దుబారాకు మారుపేరు బాబు

దుబారాకు మారుపేరు బాబు


కొమ్మినేని శ్రీనివాసరావుతో సీనియర్‌ నేత డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు

ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు అన్నింటినీ నెరవేర్చడం ఏ పార్టీకి అయినా అసాధ్యమే కానీ చంద్రబాబు ఇచ్చిన మాటలకు, చేస్తున్న పనులకు పొంతనే లేదని సీనియర్‌ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పష్టం చేస్తున్నారు. వరదలు వచ్చే సమయంలో అంతర్వేదిలో కలిసే గోదావరి నీళ్లను రోజుకు కోటి రూపాయలు ఖర్చుచేసి నీళ్లను లిఫ్టు చేసి కృష్ణా బ్యారేజీకి తీసుకొచ్చి అక్కడినుంచి మళ్లీ సముద్రంలో కలుపుతున్న దిక్కుమాలిన పనికి పట్టిసీమ అని, నదుల అనుసంధానమని చెప్పుకోవడం కంటే దిక్కుమాలిన పనన మరొకటి ఉండదని ఎద్దేవా చేశారు. డబ్బులు లేవని చెప్పి స్కూలు పిల్లల వద్ద కూడా రాజధాని ఇటుకకు పది రూపాయలు వసూలు చేసిన ముఖ్యమంత్రి తన అతిధి గృహాలకు, అధికార నివాసాలకు కోట్లు ఖర్చుపెట్టడం ఏమిటి? ఈ దుబారా ఖర్చులకు డబ్బులెక్కడి నుంచి వస్తున్నాయంటున్న దగ్గుబాటి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..



చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నారా

ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చడం ఎవరికైనా సాధ్యం కాదు. కానీ చంద్రబాబు చెప్పినదానికి, చేస్తున్నదానికి చాలా వ్యత్యాసం ఉంది. రెండేళ్లలో పట్టిసీమను పూర్తిగా తీసేస్తామని అసెంబ్లీలోనే చెప్పిన పెద్దమనుషులు దానిపై రూ.1,800 కోట్లు ఖర్చు పెట్టారు. అది అవసరమే లేదని మొన్న కాగ్‌ చెప్పింది. కృష్ణా, గోదావరి నదులకు వరదలు వచ్చే సమయంలో అంతర్వేదిలో కలిసే గోదావరి నీళ్లను తెచ్చి కృష్ణా బ్యారేజీకి తీసుకొచ్చి అక్కడినుంచి మళ్లీ సముద్రంలో కలుపుతాం. ఇదీ కార్యక్రమం. ఇలా తెచ్చిన నీళ్లను లిఫ్టు చేయడానికి రోజుకు కోటి రూపాయలు ఖర్చుపెడుతున్నారు. అదే పులిచింతలకు ప్రభుత్వం వంద కోట్లు ఇస్తే 45 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఆ నీళ్లు మన కళ్లముందు కనబడుతున్నాయి. వాటిని చక్కగా నిల్వ చేసుకోవచ్చు.



కానీ 3 టీఎంసీల నీరు నిల్వ ఉండే కృష్ణా బ్యారేజీ వద్ద రోజుకు కోటి ఖర్చుపెట్టి 60 టీఎంసీల నీటిని లిఫ్టు చేసి పోస్తామంటారు. కృష్ణా, గోదావరి పుష్కరాల పేరుతో చెరొక 1,500 కోట్లు ఖర్చుపెట్టారు. ఇక రాజధాని. ఇటుకల పేరు చెప్పి స్కూలుకెళ్లే చిన్న పిల్లల దగ్గర నుంచి వసూలు చేశారు.  అదే సమయంలో ఏపీ సీఎం హైదరాబాద్‌లో ఒక బ్లాక్‌ ఆధునీకరణ అనే మిషతో 20 కోట్లు ఖర్చు పెట్టించాడు. స్పెషల్‌ ఫ్లైట్‌లలో తిరిగావు, గెస్ట్‌ హౌస్‌లు వేసుకున్నావు. నీకోసం ఒక బస్సును 5 కోట్లు ఖర్చు పెట్టి కొన్నావు. తాత్కాలిక నివాసానికి అయిదారు కోట్లు ఖర్చు చేశావు.



కోట్ల రూపాయలు పెట్టి రెంట్‌ హౌస్‌లు తీసుకుంటారు. డబ్బులేదు, ఆర్థిక పరిస్థితి బాగా లేదు, ఇటుకకు డబ్బులివ్వండి, రాజధాని నిర్మాణానికి స్కూలు పిల్లలు కూడా డబ్బులివ్వండి అంటూ చెబుతూనే మనసున్నవాళ్లం అయితే తాత్కాలిక నిర్మాణాలకు ఇన్ని వందల కోట్లు తగలెడతామా? డబ్బుల్లేవు అంటూనే ఈ దుబారా ఖర్చులకు ఎక్కడి నుంచి వస్తున్నాయి?  పైగా ఉద్యోగులందరూ అమరావతి రావాల్సిందే అన్నావు.. అదే హైదరాబాద్‌లో బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నావు. నీకొక న్యాయం, జనంకు ఒక న్యాయం.



వైఎస్‌కి, చంద్రబాబుకి పాలనాపరంగా తేడా ఏమిటి?

నా పరిశీలన మేరకు వైఎస్‌ చాలా చురుకైన మనిషి, ఒక నిర్ణయం తీసుకోవడంలో దాన్ని అవగాహన చేసుకోవటంలో సొంత అభిప్రాయాలు ఉండవు. పదిమందిని అడుగుతారు. సలహాలు తీసుకుంటారు, తర్వాత నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకోవడంలో వైఎస్‌ వ్యవహారం చాలా షార్ప్‌. ఎక్కువ చర్చలు ఉండవు. వెంటనే అమలు చేస్తారు కూడా. కాని చంద్రబాబు వ్యవహారం నాన్చుడే. సాగదీస్తుంటారు.



పొద్దున మీటింగ్, సాయంత్రం మీటింగ్, ఒక రోజు మీటింగ్, రెండు రోజుల మీటింగ్‌. ఇంత సుదీర్ఘ చర్చలు జరిగి తీరా అమలు విషయం వచ్చేసరికి, మళ్లీ మామూలే. ఇవ్వాళ చెప్పిన కార్యక్రమం గురించిన వార్త పేపర్లో వస్తే ఇక అది అయిపోయిందనే అనుకుంటారు. మళ్లీ రేపటినుంచి కొత్త కార్యక్రమాలు. మళ్లీ దాన్ని వండటం తర్వాత ప్రకటన. ప్రకటన వచ్చేసిందంటే అది అయిపోయినట్లేనని ఊహించేసుకుంటారు.



వ్యక్తులుగా వారిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి?

చంద్రబాబు తననీడను తాను చూసి భయపడతారు. బయటకు కనబడినంత ఇదిగా ఉండడు. పైగా పార్టీ కోసం ఎక్కువగా శ్రమించినవాడిని రాజకీయంగా ఎలా నిలుపుకోవాలి అనే విషయం చంద్రబాబుకు తెలియదు. అదే వైఎస్‌ విషయంలో అయితే మనల్ని నమ్ముకున్నవాళ్లకు ఎంత మేలు, ఎప్పట్లోగా చేయగలం, చేయాలి అని స్పీడుగా టైమ్‌ కేటాయించుకుంటారు. ఆ స్పీడులో చాలామందికి సహాయాలు చేస్తుంటారు. బాబు విషయంలో అయితే ఇక్కడ ఒకరికి మేలు చేస్తే వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో అనే మీమాంస ప్రబలి సమస్యను కోల్డ్‌ స్టోరేజ్‌లో పడేస్తుంటాడు.



చంద్రబాబు తెలంగాణ ఏర్పాటుకు లేఖ ఇచ్చి ఏపీలో వ్యతిరేకించడం తెలివైన పనా?

దాన్నే దిక్కుమాలిన తెలివి అంటారు. లోపలేమో లెటర్‌ ఇచ్చావు. ఏపీలో పోరాటం చేస్తానంటావు. అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసతో కలిసి పోటీ చేశాడు. పొత్తులో భాగంగా గులాబీ కండువా వేసుకున్నాడు. ఏపీకి వచ్చి అన్యాయం చేశారంటూ గగ్గోలు పెడతాడు. కాంగ్రెస్‌ దగా చేసిందనేది రోజూ గుణపాఠమే అనుకోండి. కానీ నువ్వు చేసిన పనిని ఇతరులపైకి నెట్టి దోషుల్ని చేయడం దారుణం కదా.



పోలవరం కాంట్రాక్టు పనుల్లో మతలబు ఉందా?

అర్హత లేని కంపెనీకి పోలవరం కాంట్రాక్టు ఇచ్చారు. కాంట్రాక్టు ఇచ్చిన తర్వాత చంద్రబాబు కూడా దాన్ని పోషించారు. డబ్బుల్లేని కంపెనీ, అప్పుల పాలైపోయిన కంపెనీ రెండేళ్లపాటు ప్రాజెక్టును కట్టకున్నా చూస్తూ ఊరకున్నారు. కేంద్రం డబ్బులిస్తానని చెప్పింది కాబట్టి మళ్లీ అంచనా వేసి మరో కంపెనీకి అవకాశం ఇచ్చి ఉంటే పోలవరం పనులు కొలిక్కి వచ్చేవి. అసలు కంపెనీ నిర్మాణ పనులు చేపట్టదు. సబ్‌ కాంట్రాక్టులు ఇవ్వడం, వాళ్లు పనులు పక్కనపెట్టడం. ఇవన్నీ కేంద్రం పరిశీలనలోకి వెళ్లే అంశాలు. పోలవరం కాంట్రాక్టు వ్యవహారంపై ఎంక్వయిరీ చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అవినీతి మామూలు రూపంలో లేదు. కాగ్‌ పోలవరంపైన కూడా మాట్లాడుతుంది. అప్పుడు ఉంటుంది తమాషా.



ఫిరాయింపుదార్లకు పదవులివ్వడంపై పురందేశ్వరి లేఖ ఇచ్చారు కదా..

1982 మే 28న రెండో మహానాడులో టీడీపీ ఒక తీర్మానం చేసింది. పార్టీలోకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల వాళ్లు గెలిచి టీడీపీలోకి రావాలనుకుంటే వారి పదవులను వదిలేసుకుని రావాలని తీర్మానం చేశాం. అలాంటి విలువలతో ప్రారంభమైన పార్టీ ఇది. ఇవ్వాళ స్పీకర్లే అడ్డదిడ్డంగా చేయడం గంపగుత్తగా ప్రతిపక్షం ఎమ్మెల్యేలను లాగేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరానిది.



ఫిరాయింపుదార్లను చేర్చుకోవడం అభివృద్ధిలో భాగం అని బాబు అంటున్నారే?

ఎప్పుడైనా బలం లేనటువంటి వాళ్లు చేసే పనులు ఇలాగే ఉంటాయి. ఇంతకాలం పార్టీకి పనిచేసిన వాళ్లను పక్కనపెట్టేసి ఇతర పార్టీలనుంచి వచ్చిన వాళ్లకు పదవులివ్వడం అంటే అది బలహీనతే కదా.. వీక్‌ అయినవాళ్లే ఏదో ఒక రకంగా బలపడాలని చూస్తుంటారు గదా. ఫిరాయింపులతోటే బలపడదాం అనే దిక్కుమాలిన ఆలోచనలు బాబుకే వస్తాయని ముందే చెప్పాను మరి.



రాజధాని పేరుతో జరుగుతున్న వ్యవహారాలపై మీ అభిప్రాయం?

రాజధానిని పాలనా రాజధానిగా పెట్టుకుంటే సరిపోతుంది. బ్రహ్మాండమైన రాజధాని కట్టాలి అనుకోవడం తప్పు కాదు. కాని ఇది సాధ్యమా, సాధ్యం కాదా అని ఆలోచించుకోవాలి. హైదరాబాద్‌ అనేది సాఫ్ట్‌ వేర్‌ పరిశ్రమ వచ్చాకే ఇంత గుర్తింపు పొందింది. అంతకుముందు అమానుల్లా ఖాన్‌ కట్టిన బిల్డింగే హైదరాబాద్‌ ఐకాన్‌గా ఉండేది. అలా 30 ఏళ్లు అదే నగర చిహ్నంగా ఉండిపోయింది. అంతర్జాతీయంగా ఉపయోగపడే మానవవనరులు ఇక్కడ ఉన్నాయి కాబట్టే సాప్ట్‌ వేర్‌ పరిశ్రమ ఇక్కడికి తరలి వచ్చింది. అది చంద్రబాబు గొప్పతనం కాదు. మరొకరి గొప్పతనం కాదు. నగరం ఏర్పడాలంటే వందలాది పరిశ్రమలు, విద్యా కేంద్రాలు, లక్షలాదిమందికి ఉద్యోగాలు ఇవన్నీ కల్పించాలి. అప్పుడే అది మహానగరం అవుతుంది.



అమరావతిలో ఉన్నఫళాన ఉద్యోగాలు రావు. ఇక మెట్రో రైలు ఎక్కడినుంచి వస్తుంది? 50 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఒక రింగురోడ్డు చూశాం. అమరావతిలో రింగ్‌ రోడ్డు అంటున్నారు. ఎలా సాధ్యం? మీలాం టివాళ్లు, మాలాంటివాళ్లు జాకీలెత్తుతా ఉంటే అంటే ప్రచారం చేస్తూ ఊదర గొడుతూ ఉంటే ప్రపంచ స్థాయి రాజధానిని ఊహల్లో కట్టేస్తాం మరి. అమరావతిలో ఉన్నవారు గగ్గోలు పెడుతున్నారు. కొనేవారు లేరు, అమ్మేవారు లేరు అక్కడ. ఈపాటికి అక్కడి ఐదు వేల ఎకరాల్లో శాశ్వత భవనాలే నిర్మించుకుని ఉండవచ్చు. కానీ తాత్కాలిక అసెంబ్లీ ఏమిటి, తాత్కాలిక భవనాలేంటి. ఇదే చిన్న స్థాయి ఉద్దేశాలు అంటే..



ఏపీ ప్రభుత్వ పాలన ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏమిటి?

మూడు పువ్వులు ఆరు కాయలు లాగా బ్రహ్మాండంగా ఉందని చెబుతున్నారు కదా. కానీ ఆ ప్రచారాన్ని ప్రజలు అంగీకరిస్తారా లేదా అనేది ఎన్నికల్లోనే చూద్దాం.

(దగ్గుబాటితోఇంటర్వ్యూ రెండో భాగం పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)

https://goo.gl/9zdtiL

https://goo.gl/xRn4X5


(దగ్గుబాటితో ఇంటర్వ్యూ మొదటి భాగం పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)

https://goo.gl/PYhkkj

https://goo.gl/eBKHq8

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top