ఆహార భద్రతకు పెనుముప్పు?

ఆహార భద్రతకు పెనుముప్పు?


ఒకప్పుడు పీఎల్-480 ఒప్పందం కింద అమెరికా నుండి ఆహారధాన్యాలు దిగుమతి చేసుకున్న దుస్థితి పునరావృతమౌతుందా? మళ్లీ మన ఆహార భద్రతకు పెనుముప్పు వాటిల్లనున్నదా? అనే భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

 

 ఇటీవల విడుదలైన ‘గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2015’ వర్ధమాన దేశాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు పౌష్టికా హార లోపంతో బాధపడుతు న్నారని పేర్కొంది. 29% జనాభా దారిద్య్రరేఖకు దిగు వన ఉన్న మన దేశం కూడా ఈ జాబితాలో ఉందని చెప్ప నక్కర్లేదు. ‘‘ప్రజల ఆకలిని చల్లార్చకుండా ఆర్థికాభి వృద్ధి, సుస్థిర వృద్ధి సాధ్యం కావు’’, ‘‘ప్రగతి సాధనకు చోదకంగా పనిచేసేది పౌష్టికాహారమే’’ అని అది తేల్చి చెప్పింది. ప్రజలందరి ఆకలిని చల్లార్చాలంటే తిండి గింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించి, దేశానికి ఆహార భద్రతను కల్పించాలి. 55% ప్రజలు ఆధారపడి ఉన్న వ్యవసాయరంగం ప్రోత్సాహకరంగా ఉండాలి. కానీ ఆ నివేదిక విడుదలైన సెప్టెంబర్ 21నే మన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాంకాంగ్‌లో ఒక  సదస్సులో... ‘దేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 15%గా ఉంది, వ్యవసాయ రంగం నుంచి అత్యధికులు తయారీ, సేవలరంగాలకు మళ్లాల్సిన అవసరం ఉంది’ అన్నారు.

 

 వ్యవసాయాభివృద్ధికి చర్యలు తీసుకొనే బదులు రైతాంగాన్ని వ్యవసాయం వదిలి ఇతర రంగా లకు తరలిపొమ్మనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది సాధ్యమయ్యేదేనా? రైతుల ఆదాయాలు, జీవన ప్రమాణాలు మెరుగుపడనిదే వారంటున్న 8%, 9% లేదా రెండంకెల వృద్ధి సాధ్యమేనా? ఎన్ని ఆటుపోట్లు ఎదురవుతున్నా, ప్రపంచ విపణిలో నిలవలేకున్నా, సాగు గిట్టుబాటు కాకున్నా, ప్రభుత్వ ప్రోత్సాహకాలు సన్నగిల్లుతున్నా, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా... మన రైతాంగం సాగును వదలడానికి సిద్ధంగా లేరు. ఇది గ్రహించలేకపోవడం పాలకుల హ్రస్వ దృష్టికి నిదర్శనం.  

 

 మన ఆహార ఉత్పత్తుల దిగుబడులు గణనీ యంగా తగ్గిపోతున్నాయి. వరుసగా సంభవిస్తున్న కరు వులు, వరదల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతు న్నది. అత్యంత కీలకమైన ఈశాన్య రుతుపవనాలు రెండేళ్లుగా విఫలమయ్యాయి. ఈ ఖరీఫ్‌లో ఆహార ధాన్యాల ఉత్పత్తి కిందటేడాది కంటే 1.78% తక్కువగా ఉంటుందని (12.41 కోట్ల టన్నులకు మించదని) అంచనా. 2011-12 నుంచి మూడేళ్లలో ఆహారధాన్యాల ఉత్పత్తి వరుసగా 25.93, 25.71, 26.48 కోట్ల టన్ను లుగా ఉంది. జనాభా పెరుగుదల రేటు 2% కాగా, ఆహార ధాన్యాల వృద్ధిరేటు 1.9% మాత్రమే. ఇదే ధోరణి కొనసాగితే దేశం ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కోవాల్సి రావచ్చు. 1970-71 నుంచి దేశ జనాభా నాలుగు రెట్లు పెరిగింది. కానీ ఆహార ధాన్యాల ఉత్పత్తి రెండున్నర రెట్లే పెరిగింది. ఇటీవల పలు సాగునీటి ప్రాజెక్టుల వల్ల సాగు భూమి పెరిగినా, ఆధునిక వ్యవసాయ విధానాలను అనుసరి స్తున్నామం టున్నా... సగటు తలసరి ఆహార ధాన్యాల లభ్యత 1990 నాటి రోజుకు 510 గ్రాములకు మించ డం లేదు. వ్యవసాయ రంగ దుస్థితికి, ప్రభుత్వాల ఉదాసీనతకు ఇది అద్దం పడుతుంది.

 

 మన ఆహారధాన్యాల ఎగుమతులు తగ్గిపోయి, దిగుమతులు పెరిగాయి. ఇక పప్పు ధాన్యాలు, నూనె గింజల దిగుమతులు అనూహ్యంగా పెరిగిపోయాయి. యూపీఏ సర్కార్ 4% ఆహార ధాన్యాల వృద్ధిరేటును లక్ష్యంగా పెట్టుకున్నా దాని పాలనలో ఒక్క ఏడాదీ 2% వృద్ధిని దాటింది లేదు. సాగు వ్యయానికి 50% కలిపి కనీస మద్దతు ధరలను నిర్ణయించాలని స్వామినాథన్ కమిటీ చేసిన సూచనను పాటించి ఉంటే 2 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవారు కారు. యూపీఏ వ్యవసాయ రంగ వైఫల్యాలను, రైతు ఆత్మ హత్యలను ఎండగట్టడంలో బీజేపీ, టీడీపీలు ముందు వరుసలోనే నిలిచాయి. అధికారంలోకి వస్తే స్వామి నాథన్, హుడా కమిటీల సిఫార్సులను అమలు చేస్తా మన్న టీడీపీ ఆ తదుపరి ఆ ఊసే ఎత్తడం లేదు. వ్యవ సాయ రుణాలన్నింటినీ బేషరతుగా, పూర్తిగా మాఫీ చేస్తామని నమ్మబలికినా,  ఇచ్చిన మాట నిలబెట్టుకో వాలనే చిత్తశుద్ధి దానికి కొరవడింది.

 

 ఫలితంగా ఏపీ రైతాంగం శాశ్వతంగా అప్పుల ఊబిలో కూరుకు పోతోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం  గత 16 నెలల్లో రూ. 7,300 కోట్లు రుణమాఫీ కింద చెల్లించా మంటోంది. 189వ బ్యాంకర్స్ కమిటీ నివేదిక ప్రకారం బకాయిల మొత్తం రూ. 97,577 కోట్లకు పెరిగింది.  ప్రభుత్వం ఇచ్చింది వడ్డీలకు సరిపోలేదు. నేషనల్ శాంపిల్ సర్వే తాజా నివేదిక ప్రకారం నేటి ఏపీలో 90% రైతులు ఇంకా రుణభారంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపు ప్రకృతి కన్నెర్ర, మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక విధా నాలతో వ్యవసాయరంగం పెను సంక్షోభంలో పడింది. ఇక కేంద్ర బలవంతపు భూసేకరణ ఆర్డినెన్స్ నివ్వెరపో యేట్టు చేసింది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు... యూపీఏ పెద్ద ఎత్తున భూములను సేకరించిందంటూ ఆ ఆర్డినెన్స్‌ను విమర్శించే వారిపై ఎదురుదాడి చేస్తున్నారు. అంటే, యూపీఏ సర్కార్ చేసిన తప్పులకు మించిన తప్పులను తామూ చేస్తామనడమే.  

 

 ఒక పక్క దేశ ‘ఆహార భద్రత’కు ఢోకా లేదని భరోసా ఇస్తూనే, ప్రజా పంపిణీ వ్యవస్థకు వెన్నెముకైన ఆహార ఉత్పత్తుల సేకరణ విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా నీరు గార్చేసింది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రైతులు పండించే ధాన్యంలో 75%  మిల్లర్ల ద్వారా సేకరించి అవసరాల మేరకు వివిధ రాష్ట్రాలకు పంపుతుంది.



ఈ విధానంలోని ధరల స్థిరీకరణ వల్ల రైతాంగానికి కొంత మేలు జరుగుతున్నది. లెవీని 25%కుదించడమే గాక, పూర్తిగా రద్దు చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఈ పెడధోరణులు రైతాం గంపైన వ్యవసాయ ఉత్పత్తులపైన తీవ్ర దుష్ఫలి తాలను చూపడం అనివార్యం. ఇదంతా చూస్తుంటే ఒకప్పుడు పీఎల్-480 ఒప్పందం కింద అమెరికా నుండి ఆహారధాన్యాలు దిగుమతి చేసుకున్న దుస్థితి పునరావృతమౌతుందా? మళ్లీ మన ఆహార భద్రతకు పెనుముప్పు వాటిల్లనున్నదా? అనే భయాందోళనలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టకుంటే దేశ ఆహార భద్రత ప్రశ్నార్థకమే అవు తుంది.

 వ్యాసకర్త: ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రివర్యులు

 మొబైల్: 99890 24579,

- డా॥ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top