కర్పూరం పూజాద్రవ్యమే

కర్పూరం పూజాద్రవ్యమే - Sakshi


అక్షర తూణీరం

 


దేవుడు నిజంగానే నీరాజనాలకు ఆనందించి అనుగ్రహిస్తాడా? అదే నిజమైతే కె.సి.ఆర్ యాదాద్రి నరసింహస్వామికి ముప్పొద్దులా మూడు టన్నుల ముద్ద కర్పూరమర్పించుకోడా? చంద్రబాబు తిరప్తికి అచ్చంగా కర్పూర గూడ్స్ రైలు నడపరా?

 

కర్పూరం మీద అయిదు శాతం ఆధార పన్ను తగి లించారు. పైగా కర్పూరం పూజా ద్రవ్యం కాదు, ఔషధ దినుసని తేల్చారు. మనసు వికలమైంది. ఈ సృష్టిలో హరించే గుణం వున్న వాటిలో పవిత్రమైనవీ, ప్రాచుర్యం గలవీ రెండే రెండు వున్నాయి. ఒకటి కర్పూ రం, రెండోది ప్రజాధనం. కర్పూరం గొప్ప దినుసు. పచ్చకర్పూరం మరీ విశేషమైంది. ఔషధ గుణాలుండి ‘అరుగుదల’కి సహకరి స్తుంది. అలాగని అక్రమంగానూ దారుణం గాను తిని పచ్చకర్పూరం బొక్కితే, అరగక పోగా అనర్థం జరుగుతుంది. ప్రభుత్వం బామ్‌లు, ఇన్‌హేలర్‌లు, వక్కపొడి, సుపారి, మిఠాయిల్లో వాడుతున్న కర్పూరంపై పన్ను పడాల్సిందే అంటున్నది. శ్రీవారి తిరునామం మొత్తం కర్పూరమే. లడ్డు ప్రసాదంలో చక్ర పొంగలిలో పరిమళించే దినుసు పచ్చకర్పూ రమే కదా. తిరుమల అంటే నిత్యకల్యాణం పచ్చకర్పూరం! అది సుగంధ పూజా ద్రవ్యం.



అయ్యప్పస్వామి దీక్ష మొత్తం కర్పూరం మీదనే సాగుతుంది. జ్యోతి దర్శనం కూడా కర్పూర మహత్యమేనని కొన్నేళ్ల క్రితం హేత వాదులు రుజువులతో సహా వచ్చారు. అదిగో అక్కడి కొండరాయి మీద లారీడు ముద్ద కర్పూరాన్ని మకరజ్యోతికి ముహూర్తం నిర్ణ యించి, అర్చక స్వాములు వెలిగిస్తున్నారం టూ హడావుడి చేశారు. ఇవన్నీ నమ్మకానికి సంబంధించిన అంశాలుగాని హేతువులకు సంబంధించింది కాదని కొట్టిపారేశారు. రాతి లోపలికి కప్ప వెళ్లి కూచోడం మహత్తుగా నాలాంటి వారు భావిస్తారు. ‘‘అది అజ్ఞానం, మామిడి టెంకలోకి పురుగు వెళ్లి పెరగడం లేదా’’ అంటూ ఏ జనవిజ్ఞాన వేదిక వారో యీ మూఢమతి కళ్లు తెరిపించే ప్రయత్నం చేస్తారు. మా బోరులో నీళ్లొస్తే మహత్యంగా తెగకుండా కరెంటు వస్తుంటే మహత్యంగా, యింకా సర్కారు అందించే సేవలు గుమ్మం లో అందినపుడు మహత్యంగా భావించే అల్పజ్ఞుణ్ణి.



అసలు మనమిప్పుడు మూలాల్లోకి వెళ్లాలి. కర్పూర హారతికి అసలు శక్తి వుందా? దేవుడు నిజంగానే నీరాజనాలకు ఆనందించి అనుగ్రహిస్తాడా? అదే నిజమైతే కె.సి.ఆర్ యాదాద్రి నరసింహస్వామికి ముప్పొద్దులా మూడు టన్నుల ముద్ద కర్పూరమర్పించు కోడా? చంద్రబాబు తిరప్తికి అచ్చంగా కర్పూర గూడ్స్ రైలు నడపరా? తమిళనా డులో ‘అమ్మ కర్పూరం’ వుచితంగానే గుమ్మా ల్లోకి రాదా? కర్పూరం మందే కాదు మాకు కూడా. భక్తినే కాదు సెంటిమెంటుని కూడా దీంట్లోంచి పిండచ్చు. కళాతపస్వి విశ్వనాథ్ సినిమాల్లో ఆడ పిల్లలు అరచేతిలో కర్పూరం వెలిగించుకుని అఘాయిత్యాలు చేస్తారు. తర్వాత అందుకు కారణమైన ఆ యొక్క తండ్రి బొబ్బలకు నవనీతం రాస్తూ, ‘దొర కునా యిటువంటి సేవ...’ అంటూ శాస్త్రీయ బాణీలో పాటొకటి అందుకుంటాడు. అప్పు డు ప్రేక్షకులు కన్నీళ్లు కురిపిస్తారు గాని అవి తెరమీద పడవు. ఆ మాటకొస్తే కొబ్బరికాయ తినే ఆహా రమా, పూజా ద్రవ్యమా అని డౌటు వచ్చింది. టెంకాయ పూజా ద్రవ్యం, కొబ్బరి కాయ తినే తిండి అని ఒక మేధావి వివరణ యిచ్చాడు. ఒక గొప్ప సుగంధ ద్రవ్యం మీద పన్నేమిటి? అష్టదిగ్గజ కవి అల్లసాని పెద్దన, రమణీ ప్రియదూతిక తెచ్చియిచ్చు కర్పూరపు విడెము కావాల న్నాడు గొప్ప అక్షరం రాయ డానికి. అందాకా దేనికి, ప్రధాని మోది ఏడాది పాలనకుగాను ఆయనకు కర్పూర నీరాజనాలు సెగ తగలకుండా యిస్తున్నాం కదా. అందుకని కర్పూరం పూజా ద్రవ్యమే.



http://img.sakshi.net/images/cms/2015-05/71432927148_Unknown.jpg 



(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

 శ్రీరమణ

 

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top