సామూహిక దుఃఖమే నా కవిత్వం

సామూహిక దుఃఖమే నా కవిత్వం


‘కాగుతున్న రుతువు’ సంకలనం వచ్చిన నేపథ్యంలో కెక్యూబ్‌ వర్మతో సాక్షి సాహిత్యం ప్రతినిధి జరిపిన చిరు సంభాషణ...

1. మీ పేరేంటి చిత్రంగా ఉంది?

అసలు పేరు కయనీకోరోత్‌ కుమార వర్మ. కయనీకోరోత్‌ మా ఇంటిపేరు. దాంతో మా ఫ్రెండ్స్‌ కెక్యూబ్‌ అనేవాళ్లు. నేనూ అలాగే కంటిన్యూ అయ్యాను. (ప్ర: ఇంటిపేరు కూడా చిత్రంగా ఉంది...) మా నాన్న కేరళీయుడు. తనకు 21 ఏళ్లప్పుడు యోగిగా పార్వతీపురం వచ్చారు. 31 ఏట మా అమ్మను చూసి గృహస్థాశ్రమంలోకి మారారు. మరలా 60 ఏళ్ల తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించారు. చిత్రంగా ఆయన దగ్గరే నేను కమ్యూనిజం పుస్తకాలు చదివాను.



2. జీవితంలో మీకు దుఃఖమే ఎందుకు ఎక్కువ కనబడుతోంది?

జరుగుతున్న పరిణామాలు అలాగే ఉన్నాయ్‌. సమాజంలో ఒక రకమైన అసహనం ఉండటం, ఆశావహ దృక్పథం కనబడకపోవడం, మిత్రులు చనిపోవడం, ముందుకు తీసుకుపోవాల్సిన ఉద్యమాలు వెనుకంజ వేయడం, ప్రజలు వివిధ ప్రలోభాలకు లోనుకావడం, ఏదైతే కల కన్నామో దాన్నుంచి దూరంగా నెట్టివేయబడటం... ఈ దుఃఖాన్నే కవిత్వం ద్వారా వ్యక్తం చేస్తున్నా.



3. దుఃఖం కాకుండా, మీ కవిత్వానికి ప్రేరణ ఎక్కడినుంచి వస్తుంది?

అడవిలో పూచిన వెన్నెల, ఈ నీరెండ సమంగానే మనసును వెన్నాడుతూ వుంటాయి. గుండెలో తడి లేని వాడు విప్లవకారుడు కాలేడన్న చే మాట నిరంతరం ఘోషిస్తూ వుంటుంది. పచ్చదనం, అటవీ సంపద, సెలయేళ్లు, పువ్వులు, పత్రహరితం, వీటన్నింటినీ మాయం చేసే ఎడారితనం నన్ను కలవరపరుస్తుంది. ఇది వైయక్తిక దుఃఖం మాత్రం కాదు. ఒక సామూహిక నెత్తుటి గాయం సలపరమే నా కవిత్వం.



4. కవిత్వం రాయడానికి మీదైన పద్ధతి ఏమైనా ఉందా?

నేనలా చెప్పలేనేమో! నిజానికి ప్రత్యేకమైన శైలి నేను కోరుకోవడం లేదు. ముందు రెండు లైన్లలో ఒక చిత్రాన్ని స్కెచ్‌ వేసుకుంటాను; మరో రెండు లైన్లతో దాని కొనసాగింపు... ఇలా రాస్తాను. కొన్ని సాయంత్రాలు పేరుతో పది పదిహేను కవితలు రాశాను. వాటితో ఒక రకమైన మూడ్‌ని క్రియేట్‌ చేయాలనుకుంటాను. ఆ మూడ్‌లోకి పాఠకుడిని తీసుకెళ్లాలి...



5. కవిత్వాన్నుంచి మీరు ఆశించే ప్రయోజనం?

కథ కన్నా కవిత్వం వెంటనే చెప్పగలుగుతుంది. ఒక స్పార్క్‌లాగా. చదివినవాళ్ల మనసులోకి చొచ్చుకుపోయేలా! నేననుకోవడం, ఎవరికో దుఃఖమో, బాధో కలిగించే ఘటనను పాఠకుడు తమదిగా భావించేలా చేయగలగాలి. తద్వారా వాళ్లు దానిగురించి ఆలోచించేలా చేయాలనేది నేనాశించే ప్రయోజనం.



కాగుతున్న రుతువు; కవి: కెక్యూబ్‌ వర్మ; పేజీలు: 174; వెల: 80; ప్రతులకు: కవి, 11–3–11, కె.పి.ఎం. హైస్కూల్‌ దగ్గర, పార్వతీపురం–535501. ఫోన్‌: 9912464484

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top