కాముకత్వపు చీకటి... కానరాని వెలుతురు

కాముకత్వపు చీకటి... కానరాని వెలుతురు - Sakshi


నామిని మూలింటామె...

 ఈ నవల వాస్తవానికి ఒక చిన్న కథ. ఎవరైనా రాస్తే అంతే రాయాలి. గతంలో చాలామంది రాశారు. ఒక రైతు. వ్యవసాయం చేస్తుంటాడు. ఏవేవో జరుగుతాయి. భూమిని అమ్మాల్సి వస్తుంది. ఆ రైతు పొలానికి వెళ్లి అంత మన్ను పట్టుకొని ఆ పొలంలోనే ప్రాణం విడుస్తాడు. మూలింటామె కథ కూడా అంతే. ఒక మూలింటామె. ఆమెకు కొంత పొలం ఉంది. ఏవేవో జరుగుతాయి. ఆ పొలం అమ్మాల్సి వస్తుంది. ఆమె విషం ఆకు తిని ఆత్మహత్య చేసుకుంటుంది. గతంలో వచ్చిన కథల్లో వలస, కరువు, పండిన పంట గిట్టుబాటు కాకపోవడం, కొడుకూ కోడలు తకరారు... ఇవన్నీ భూమిని అమ్మడానికి కారణాలు. కాని మూలింటామెలో?

 

 ఈ నవల వాస్తవానికి ఒక ఉద్గ్రంథం. ఎవరైనా రాస్తే అంతే రాయాలి. గతంలో అతి కొద్దిమంది రాశారు. కాని నామిని దీనిని ఉద్గ్రంథం చేసేంత వృత్తాన్ని తీసుకో నిరాకరించాడు. ఇది 1980ల నాటి తెలుగు గ్రామీణ జీవితాలపై ఒక స్టేట్‌మెంట్. ‘అభివృద్ధి’ అనే ఊహ నెమ్మదిగా మొదలై ఎన్నేళ్లు కష్టపడ్డా ఏ వెలుతురూ ఇవ్వని వ్యవసాయంపై రోసి వ్యక్తులు ఎలా పతనం కావడం మొదలుపెట్టారో చూపే శ్వేతపత్రం. కాని చిక్కేమిటంటే ఇది ఉండాల్సినన్ని పేజీల్లో లేదు. ఉండాల్సిన ధోరణిలో లేదు. ఉండాల్సిన స్పష్టతతో లేదు.

 

 ఈ నవలంతా ఏం చెబుతుందంటే ‘బీదరికానికి అభ్యంతరం ఉంటుంది. అంతస్తుకు అంగీకారం ఉంటుంది’ అని. ఇవాళ మనం చూస్తున్నది కూడా అదే. అంతస్తు ఉంటే చేసింది ఎంత పెద్ద తప్పైనా సమాజంలో మతింపు ఉంటుంది. బీదరికం ఉంటే అది ఎంత చిన్న తప్పైనా ఎత్తిపొడుపు వేధింపు చట్టం న్యాయం జెయిలు ఉంటాయి. ఈ సంగతి అనుభవంలోకి వచ్చాక సమాజం ఏమనుకుంటుందంటే- తప్పులు చేసైనా అంతస్తు తెచ్చుకుందాం. అంతస్తు వచ్చాక మరిన్ని తప్పులు చేద్దాం. 1980లలో మొలకేసిన ఈ ధోరణికి  ఈ నవలలో ‘పందొసంత’ (పంది వసంత) క్యారెక్టర్  ప్రతినిధి. ఈ పందొసంత చిన్న వయసుకే వ్యవసాయం కంటే వ్యాపారమే మిన్న అని గ్రహించి చిల్లర అంగడి నిర్వహిస్తూ ఉంటుంది. అణాకాణి కట్నం ఊసు లేని సంబంధం రావడం వల్ల- పెళ్లాం లేచిపోయినోడైతే ఏమి మనక్కావలసింది మొగుడూ మెడలో ఒక బొట్టూ అన్నట్టుగా మూలింటామె కొడుకును చేసుకొని మిట్టూరు వచ్చింది.

 

 మొగుడుకీ తనకూ ఇరవై ఏళ్ల ఎడం. రావడం రావడమే మొగుడి తమ్ముడితో సంబంధం పెట్టుకుంది. మరికొద్ది రోజులకే చుట్టుపక్కల మూడు ట్రాక్టర్లను అద్దెకు తిప్పుతూ మోటార్ సైకిల్ మీద డాబుగా తిరిగే ముప్పై ఏళ్ల రెడ్డితో సంబంధం పెట్టుకుంది. ఆ వెంటనే ఆమె చేసిన పని ఇంటి చుట్టూ విశాలమైన స్థలంలో అడవి వలే పెరిగిన అనేక చెట్లనూ మొక్కలనూ మొదుళ్లనూ అమ్మి (ధ్వంసం చేసి) వచ్చిన పన్నెండు వేలతో చిల్లర అంగడి తెరవడం. ఆ వెంటనే తండలు (వడ్డీ) వ్యాపారం మొదలుపెట్టడం. తన ప్రియుడైన రెడ్డితో కలసి మొగుడికి మందు అలవాటు చేసి, నువ్వు ఇంకో ఆడదాన్ని పెట్టుకుంటే చూడాలని ఉంది అని నవ్వించి, ప్యాంటు షర్టూ తొడిగించి, మోపెడ్ అలవాటు చేసి వీటన్నింటి బదులుగా వ్యవసాయానికి పోవాల్సిన పని లేదని తేల్చింది. ఇక మిగిలిందేమిటి? పనికిరాని పొలం. దాన్ని యాభై వేలకు అమ్మేసి ఇంకా భారీ స్థాయిలో వడ్డీ వ్యాపారంలోకి దిగేసింది.  ఇన్ని చేసి ఇంత బీభత్సం సృష్టించినా ఆమెకు కాస్తయినా గిల్ట్ లేదు. గిల్ట్‌కు పోయే రోజులు కావు అవి. ఆ రోజులు పోయాయి.

 

 కాని నిజంగా మునుపటి గ్రామీణ సమాజం ఈమెలా లేదు. అది ఆమె అత్త మూలింటామెలా ఉంటుంది. మూలింటామెకు సేద్యం ఇష్టం. కష్టించి జీవించడం ఇష్టం. ఉన్నంతలో బతకడం ఇష్టం. చెట్లతో మొక్కలతో మట్టితో పాలిచ్చే గొడ్లతో పాదాల దగ్గర తిరుగాడే పెంపుడు పిల్లులతో జీవించడమే ఇష్టం. నిజానికి ఇలా మనిషీ ప్రకృతీ కలిసి ఉండటమే సృష్టి. ఇరువురి ఉత్పత్తి ప్రత్యుత్పత్తే సృష్టి. ఈ నిరాడంబరమైన అమరికను డిస్టర్బ్ చేయడమే అభివృద్ధి. అదే పేరాశ. అదే వొత్తిడి. అదే పతనం. కొత్త తాకిడికి పాత విలువ నిలువలేకపోయింది. మూలింటామె ఆత్మహత్య చేసుకుంది. ఇదీ కథ.

 

 కరెక్టే. కాని ఈ ఆపరేషన్‌కు రచయిత వాడిన కత్తెర్లు ఏమిటా అని? శ్రీరమణ ‘ధనలక్ష్మి’ కథ ఉంది. అందులో ఒక మైనస్ ఉంది. అది అభివృద్ధిలోని చీకటి కోణాలను చూపదు. కాని అందులో ఒక ప్లస్ ఉంది. అది లైంగిక సంబంధాలకు చోటివ్వదు. ఆ కథలోని ధనలక్ష్మి వ్యవస్థలోని లోపాలను ఖాళీలను వాడుకొని వ్యక్తులను ఉపయోగించుకొని అభివృద్ధే ఊతంగా ఆర్థికంగా పైకొస్తుంది. కాని పందొసంత అలా కాదు. రావడం రావడమే బరితెగింపుగా ఊరి మీద పడుతుంది. సంబంధాలు పెట్టుకుంటుంది. అత్త ముందు, ఆడపడుచు ముందు ఒకే ఇంట్లో ఇద్దరు మొగుళ్లను పెట్టుకొని మసలుతుంది. ఊరి ఆడవాళ్లంతా దీనిని చూసి ఎంతగా మురిసిపోతారంటే- రెడ్డి భార్య వచ్చి ఏంటీ అన్యాయం అనంటే వాళ్లే ఆమెను తన్ని తగలెయ్యబోతారు మా పందొసంత ఏం తప్పు చేసింది అనంటూ.

 

 రచయిత ఒక కవితా న్యాయం సాధిద్దామనుకున్నాడు. నవల ప్రారంభంలో మూలింటామె మనవరాలు (కూతురి బిడ్డనే కొడుక్కిచ్చి చేసింది) ఒక మాదిగవానితో లేచిపోయి ఉంటుంది. పోయి పోయి మాదిగవానితో ఒక కమ్మ స్త్రీ లేచిపోతుందా అని ఊరంతా మూలింటామె నరాలు కొరికేస్తారు. వీళ్లకు పాఠం చెప్పాలనుకున్నాడు రచయిత. ఆ మనవరాలి స్థానంలో పందొసంతను తెచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత ఆమెకు రెడ్డితో సంబంధం పెట్టాడు. రెడ్డి ఉన్నోడు కాబట్టి దరిమిలా పందొసంత కూడా స్థితిమంతురాలు కానున్నది కాబట్టి ఊరంతా ఆమె చేసిన పనికి కిక్కురుమనలేదు. ఇంకేం. చూశారా మీ దగుల్బాజీతనం బయటపడింది అని రచయిత వాళ్ల ముఖాన ఊంచాడు. కాని ఇలా ఊంచడానికి రచయిత అనేక తప్పిదాలు చేశాడు. పతనాలూ చేశాడు. ఔచిత్యాలు మరిచాడు.

 

 మొదటి భార్య లేచిపోయింది. నిజమే. రెండో భార్య వచ్చింది. నిజమే. కాని ఆ భార్య వచ్చీ రావడంతోటే పక్కలు పరవడానికి సిద్ధమైపోతే అత్త మూలింటామెగాని, ఆడపడుచు నడిపామెగానీ నోరు విప్పరు. ఎక్కణ్ణుంచో వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టావా సేయ్ అని ఊళ్లో ఒక్క ఆడదీ అనదు. అన్నింటికీ మించి మొగుడు- వీడు ఆశపరుడు కాదు, సోంబేరీ కాదు, పెళ్లాం సంపాదిస్తే తిందాం అనుకునే రకం కూడా కాదు- వీడు రచయిత కోరిక మీద హటాత్తుగా మారిపోయి పెళ్లయిన పదో రోజు నుంచే పెళ్లాం ‘మిండగాడి’కి మంచం మీద దుప్పటి పరవడానికి సిద్ధమైపోతే తల్లిగాని చెల్లిగాని ఒరే యెదవా... నీలాంటి యెదవ కోసమట్రా మేమింత తాపత్రయ పడింది అని అనరు. ఇరవై ఏళ్ల పిల్ల పందొసంత. చెప్పు తీసుకుని కొట్టి సరి చేయాలంటే క్షణం పట్టదు. కాని రచయిత పరశురాముడిలా అడ్డు నిలిచి ఉన్నాడు. ఆమె పక్కలేయకపోతే అతడు విశ్రమించడు. నిజానికి ఏ ఊరైనా ఏమనుకుంటుందంటే- ఈ మొగుడు ముండాకొడుకు కొత్త పెళ్లికూతురినే పరాయోడి దగ్గరకు పంపిస్తున్నాడే వీడి బుద్ధి గమనించే ఆ మహాతల్లి మొదటి భార్య ఎవడితోనో లేచిపోయి ఉంటుంది అని అనుకుంటారు. కాని రచయిత అలా అనుకోనివ్వడు. మొగుడు చేతగానివాడు కాబట్టి ఆమె లేచిపోయింది అనే పాయింటును వదిలిపెట్టి ఆమెను సమర్థించడానికి ఊళ్లోని ఆడోళ్లందరూ రంకులాడులే అనే పాయింట్‌ను పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తాడు.  దైహిక పతనం చూపబోయి కాముకత్వంగా విఫలమయ్యాడు.

 

 వాస్తవానికి ఊళ్లలో సంబంధాలు ఉండొచ్చు. వాటికి ఉచ్ఛనీచాల ప్రత్యేక విలువ లేకపోవచ్చు. కాని అవి గుంభనంగా ఉంటాయ్. నవలలో కూడా అలా  గుంభనంగా చెప్పి ఉంటే ఒక శిల్ప సౌందర్యం ఉండేది. కాని బట్టబయలు చేసేదాక రచయిత ఊరుకోడు. చూడండి చూడండి అని ప్రతీ పేజీలో చూపడమే. నవల రెండో అంకానికి ‘కొనభాగం’ అని పెట్టాడు రచయిత. కాని దానికి ‘అర్ధరాత్రి- కోడికూర’ అని పెట్టాలి. రచయిత గతి తప్పిన కలానికి పేజీల కొద్దీ కోడికూర గోల ఒక ఉదాహరణ.

 

  భారీ వర్షంలో ఎద్దులు దున్నడానికి పోతాయా అని కేశవరెడ్డిని పదే పదే విమర్శించిన నామిని మూలింటామె చనిపోయాక అంతరాత్రి పదిగంటల దాకా మనవరాలు ఒక్కత్తే  సమాధి మీద బోరోమని ఏడ్చే దాసరి నారాయణరావు సన్నివేశం రాయడం విషాదం. ఆ వెంటనే ఆమెను తిరుమల కొండ మెట్ల మీద నుంచి ఏదో కోనలోకి దూకించి చంపేశాడు. రచయితను తోద్దామంటే పాఠకులకు అందుబాటులో లేకపోవడం మరో విషాదం. కథ ఉంది. వస్తువు ఉంది. ప్రపంచంలో ఏ రచయితా డీకొట్టలేనంత అద్భుతమైన సంభాషణా చాతుర్యం ఈ నవలలో అణువణువూ ఉంది. మరికొంత సంయమనం, కుదురు, కోత, విస్తృతి, దృష్టికోణం ఉండుంటే పల్లెల ఆధునికత దాంతో పాటు మొదలైన పర్యావరణ విధ్వంసం పై  చాలా మంచి నవల అయి ఉండేది. .

 - ఖదీర్

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top