ఊరి చెరువు దుఃఖం తీరింది

ఊరి చెరువు దుఃఖం తీరింది


మనసులో మాట


► కొమ్మినేని శ్రీనివాసరావుతో తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌



తెలంగాణలో ఊరి చెరువు దుఃఖం తీర్చినవాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అని, దాదాపు 47 వేల చెరువులకు పునాది తీసి, వర్షం వస్తే లక్షల ఎకరాల్లో పంట  పండేలా చర్యలు తీసుకున్నారని తెలంగాణ ఎమ్మెల్యే, కళాకారుడు రసమయి బాలకిషన్‌ చెప్పారు. తరాల పాటు దారి ద్య్రంలో మగ్గిన వారి పేదరికాన్ని తీర్చే పనులు మొదలైనప్పుడు ఆ పరిస్థితిలో మార్పును కనీసంగానైనా గుర్తించకుండా కోదండరామ్‌ వంటి పెద్దలు విమర్శ చేయడం బాధ కలిగిస్తోందన్నారు. ప్రాజెక్టులు కడుతుంటే వ్యతిరేకించడం, నీళ్లు లేని తెలంగాణకు నీళ్లు తెస్తూ ఉంటే ఎటువైపు ఉండాలో ఆలోచించుకోవాలన్నారు.



ఉద్యమ పాటకు జీవం పోసిన కళాకారులు తిండి లేక బాధపడుతుంటే 550 మందికి ఉద్యోగాలు ఇచ్చి చల్లటి బతుకిచ్చినవాడు కేసీఆర్‌ అన్నారు.  పేదల కన్నీళ్లు తుడిచే పాలనను కేసీఆర్‌ అందిస్తుంటే.. ఏపీలో ఏ ఒక్కరూ సంతోషంగా లేని పాపిష్టి పాలనను చంద్రబాబు అందిస్తున్నారని.. పాలన  విషయంలో కేసీఆర్‌కు, బాబుకు  పోలికే లేదంటూ  ‘మనసులో మాట’లో రసమయి చెబుతున్న అభిప్రాయాలు



ఆయన మాటల్లోనే..

జీవితంలో బాగా సంతోషం కలిగించిన సందర్భాలు చెబుతారా? రెండున్నాయి. ఎమ్మెల్యే కావడం కంటే ఎక్కువగా సంతోషపడ్డది మా ‘సాంస్కృతిక  వారధి’ సంస్థకు కేసీఆర్‌ వచ్చి మాట్లాడినప్పుడే. ఆరోజు ఆయన ఒక గొప్పమాట చెప్పిండు. ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు వెన్నంటి ఎవడూ లేడు. వాడూ (రసమయి), నేనూ ఇద్దరమే ఉన్నాం. వాడి పాట, నా మాటతో ఇంతదూరం నడిచాం అని చెబుతూ ఇంతమందికి ఆయన ఉద్యోగాలు ఇచ్చారు.



స్టేజీ మీద పాటలు పాడి చాలామందిని ఏడిపించేవాడినే కాని నేను ఏడ్చేవాడిని కాదు. కేసీఆర్‌ ఆ మాట అనగానే మొదటిసారి వేదికమీదే ఏడ్చేశాను. మొదటిసారి నా కడుపునిండా ఏడ్చాను. దాచుకున్న దుఃఖాన్నంతా వెళ్లగక్కి ఆరోజు నాకు ఏడ్వాలనిపించింది. ఏడ్చాను కూడా. ఉద్యమం కోసం జీవితాలను అర్పించిన 550 మంది కళాకారులకు మేం ఉద్యోగాలు ఇచ్చాం. వాళ్లు ఇవ్వాళ బైకులమీద తిరుగుతున్నారు. జీన్స్‌ వేసుకుంటున్నారు. ఇదిరా బాయ్‌ బతుకంటే. మంచిగా, సల్లగా బతకండి. ఇకపై ఎవ్వరినీ రూపాయి కోసం అడుక్కోవద్దు అంటున్నా. ఇంతకుమించి సంతోషం ఉంటుందా నాకు.



బాధపడిన సందర్భాలు చెబుతారా?

జీవితమంతా బాధలతోటే గడిచింది. మాది చాలా పేద కుటుంబం. తిండిలేని పూట నీళ్లు తాగి బతికిన రోజులున్నాయి. వర్షం పడుతుంటే తిండిలేక మొక్క జొన్న కంకులు ఉడకపెట్టి తిన్న రోజులున్నాయి. గొడ్డు కూర తీసుకొచ్చి ఉడకబెట్టుకుని కడుపు నింపుకున్న రోజులున్నాయి. మా కుటుంబానికి ఏమీ లేనప్పుడు అమ్మా నాన్న నన్ను బాగా సాకిండ్రు. కానీ నేను మంచిగయిన తర్వాత, నా పరిస్థితి కొంత బాగయిన తర్వాత వారిద్దరూ లేకుండా పోయారు. అదే నన్ను బాగా బాధించింది.



మరి ఇప్పుడు తెలంగాణ అంతా పచ్చగా అయిపోయిందంటారా?

పచ్చగా ఒకేసారి అయిపోతుందా? ప్రయత్నం అన్నది కొనసాగుతోంది. ఇప్పుడు 40 శాతం పని మాత్రమే పూర్తయింది.



తెలంగాణలో ప్రశ్నించే పరిస్థితే లేకుండా పోతోందనీ కోదండరామ్‌ అంటున్నారు?

47 వేల చెరువులకు పునాది తీస్తే చెరువులు బాగు చేసిండ్రు అని ఒక్కమాట ఆయన ఏనాడైనా ప్రశంసించారా? ఇప్పటివరకూ నా జీవితంలో ఒక్కసారి కూడా కోదండరామ్‌ గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మంచి పని చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు దాన్ని గుర్తించడం లేదన్నదే నా ప్రశ్న. కోదండరామ్‌ను కేసీఆర్‌ ఎప్పుడూ కూడా నువ్విలా చేస్తున్నావే అని అడగలేదు. బాధ ఏమిటంటే, ప్రాజెక్టులు కడతానంటే నువ్వు కోర్టులకు వెళ్లావు. ప్రభుత్వం ఏ పని చేస్తున్నా అడ్డం తిరిగి మాట్లాడుతున్నారు. సూడు తెలంగాణ మరి నీళ్లు లేని తెలంగాణ అని వందల పాటలు పాడాం. ఇప్పుడు నీళ్లు తీసుకువస్తా ఉంటే ఆయనలాంటి పెద్ద మనిషి ఏ వైపు ఉండాలి?



మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి కేసీఆర్‌ తెలంగాణ కన్నీళ్లు తుడిచేస్తున్నారా?

ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఊరి చెరువు దుఃఖాన్ని తీర్చినవాడు కేసీఆర్‌. ఇవ్వాళ నేను ఎమ్మెల్యేను కానీ నా జీవితమంతా పేదరికమే కదా. ఆ పేదరికాన్ని తీర్చే పనులు ఇప్పుడు మొదలయినప్పడు ఆ పరిస్థితిలో మార్పును పాటగా పాడటం తప్పేంటి?



చంద్రబాబు, కేసీఆర్‌ ఇద్దరి పాలనపై మీ అభిప్రాయం?

చంద్రబాబుది పాలన ఎట్లవుతది. అది పాపిష్టి పాలన. అంతా హైటెక్కూ, హంగులూ గింగులే తప్ప ప్రజలకు కావలసిన పాలన ఎన్నడూ బాబు చేయడు. పచ్చి అవకాశవాది. ఏది కనబడితే దాంట్లో దూరతాడు. ఇమిడిపోతాడు. పదవి లేకపోతే పాగల్‌ అయిపోతాడు.



చంద్రబాబుపై అంత స్థిరమైన అభిప్రాయానికి వచ్చేశారేంటి?

ఎందుకంటే చంద్రబాబు చేసిన చరిత్ర కూడా మన కళ్లముందు కనబడుతోంది కదా. పార్టీ పెట్టిన ఎన్టీఆర్‌నే పెరికేసిండు. సొంత మామనే దించి పదవి పట్టుకుని వేలాడిన బాబు గురించి టీవీలల్లో మాట్లాడుకోవడం వేస్ట్‌. బాబుకు కేసీఆర్‌కు పొంతనే లేదు. బాబు పదవులకోసం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే మా కేసీఆర్‌ పదవులు వదులుకున్నారు. మా సార్‌కి పదవి అంటేనే లెక్కలేదు. కేంద్ర మంత్రిపదవినే వదులుకునేశారు.



అన్ని పార్టీల్లోంచి ఫిరాయింపుదారులను తీసుకెళ్లడం పద్ధతేనా?

టీడీపీ లెక్క ఎలా ఉంటుందంటే.. వాళ్లు చేస్తేనే సంసారం. ఇంకొకళ్లు చేస్తే వ్యభిచారం. ఏపీలో ఏం చేశారండీ. అక్కడ నీ బలమెంత?  అక్కడ మంచి మెజారిటీతో వైఎస్సార్సీపీ గెలిస్తే ఏం చేశాడో తెలవదా? మొదట్లో ఇక్కడా అదేవిధంగా మా పార్టీని ఏదో చేయబోయిండు.. పైసలిస్తే తలవంచుతారని అనుకున్నారు. కాని అది ఇక్కడ నడవలేదు కదా. ఎన్టీఆర్‌ విషయంలో చేసినట్లు జిమ్మిక్కులు, గిమ్మిక్కులు చేయాలని చూసిండు. ఆఖరుకు ఏమయింది? ప్రతివాడు రియలైజ్‌ అయిపోయాడు. నాయనా నువ్వు గాదురా మా నాయకుడే మాకు సరైనోడు.. నీ జాగాలో నువ్వు ఉండు నాయనా అని చెప్పి టీడీపీ వాళ్లంతా ఇటు వచ్చేసిండ్రు.



ఆ విషయంలో బాబు, కేసీఆర్‌ను డిఫెన్సులో పడేశాడా లేదా?

డిఫెన్సూ లేదు అఫెన్సూ లేదు. కేసీఆర్‌ ఎలా ఆలోచించారు? రెండుగా విడిపోయాం. ఇక కక్ష సాధింపులెందుకు? అనే అనుకున్నారు. కానీ బాబు చేసింది నూటికి నూరు శాతం తప్పు. తాను మాట్లాడిన టేప్‌ కూడా దొరికింది. నువ్వు ఎమ్మెల్యేను కొనడానికి పైసలు తీసుకొచ్చినవ్, కేసు కూడా కోర్టు పరిధిలో ఉంది.



మరి బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు అని కేసీఆర్‌ ఎందుకన్నారు?

ఈరోజు చిదంబరం, ఆయన కొడుకు పరిస్థితి ఏంటి? తప్పు చేసినోడు ఏదో ఒక క్షణాన కచ్చితంగా శిక్ష అనుభవించవలసిందే. ఎప్పటికైనా అది జరిగి తీరుతుంది. కాకపోతే మనకు చట్టముంది. దానిమీద గౌరవం ఉంది. కానీ చట్టం చేసే పనుల్ని కూడా మన చేతుల్లోకి తీసుకుని

మనమే వెళ్లి సంకెళ్లు వేసి తీసుకురాలేం కదా?

 


కేసీఆర్‌ పాలనకు, చంద్రబాబు పాలనకు మీరెన్ని మార్కులిస్తారు?

రెండే రెండు విషయాలు చెబుతాను. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క వ్యక్తి కూడా సంతోషంగా లేడు. దయచేసి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. మేమే పరాయివాళ్లమా.. ఏపీతో మాకు సంబంధాలు లేవా.. మాకు అక్కడ బంధువులు లేరా? ఏపీలో ఏ ఒక్క వ్యక్తి అయినా సరే చంద్రబాబు ఆహా, ఓహో అంటున్నాడేమో చూపించండి చాలు. అంతా సోకుటాకుల కేసులు, హంగామా తప్ప ఇంకేమీ లేదక్కడ. అదే తెలంగాణలో చూసుకోండి. ఒక గొర్రె కావాలంటే అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి పోయింది. తెలంగాణలోని యాదవులకు ఒక్కొక్కరికి 20 గొర్రెలు ఇస్తున్నామే.. మత్స్యకారులు, రజకులు, మంగలి ఇలా.. ఊరికి సేవ చేసే కులాలుగా పేరుపడిన వాళ్లు ముందుగా ఆ ఊర్లలోనే స్థిరపడాలి. బతుకు నిచ్చిన ఊర్లకు మళ్లీ తిరిగి రావాలి.



ఏపీలో బాబు పాలనకు, తెలంగాణలో కేసీఆర్‌ పాలనకు పోలికే లేదు. బతుక్కోసం బొంబాయి వెళ్లడానికి బస్సు ఏర్పాటు చేయండి అని గతంలో అన్న తెలంగాణ ప్రజలు ఇప్పుడు బొంబాయి బస్సులను రద్దు చేయమంటున్నారు. చెరువులు నిండితే అందరికీ పని దొరికే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం. ఎవరైతే ఊరికి సేవ చేసే కులాలుగా స్థిరపడ్డారో వాళ్లను ఊర్లలో స్థిరపడేలా చేస్తున్నాం. అదే బాబు పాలనలో ఏపీలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు.

(రసమయితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)

https://goo.gl/TRQrBp

https://goo.gl/C0yaqC

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top