ముదిరిన మరాఠా ‘ప్రేమ’ కలహం

ముదిరిన మరాఠా ‘ప్రేమ’ కలహం - Sakshi


పాతికేళ్ల క్రితం మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య ఏర్పడిన పొత్తుకు ప్రమోద్ మహాజన్, బాల్‌థాక్రే, గోపీనాథ్ ముండే క్రమంగా ఊపిరి పోస్తూవచ్చారు. ఈ ముగ్గురూ కనుమరుగయ్యాక రెండు పార్టీల మధ్య నిత్య ఘర్షణలను, అహాన్ని తగ్గించలేకపోవడం ఇప్పుడు ఎన్నికల పొత్తుకు అడ్డంకిగా మారింది.

 

అక్టోబరు 15న మహారాష్ట్ర  శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో పొత్తుల కోసం అక్కడి రాజకీయ పక్షాలు చేస్తున్న కసరత్తు పతాక దశకు చేరింది. అధికార కూటమి, ప్రతిపక్ష కూటమి రెండూ సీట్ల పంపిణీలో చివరి నిమి షంలో కూడా ఒప్పందానికి రాలేక ఆపసో పాలు పడుతున్నాయి. నామినేషన్ల చివరి తేదీ సెప్టెంబర్ 27 సమీపిస్తున్నప్పటికీ ఏ కూటమిలోనూ పొత్తు ఫలించే సూచనలు కనిపించడం లేదు. ఇటు బీజేపీ-శివసేన, అటు కాంగ్రెస్-ఎన్సీపీలు ఎన్నికల పొత్తు కుదరకపోతే వేరు కుంపటి పెట్టుకోవడానికి కూడా సిద్ధమవుతున్నాయి. ప్రత్యేకించి మహా రాష్ట్రలో రెండు కాషాయ పార్టీల మధ్య పాతికేళ్లుగా కొనసాగుతున్న పరస్పర మైత్రికి ఇది పరీక్షా సమయం.



ఈ దఫా ఎన్నికల్లో కనీసం 130 సీట్లు కావాలని బీజేపీ చేసిన డిమాండును శివసేన తోసిపుచ్చడమే కాకుండా, తనకు పట్టు ఉన్న నియోజకవర్గాలను బీజేపీకి ధారపోసే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. పైగా 288 శాసనసభ స్థానాల్లో బీజేపీకి 119 సీట్లకు మించి ఒక్కటి కూడా అదనంగా ఇవ్వబోనని స్పష్టం చేయడంతో విభేదాలు మరింత తీవ్రమయ్యా యి. పొత్తు ప్రయోజనాల కోసం రాజీ పడదామని ఇరు పార్టీల అగ్రనేతలూ పిలుపునిస్తున్నప్పటికీ సోమవారం సాయంత్రానికి కూడా సీట్ల పంపిణీ పీటముడి చిక్కు వీడలేదు. వీటికి తోడు చిన్న పార్టీలైన రాష్ట్రీయ సమాజ్ పక్ష, స్వాభిమాని షేత్కరి సంఘ్ కూడా పొత్తు నుం చి బయటపడతామని హెచ్చరించడం కొసమెరుపు. మరోవైపున శరద్ పవార్ నాయకత్వం లోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైంది. మొత్తం స్థానాల్లో తనకు సగం కావాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్ వదులుకోనట్లయితే అది ఒంటరిగా పోటీ చేసుకోవచ్చని ఎన్సీపీ తేల్చి చెప్పింది. మరోవైపు బీజేపీ, శివసేనలు కలిసి పోటీ చేయకపోతే కాంగ్రెస్‌తో పొత్తు అవసరం లేదని ఎన్‌సీపీ భావిస్తోంది. కనుక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరు నాలుగు స్తంభాలాట అయ్యే అవకాశం ఉంది.



పాతికేళ్ల బంధం



శివసేన, బీజేపీల మధ్య పొత్తు ప్రారంభం నుంచీ లుకలుకలతోనే సాగింది. పాతికేళ్ల మైత్రీ బంధంలో శివసేనే పెద్దన్నగా నిలిచిం ది. ప్రతి ఎన్నికలోనూ అధిక స్థానాలను ఆ పార్టీయే అట్టిపెట్టుకునేది. 2009లో సైతం శివసేన 171 స్థానాలలో పోటీ చేయగా బీజేపీ 117 సీట్లతో సరిపెట్టుకుంది. అయితే 2014లో సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాక, మహారాష్ట్రలో తన వాటా పెరగాలని బీజేపీ కోరుకుంది. ఇదే సమస్యకు మూలం. గత మూడు నెలలుగా రెండు పార్టీలూ  అసెంబ్లీ ఎన్నికల పొత్తుపై ఘర్షించుకుంటూనే ఉన్నాయి.

 1989లో బీజేపీ నేత ప్రమోద్ మహాజన్, శివసేన అధినేత బాల్‌థాక్రే మధ్య తొలిసారి పొత్తు కుదిరింది. అంతవరకు వేళ్లమీద లెక్కించగలిగిన స్థానాల్లోనే గెలుపొందుతున్న ఈ రెండు పార్టీలూ పొత్తు కుదిరిన తర్వాతి సంవత్సరంలో అనూహ్యంగా 94 స్థానాలు గెలిచి బలమైన ప్రతిపక్షంగా అవతరించాయి. 1993లో ముంబై పేలుళ్ల అనంతరం మత ఘర్షణల నేపథ్యంలో 95లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సేన-బీజేపీ కూటమి తొలిసారిగా అధికారాన్ని కైవసం చేసుకుంది. తర్వాత 15 ఏళ్లపాటు అధికారానికి దూరమైనప్పటికీ వీటి మధ్య పొత్తు మాత్రం బలోపేతమవుతూనే వచ్చింది. 1999లో 125 స్థానాలను, 2004లో 116 స్థానాలను, 2009లో 90 స్థానాలను చేజిక్కించుకున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల ప్రభుత్వాలకు బలమైన ప్రతిపక్షంగా సేన-బీజేపీ కూటమి పాత్ర పోషించింది. తొలిదశలో ప్రమోద్ మహాజన్, బాల్ థాక్రే, మలిదశలో గోపీనాథ్ ముండే సమర్థ నాయకత్వం వల్ల రెండు పార్టీల మధ్య పొత్తు చెదరకుండా నిలిచింది. పాతికేళ్లుగా మహారాష్ట్రలో బీజేపీ,సేన కూటమికి ఊపిరిపోసిన ప్రమోద్ మహాజన్, బాల్‌థాక్రే, గోపీనాథ్ ముండే కనుమరుగవటంతో ఇరు పార్టీల మధ్య నిత్యం రగుల్కొంటున్న అహాల మధ్య ఘర్షణలను పరిష్కరించేవారు లేకుండా పోయారు.



దీనికి తోడు ప్రధాని నరేంద్రమోదీ ప్రభావ ఫలితంగా మహారాష్ట్ర బరిలో అధిక వాటాను బీజేపీ  ఆశిస్తుండటంతో ఇరుపార్టీల మధ్య దూరం పెరిగింది. అందుకే ఈ సారి 130 స్థానాల్లో పోటీ చేస్తానని బీజేపీ పంతం పట్టింది. సాధారణ పరిస్థితుల్లో పది సీట్లు అటూ ఇటూ మారడానికి పెద్దగా అభ్యంతరం ఉండేది కాదు. కానీ మోదీ ప్రభావం బీజేపీని ఊరిస్తుండటంతో రెండు పార్టీలూ పంతం వీడకపోగా పొత్తునుంచి వైదొలుగుతామని భీష్మించుకు కూర్చున్నాయి. నామినేషన్ల దాఖ లుకు చివరి తేదీ దగ్గరపడుతున్నప్పటికీ పొత్తు కుదరకపోవడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్రలో ఆ పార్టీ ఇంచార్జ్ రాజీవ్ ప్రతాప్ రూడీ శివసేన నాయకత్వానికి పొత్తును విచ్ఛిన్నపర్చవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఈ రెండు పార్టీల మధ్య పాతి కేళ్ల పొత్తు ఇకపై ఉంటుందా, ఊడుతుందా అనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టంకానుంది.

 

- మోహన

 

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top