లేమితో బాధపడుతున్నవే. ఐదవది తలసరి ఆదాయం తక్కువగా ఉండటం.  కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో సగటు తలసరి ఆదాయం చాలా తక్కువ. పైగా రాష్ట్ర విభజనవల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సర్వాంగాలు చచ్చుబడిన స్థితిలో ఉంది. తిరిగి కోలుకొని వృద్ధి బాటలో ముందుకు సాగాలంటే కేంద్రం నుంచి ప్రత్యేక సహాయం అవసరం.

 

 నీటి మూటలు... పగటి కలలు

 ప్రత్యేక హోదా వల్ల కేంద్రం ఇచ్చే పన్నుల రాయితీలు, తగ్గింపులు మాత్రమే మన రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టేలా స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించగలుగుతాయి. చంద్రబాబు సింగపూర్ మాయాజాలం వల్ల వచ్చి పడేది రాజధాని పేరిట లక్షల ఎకరాల పంట భూములను రియల్ ఎస్టేట్ ఆస్తులుగా సొంతం చేసుకునే మాయావులే తప్ప పెట్టుబడులు కాదు. పైగా ప్రత్యేక హోదా కింద 90 శాతం గ్రాంట్లతో చేపట్టే ప్రాజెక్టులతో మాత్రమే రోడ్లు, విద్యుత్తు తదితర మౌలిక వసతుల అభివృద్ధి సాధ్యం. వాటితో పాటే పరిశ్రమలు, సేవలు, ఉపాధి అవకాశాలు వృద్ధి చెందుతాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 90 శాతం గ్రాంటుగా లభిస్తుంది. ప్రత్యేక హోదావల్ల వచ్చే ఈ ఆసరాలేవీ లేకుంటే రాష్ట్రం మరింత అధోగతికి చేరడం ఖాయం. జీతాలు ఇవ్వడానికి దిక్కులేని ప్రభుత్వం మెట్రో రైళ్లు, ఆకాశ మార్గాలు, భూగర్భ రహదారులు అంటూ చెప్పే మాటలు నీటి మూటలు, పగటి కలలే.

 

 హోదాతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి

 చంద్రబాబు ప్రధాని మోదీతో ఏ మంత్రాంగమో చేసి కలల రాజధానికి కావలసిన లక్షల కోట్ల నిధులను తేలేరనేది ఇప్పటికే తేలిపోయింది. అయినా, ఆయన కేంద్ర ఖజానాను ఏపీలో కుమ్మరించేలా చేస్తారనుకున్నా... ఏపీ భవిత అంధకారబంధురమే. ఎందుకంటే చంద్రన్న కలల రాజధాని వచ్చి పడితే మరోమారు ‘హైదరాబాద్’ చరిత్ర పునరావృతమౌతుంది. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, విద్య, వైద్య సదుపాయాలు సకలమూ అక్కడే కేంద్రీకృతమవుతాయి. వెనుకబాటుతనంతో కుములుతున్న ఉత్తరాంధ్ర ఇప్పటికే రగులుతోంది.

 

 దీర్ఘకాలిక క్షామ పీడిత ప్రాంతంగా నీటి చుక్క కోసం అల్లాడుతున్న రాయలసీమ రాజధాని విషయంలో మరోమారు దగా పడ్డామనే ఆగ్రహంతో మండుతోంది. రాష్ట్ర అభివృద్ధి అంతా రెండు జిల్లాలకు పరిమితమైన పరిస్థితిలో వెనకబడిన ప్రాంతాలు ఇంక వెనకబడిపోక తప్పదు. అంతేగానీ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి అసంభవం. ప్రత్యేక హోదా ఉంటేనే కేంద్ర పథకాల ద్వారా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి జరుగు తుంది. అప్పుడే సంతులితవృద్ధి సాధ్యం. సంతులిత వృద్ధి ద్వారా మాత్రమే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అలాంటి వ్యూహం, అభివృద్ధి పంథా రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో లేకపోవడం శోచనీయం. ప్రత్యేక హోదాపై దాని నిర్లక్ష్యానికి అది కూడా ఒక ముఖ్య కారణం.

 

 పార్లమెంటు ఆమోదించిన చట్టం హామీ ఇచ్చిన ప్రత్యేక తరగతి హోదాను కల్పించాల్సిన బాధ్యతను నిర్వర్తించాల్సిన కేంద్ర ప్రభుత్వం... అందుకోసం ప్రాణత్యాగాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం శోచనీ యం. దేశ ప్రధానే ఇచ్చిన మాటను మరవడం మన ప్రజాస్వామ్యానికి పట్టిన  దౌర్భాగ్యం. 2014లోనే కేంద్ర మంత్రి మండలి ఏపీకి పదేళ్ల ప్రత్యేక హోదాకు ఆమోదముద్ర వేసి ప్రణాళికా సంఘానికి పంపింది. ఇంకేం కావాలి? అంతకు మించిన ఉన్నత శాసన స్థాయి, పరిపాలనా స్థాయి ఉన్నదా?

 

 ప్రజలతో చెలగాట మాడుతారా?

 రాష్ట్రాన్ని పాలిస్తున్న టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తే.. కేంద్రానికి ఎదురు నిలిచి పోరాడి ప్రత్యేక హోదాను సాధించడానికి కృషి చేసి ఉండేది. తానే ముందుండి ప్రతిపక్షాలను కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేది. కానీ అందుకు భిన్నంగా ప్రపంచంలోనే లేని అపురూపమైన రాజధానిని నిర్మించాలనే కలల లోకంలోనే పరిభ్రమిస్తూ ఉంది. ఆ కలల రాజధాని సాకారమైనా కాకున్నా అభివృద్ధి కేంద్రీకరణ జరగడం, మిగతా ప్రాంతాల అభివృద్ధి కుంటుపడటం తప్పదనిపిస్తోంది. అదే జరిగితే మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలు తలెత్తడానికి పునాదులను వేస్తున్న ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదే అవుతుంది.



ఇప్పటికే రెండు ముక్కలైన తెలుగు జాతిని మళ్లీ ముక్కలు చెక్కలు చేస్తారా? లేక ప్రత్యేక హోదాను సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా? సమాధానం చెప్పాల్సింది టీడీపీ ప్రభుత్వమే. దక్షిణాదిన  విస్తరించాలని శతవిధాలా యత్నిస్తున్న బీజేపీ మాట తప్పిన పార్టీ అపఖ్యాతితో ఆ పని చేయగలదా? ప్రజలతో, ప్రజాస్వామ్యం చెలగాటం చాలా ప్రమాదం. ఇది చరిత్ర చెప్పిన సత్యం.

 (వ్యాసకర్త రావూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు)

 మొబైల్:  98663 22172

 - వి.నాగరాజ నాయుడు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top