ఇది గుత్తాధిపత్య ప్రజాస్వామ్యం!

ఇది గుత్తాధిపత్య ప్రజాస్వామ్యం!


మంత్రివర్గంలో బలహీన వర్గాల వాటా 1972లో ఏర్పడ్డ పీవీ ప్రభుత్వంలో ఒక లాంగ్ జంప్ చేసి, 40 శాతానికి పెరిగింది. ఇప్పటికీ అదే బెంచ్‌మార్క్‌గా నిలచిపోయింది. ఒకటి, రెండు శాతం అటూ ఇటుగా అదే నిష్పత్తి నేటికీ కొనసాగుతున్నది. ఈ ప్రతిష్టంభన తొలగి సమాజం లోని అన్ని వర్గాల వారికీ రాజకీయాధికారంలో న్యాయమైన వాటా రావాలంటే 1971 నాటి ఇందిరా ప్రభంజనం లాంటి  రాజకీయ పెను ఉప్పెనైనా రావాలి లేదా బలహీన వర్గాల, మహిళల మహోద్యమం ఏదైనా సాగాలి. లేదా రాజకీయ నాయకత్వాలే చిత్తశుద్ధితో సామాజిక న్యాయం, హేతుబద్ధ ప్రజాస్వామ్యాల కోసం దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేయాలి.

 

 ఈ వారం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. మంత్రుల సంఖ్య 18కి చేరింది. ఇది గరిష్ట స్థాయి. ఇంతకన్నా పెంచడానికి అవకాశం లేదు. దీంతో సహజంగానే మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం ఉందా, లేదా? అనే అంశంపై విశ్లేషణలు మొదలయ్యాయి. మన దేశంలో గడచిన కొన్ని దశాబ్దాలుగా ఎన్నికల ముందు టికెట్ల పంపిణీ సందర్భంగానూ, ఆ తరువాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడంలోనూ ఈ తరహా విశ్లేషణలూ, వాటి ఆధారంగా విమర్శలూ సర్వసాధారణంగా మారాయి.  ఆ సంప్రదాయం ప్రకారమే తాజాగా తెలంగాణ మంత్రివర్గ కూర్పుపైనా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో ఎనభై ఐదు శాతం మంది బలహీన వర్గాల ప్రజలని అంచనా. వెనుకబడిన తరగతులు(బీసీలు), దళితులు, గిరిజనులు, మైనారి టీలు ఈ వర్గీకరణ కిందకు వస్తారు. వీరందరికీ కలిపి ఏడు మంత్రి పదవులు దక్కాయి. వ్యవసాయరంగం నుంచి అభివృద్ధి చెందిన అగ్ర కులాల వారికి మిగిలిన పదకొండు పదవులూ దక్కాయి. వీరిలో అత్యధిక జనాభాగా (మొత్తం జనాభాలో ఏడు శాతం) ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఆరు మంత్రి పదవులు లభించాయి. సుమారు ఒక శాతం కంటే తక్కువ జనాభా ఉన్న పద్మనాయక వెలమలకు ముఖ్యమంత్రి పీఠం సహా నాలుగు పదవులు లభించాయి. దాదాపు అంతే సంఖ్యలో ఉండే కమ్మవారికి ఒక మంత్రి పదవి లభించింది.

 

  సుమారు ఆరు శతాబ్దాల తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో పద్మనాయక వెలమల ప్రాభవం తిరిగి వెలుగుతోంది. కాకతీయ సామ్రాజ్య పతనానికి, కుతుబ్ షాహీల గోల్కొండ రాజ్య స్థాపనకు మధ్య సంధి కాలంలో వందేళ్లపాటు వెలమ వారు రాచకొండను రాజధానిగా చేసుకొని తెలంగాణను పాలించారు. ఇన్నాళ్లుగా మరుగునపడ్డ రాచకొండ కేసీఆర్ హయాంలో కళాకాంతులు దిద్దుకోబోతుండటం కేవలం కాకతాళీయమే. రాచకొండ వెలమ రాజుల్లో శ్రేష్ఠుడైన సర్వజ్ఞ సింగభూపాలుని హయాంలో తెలుగు సాహిత్యం వైభవాన్ని చవిచూసింది. కొండవీడు రెడ్డి రాజుల ఆస్థానంలోని శ్రీనాథ మహాకవిని రాచకొండకు రప్పించి సత్కరించిన కాలమది. తెలంగాణ సాహితీ మాగాణాల్లో బమ్మెర పోతన మధుర కవితలు విరగబూసిన కాలం కూడా అదే. నాటి సింగ భూపాలుని వలెనే నేటి కేసీఆర్ కూడా కవి, పండిత మిత్రుడు కావడం ఇంకో కాకతాళీయ ఘటన.

 

నలభై శాతం లక్ష్మణరేఖా?

 ప్రస్తుత మంత్రివర్గ విస్తరణ విషయానికి వస్తే, ఎనభై ఐదు శాతం జనాభాగా ఉన్న సామాజిక వర్గాలకు 38 శాతం మంత్రి పదవులే లభించడం అవాంఛనీయ పరిణామం అనడంలో సందేహం లేదు. అయితే ఈ పరిస్థితి ఒక్క తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైనదో, ఈ ఒక్క సందర్భానికి పరిమితమైనదో కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులున్న బిహార్, యూపీ, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలను మినహాయిస్తే కుడి, ఎడమగా దేశమంతటా ఇదే పరిస్థితి. రాష్ర్టం విడిపోయిన తర్వాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పరిస్థితి కూడా ఇందుకు భిన్నం గాలేదు. నిజానికి ఇంకా ఘోరంగా ఉంది. ముఖ్యమంత్రిసహా మొత్తం ఇరవై మంది మంత్రుల్లో ఎనిమిది మంది బలహీనవర్గాల వర్గీకరణ కిందికి వస్తారు. అలా చూస్తే మంత్రివర్గంలో వారి వాటా 40 శాతం ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ వెనుకబాటుతనం కారణంగా అక్కడి ఆధి పత్య కులాలు కూడా బీసీ కోటాలోకే వస్తాయి. ముగ్గురు బీసీలు ఆ ప్రాంతం వారే ఉన్నారు. ఆ జిల్లాలను మినహాయిస్తే అసలు సంగతి తెలుస్తుంది. పెపైచ్చు ఒక్క గిరిజనుడికి కానీ, మైనారిటీ వ్యక్తికి కానీ ఏపీ కేబినెట్‌లో చోటు దొరకలేదు.

 

 ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గాలలోని సామాజిక కూర్పులను ఒకసారి పరిశీలిద్దాం. 1956లో రాష్ట్రం అవతరించినప్పుడు ఏర్ప డిన మంత్రివర్గంలో బలహీనవర్గాల నిష్పత్తి పదిహేను శాతంగా ఉండేది. ఒకే ఒక్క బీసీ... అనగాని భగవంతరావు(గుంటూరుజిల్లా)కు మంత్రి పదవి దక్కింది. 1960లో ఏర్పడిన సంజీవయ్య మంత్రివర్గంలో కూడా బలహీన వర్గాల వాటా దాదాపు అంతే శాతం. ఈసారి మంత్రివర్గంలోని ఒకే ఒక్క బీసీగా.. కొండా లక్ష్మణ్ బాపూజీ (తెలంగాణ)కి బెర్త్ దక్కింది. 1967లో మొత్తంగా బలహీన వర్గాల కోటా 25 శాతానికి పెరిగింది. 1972లో మాత్రమే ఈ విషయంలో ఒక లాంగ్‌జంప్ కనబడింది. పీవీ నరసింహారావు నేతృత్వంలో ఏర్పడిన మంత్రివర్గంలో బలహీనవర్గాల వాటా 40 శాతానికి పెరిగింది. ఆ ఘనత పీవీదే అయినా, నాటి ప్రధాని ఇందిరాగాంధీ బలహీన వర్గాలను కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పునాదిగా మలచుకుంటున్న నేపథ్యంలోనే అది సాధ్యమైందని విస్మరించలేం. ఇప్పటికీ అదే బెంచ్‌మార్క్‌గా నిలచిపోయింది. ఒకటి, రెండు శాతం అటూ ఇటుగా అదే నిష్పత్తి నేటికీ కొనసాగుతున్నది. బలహీన వర్గాల వారికి కూడా కొన్ని కీలక శాఖలను కేటాయించడం ఎన్టీ రామారావుతో మొదలైంది.

 

శేష ప్రశ్నలేనా?

 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాదు, మెజారిటీ రాష్ట్రాల్లోనూ, కేంద్రం లోనూ ఇటువంటి వాతావరణమే కొనసాగుతోంది. ఇరవై శాతంలోపు ఉన్న అగ్రకులాల ఆధిపత్యంలోనే రాజకీయాధికారం కేంద్రీకృతమై ఉందని బలహీన వర్గాల నే తలు ఆరోపిస్తున్నారు. సామాజిక వేత్తలూ, రాజకీయ పరిశీలకులూ ఆ విషయాన్ని అంగీకరిస్తున్నారు.  కానీ పరిస్థితిని మరింత నిశితంగా పరిశీలిస్తే, అంతకన్నా తీవ్రస్థాయిలోనే రాజకీయ గుత్తాధిపత్యం కేంద్రీకృతమైన వైనాన్ని మనం గమనించగలం. అగ్రకులాలు, బలహీన  కులాలు అనే తేడా లేకుండా మొత్తం సమాజంలో సగంగా ఉన్న మహిళలు రాజకీయ నిర్ణయాధికారానికి దూరంగా ఉన్నారు.

 

  చట్టసభల్లోని వారి ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉంటోంది. అంటే అగ్రవర్ణాల్లోని సగం మంది ఈ గుత్తాధికారానికి దూరంగా ఉన్నట్టే లెక్క. అలాగే అగ్రవర్ణాలు, కులాలలోని పేదలు కూడా. ఎంత సచ్ఛీలురూ, సంఘసేవకులూ అయినప్పటికీ డబ్బు దండిగా లేకపోతే... అగ్రకులస్తులైనా ప్రధాన రాజకీయ పక్షాల నాయకత్వాలేవీ వారికి ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. కనుక అగ్రవర్ణాలు, కులాల్లోని పేద వర్గాలు కూడా రాజకీయ చక్రాన్ని తిప్పే పరిస్థితుల్లో లేరు. మిగిలిందల్లా నాలుగైదు శాతంగా ఉన్న సంపన్న వర్గాలు మాత్రమే.

 

 వీరిలో అతి స్వల్పంగా బలహీన వర్గాల వారు కూడా ఉండవచ్చు. అక్కడక్కడా మహిళలూ, అగ్రకులాల పేదలు కూడా కనిపించవచ్చు. అయినాగానీ మొత్తంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థపైన జనాభాలోని నాలుగైదు శాతం సంపన్న శ్రేణి గుత్తాధిపత్యం వహిస్తున్నమాట తిరుగులేని వాస్తవం. దేశ ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారీ గుత్తాధిపత్యం నెలకొన్నట్టే, మన ప్రజాస్వామిక వ్యవస్థపైన కూడా గుత్తాధి పత్యం సాగుతోంది. మనదేశంలోని అత్యంత సంపన్న శ్రేణి పారిశ్రామిక, వ్యాపార రంగాలపై ప్రత్యక్ష గుత్తాధిపత్యం వహిస్తోంది, పరోక్షంగా రాజకీయాలను శాసిస్తోంది. కాగా, ఆ తదుపరి సంపన్న శ్రేణి ప్రత్యక్షంగా దేశాన్ని, రాష్ట్రాలను రాజకీయంగా పాలిస్తోంది, పరోక్షంగా పారిశ్రామిక, వ్యాపార రంగాలను శాసిస్తోంది.

 

 ఇలా రెండు విధాలా పెనవేసుకుపోయిన గుత్తాధిపత్య ప్రజాస్వామ్యాన్ని వదిలించుకొని, కొంత హేతుబద్ధమైన ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించుకో లేమా? మహిళలకూ, పేదలకూ న్యాయమైన వాటా అందివ్వలేమా? ఎనభై శాతం జనాభావున్న బలహీనవర్గాల నిష్పత్తి నలభయ్యేళ్లుగా నలభై శాతం దగ్గరే నిలిచిపోవడమేమిటి? సమాజంలోని సగంగా ఉన్న మహిళలకు చట్టసభల్లో సమ ప్రాధాన్యం కాదు గదా, ఇస్తామంటూ ఆశ చూపుతున్న 33 శాతం రిజర్వేషన్లు శాశ్వత ఎన్నికల వాగ్దానంగా మిగిలిపోయిందెందుకు? గుత్తాధిపత్య ప్రజాస్వామ్యం ఉనికికి ప్రమాదమనే భయంతోనే కాదా? దళిత వర్గాల నుంచి ఎదిగిన నాయకుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా కూడా రిజర్వుడు నియోజకవర్గాలనే ఆశ్రయించాల్సిన దుస్థితి ఎందుకున్నట్టు?... మన ప్రజాస్వా మ్యవ్యవస్థ తన చుట్టూ తాను తిరుగుతూనే, డబ్బు చుట్టూ తిరగడం ప్రారం భమైన ఈ ఆధునిక, ‘సంస్కరణల యుగం’లో రాజకీయ నాయకత్వానికి దూరదృష్టి, చిత్తశుద్ధి లేకపోతే ఈ ప్రశ్నలు ఎప్పటికీ శేష ప్రశ్నలుగానే మిగిలిపోతాయి.

    

మార్పు ఎన్నడు?

 స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో, నూటికి ఎనభై మంది ప్రజలు వ్యవ సాయరంగంపై ఆధారపడివున్న నేపథ్యంలో మన దేశంలో ఎన్నికల క్రతువు మొదలైంది. ఈ నేపథ్యం సహజంగానే వ్యవసాయాధిపత్య కులాలకు కలసి వచ్చింది. గ్రామాలపై తమకు ఉన్న పట్టు కారణంగా భూస్వామ్య, ధనిక రైతు వర్గాలవారు పెద్ద సంఖ్యలో చట్టసభలకు ఎన్నికై, అనతికాలంలోనే రాజకీయ ఆధిపత్యం కూడా సాధించగలిగారు. రాజకీయాధికారం దన్నుతో వీరిలో కొందరు ప్రభుత్వ ప్రాయోజిత ఆర్థిక కార్యక్రమాల అమలులో కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి, క్రమంగా మరింత బలపడ్డారు. భూసంస్కరణల చట్టం తర్వాత పెద్ద ఎత్తున ఆ వర్గాలు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోకి ప్రవేశిం చాయి. అభివృద్ధి రంగంలో ప్రభుత్వాల పెట్టుబడులు పెరిగే కొద్దీ కాంట్రాక్టర్ల రూపంలో అదే నిష్పత్తిలో బలపడుతూ వీరు ఒక సరికొత్త ఆశ్రీత పెట్టుబడిదారీ వర్గంగా రూపాంతరం చెందారు.

 

 గత పాతికేళ్లుగా అమలవుతున్న ఆర్థిక సంస్క రణలు కూడా వీరికి బాగా కలసి వచ్చాయి. వీరి అండ లేనిదే రాజకీయ పార్టీలు కూడా మనుగడ సాగించలేని పరిస్థితి నేడు ఏర్పడింది. రాజకీయ నాయక త్వానికి ఇష్టం ఉన్నా లేకున్నా టికెట్ల కేటాయింపులోనూ, మంత్రివర్గ కూర్పులోనూ వీరికి పెద్ద పీట వేయక తప్పని స్థితి ఏర్పడింది. ఈ కారణంగానే గత నలభయ్యేళ్లుగా మంత్రివర్గాల కూర్పులో బలహీన వర్గాల నిష్పత్తి ఎదుగూబొదుగూ లేకుండా నలభై శాతం దగ్గరే ఆగిపోయింది. ఈ ప్రతిష్టంభన తొలగి సమాజంలోని అన్ని వర్గాల వారికీ రాజకీయాధికారంలో న్యాయమైన వాటా రావాలంటే 1971 నాటి ఇందిరా ప్రభంజనం లాంటి  రాజకీయ పెను ఉప్పెనైనా రావాలి లేదా బలహీన వర్గాల, మహిళల మహోద్యమం ఏదైనా సాగాలి.

 

 ఈ రెండు ‘దైవాధీనాలే’ కనుక రాజకీయ నాయకత్వాలే కొంత చిత్తశుద్ధితో సామాజిక న్యాయం కోసం, హేతుబద్ధమైన ప్రజాస్వామ్యం కోసం దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేయవలసి ఉంటుంది. మహిళలకు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలుజరుగుతున్న స్థానిక సంస్థలను బలోపేతం చేయ డం ఇందులో ప్రధానమైనది. వీటిని ఆర్థికంగా పరిపుష్టం చేయడం ద్వారా, అధికారాలను బదలాయించడం ద్వారా అన్ని వర్గాల నుంచి క్రమక్రమంగా నాయకత్వ శ్రేణులు అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరగాల్సింది, ఫలితాలనివ్వాల్సింది స్థానిక స్థాయిలోనే. అందుకే వాటి రూప కల్పనలో స్థానిక సంస్థలను భాగస్వాములను చేయాలి. ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గ నిధులను పూర్తిగా రద్దు చేసి, స్థానిక సంస్థల ద్వారానే అభివృద్ధి కార్యక్రమాల అమలు జరిగేలా చూడాలి. చిన్న స్థాయి కాంట్రాక్టు పనులన్నిటినీ స్థానిక ప్రజా సంఘాలకు రిజర్వు చేయాలి. ఇటువంటి ప్రయత్నాలను ఎమ్మెల్యేలు, ఎంపీలు అడ్డుకునే అవకాశం ఉంటుంది. అయినా అధిగమించ గలిగే రాజకీయాధికార నేతే రాజనీతిజ్ఞుడు అనిపించుకుటాడు.  లేకపోతే అంతా దైవాధీనమనుకొని, ‘సంభవామి యుగే యుగే’ అన్నట్టుగా ఆ ‘యుగపురుషుని’ కోసం ఎదురు చూస్తూనే ఉండాలి.

 muralivardelli@yahoo.co.in

 - వర్ధెల్లి మురళి

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top