తాలిబన్ బలమూ... పాకిస్తాన్ బలహీనతా...

తాలిబన్ బలమూ... పాకిస్తాన్ బలహీనతా...


పాకిస్తాన్ గడ్డపై ఇస్లామిక్ షరియా చట్టాన్ని అమలు చేయాలంటున్న తాలిబన్ శక్తులకూ, బ్రిటిష్ వలసవాద లౌకిక పునాదిని ఎంతో కొంతమేరకు కొనసాగించదలిచిన పాక్ పాలక వ్యవస్థకూ మధ్య పోరాటం ఇప్పుడిప్పుడే ముగియటం కష్టం. ఈ చిక్కు సమస్యను పరిష్కరించనంతవరకూ, తాలిబన్‌కు వ్యతిరేకంగా సాగే ఏ పోరాటమూ విజయం పొందదు.

 

 పాకిస్తాన్ తాలిబన్‌లు వాస్తవంగా ఏం కోరుకుంటున్నారు? వారితో పోరాటం పాక్‌కు ఎందుకు కష్టమవుతోంది? ప్రస్తు తం ప్రపంచమంతటా మార్మోగుతున్న ప్రశ్న ఇది. ప్రపంచ ప్రసిద్ధ పత్రికలు, వార్తా ఏజెన్సీలు ఇప్పుడీ ప్రశ్న చుట్టూనే తిరుగుతూ సమాధానం కోసం జల్లెడ పడుతున్నాయి. పెషావర్ సైనిక పాఠశాలలో సిబ్బందితో సహా 145 మంది చిన్నారుల రక్తం పారించిన పాక్ తాలిబన్ ఘాతుక చర్యా, దాని లక్ష్యాలూ ప్రపంచ వార్తగా మారాయి. పెషావర్ మారణకాండ జరిగిన వెంటనే అసోసియేటెడ్ ప్రెస్ పాకిస్తాన్ తాలిబన్ ఏం చేయదల్చింది? అనే కథనాన్ని ప్రచురించింది. పాకిస్తాన్‌లో ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టి అత్యంత కఠినరూపంలో ఇస్లామిక్ పాలనను నెలకొల్పుతానని పాక్ ఉగ్రవాద ముఠా టీటీపీ ప్రతిజ్ఞ చేసినట్లు ఆ కథనం పేర్కొంది. ప్రముఖ అమెరికన్ వార్తా చానెల్ సీఎన్‌ఎన్ విలేఖరులు లారా స్మిత్, టిమ్ లిస్టర్ ఇదే ప్రశ్న సంధించారు. సైనిక స్కూల్‌పై ఉగ్రవాద ముట్టడి ముగిశాక పాకిస్తాన్ చేష్ట్యలుడిగిపో యింది. ఇలాంటి ఘాతుక చర్యకు ఎవరు పాల్పడ్డారు? వాళ్లేం సాధించదల్చుకున్నారు? పెషావర్ సైనిక స్కూల్లో పిల్లల్ని బలిగొన్న ముఠా ఉనికి విషయంలో ఎలాంటి మార్మికత లేదు. అది బహిరంగ రహస్యం అని సీఎన్‌ఎన్ ప్రతినిధులు పేర్కొన్నారు.



 మరోవైపున పాకిస్తాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోసి కఠినాతి కఠినమైన షరియా పాలనను ఏర్పర్చాలని ప్రయత్నిస్తూ, చాలా కాలం నుండే పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్న తాలి బన్.. పెషావర్ దాడికి తామే కారణమని తక్షణమే ప్రకటించింది. ఇండిపెండెంట్ పత్రిక విలేకరి కూడా ఇదే విషయం రాస్తూ గిరిజన ప్రాంతాల్లో తిరుగుబాటుదారులపై పాక్ సైనిక చర్యకు వ్యతిరేకంగా తాలిబన్ ముఠా దాడులు తీవ్రతరం చేయడానికి కంకణం కట్టుకుం దని తెలిపారు. ఇంగ్లిష్ ప్రెస్‌లో చాలా కాలంగా ఇదే ప్రశ్నను సంధిస్తూ వచ్చారు. 2010లో ది నేషనల్ పత్రిక ఆప్ఘన్ తాలిబన్ గురించి రాస్తూ తాలిబన్ ఎవరు? వారేం చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించింది. ఆప్ఘన్ తాలిబన్ నేత ఒంటి కంటి ముల్లా ఒమర్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ గత సంవత్సరం సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్నపై తగు స్పష్టతనిచ్చారు. మొదటి నుంచి ఇదే విషయమై మమ్మల్ని అడుగుతున్నారు. మేం మళ్లీ చెబు తున్నాం. ఆప్ఘన్ గడ్డమీది నుంచి విదేశీ శక్తులను తరిమి కొట్టడం, ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పర్చి, షరియా చట్టాన్ని అమలు చేయడం ఇవే మా లక్ష్యాలు అని ఆయన నొక్కి చెప్పారు.



ఆర్థర్ బ్రైట్ అనే విలేకరి 2012లో క్రిస్టియన్ సైన్స్ మానిటర్ పత్రికలో, తాలిబన్‌కు వస్తున్న నిధుల గురించి ఒక నిపుణుడిని ఉల్లేఖించారు. తాలిబన్ నిధుల్లో మెజారిటీ భాగం అరబ్ గల్ఫ్ దేశాల్లోని సంపన్న వ్యక్తుల నుంచి వస్తున్నాయని, సంస్థకు నిధుల వసూళ్ల సమయంలో తాలిబన్‌లు ముస్లింల పవిత్ర స్థలమైన మక్కాకు చేసే హజ్ యాత్రను కూడా ఉపయోగిస్తుండవచ్చునని ఆ నిపుణుడు తెలిపారు. గల్ఫ్ కేంద్రంగా పనిచేస్తున్న మిలిటెంట్లతో ఈ రకం సంబంధాలు కొన్ని ఉగ్రవాద బృందాలపై అల్‌ఖైదా ప్రభావా నికి దారి తీస్తుండవచ్చని అతడి భావన.



 అయితే రెండు విషయాలు స్పష్టమే. మొదటిది. వాస్తవానికి తాలిబన్ కోరుకుంటున్నది షరియా చట్టం. రెండోది. వీరు ఏమా త్రం ఒంటరి ముఠా కాదు. వీరికి తగు ఆర్థిక మార్గాలున్నాయి. షరియా చట్టంపై వారెందుకు డిమాండ్ చేస్తున్నారన్నది ఇక్కడ ప్రశ్న. సమాధానం చట్టంలోనే ఉంది.  పాకిస్తాన్ రాజ్యాంగం లోని 227 (ఇస్లామిక్ నిబంధన, 9వ భాగం) ఇలా పేర్కొంటోంది. ప్రస్తుతం ఉన్న అన్ని చట్టాలూ పవిత్ర ఖురాన్, సున్నాహ్ నుంచి స్వీకరించిన ఇస్లామ్ ఆదేశాలకు అనుగుణంగా ఉండేలా చేయాలి. ఈ భాగంలో పవిత్ర ఖురాన్ బోధనలను ఇస్లామ్ ఆదే శాలుగా పేర్కొన్నారు. ఇస్లామ్ ఆదేశాలకు వ్యతిరేకంగా ఏ చట్టాన్నీ రూపొందించి అమలు చేయరాదు. ఈ నిబంధన చాలా స్పష్టంగా అదే సమయంలో అసందిగ్ధంగా కూడా ఉంది. జిన్నా వారసుడు లియాఖత్ ఆలీ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ రాజ్యాం గసభ 1949లో చేసిన ఒక వాగ్దానం ప్రకారం ఈ నియమ నిబంధన ఉనికిలోకి వచ్చింది. లక్ష్య తీర్మానం అనే పేరున్న ఈ నిబంధన సారాంశం...



 సమస్త ప్రపంచంపై సర్వశక్తిసంపన్నుడైన అల్లాకే సార్వభౌమా ధికారం ఉంటుంది. పాకిస్తాన్‌లోని అధికార వ్యవస్థ ఒక ధార్మిక సంస్థగా దేవుడు విధించిన పరిమితులలో ఉంటుంది. పాకిస్తాన్ ప్రజలు తమ అభీష్టంతో ఎక్కడైతే క్రమ పాలనను నెల కొల్పుతారో, ఎన్నికైన ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వం ఎక్కడైతే తమ అధికారాలను వినియోగిస్తుందో, ఇస్లాం ప్రవచించిన ప్రజా స్వామ్య సూత్రాలు, స్వాతంత్య్రం, సమానత్వం, సహనం, సామా జిక న్యాయం, ఎక్కడైతే పూర్తిగా అమలవుతుంటాయో, ఇస్లాం బోధనలకు అనుగుణంగా ముస్లింలు ఎక్కడైతే వ్యక్తిగతంగా, సామూహికంగా తమ జీవితాలను క్రమపద్ధతిలో ఉంచుకోగలుగు తారో అవన్నీ పవిత్ర ఖురాన్, సునాహ్ నిర్దేశించినట్లుగానే ఉంటా యి అని ఆ నిబంధనలో ఉంది.



 అయితే దీనికి భిన్నంగా పాకిస్తాన్ చట్టాలు చాలావరకు లౌకికవాద భారత్ చట్టాలను పోలి ఉంటున్నాయి. వీటిలో చాలా వరకు 19వ శతాబ్ది మధ్యలో మెకాలే హయాంలో బ్రిటిష్ వలస ప్రభుత్వం రాసినవే కావడం గమనార్హం. 1980లలో నాటి అధ్య క్షుడు జియా ఉల్ హక్ కొన్ని ఇస్లామిక్ చట్టాలను ప్రవేశపెట్టారు. మద్యం సేవించి పట్టుబడిన వ్యక్తులకు కొరడా దెబ్బలు, అత్యా చారంపై, హత్య చేసేందుకు డబ్బు తీసుకోవడం వంటి వాటిపై చేసిన చట్టాలు వీటిలో కొన్ని. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం కాలాన్ని వెనక్కు తిప్పడానికి ఇష్టపడకపోవడంతో ఈ కొత్త చట్టాలలో చాలావరకు కాగితాలకే పరిమితమయ్యాయి తప్పితే వాస్తవంగా అమలులోకి రాలేదు. పాక్ వ్యవహారాల నిపుణుడు ఖలీద్ అహ్మద్ పాకిస్తాన్‌ను ఒక అసంపూర్ణ ఇస్లామిక్ దేశంగా పేర్కొన్నారు. అంటే షరియాను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని చేసిన వాగ్దానం అలాగే ఉండిపోయిందని దీనర్థం. ఈ విషయంలో తగు స్పష్టత లోపించడంతో దీన్నే తాలిబన్ సొమ్ము చేసుకుంటోంది.



తాలిబన్ నిజంగా ఏం కోరుకుంటోందన్న విషయంపై పాక్ వ్యవహారాల నిపుణులను తల గొక్కునేలా చేస్తున్న ప్రశ్నకు సమా ధానం ఏమంటే పాకిస్తాన్ రాజ్యాంగాన్ని విస్పష్టంగా అమలు చేయ డమే. అంతవరకు పాక్ తాలిబన్‌తో పోరాడటం కష్టం. చట్టానికి సం బంధించిన సమస్యపై తాము సరిగ్గా ఉంటున్నామని తాలిబన్‌లు చెబుతున్నారు. పాకిస్తాన్ రాజ్యాంగంలో ఉన్న ఈ అయోమయం తొలిగి, దాని వాగ్దానాన్ని పరిష్కరించనంతవరకూ, తాలిబన్‌కు వ్యతిరేకంగా సాగే ఏ పోరాటమూ విజయం పొందదు. లేదా అలాంటి పోరాటాన్ని నిర్దిష్టదిశలో ప్రారంభించలేరు కూడా.

- ఆకార్ పటేల్

(వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)

aakar.patel@gmail.com

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top