సంస్కృతిపై రాజకీయ క్రీనీడలు

సంస్కృతిపై రాజకీయ క్రీనీడలు - Sakshi


కొద్ది రోజులుగా బతుకమ్మ పండుగ, కల్లు రెండిటి చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. బతుకమ్మ పండుగను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయం. కానీ బతుకమ్మ స్త్రీలు తప్ప, పురుషులు ఆడేది కాదనే స్పృహను కోల్పోయి చంద్రబాబు సహా అన్ని పార్టీల నేతలు, మంత్రులు, బతుకమ్మలాడారు. బతుకమ్మను రాజకీయ క్రీడగా మారుస్తున్నారనడానికి వేరే ఉదాహరణ కావాలా? ఇక హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను తెరవాలని నిర్ణయించి కేసీఆర్ మాట నిలుపుకున్నారు.  కానీ కల్తీ కల్లు ఏరులై పారకుండా జాగ్రత్తల మాటేమిటి?

 

డేట్‌లైన్ హైదరాబాద్

 

బతుకమ్మ పండుగ, కల్లు తెలంగాణ సంస్కృతిలో భాగం. దురదృష్టవశాత్తు కొద్ది రోజులుగా ఈ రెండిటి చుట్టూ రాజకీయాలు, రాజకీయాల చుట్టూ ఈ రెండూ తిరుగుతున్నాయి. సుదీర్ఘ ఉద్యమం తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రాగానే బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ సమాజం మొత్తం అందుకు హర్షం వ్యక్తం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతుకమ్మ మీద నిషేధం ఏమీ లేదు. ప్రతి ఏటా బతుకమ్మ పండుగ వచ్చిందంటే తెలంగాణ పల్లెలు రకరకాల పూలతో అలంకరించుకుని ఎంతో అందంగా తయారయ్యేవి. ఆ తొమ్మిది రోజులూ తెలంగాణ పల్లెల సొగసు వర్ణనాతీతం. కనువిందు చేసే దృశ్యాలు, వీనుల విందు చేసే జానపద గీతాలు చూసి, విని ఆనందించాల్సిందే. బతుకమ్మ పండుగపై నాడు నిషేధం లేకపోయినా నిరాదరణ ఉండేది. బతుకమ్మ అనాదిగా తెలంగాణ స్త్రీ ధిక్కార, ప్రతిఘటన స్వభావానికి ప్రతీకగా నిలిచింది.



బతుకమ్మ తెలంగాణ అస్తిత్వ ప్రతీక



తెలంగాణ ఉద్యమ కాలంలో బతుకమ్మను మరింత ప్రచారంలోకి తెచ్చిన ఘనత ‘తెలంగాణ జాగృతి’ సంస్థకు, ఆ సంస్థ నాయకురాలు కల్వకుంట్ల కవితకు దక్కుతుంది. ఈ పదమూడేళ్లు బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ రూపాల్లో భాగమై నిలిచింది.బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వానికి ఒక బలమైన సాంస్కృతిక ప్రదర్శన. దాన్ని అట్లా ఉండనిస్తే బాగుండేది. కానీ బతుకమ్మ చుట్టూ రాజకీ యాలు చేరాయి. బతుకమ్మ ఆధారంగా ఎదిగిన తెలంగాణ జాగృతి నేత్రి, టీఆర్‌ఎస్ అధినేత కూతురు కవిత పార్లమెంటుకు పోవడానికి నిచ్చెనలు వేసింది. ఎవరు ఏ పదవికి పోటీ చేయాలో నిర్ణయించుకునే హక్కు రాజకీయ పార్టీలకు ఎప్పుడూ ఉంటుంది. దాని మీద చర్చలేదు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక బతుకమ్మను అధికారిక పండుగగా ప్రకటించడంపై చర్చలేదు, అభ్యం తరం అంతకన్నా ఉండకూడదు. బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రమం తటా ఘనంగా జరపడానికి పది కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది కాబట్టి దాన్ని కూడా స్వాగతిద్దాం. ఈ జోరు కొత్త మురిపెం కాకుండా దీర్ఘకాలం కొనసాగాలని ఆశిద్దాం. అయితే ఇక్కడ రెండు విషయాలు తప్పకుండా మాట్లాడుకోవాలి. ప్రభుత్వం ఈ పండుగ ఘనంగా జరపడం కోసం కేటాయించిన నిధులు ఎక్కడ ఖర్చు అయ్యాయి అనేది మొదటిదయితే, మొత్తం బతుకమ్మ సంబరాలు రాజకీయ క్రీడలో భాగంగా తయారయి అపహాస్యం పాలు కావడం రెండవది.



మెప్పు కోసం నేతలెత్తిన బతుకమ్మ



తెలంగాణ రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, మంత్రులు, అధికారులు, వీళ్లు వాళ్లు అనకుండా బతుకమ్మను నెత్తికి ఎత్తుకొని, బతుకమ్మ చుట్టూ అడుగులేసి నృత్యాలు చేశారు. ముఖ్య మంత్రి మెప్పు పొందడానికే ఇదంతా. అందుకే బతుకమ్మ స్త్రీలకు మాత్రమే ప్రత్యేకం, పురుషులు ఆడేది కాదనే స్పృహ పూర్తిగా కోల్పోయారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమ్రంతి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు బతుకమ్మను నెత్తికి ఎత్తుకున్నట్టు? బహుశా తెలంగాణలో తమ పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఆయన బతుకమ్మను ఇట్లా ఉపయోగించుకున్నారేమో. మరి ఇందిర చేత బతుకమ్మ ఆడించిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ట్యాంక్ బండ్ మీద జరిగిన అధికారిక ముగింపు ఉత్సవంలో తానెందుకు బతుకమ్మ ఆడలేదన్న సందేహం ఎవరికీ ఎందుకు కలగలేదు? బతుకమ్మను తెలంగాణ అస్తిత్వానికి ఒక సాంస్కృతిక ప్రతిరూపంగా కాకుండా రాజకీయ క్రీడగా మార్చేస్తున్నారన డానికి ఇంత కంటే వేరే ఉదాహరణ అవసరం లేదేమో.



కల్లు తెలంగాణ సంస్కృతిలో భాగం



ఇక కల్లు వ్యవహారం చూద్దాం. రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు తిరిగి ప్రారంభిస్తామన్న ఎన్నికల వాగ్దానం నిలబెట్టుకుని కేసీఆర్ మొన్న దసరా పండుగ నాటి నుంచి కల్లు దుకాణాలు తెరిపించారు. మొదట్లో చెప్పినట్టు కల్లు తెలంగాణ సంస్కృతిలో భాగం. తెలంగాణలో ఒకప్పుడు కల్లును మద్యం కింద లెక్కించే వారు కాదు. పైగా ఆరోగ్య పానీయంగా పరిగణించే వారు. ఇప్పటికి తెలంగాణ పల్లెల్లో కల్లు తాగడాన్ని దురలవాటుగా చూడరు. ఎవరయినా గతానికి వెళ్లి చూసి... హైదరాబాద్ నగరంలో రాష్ర్ట ప్రభుత్వమే శాసనసభ ఆవరణలో, ట్యాంక్ బండ్ మీద, మరికొన్ని చోట్లా అధికారికంగా దుకాణాలు తెరిచి ‘నీరా’ (తెల్లవారు జామున చెట్టు నుంచి తీసే కల్లు) అమ్మించిన విషయం గుర్తు చేసుకోవచ్చు.



హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు తెరవాలనే నిర్ణయం తీసుకోగానే రెండు వాదనలు ముందుకొచ్చాయి. 2005లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం హైదరాబాద్‌లో కల్లు విక్రయాన్ని నిషేధించింది. హైదరాబాద్ నగరానికి 50 కిలోమీటర్ల పరిధిలో తాటి చెట్లు లేనందున కల్తీ కల్లు, కృత్రిమ కల్లు సరఫరా వల్ల ప్రాణహాని కలుగుతుందని 767 జీవోలోని ఒకక్లాజు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే హైదరాబాద్‌లో కల్లు విక్రయంవల్ల విస్కీ, బ్రాందీల వంటి సీమ మద్యం వ్యాపారం నష్టపోతుందనే మద్యం వ్యాపా రులతో కుమ్మక్కయి ఎక్సైజ్ అధికారులు ఆనాటి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిం చారని, నగరం కల్లు అవసరాలను తీర్చగలిగినన్ని తాటి చెట్లు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయని గీత పనివారి సంఘ నాయకుల వాదన. స్మార్ట్ సిటీ, ఇంటర్నేషనల్ సిటీ అంటున్న హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు తెరవడం ఏమిటి? అన్నది. దీన్ని పెద్దగా పట్టించు కోనక్కరలేదు. మద్యం రక్కసి కోరలు విప్పి చీప్ లిక్కర్ పేరుతో హైదరాబాద్‌ను ఎట్లా కబళించ చూస్తున్నదో అందరికీ తెలుసు. నిజానికి హైదరాబాద్‌లో కల్లు అమ్మితే నష్టపోయేది చీప్ లిక్కర్ అమ్మకందారులే.



కాటేసే ‘సొసైటీల’ కల్లేనా మళ్లీ?



పాత సొసైటీలకే హైదరాబాద్‌లో కల్లు విక్రయాన్ని అప్పచెబుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం సమంజసం కాదు. ఈ సొసైటీలన్నీ ఎప్పుడో కాంట్రాక్టర్‌ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. లాభార్జనే ధ్యేయంగా  అవి కల్తీకల్లు, కృత్రిమ కల్లు అమ్మి ప్రజల జీవితాలతో ఆడుకున్న సంఘటనలు గతంలో అనేకం. హాస్యాస్పదం ఏమిటంటే కల్లు గీత పనివారే ఉండవలసిన ఈ సొసైటీలలో ఆ వృత్తితో, ఆ సామాజికవర్గంతో సంబంధం లేని ప్రభుత్వ అధికా రులు కూడా సభ్యులుగా ఉంటారు. ఇది కల్లు గీత పనివారికి ఏ రకంగాను మేలు చెయ్యదు. హైదరాబాద్‌లో కల్లు అమ్మకాలు మళ్లీ మాఫియాల చేతుల్లోకి వెళ్లకుండా, కల్తీ లేకుండా సక్రమంగా జరగాలంటే ఈ సొసైటీలను రద్దు చేసి, కల్లు గీత కార్మికులకే కల్లు  విక్రయాలను అప్పగించాలి. అందుకు కావలసిన ఆర్థిక సాయాన్ని వారికి అందించాలి. కల్లు కల్తీ జరిగినా, కృత్రిమ కల్లు పారిం చినా కోలుకోలేని శిక్షలు విధించాలి. ఇదంతా చెయ్యడానికి ప్రభుత్వం సిద్ధపడ్డ నాడే నగరంలో కల్లు విక్రయాలు మొదలు పెడితే మంచిది.



హైదరాబాద్ నగర అవసరాలకు సరిపడా కల్లు లభించేందుకు కావలసినన్ని చెట్లు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నాయని  గీత పనివారల సంఘం చేస్తున్న వాదన సరైనదే కావచ్చు. అయితే అసలు కొత్త తరం గీత పనివారి కుటుంబాల నుంచి ఎంత మంది ఈ వృత్తి మీద ఆధార పడుతున్నారు? ఎంత మంది తాడి చెట్లు ఎక్కుతున్నారు? అనేది కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఈ విషయాలన్నీ ఆలోచించకుండా ఎన్నికల వాగ్దానం కదా అని అమలు చేసేస్తే ఒక ఉపద్రవానికి తెర లేపిన బాధ్యతను రేపు ప్రభుత్వమే తలకెత్తుకోక తప్పదు.    

 

 దేవులపల్లి అమర్



 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top