సమతను చాటిన సాధువు

సమతను చాటిన సాధువు

పుస్తక పరిచయం

 

‘‘జనం అంతకుముందు చాలామంది బాబాలను, గురువులను చూశారు. అయితే, వాళ్లందరూ బ్రహ్మజ్ఞానం, మాయ, కోరికలు, సమర్పణలు, పరలోకాలు, ముక్తి, మోక్షం లాంటి మాటలే చెబుతూ ఉండేవారు. వాటిలో ఈ లోకానికి సంబంధించినవి, ఇప్పటికి అవసరమైనవి ఒక్కమాట కూడా ఉండేది కాదు. కానీ, ఈ కొత్త బాబా చెబుతున్నవి చాలా కొత్తగా ఉండటమే కాదు, అర్థమవుతోంది కూడా’’ అంటారు రచయిత మల్లంపల్లి సాంబశివరావు. ‘అభినవ బుద్ధుడు– అంబేడ్కర్‌ గురువు సంత్‌ గాడ్గేబాబా’ అనే తన పరిశోధనాత్మక గ్రంథంలో ఆయన అనేక విషయాలను వెలుగులోకి, తెలుగులోకి తెచ్చారు.



సమాచారం కోసం మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు. వృద్ధాప్యంలో ఉన్న గాడ్గేబాబా డ్రై వర్‌ భావ్‌రావు కాలేను కలిశారు. తాను ఆచరిస్తున్నది బౌద్ధమనే విషయం తెలియకుండానే జీవితాంతం బుద్ధుడి వలే గడిపిన మహనీయుడు గాడ్గేబాబా అంటారు రచయిత. అక్షరజ్ఞానం లేని ఒక సాదాసీదా గాడ్గేబాబాను తన గురువుగా అంబేడ్కరే స్వయంగా ప్రకటించాడు. బుద్ధుడి మాదిరిగా తన 29వ ఏట గాడ్గేబాబా ఇంటి నుంచి వెళ్లిపోయి, సంసారిక జీవితానికి దూరంగా జరిగి, జనం ఈతిబాధలను రూపుమాపే మహత్కార్యానికి పూనుకున్నాడు. ఈ బాధలను తొలగించడానికి అపరిశుభ్రత నిర్మూలన అనే ఆచరణాత్మక విధానాన్ని ఆయన ఆయుధంగా చేసుకున్నాడు.



స్వచ్ఛత గురించి గాంధీ మహాత్ముడు ప్రవచించకముందే, 1905లో మహారాష్ట్రలో అప్పటికే బోధిస్తూ, ఆచరిస్తూ జనం హృదయాలను గెలుచుకున్నవాడు గాడ్గేబాబా. పది సూత్రాల కోసం జీవితమంతా దేశాటన చేశాడు. ‘ఆకలిగొన్నవారికి అన్నం పెట్టండి, వస్త్ర విహీనులకు వస్త్రాలు అందించండి, దాహార్తులకు మంచినీరు ఇవ్వండి, జంతువులను ప్రేమించండి, జంతుబలికి పూనుకోకండి, అంటరానితనం పాటించకండి, మద్యాన్ని సేవించకండి, తల్లిదండ్రులను సేవించండి, విద్య లేనివారికి విద్యను అందించండి, అప్పులు చేసి తీర్థయాత్రలకు వెళ్లకండి’ అని బోధించాడు.

 

మహారాష్ట్రలోని సతారా, అమరావతి, పుణె, బొంబాయి, వార్ధా వంటి ప్రాంతాల్లో ధర్మశాలలు, గోశాలలు, విద్యాసంస్థలను 60కి పైగా నిర్మించాడు. గాడ్గేబాబా శిష్యగణం, అభిమానుల్లో సామాన్యులతోపాటు మాన్యులు కూడా అనేక మంది ఉన్నారు. ప్రముఖ కాలమిస్టు సుధీంద్ర కులకర్ణి, జేఎన్‌యూ ప్రొఫెసర్‌ వివేక్‌ కుమార్‌ వంటివారు రాసిన వ్యాసాలతో కూడిన ఐదు అనుబంధాలను పొందుపరిచిన ఈ 28 అధ్యాయాల పుస్తకానికి టీవీ 9 సీఈవో రవిప్రకాశ్‌ ముందుమాట రాశారు. 

 

సంత్‌ గాడ్గేబాబా; 

రచన: మల్లంపల్లి సాంబశివరావు; 

పేజీలు: 166; 

వెల: 150; ప్రతులకు: 

విశాఖ బుక్స్, ఫోన్‌: 040–27090197 

 

                                                                                    ఠి నీలం వెంకన్న
Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top