హడలెత్తిస్తున్న హార్దిక్ పటేల్

హడలెత్తిస్తున్న హార్దిక్ పటేల్ - Sakshi


త్రికాలమ్



రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని ప్రతిఘటించేందుకు తాము వీధుల్లోకి వస్తామంటూ ఎస్‌సీ, ఎస్‌టీ నాయకులూ, ఓబీసీ నాయకులూ హెచ్చిస్తున్నారు. అదే జరిగితే కల్లోలమే తరువాయి. ఇంతకీ, హార్దిక్ పటేల్ వెనుక ఎవరున్నారు? నాలుగు దశాబ్దాల కిందట కాంగ్రెస్‌లోని అసమ్మతివర్గం చిమన్‌భాయ్ పటేల్ ను గద్దె దించేందుకు నవనిర్మాణ సంఘర్షణ ఉద్యమానికి ఊతం అందించినట్టుగానే ఇప్పుడు గుజారాత్ బీజేపీలో ఆనందినీ పటేల్ ప్రత్యర్థులు హార్దిక్ పటేల్ వెనుక ఉన్నారనే అనుమానాలు లేకపోలేదు.

 

భారత ప్రజాస్వామ్యవ్యవస్థలో రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగు తాయో, ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో తెలియదు. ఏ ఉద్యమం ఎం దుకు పుట్టిందో ఎట్లా ముగుస్తుందో అంతుబట్టదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా సాధించిన విజయాలను ఏకరువు పెడుతూ ఎన్నికల ప్రచారం అట్టహాసంగా సాగించి అద్భుతమైన విజయం సాధించిన నరేంద్రమోదీకి హార్దిక్ పటేల్ అనే ఇరవై రెండు సంవత్సరాల యువకుడి అంతరంగం అంతుబట్టడం లేదు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని గెలిపించడానికి వ్యూహాలు రచిస్తూ, శక్తి మంతమైన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ప్రధాని మోదీకి స్వరాష్ట్రం సింహస్వప్నమై కలవరపెడుతోంది. హార్దిక్ పటేల్ అనే కుర్రవాడు పక్కలో బల్లెంలాగా తయారైనాడు.



బాబాసాహెబ్-బాలాసాహెబ్

బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో రచించిన రాజ్యాంగం విద్యాసంస్థ లలో, ఉద్యోగాలలో దళితులకూ, ఆదివాసీలకూ ప్రసాదించిన రిజర్వేషన్లనూ, మండల్ కమిషన్ సిఫార్సులను విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం ఆమోదించి ఏబీసీల (అదర్ బ్యాక్‌వర్డ్ క్యాస్ట్స్)కు ఇచ్చిన రిజర్వేషన్లనూ వ్యతిరేకిస్తూ హార్దిక్ పటేల్ నాయకత్వంలో పెల్లుబికిన ఉద్యమం ‘గుజరాత్ నమూనాను’ సవాలు చేస్తున్నది. గుజరాత్ మోడల్ అంటే పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, ఆర్థికం గా అభివృద్ధి సాధించి ఉద్యోగాలు సృష్టించి ప్రజలను ప్రగతి పథంలో నడిపించ డంగా ఇంతకాలం అర్థం చేసుకున్న భారతీయులను ఇప్పుడు కొత్త ప్రశ్నలు వేధిస్తున్నాయి. బాబాసాహెబ్ కు విరుగుడుగా బాలాసాహెబ్‌ను ఆరాధించే నవయువకుడి నాయకత్వంలో వేలాదిమంది పాటీదార్ (పటేళ్లు) ఉద్యమిం చడం ఒక్క మోదీకీ, బీజేపీకే కాదు, దేశం మొత్తానికీ ఆందోళన కలిగించవలసిన అంశం. పాటీదార్ వ్యవసాయంలో, వ్యాపారంలో ఆరితేరినవారు. అమెరికాలో భారత సంతతికి చెందినవారు నిర్వహించే వ్యాపారాలలో పటేళ్లదే సింహ భాగం. సంపన్న కులంగా పరిగణించే పాటీదార్‌లలో సైతం ఇంత అసంతృప్తి దావానలం దాగుందని బహుశా నరేంద్రమోదీ సైతం ఊహించి ఉండరు. ఏ జాతీయ నాయకుడి కి ఆకాశం అంత ఎత్తు విగ్రహం కట్టించాలని మోదీ న డుం బిగించారో ఆ నాయకుడి పేరుతో వెలసిన సర్దార్‌పటేల్ గ్రూప్ (ఎస్‌పీజీ) నాయకుడు హార్దిక్ పటేల్. ఈ సంస్థకు ఒక సిద్ధాంతం లేదు. సామాజిక స్పృహ లేదు. కండబలంతో తమ కులానికి చెందినవారిలో భద్రతాభావం కలిగించడం ద్వారా ఎదిగిన ముఠా. ‘మా ఆడవారిపైన చేయి వేసినవారి చేతులు విరిచేస్తాం. అందుకే పాటీదార్లంతా మాకు మద్దతు పలుకుతున్నారు. నేను ఎంతమంది చేతులు విరిచేశానో తెలుసా?’ అంటూ ప్రగల్భాలు పలికే ఈ యువ నాయ కుడికి బాల్‌ఠాక్రే సిద్ధాంతాలు ఆదర్శం. రాజ్ ఠాక్రే పద్ధతులు అనుసరణీయం. ‘రిజర్వేషన్లు ఉంటే అందరికీ ఉండాలి లేకపోతే ఎవ్వరికీ ఉండకూడదు’ అనే సూత్రాన్ని పట్టుకొని ఉద్యమం నిర్మిస్తున్న హార్దిక్ పటేల్‌కి ఈ దేశం గురించి కానీ సమాజం గురించి కానీ అవగాహన బొత్తిగా లేదు. భగత్ సింగ్‌నూ, చంద్రశేఖర్ ఆజాద్‌నూ ఆదర్శంగా భావించేవారికి బాల్‌ఠాక్రే మార్గదర్శి కావడం విచిత్రం. ‘మీరు అడిగింది ఇవ్వకపోతే హింసాత్మకంగా వ్యవహరిస్తారా?’ అని ప్రశ్నిస్తే ‘మా హక్కు ప్రేమతో ఇవ్వకపోతే బలవంతంగా లాక్కుంటాం (అగర్ హమారే హక్ ప్యార్ సే నహీ దోగే తో చీన్‌కే లేంగే)’ అంటాడు.



గుజరాత్ నమూనా ఇదేనా?

ప్రపంచజ్ఞానం అంతగా లేనివాడు, పాతికేళ్లు కూడా నిండనివాడు లక్షలమంది పాటీదార్లకు ఎట్లా నాయకుడు కాగలిగాడు? ‘మా కులంలో 40 శాతం మంది సంపన్నులు. కానీ పది నుంచి ముప్పయ్ శాతం వరకూ పిల్లల్ని చదివించా లంటే ఫీజు కట్టేందుకు భూములు అమ్ముకోవలసిన దుస్థితిలో ఉన్నవారు. ధనవంతుడైన ఓబీసీ విద్యార్థికి ఉచితంగా సీటు వస్తుంది. చదువు పూర్తి కాగానే ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుంది. మా పిల్లలు మాత్రం చదువు కోసం, ఉద్యోగం కోసం పొలాలు అమ్ముకొని ఖర్చు చేయాలి. గుజరాత్‌లో సెల్ఫ్ ఫినాన్స్ ఎడ్యు కేషన్ అమలులో ఉంది. మా చదువుకు అయ్యే ఖర్చు మేమే భరించాలి. ఉద్యో గాలు కావాలంటే లంచాలు ఇవ్వాలి. ఈ అన్యాయం సహించరానిది’. ఒక పత్రి కకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్ పటేల్ చేసిన వ్యాఖ్యలివి. ‘నరేంద్రమోదీ నాయకత్వంలో గుజరాత్ అభివృద్ధి చెందింది కదా’ అని అడిగితే, ‘అంతా అబ ద్ధం. అభివృద్ధి చెందకపోగా పరిస్థితి దిగజారింది. సంపన్నులు మరింత సంప న్నులైనారు. పేదలు మరింత పేదలైనారు’ అని సమాధానం. మొన్న హైదరా బాద్ కేంద్రీయ విశ్వవిద్యాలంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పింది సరిగ్గా ఇదే. కులం పేరుతో రాజకీయం చేస్తూ కుల రాజకీయాల ద్వారా అధికారం హస్తగతం చేసుకున్న ములాయంసింగ్, శరద్ పవార్, మాయావతి వంటి నాయకులు దేశాన్ని సర్వనాశనం చేశారని నిందిస్తాడు హార్దిక్ పటేల్. ‘వారికంటే మీరు ఎట్లా భిన్నం?’ అంటే, ‘వారు కేవలం రాజకీ యవాదులు (పొలిటీషియన్స్). అసలైన ప్రజానాయకుడు (లీడర్) బాల్‌ఠాక్రే అడుగుజాడల్లో నేను నడుస్తున్నాను’. హార్దిక్ పటేల్ అనే యువనాయకుడి మనో గతం ఏమైనా అర్థం అవుతోందా? కాదు. ఎందుకంటే, అతనికేమి కావాలో అతనికే తెలియదు. దిశానిర్దేశం లేని క్షిపణి అతడు. సెప్టెంబరు ఆరో తేదీన ఢిల్లీలో జాట్ల మహాసభలో మాట్లాడబోతున్నాడు. పాటీదార్ల వంటి ఇతర కులాల నాయకులతో సమాలోచన జరపబోతున్నట్టు అతడు వెల్లడించారు. దేశంలోని 121కోట్ల జనాభాలో పాటీదార్లూ, వర్మ, కటియా, రెడ్డి, హూడా, గుజ్జర్లు, కూర్మీ లు, జాట్‌లు, మరాఠాలూ కలిపి 27 కోట్లు ఉంటారని పటేల్ అంచనా. తెలుగు సమాజం గురించి అతడికీ, అతడి మిత్రులకూ స్పష్టత ఉన్నట్టు లేదు. ఒక వైపు రెడ్డి కులం పాటీదార్ వంటిదేనని చెబుతూ హార్దిక్ పటేల్, నితీశ్ కుమార్, చంద్ర బాబు నాయుడు కలిసి నాయకత్రయంగా ఏర్పడే అవకాశం ఉన్నదంటూ హార్దిక్ మిత్రుడు చిరాగ్‌భాయ్ పటేల్ అన్నాడు. హార్దిక్ పటేల్‌కు ఇన్ని లక్షల మంది మద్దతు ఎందుకు ఇస్తున్నారో అర్థం చేసు కోవా లంటే గుజరాత్ అభివృద్ధి నమూనాను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఇటీవల గుజరాత్ వెళ్లి నప్పుడు కొన్ని గ్రామాలు సందర్శించారట. అవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా లలో గ్రామాలకంటే హీనంగా, దీనంగా ఉన్నాయని చెప్పారు. ఈ అభి ప్రాయంతో ఎంతమంది ఏకీభవిస్తారో తెలియదు కానీ గుజరాత్ నమూనాను గుడ్డిగా నమ్మకుండా లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నదని మాత్రం హార్దిక్ పటేల్ ఉత్థానం స్పష్టం చేస్తున్నది. పాటీదార్ల ఉద్యమం తాటాకు మంటలాంటిదేనా? చప్పున ఆరిపోతుందా లేక ఆనందీబెన్ పటేల్ ప్రభు త్వానికి ప్రమాదం తెచ్చిపెడుతుందా?



నవనిర్మాణ ఉద్యమం

బహుశా 1974 నాటి నవనిర్మాణ ఉద్యమం నరేంద్రమోదీ మనస్సులో మెదు లుతూ ఉండవచ్చు. నాటి పరిణామాలు గుర్తుకు వచ్చి కించిత్ ఆందోళనకు లోను అవుతూ ఉండవచ్చు. 1960 మే 1 వ తేదీన గుజరాత్ రాష్ట్రం అవతరిం చింది. ఆ తర్వాత పదేళ్లకే ఇందూలాల్ యాజ్ఞిక్, జీవ్‌రాజ్ మెహతా, బల్వంత రాయ్ మెహతా వంటి ఉద్దండుల తరం అంతరించి చిమన్‌భాయ్ పటేల్ హయాం వచ్చింది. అవినీతి తాండవం చేసింది. విద్యార్థులు ఉద్యమించారు. 1974 జనవరి 7 వ తేదీన విద్యాసంస్థల బంద్‌కు పిలుపు ఇచ్చారు. చిమన్ భాయ్ పటేల్ రాజీనామా చేయాలన్నది వారి ప్రధానమైన డిమాండ్. అప్పటికే అవినీతిపై పోరాట ం ప్రారంభించిన జయప్రకాశ్ నారాయణ్ నవనిర్మాణ ఉద్య మానికి మద్దతు ప్రకటించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా, అఖిలభారత విద్యార్థి పరిషత్ నాయకుడుగా పని చేస్తూ ఉండిన నరేంద్రమోదీ నాటి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఉద్యమాన్ని జనసంఘ్ సమర్థించింది. విద్యార్థుల ఒత్తిడికి లొంగి 15 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు రాజీనామా చేశారు. కాంగ్రెస్ (ఓ) నాయకుడు మొరార్జీదేశాయ్ మార్చి 12న నిరవధిక నిరశన ప్రారంభిం చారు. మొత్తం 167 మంది కాంగ్రెస్ శాసనసభ్యులలో 95 మంది రాజీనామా చేశారు. ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు చిమన్‌భాయ్ రాజీనామా చేశారు. మార్చి 16న అసెంబ్లీని రద్దు చేశారు. ఉద్యమం ప్రారంభమైన నాలుగు మాసా లలోనే అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉన్న చిమన్‌భాయ్ పటేల్ రాజీనామా చేయ వలసి వచ్చింది (అనంతరం, 1990లో, బీజేపీ మద్దతులో చిమన్‌భాయ్ మళ్లీ ముఖ్యమంత్రి కాగలిగారు. అది వేరే విషయం). 1974లో ప్రభుత్వాన్ని మార్చిన విద్యార్థి ఉద్యమం సమాజాన్ని మార్చలేకపోయింది. అవినీతిని అంతం చేయ లేకపోయింది. కానీ ప్రభుత్వాన్ని కూల్చగలిగింది. అటువంటి పరిస్థితులే తిరిగి తలెత్తితే ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వం మాత్రం తట్టుకోగలుగుతుందా అనే అనుమానం మోదీని నిద్రకు దూరం చేయవచ్చు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని ప్రతిఘటించేందుకు తాము వీధుల్లోకి వస్తామంటూ ఎస్‌సీ, ఎస్‌టీ నాయకులూ, ఓబీసీ నాయకులూ హెచ్చిస్తున్నారు. అదే జరిగితే కల్లోలమే తరువాయి. ఇంతకీ, హార్దిక్ పటేల్ వెనుక ఎవరున్నారు? నాలుగు దశాబ్దాల కిందట కాంగ్రెస్‌లోని అసమ్మతివర్గం చిమన్‌భాయ్ పటేల్ ను గద్దె దించేందుకు నవనిర్మాణ సంఘర్షణ ఉద్యమానికి ఊతం అందించినట్టుగానే ఇప్పుడు గుజారాత్ బీజేపీలో ఆనందీబెన్ పటేల్ ప్రత్యర్థులు హార్దిక్‌పటేల్ వెనుక ఉన్నారనే అనుమానాలు లేకపోలేదు. విశ్వహిందూ పరిషత్తు నాయకుడు ప్రవీణ్ తొగాడియా, అతని శిష్యుడు గోవర్థన్ జడాఫియాలు హార్దిక్ పటేల్‌కు పరోక్షంగా, ఉదారంగా సహకారం అందిస్తున్నట్టు అభిజ్ఞవర్గాల భోగట్టా. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి రిజర్వేషన్లకు గండిగొట్టాలనే కుట్రపూరిత వ్యూహంతో ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం హార్దిక్ పటేల్‌ను ఒక ఆయుధంగా వినియోగిస్తున్నదని కాంగ్రెస్ నాయకుల ఆరోపణ.

 పాటీదార్లకూ, వారిని పోలిన కులాలకూ జాతీయ స్థాయిలో నాయకత్వం వహించాలన్న హార్దిక్ పటేల్ ఆకాంక్ష అసమంజసమైనదీ, అసాధ్యమైనదీ కావచ్చు. నవనిర్మాణ ఉద్యమం లాగానే పాటీదార్ల ఉద్యమం సైతం పరిమితి మైన విజయాలతోనో, విజయాలు ఏమీ సాధించకుండానో చల్లారిపోవచ్చు. కానీ అది మోదీ ప్రతిష్ఠను దారుణంగా దెబ్బతీసింది. బిహార్‌ను గుజరాత్‌లాగా అభివృద్ధి చేస్తానంటూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేస్తున్న మోదీ తన పుష్కరకాల పాలనలో గుజరాత్‌ను బిహార్ చేశారా? ఈ సంశయం ప్రజల మనస్సులలో బలంగా నాటుకున్నది. గుజరాత్ నమూనాపైన అనుమానాలు బలపడుతున్నాయి. ఆ మేరకు మోదీకీ, బీజేపీకి హార్దిక్ పటేల్ నష్టం కలిగించాడు.

 

కె.రామచంద్రమూర్తి

 

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top