మోదీ విస్త‘రణం’

మోదీ విస్త‘రణం’ - Sakshi


త్రికాలమ్‌

ఈ రోజు ఉదయం జరగనున్న మంత్రిమండలి పునర్నిర్మాణం బీజేపీకీ, ప్రధాని నరేంద్ర మోదీకీ అత్యంత ప్రధానమైనది. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి పూర్తి స్థాయి విస్తరణ ఇది. దీని తర్వాత భాగస్వామ్య పక్షాల ప్రతినిధులను చేర్చుకునేందుకు కొన్ని చేర్పులు ఉండవచ్చు కానీ ఇంత పెద్ద కుదుపు ఉండదు. విస్తరణ తర్వాత రూపొందే కొత్త మంత్రిమండలి పనితీరుపైనే 2019 ఎన్నికలలో ఎన్‌డీఏ సాధించే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మంత్రుల రాజీనామాల గురించీ, కొత్తగా చేరబోయే మంత్రుల గురించీ రకరకాల వదంతులు వింటున్నాం. ప్రభుత్వం ఎటువంటి ప్రకటనా చేయలేదు. రాజీనామా చేసిన మంత్రులలో ఒకరు అవినీతి ఆరోపణల కారణంగా వైదొలగవలసి వస్తున్నదని అంటున్నారు. అవినీతి మంత్రి పేరు మాత్రం వెల్లడి కాలేదు. ఇటీవల ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మట్లాడుతూ, ‘మాది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదు లీకులు ఇవ్వడానికి. మేం మీడియా మిత్రులను ఆశ్చర్యపర్చుతాం. ఒక్క వెంకయ్యనాయుడి విషయంలోనే మీరు ముందుగా చెప్పగలిగారు. కోవింద్‌ విషయంలో కానీ ఇంకా అనేక ఇతర సందర్భాలలో కానీ మీడియా జోస్యం నిజం కాలేదు. ఇప్పుడు కూడా అంతే’అన్నారు. ఈ సారి ప్రధాని కంటే పార్టీ అధ్యక్షుడు ఎక్కువ క్రియాశీలకంగా ఉండటం విశేషం. మంత్రుల రాజీనామాలను ప్రధాని కార్యాలయం(పీఎంఓ) కాకుండా అమిత్‌షా ఫోన్‌ చేసి అడుగుతున్నారు.



మంత్రివర్గ విస్తరణ సందర్భంలో 54 ఏళ్ళ కిందటి కామరాజ్‌ తర్వాత ఒక పార్టీ అధ్యక్షుడు అంతటి కీలకమైన భూమిక పోషించడం ఇదే ప్రథమం. మూడేళ్ళుగా తన మంత్రుల పనితీరును ప్రధాని శ్రద్ధగా గమనిస్తూ వచ్చారు. రెండువారాల పాటు వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న ప్రిన్సిపల్‌ సెక్రటరీలనూ, జాయింట్‌ సెక్రటరీలనూ ప్రధాని, పీఎంఓకు చెందిన ముఖ్యమైన అధికారులూ కలుసుకొని సుదీర్ఘంగా చర్చలు జరిపారు. దీనికి తోడు ఇంటెలిజెన్స్‌ నివేదికలు తెప్పించుకున్నారు. బీజేపీ పక్షాన పనిచేస్తున్న సోషల్‌ మీడియా యంత్రాంగం ద్వారా సమాచారం సేకరించారు. మూడు వ్యవస్థల నుంచి అందిన సమాచారాన్ని కాచి వడబోసే బాధ్యతను అమిత్‌షాకి అప్పగించారు. ఆయనకు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌లు సహకరించారు. ఇది కాకుండా మథురలోని బృందావన్‌లో జరుగుతున్న మూడు రోజుల ఆర్‌ఎస్‌ఎస్‌ సమన్వయ సమితి సమావేశాలలో పాల్గొన్న అమిత్‌షా సంఘ్‌ ప్రముఖుల అభిప్రాయాలు సేకరించారు. విస్తరణ గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌తో అమిత్‌షా సవివరంగా చర్చించారు. చివరికి నరేంద్ర మోదీతో శనివారం రాత్రి సమాలోచనలు జరిపి తుది జాబితా రూపొందించారు. నిరుడు జులైలో విస్తరణ జరిగినప్పుడు ఇంత విస్తృత సమాలోచనలు లేవు. అప్పుడు 19 మంది కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ప్రకాశ్‌ జావదేకర్‌ను సహాయ మంత్రి హోదా నుంచి కేబినెట్‌ హోదాకు పెంచారు. ఐదుగురు సహాయ మంత్రులకు ఉద్వాసన చెప్పారు. చడీచప్పుడు లేకుండా జరిగిపోయింది. ఈ సారి రెండురోజులుగా వివిధ నాయకులతో అమిత్‌షా చర్చిస్తున్నారు.



తలలేని ముఖ్యమైన శాఖలు

వెంకయ్యనాయుడు రాజీనామా, మనోహర్‌ పారీకర్‌ రక్షణశాఖను వదిలేసి గోవా ముఖ్యమంత్రిగా వెళ్ళిపోవడంతో పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసార శాఖలూ, రక్షణ శాఖా ఇతర మంత్రులకు అదనపు శాఖలుగా చేరాయి. కీలకమైన ఈ శాఖలకు సమర్థులైన మంత్రులను నియమించవలసిన అవసరం ఉన్నది. ఈ సారి మార్పులు చేర్పులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు నిర్ణయించుకున్నారు. ఒకటి, అవినీతి మరక అంటిన వారికి ఉద్వాసన చెప్పడం. రెండు, ప్రధాని అత్యంత ముఖ్యమైనవిగా పరిగణిస్తున్న కార్యక్రమాలను (ఫ్లాగ్‌షిప్‌ ప్రోగ్రాంలు) ఉద్యమసదృశంగా నడిపించ లేనివారిని గుర్తించి తొలగించడం. మూడు, మంత్రులు చూపుతున్న చొరవనూ, వారి సృజనాత్మకతనూ, వారు సాధిస్తున్న ఫలితాలనూ అధ్యయనం చేసి మూల్యాంకన చేయడం. నాలుగు, 2019 లోపు శాసనసభ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వడం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని తొలగించినట్టు రూఢి కాని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. నిప్పు లేకుండా పొగ రాదని భావిస్తే ఈ ఆరోపణలలో ఎంతో కొంత నిజం ఉంటుందని అనుకోవాలి. ఇది మోదీ ప్రభుత్వానికి అప్రదిష్ట.



ప్రస్తుతానికి రహస్యంగా ఉంచినప్పటికీ కాలక్రమేణా వివరాలు వెలుగులోకి రావచ్చు. మంత్రి పేరు వెల్లడి కావచ్చు. రాజీనామా చేసిన వారిలో రాజీవ్‌ప్రతాప్‌ రూడీ, కల్రాజ్‌ మిశ్రా, దత్తాత్రేయలు మూడు ముఖ్యమైన శాఖలు నిర్వహిస్తున్నారు. రూడీది స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిత్వశాఖ. మిశ్రాది మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ శాఖ. దత్తన్నది కార్మికశాఖ. యువతకు మెలకువలు నేర్పించి, వారి చేత చిన్న వ్యాపారాలో, పరిశ్రమలో పెట్టించి ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేయవలసింది ఈ శాఖలే. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తానంటూ మోదీ 2014 ఎన్నికల ప్రచారంలో ఊదరకొట్టారు. ఉద్యోగాల కోసం యువతరం మూడేళ్ళుగా ఎదురు చూస్తోంది. కనీసం స్కిల్స్‌ నేర్పించి ఉపాధి కల్పించే ప్రయత్నమైనా జరిగిందా అంటే అదీ లేదు. ‘నయా ఇండియా’నినాదంతో యుద్ధ ప్రాతిపదికపైన జరగవలసిన పనులు నత్తనడక నడుస్తుంటే వచ్చే ఎన్నికలలో ఎన్‌డీఏ యువతీయువకుల ఆగ్రహం చవి చూడవలసి వస్తుం ది. ఈ మూడు శాఖల నిర్వహణ ఆశించిన విధంగా లేకపోవడంతో ముగ్గురు మంత్రులచేతా రాజీనామా చేయించారు. కల్రాజ్‌మిశ్రాకి 77 ఏళ్ళు. వయసు పైనపడింది కనుక బాధ్యతల నుంచి తప్పించవలసిందిగా తానే ప్రధానిని కోరినట్టు మిశ్రా చెప్పారు. ‘బేటీ బచావ్, బేటీ పఢావ్‌’కూడా ప్రధాని ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్న కార్యక్రమాలలో ఒకటి. ఈ కార్యక్రమం కుంటినడక మేనకాగాంధీ శాఖ మార్పిడికి గల కారణాలలో ఒకటి. ‘స్వచ్ఛభారత్‌’, ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కూడా మోదీ అట్టహాసంగా ప్రకటించిన కార్యక్రమాలు. ఇటువంటి ‘ఫ్లాగ్‌షిప్‌’కార్యక్రమాల విజయంపైనే ఎన్‌డీఏ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వాటిని తిరిగి ఎవరికి అప్పజెప్పాలనేది కీలకమైన అంశం. అందుకే సుదీర్ఘ సమాలోచన.



నయా కామరాజ్‌ నాడార్‌ అమిత్‌షా

తొమ్మిదిమంది మంత్రులు రాజీనామా చేశారని కొన్ని చానళ్ళూ, ఏడుగురే చేశారని మరికొన్ని చానళ్ళూ చెబుతున్నాయి. శుక్రవారంనాడు రాజీనామా చేసిన మంత్రుల జాబితాలో ఉమాభారతి, నిర్మలాసీతారామన్‌ పేర్లు ఉన్నాయి. శనివారంనాడు మోహన్‌భాగవత్‌తో అమిత్‌షా సమావేశం ఫలితంగా ఉమాభారతి రాజీనామాను ఆమోదించకపోవచ్చునని అభిజ్ఞవర్గాల భోగట్టా. అట్లాగే నిర్మలాసీతారామన్‌కు సమర్థురాలైన మంత్రిగా పేరుంది. కాకపోతే మాట పెళుసు. ఆమెకు ఉద్వాసన చెప్పే ప్రసక్తి లేదు. పైగా ఆమెకు తమిళనాడులో బీజేపీ వ్యవహారాలను పర్యవేక్షించే అదనపు బాధ్యత అప్పగించవచ్చు. ఈ మధ్య జరిగిన వరుస రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేస్తానని చెప్పిన రైల్వే మంత్రి సురేశ్‌ప్రభుకు సమర్థుడిగా, నిజాయతీపరుడిగా మంచి పేరుంది. ఆయనకు రక్షణ శాఖను అప్పగించవచ్చు. నితిన్‌గడ్కరీ, పీయూష్‌ గోయెల్‌ వంటి కొందరు మంత్రులు దీక్షాదక్షతలతో పని చేస్తున్నారని ప్రధాని కార్యాలయం గుర్తించింది. గడ్కరీకి ఉపరితల రవాణా, జలరవాణాతో పాటు రైల్వే శాఖ కూడా అప్పగించే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. రైల్వే బదులు పౌర విమానయాన శాఖ అప్పగించినా ఆశ్చర్యం లేదు. ఆయన సామర్థ్యంపై ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేతకు అపార విశ్వాసం. మోదీని గడ్కరీ శనివారం రాత్రి కలుసుకున్నారు. ఏమి నిర్ణయించారో తెలియదు. కర్ణాటకలో వచ్చే సంవత్సరం ఏప్రిల్‌–మేలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రం నుంచి ఇప్పటికే అనంతకుమార్‌ (బ్రాహ్మణ), సదానందగౌడ (వొక్కలిగ), రమేశ్‌ జిగజిగడి (దళిత్‌) మోదీ కేబినెట్‌లో ఉన్నారు. అనంతకుమార్‌ హెగ్డే (బ్రాహ్మణ)కు కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఈ యేడాది చివరలో జరగనున్నాయి. ఆ రాష్ట్రం నుంచి అనురాగ్‌ ఠాకూర్‌ను మంత్రిమండలిలోకి తీసుకోవాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్టులేదు.



తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యేనా?

తెలుగు రాష్ట్రాల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. విశాఖ లోక్‌సభ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కుటుంబ సమేతంగా విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళారు. తుది జాబితాలో ఆయన పేరు ఉన్నట్టు లేదు. చివరి క్షణంలో ఏమైనా మార్పులు జరిగితే ఆయనకు పదవి దక్కవచ్చు. రెండు రోజులుగా రామ్‌మాధవ్‌ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆయన కొలంబోలో తన ఆధ్వర్యంలోని ‘ఇండియా ఫౌండేషన్‌’నిర్వహిస్తున్న ‘ఇండియన్‌ ఓషన్‌ కాన్ఫరెన్స్‌’లో నిమగ్నమై ఉన్నారు. తెలంగాణలో బండారు దత్తాత్రేయ స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది అస్పష్టం. కిషన్‌రెడ్డి, మురళీధరరావు పేర్లు చర్చకు వచ్చాయి. కిషన్‌రెడ్డి అసెంబ్లీలో బీజేపీ పక్ష నాయకుడు. మురళీధరరావు శనివారం రాత్రి వరకూ బెంగళూరులోనే ఉన్నారు. రాజస్థాన్‌లో నీటి పారుదల వ్యవహారాలలో ముఖ్యమంత్రి వసుంధరరాజేకు సలహాదారుడిగా పనిచేస్తున్న వెదిరె శ్రీరామ్‌ పేరు బుల్లితెర మీదికి వచ్చింది. బీజేపీ అందుబాటులో రెండు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. వెంకయ్యనాయుడు ఖాళీ చేసిన రాజస్థాన్‌ స్థానం, కేంద్రమంత్రి అనిల్‌ దవే అకాల మరణం కారణంగా మధ్యప్రదేశ్‌లో ఖాళీ అయిన స్థానం. ముగ్గురు తెలంగాణ నాయకులలో ఎవరికి అవకాశం ఇచ్చినా రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలి. ఎవ్వరికీ అవకాశం రాకపోయినా ఆశ్చర్యం లేదు.



ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలకు ఇప్పుడు అవకాశం లేనట్టు కనిపిస్తోంది. జేడీ(యూ) ఇటీవలే ఎన్‌డీఏ తీర్థం పుచ్చుకున్నా మోదీ ఇవ్వజూపుతున్న ఒక కేబినెట్‌ మంత్రి పదవి, మరో సహాయ మంత్రి పదవి ఆ పార్టీకి ఆమోదయోగ్యం కాదు. తమిళనాడు రాజకీయం రసకందాయంలో పడింది. ఏఐఏడిఎంకె భవిష్యత్తు అగమ్యగోచరం. పన్నీర్‌సెల్వం, పళనిస్వామి భుజాలు కలిపినప్పటికీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి దినకరన్‌ సిద్ధంగా ఉన్నాడు. ఈ అయోమయ స్థితిలో ఏఐఏడిఎంకెని భాగస్వామ్యపక్షంగా చేర్చుకోవడమా, తమిళ కథ ఒక కొలిక్కి వచ్చే వరకూ వేచి చూడటమా అన్న సందిగ్థంలో బీజేపీ నాయకత్వం కొట్టుమిట్టాడుతోంది. మొత్తం మీద జేడీ(యూ), ఏఐఏడిఎంకెలకు ఇప్పటికైతే అవకాశం రాకపోవచ్చు.

తుది జాబితాలో ఈ పేర్లు ఉంటాయని అంచనా: శివప్రతాప్‌ శుక్లా (ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు), అశ్వనీకుమార్‌ చౌబే (బస్తర్‌–చత్తీస్‌గఢ్‌), వీరేంద్రకుమార్‌ (మధ్యప్రదేశ్‌), అనంత్‌కుమార్‌ హెగ్డే (కర్ణాటక), ఆర్‌కె సింగ్‌ (బిహార్, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి),హర్‌ప్రీత్‌సింగ్‌పూరీ (ఐఎఫ్‌ఎస్‌ అధికారి, దౌత్య ఉద్యోగి), గజేంద్రసింగ్‌ శెఖావత్‌ (రాజస్థాన్‌),సత్యపాల్‌సింగ్‌ (యూపీ) అల్ఫోన్స్‌ కన్ననంతకన్‌ (కేరళ, ఐఏఎస్‌). కేవలం కులాల, ప్రాంతాల లెక్కలు కాకుండా సామరŠాథ్యనికీ, ప్రతిభకూ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తున్నది. ఇది మంచి సంప్రదాయం. ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలను సాధించే మంత్రిమండలి అవసరం. ఆ దశగా అడుగువేస్తున్నందుకు అభినందించాలి.



కె. రామచంద్రమూర్తి

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top