భవితపట్ల బెంగలేని మన యువత

భవితపట్ల బెంగలేని మన యువత


అవలోకనం

అతి పెద్ద సంఖ్యలో నేను కలుసుకున్న యువత నుంచి అందిన సమాచారం ఆధారంగా మన దేశంలోని పిల్లలు తిరుగుబాటుతత్వం గలవారు కారని, సంప్రదాయకమైనవారని స్పష్టమైంది. స్థూలంగా చెప్పాలంటే.. మన యువకులలోకంటే యువతులలోనే కొన్ని సంప్రదాయేతర భావనలను పరిగణనలోకి తీసుకునే విశాల దృష్టి ఎక్కువగా ఉంటోంది. నేను మాట్లాడిన వారిలో దళితులు, ఆదివాసుల దుస్థితి పట్ల సానుభూతి దాదాపుగా ఎన్నడూ వ్యక్తం కాలేదు. ఉద్యోగితపై చర్చగానీ, నిరుద్యోగం అతి పెద్ద సమస్యలలో ఒకటనిగానీ వారికి తెలిసివున్నట్టు అనిపించదు.



నా పనిలో భాగంగా ఏళ్ల తరబడి నేను వందలాది మంది శ్రోతలతో మాట్లాడుతుంటాను. అలా నేను అనేక వేల మందితో, బహుశా లక్షల మందితో మాట్లాడి ఉంటాను. తరచుగా వారు కళాశాల విద్యార్థులైన యువతీయువకులు. మొదట నేను ఏదో ఒక అంశంపై ఓ అరగంటో లేక నలభై నిముషాల పాటో మాట్లాడటం, ఆ తర్వాత శ్రోతలు తమ ఆభిప్రాయాలను వెలిబుచ్చడం లేదా ప్రశ్నలు వేయడం అనే తీరున సాధారణంగా ఈ సంభాషణ సాగుతుంటుంది.



గత కొన్ని నెలలుగా కొన్ని రాష్ట్రాల్లో పెద్ద పెద్ద బృందాలతో మాట్లాడాక, శ్రోతలలో నాకు కనిపించిన కొన్ని సాధారణాంశాల గురించి తీవ్రంగా యోచిస్తున్నాను. మొట్టమొదటిది వారి దృక్పథానికి సంబంధించినది. అతి పెద్ద సంఖ్యలో నేను కలుసుకున్నవారి నుంచి అందిన సమాచారం ఆధారంగా మన దేశంలోని పిల్లలు తిరుగుబాటుతత్వం గలవారు కారని, సంప్రదాయకంగా ఉండేవారని నాకు స్పష్టమైంది. ఆధిపత్యం చెలాయించే బాపతువారికి కూడా ఇది వర్తిస్తుంది. అలాంటి వారు తరగతి గదిలో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, పాత్రికేయులుగా ఉన్నా లేక సెలబ్రిటీలే అయినా ఇదే బాపతు.



ఇక రెండవది, స్థూలంగా చెప్పాలంటే మన యువకులలోకంటే యువ మహిళలలోనే సంప్రదాయేతరమైన కొన్ని భావనలను పరిగణనలోకి తీసుకునే విశాల దృష్టి ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకు, నేను జాతీయవాద భావనను ప్రశ్నించేట్టయితే, మహిళలు తలలు ఊపే అవకాశం ఎక్కువ, నా ప్రసంగం ముగిశాక ఆగ్రహంతో ప్రశ్నలు సంధించే అవకాశం తక్కువ. ఇక మూడవ విషయం, యువతీయువకులు ఇరువురికీ ఒకే తీరున సామాజిక న్యాయమనే భావన తెలిసి ఉండటం లేదు. ఉదాహరణకు, రిజర్వేషన్లనే తీసుకుందాం. నేను మాట్లాడిన శ్రోతలు దాదాపుగా ఎన్నడూ దళితులు, ఆదివాసుల దుస్థితి పట్ల సానుభూతితో లేరు.



శ్రోతలలో దళితులు, ఆదివాసులు దాదాపుగా ఎవరూ లేరని నిర్ధారణ అయినాక, ఆ వర్గాల వారు అక్కడ లేకపోవడానికి కారణం వ్యవస్థ వారిని అవకాశాలకు దూరం చేయడమేనని తెలిసినా వారి దృష్టి మారదు. రిజర్వేషన్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి ముందు దళితులు, ఆదివాసులు వివక్షను ఎదుర్కొంటున్నారని ఆమోదించాలని ఆశిస్తున్నానని నేను తరచుగా నా శ్రోతలకు చెప్పేవాణ్ణి. అయినా అది ఎన్నడూ జరగలేదు. రిజర్వేషన్లపై ‘ప్రతిభ’ విజయం సాధించాలనే ఒకే ఒక్క అంశంపైన మాత్రమే యువత ఆగ్రహంతో ఉంది.



నాలుగు, వారికి ఆందోళన కలిగిస్తున్న ఏకైక అతిపెద్ద సమస్య కశ్మీర్‌ మాత్రమే. ప్రభుత్వం ఉగ్రవాదంగా పిలిచే సమస్య దేశంలోని మూడు ప్రాంతాల్లో ఉన్నదని వారికి చెప్పి చూశాను. గత పదేళ్లుగా ఈ హింస అతి ఎక్కువగా జరుగుతున్నది, 6,080 మంది మరణించిన నక్సలైట్‌ ప్రాంతంలో. ఈ హింసకు సంబంధించి రెండవ స్థానం ఈశాన్య భారతానిది. ఇదే కాలంలో అక్కడ 5,050 మంది మరణించారు. జమ్మూకశ్మీర్‌ ప్రాంతం మూడో స్థానంలో ఉంది. అక్కడ గత పదేళ్లలో 3,378 మంది చనిపోయారు. అయినా, ఈశాన్యం లేదా నక్సలైట్‌ హింస గురించి ఎన్నడూ ఏ ప్రశ్నా ఎదురు కాలేదు. కానీ కశ్మీర్‌ గురించి, రాళ్లు విసిరేవారి గురించి యువత బాగా ఆందోళన చెందుతోంది. ఈ ఆందోళనతో పాటూ వారికి ఆర్టికల్‌ 370 చరిత్ర గురించి, భారత ప్రభుత్వ ప్రవర్తన గురించి ఏ మాత్రం తెలిసి ఉండకపోవడమూ ఉంది.



వారు విద్యార్థులు కావడం వల్ల ఇది ఆశ్చర్యకరం. మన చానళ్లు చూపుతున్న జాతీయత, జాతి వ్యతిరేకత అనే తెలుపు నలుపు వైఖరికే వారు అంటిపెట్టుకున్నారు. ఐదు, పైన పేర్కొన్న నా పరిశీలనలకు కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. అవి సాధారణంగా సామాజిక శాస్త్రాలు, కళలు, సాహిత్యం వంటి రంగాలకు చెందినవారి నుంచి వచ్చేవే. కానీ ఇంజనీరింగ్, కామర్స్, సైన్స్‌ విద్యార్థులు చాలా వరకు పైన పేర్కొన్న ప్రామాణిక వైఖరితో ఉండే అవకాశమే ఎక్కువ. ఆరు, ప్రధాని నరేంద్ర మోదీకి విద్యార్థులలో బాగా ఆదరణ ఉంది. ఆయన మాట్లాడేది బాగా అర్థవంతంగా ఉంటుందని అనుకుంటున్నారు, ఆయనలో కనిపించే గుణాలను వారు మెచ్చుతున్నారు. ఆయన గతం గురించిన లేదా పనితీరు గురించిన అభ్యంతరాలను విద్యార్థులు తేలికగా తోసిపుచ్చేస్తారు. ఏడు, గోవధ, గొడ్డు మాంసాల సమస్యపై కొట్టి చంపేయడాలు వారికి ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. కానీ ఆ హింసకు ప్రభుత్వం బాధ్యత వహించాలని వారు భావించడం లేదు.



ఎనిమిది, వారి భవిత గురించి లేదా భారత ఉపాధి మార్కెట్‌ గురించి అడిగితే తప్ప వారు ఎన్నడూ మాట్లాడటం లేదు. ఉద్యోగిత గురించి జరుగుతున్న చర్చగానీ, నిరుద్యోగం అతి పెద్ద సమస్యలలో ఒకటనిగానీ వారికి తెలిసివున్నట్టు అనిపించదు. లేదంటే, వారు తమ భవితకు సంబంధించిన సమస్యలను ఎలాగోలా పరిష్కరించుకోగలమనే విశ్వాసంతో ఉండి ఉంటారు. తొమ్మిది, వారు వేసే ప్రశ్నల నాణ్యత ప్రాథమికం, బలహీనం. మీడియా లేదా తమకు విద్య నేర్పేవారు నూరిపోసే దానికి స్వతంత్రంగా సమస్యను పరిశీలించే మంచి విద్యార్థులను మనం తయారు చేయడం లేదు. ఇక చివరిది, ఇంగ్లిషు వాడే వారి భాషాపరిజ్ఞానం అధ్వానం. ఉన్నత విద్యా వ్యవస్థ సరైన నిపుణ, కార్యాలయ ఉద్యోగాలకు తగిన పట్టభద్రులను తయారు చేయడం లేదు. చాలా మంది కాకున్నా పలువురికి ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయడానికి అవసరమైన ప్రాథమిక సంభాషణా నైపుణ్యాలు సైతం లేవు.



వ్యాసకర్త కాలమిస్టు, రచయిత

ఈ–మెయిల్‌ : aakar.patel@icloud.com

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top