మా అన్నయ్య దాశరథి

మా అన్నయ్య దాశరథి - Sakshi


చెదరని జ్ఞాపకం

 

‘నిరుపేదవాని నెత్తురు చుక్కలో ఎన్ని విప్లవాలో’ అన్న కవి దాశరథి. ఆయన చనిపోయి (1987) చాలా కాలమైనా సాహిత్యంలో ఆయన ప్రాసంగికత, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఆయన కవిత్వ స్ఫూర్తి పదే పదే స్ఫురణకు వచ్చి ఆయన యశస్సును పెంచుతూనే ఉన్నాయి.

 

ఈ నేపథ్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి మహాకవి దాశరథి  పేరుతో ఒక జాతీయ సదస్సు నిర్వహించి ఆ సందర్భంగా వచ్చిన 61 పత్రాలను ‘దాశరథి సాహిత్య సమాలోచన’ గా, దాశరథికి కవుల నివాళిని ‘సాహిత్య ప్రపంచంలో దాశరథి’ గా భారీ సంకలనాలు తీసుకొని వచ్చింది (ప్రతులకు: 9848292715). ఈ సందర్భంగా ఈ సంకలనాల కోసం దాశరథి సోదరుడు దాశరథి రంగాచార్యులు తన అన్నయ్య చివరి క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటూ రాసిన వ్యాసం ఇది.

 

‘దేశే దేశే కళత్రాని, దేశే దేశేచ బాంధవాః తంతు దేశం నాపశ్యామి యత్ర భ్రాత సహోదరః’ అని విలపిస్తాడు రాముడు- లక్ష్మణుడు మూర్ఛపోయినందుకు. మరి మా అన్నయ్య నా రాముడు దాశరథి కవితా శరధి మాట మాత్రం చెప్పకుండా వెళ్లిపోయాడు. దుఃఖంలో ముంచి పోయాడు. నా గుండెలో చీకట్లు నింపి తిమిరంలో సమరం జరపడానికి వెళ్లిపోయాడు.

 

అక్కడ- ఆ లోకంలో- నైజాం పిశాచం వెలసినట్టున్నాడు. అక్కడ చీకట్లు కమ్ముకున్నట్టున్నాయి. సమరం జరపడానికి పిలిచినట్టున్నారు. దేవుడు వట్టి స్వార్థపరుడు. ఇక్కడి చీకట్లను ఇలాగే ఉంచి, అక్కడి తిమిరంతో సమరానికి మా అన్నయ్యని తీసుకెళ్లాడు.మా అన్నయ్య చనిపోయాడంటే- అతని పార్థివ శరీరాన్ని నేనే అగ్నికి ఆహుతి చేయించానంటే నా మనసు నన్నే నమ్మడం లేదు.

 

 తెల్లని ధోవతి ధరించి, కాలరులేని పొడుగు చేతుల చొక్కా వేసుకొని చేతిలో బ్రీఫ్ కేసు పట్టుకుని మా ఇంటి దర్వాజాలో నుంచొని ‘తమ్ముడూ’ అని పిలుస్తున్నట్టనిపిస్తున్నది. మా అన్నయ్య ఇంకా మాట్లాడ్తాడనీ, ఏ విషయాన్ని అయినా ఎవరితోనయినా గంటల తరబడి మాట్లాడేవారు మరణించడం అసాధ్యం అనీ అనుకుంటుంది మనసు. 20 సెప్టెంబర్ నాడు మా అన్నయ్యను ఆస్పత్రిలో చేర్పించారని ఫోను వచ్చింది. నేను కదిలే స్థితిలో లేను. డాక్టర్‌ను అడిగాను.

 

 మీ ఆరాటం చూస్తుంటే మీరు వెళ్లడమే మంచిది అన్నాడు. కమల, నేను వెళ్లాం, మా పిల్లవాడు విరించి అక్కడే ఉన్నాడు. నన్ను మా అన్నయ్య ఉన్న గదికి తీసుకెళ్లాడు. మంచం మీద దిండ్లు ఆనించి కూర్చోపెట్టారు. ఆక్సిజన్ వగైరా గొట్టాలతో కట్టివేసినట్టున్నాడు. అన్నయ్యను చూచాను. నాలో దుఃఖం కట్టలు తెంచుకుంది. పెద్దగా ఏడ్చేశాను. అన్నయ్య కళ్లు తెరిచాడు. ‘తమ్ముడూ’ అన్నాడు. నా గుండె అవిసిపోయింది. నర్సులు వచ్చారు. నన్ను బయటకు నడిపించారు.

 

 మా అన్నయ్యను నిజాం జైల్లో పెట్టగలిగాడు- కాని బంధించలేకపోయాడు. జైల్లోనే ‘వద్దంటే గద్దెనెక్కి పెద్దరికం చేస్తావా’ అని గర్జించాడు. అలాంటి సింహాన్ని ఆస్పత్రి బంధించింది. చూడలేకపోయాను. ఎంతోసేపు విలపించాను.అన్నయ్య ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చాడు. నేను, కమల వెళ్లాం. ఆస్పత్రిలో కంటే బావున్నాడు. పూర్వం వలెకాకున్నా సరదాగానే మాట్లాడాడు. ‘మరదలు వచ్చిందంటే ఆపిల్స్ తెచ్చిందన్న మాటే. చెక్కు తీసి కోసి పెట్టమ్మా’ అన్నాడు. అన్నయ్య మాటల్లో దుఃఖపు తడి కనిపించింది. కమల ఆపిల్ చెక్కు తీసి ముక్కలు కోసి పెట్టింది. ‘తమ్ముడూ.. ఈ ఊపిరితిత్తుల్లో నీరు ఎప్పుడు వచ్చిందో తెల్సుగా. 1940లో ఖమ్మం హీరాలాల్ ఇంట్లో నువ్వు నా మూత్రపురీషాలు ఎత్తిపోశావు’ అని గతాన్ని తోడి పోశాడు. ఆపిల్ ముక్క ఒక్కటే తిన్నాడు. ‘అందరికీ ఆపిల్స్ సెలెక్ట్ చేయడం చేత కాదురా’ అన్నాడు.

 

మా అన్నయ్య బాగవుతున్నాడు. కోలుకుంటున్నాడు. మళ్లీ కొద్దిరోజుల్లో మా ఇంటికి వస్తాడు. ‘తమ్ముడూ’ అని పిలుస్తాడు. మా ఇంట్లో ఆపిల్ తింటాడు. చాయ్ తాగుతాడు. లోకంలో ముచ్చట్లన్నీ చర్చిస్తాడు అనుకున్నాను. కాలేదు. బాగు కాలేదు. మా ఇంటికి రాకుండానే వెళ్లిపోయాడు.

 

ఆశలన్నీ అడియాసలు చేసి వెళ్లిపోయాడు.1-11-87 ఆదివారం నేనూ కమలా వెళ్లాం. అన్నయ్య నిద్రలో ఉన్నాడంటే బయటనే కూర్చున్నాం. గ్రహించాడు మేం వచ్చామని. ‘తమ్ముడూ’ అని పిలిచాడు. వెళ్లాం. నన్ను తన మంచం మీదనే కూచోమన్నాడు. తాను లేచి కూచున్నాడు. ఇదివరకు చూచినప్పటికీ ఇప్పటికీ బాగున్నాడు. రాసినవి, రాయవలసిన వాటిని గురించి ముచ్చటించాడు. ‘అన్నయ్యా. నీ జబ్బు నయమైంది. ఇంక కోలుకోవాలి. అంతే. వారం పది రోజుల్లో బాగవుతావనుకుంటా. మేము మళ్లీ వచ్చేసరికి కోలుకుని నడుస్తుంటావు’ అన్నాను. ‘నేనూ అదే అనుకుంటున్నాను. నాకు జబ్బు లేదు. నీరసమే ఉంది. బాగయిపోతాను’ అని ధైర్యం కనబరచాడు. నాకు చాలా సంతోషం కలిగింది.

 

 ఇంటికి వచ్చిన తరువాత అనుకున్నాను. మా అన్నయ్యకు అన్నీ మా నాయన లక్షణాలు వచ్చాయని. మా నాయన 1979వ సంవత్సరంలో తన 81వ సంవత్సరంలో పరమపదించారు. మా అన్నయ్య కూడా 81 సంవత్సరాలు జీవిస్తాడు అనుకున్నాను. అన్ని అంచనాలను తల్లకిందులు చేశాడు. అందని తీరాలకు వెళ్లిపోయాడు. కార్తీకపౌర్ణమి అందరికీ పర్వదినం. మాకది దుర్దినం. అన్నయ్య ఆ ఉదయం రక్తపరీక్ష కోసం డాక్టరు దగ్గరికి వెళ్లి వచ్చాడు. రెండు ఇడ్లీలు తిన్నాడు. కాస్సేపు నిద్రపోయాడు. లేచాడు. ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకున్నాడు.

 

 బాత్‌రూమ్‌కు వెళ్లాడు. తలుపు వేసుకోవద్దని వాళ్లమ్మాయి ఇందిర బయట నుంచుంది. కమోడ్ మీది నుంచి పక్కనే ఉన్న నీళ్ల బకెట్‌లో పడిపోయాడు. ఇందిర ‘నాన్నా నాన్నా’ అంటూ లోనికి ఉరికింది. ఇంకెక్కడి నాన్నా. నాన్న ఎక్కడున్నాడు. ఎక్కడున్నాడమ్మా నాన్నా. నాన్న వెళ్లిపోయాడు. ఏ లోకాల నుంచో పిలుపు వచ్చింది. వెళ్లిపోయాడు. అందరినీ వదలి వెళ్లిపోయాడు. ఒంటరిగానే వెళ్లాడు. అర్థం కాని చోటికి వెళ్లిపోయాడు.

 

 మృత్యువు సైతం మా అన్నయ్య మందహాసాన్ని ఆర్చలేకపోయింది. చావు తర్వాత కూడా మా అన్నయ్య ముఖంలో మార్పులేదు. అది వెలుగుతున్న దివ్వెలా ఉంది. మా అన్నయ్యను యమపాశాలు బంధించినట్లు కనిపించదు. మృత్యుదేవి అతని అడుగులకు మడుగులొత్తి తీసుకెళ్లిపోయింది. మరణాయాసం మా అన్నయ్య దరి చేరడానికి అదిరిపోయింది. మా  అన్నయ్య శరీరం నిద్రపోతున్నట్టుంది. ఏవో పనుల మీద ఆ లోకాలకు వెళ్లాడు. మరలి వస్తాడేమో అన్నట్టున్నాడు.

 

 మా అన్నయ్య కల్లాకపటం ఎరుగనివాడు. స్నేహం అంటే ప్రాణం ఇచ్చేవాడు. అతడికి వేల సంఖ్యలో మిత్రులున్నారు. మా అన్నయ్య మానవతామూర్తి. ఆయన మనసులో కళ్లలో కవితలో హృదయంలో మానవత నిండి నిబిడీకృతం అయి ఉంది. మా అన్నయ్య నిజమైన కవి. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా స్పందించేవాడు. దాన్ని కవితామయం చేసేవాడు. మా అన్నయ్య గొప్ప వక్త. సభలలో గంటల తరబడి అనర్గళంగా ఉపన్యసించేవాడు. ఉత్తరాలు రాయడంలో మా అన్నయ్యను మించినవాడు ఉన్నాడనుకోను. ఎవరు ఉత్తరం రాసినా వెంటనే జవాబు రాసేవాడు. కొంతమందికి వారి ఉత్తరం అవసరం లేకుండానే జవాబు రాసేవాడు. వేల సంఖ్యలో జాబులు రాశాడు. మా అన్నయ్య హెచ్చుతగ్గులు ఎరగడు. ప్రధానితోనూ పసిపాపతోనూ ఒకేరకంగా మాట్లాడేవాడు. మా అన్నయ్య మహా మానవతావాద కవి. ఆయన కవితలు అగ్గి కురిపించగలవు. పూలవాన రాల్చగలవు.

 

 మా అన్నయ్య అగ్నిధారలో ఉన్నాడు. రుద్రవీణలో ఉన్నాడు. తిమిరంతో సమరంలో ఉన్నాడు. గాలిబ్ గీతాల్లో ఉన్నాడు. మిత్రుల మనసుల్లో ఉన్నాడు. మా అన్నయ్య ఉన్నాడు. ఉంటాడు. ఉండి తీరుతాడు.

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top