గోళ్లు, వెంట్రుకలు మరియు సిట్‌!

గోళ్లు, వెంట్రుకలు మరియు సిట్‌! - Sakshi


అక్షర తూణీరం



మహా సంగ్రామాలప్పుడు కొన్ని వ్యూహాలు శత్రు పక్షాన్ని దారి తప్పిస్తాయ్‌. ప్రస్తుతం డ్రగ్స్‌పై విచారణలో గొప్ప వ్యూహ రచన సాగిందని తెలుస్తూనే ఉంది. అసలైన గొప్ప గుర్రాల్ని జాగ్రత్తగా కప్పెట్టడానికే ఈ వ్యూహం పన్నారని జనం అనుకుంటున్నారు.



నాస్తికులు నమ్మరుగానీ దేవుడు భలే అసాధ్యుడు. సృష్టిలో బోలెడు మెలికలు పెడతాడు. గోళ్లు మిక్కిలి నిష్ప్రయోజనమైనవనుకుం టాం. శరీరాన్ని అంటిపెట్టుకు ఉన్నా రక్త సంబంధంలేని భాగాలు గోళ్లు, వెంట్రుకలు. వాటి దారిన అవి పెరుగుతూ ఉంటాయి. వాటి పోషణ ఇటీవలి కాలంలో పెనుభారం అయ్యింది. గోళ్ల వ్యవ హారమూ తక్కువది కాదు. వీటిని చాలా తృణీకారంగా తీసేస్తుంటాం. అదే మన అజ్ఞానం. మన పెద్దవాళ్లు బిడ్డ పుట్టగానే బొడ్డుని భద్రపరచి, తాయత్తులో పదిలపరిస్తే మూఢ నమ్మకం అనుకున్నాం. కానీ మూల కణాల చరిత్రని క్షణాల్లో అది చెబుతుందని నిన్న మొన్నటిదాకా మనకు తెలిసిరాలేదు.



అకున్‌ సబర్వాల్‌ పుణ్యమా అని కొన్ని కీలక ఘట్టాలలో గోళ్లు, వెంట్రుకలు గుట్టు విప్పుతాయని జన సామాన్యానికి విశదమైంది. విచారణకు వచ్చిన వారిలో కొందరు వెంట్రుక ముక్కలు ఇవ్వడానికి ససేమిరా అన్నారు. గోళ్లు ఆత్మరక్షణకే అనుకున్నాం గానీ ఇలా గమ్మత్తు కథలు చెప్పగలవని ఎవరికీ తెలియదు. నెత్తుట్లో సైతం దొరకని కొన్ని మధుర స్మృతులు వీటిలో చూడవచ్చుట. మొత్తానికి నెల రోజులపాటు అటు ఆబ్కారీ శాఖ, ఇటు మీడియా కావల్సినంత సందడి చేశారు. కొన్ని చానెల్స్‌ స్వయంగా ఇంకొన్ని మసాలాలు జోడించి రేటింగులు సాధించుకున్నాయి. అందరూ పేరూ ప్రఖ్యాతి కలిగినవారు. ముఖ విలువ ఉన్నవారు. నాబోటి వాళ్లకి విషయాలు తెలుసుకోవాలని విప రీతమైన ఆసక్తి. ఈ మహా మత్తులో చిక్కుకున్న వారికి డబ్బు నిషా ఆనదు.



విలాస జీవన శైలి ప్చ్‌... గ్లామర్‌ నిషా చాలదు. అప్పుడు అవసరపడతాయీ అదనపూ కిక్కులు. తొలి అడుగులోనే ఆనంద స్థితికి చేర్పిస్తాయి టాటూలు, బ్లాసమ్‌లు. ఒక్కసారి రుచి మరిగితే వీడటం కష్టం. గంజాయి, నల్లమందు, భంగు అతి ప్రాచీనమైన దేశవాళీ నిషాలు. తర్వాత అనేకానేక పై సంగతులు వచ్చి పడ్డాయి. ఇవీ కొత్తేమీ కాదు. ఎప్పుడూ ఓ మూల ఈ కోడ్‌ నడుస్తూనే ఉంది. ఇప్పుడెందుకో తీగె లాగారు. డొంకంతా కదల్లేదుగానీ కొద్దిగా హడావుడి చేశారు.



గంటలు గంటలు, రోజులు రోజులు ఇంటరాగేషన్‌ చేశారు. అందరూ సహకరించారు. అయినా అసలు సంగతి ఏమిటో ఎవరికీ తెలియదు. వారాల తరబడి టీవీ తెరలకు అతుక్కుపోయిన జనం పిచ్చివాళ్లుగా మిగిలారు. మహా సంగ్రామాలప్పుడు కొన్ని వ్యూహా లుంటాయ్‌. అవి శత్రు పక్షాన్ని దారి తప్పిస్తాయ్‌. ఇప్పుడు కూడా గొప్ప వ్యూహ రచన సాగిందని తెలుస్తూనే ఉంది. అసలైన గొప్ప గుర్రాల్ని జాగ్రత్తగా కప్పెట్టడానికే ఈ వ్యూహం పన్నారని జనం అను కుంటున్నారు. తిమింగలాలు సముద్ర మధ్యంలో నిశ్చిం తగా జోగుతున్నాయ్‌. ఒడ్డున చిన్న చేపతో అలజడిని సృష్టించి, ఆయా శాఖలు తమ నిజాయితీని చాటుకుం టున్నాయి. అకున్‌ సబర్వాల్‌ జీ! ఇంతకీ దీని ఫలశ్రుతి ఏమిటో చెప్పరా ప్లీజ్‌! గోళ్లు, వెంట్రుకలు మరియు రాజకీయం. వడ్ల గింజలో బియ్యపు గింజ!



శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు
)

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top