చట్టబద్ధమైన అహంకారమా?

చట్టబద్ధమైన అహంకారమా?


విశ్లేషణ

‘చెప్పుతో 25 సార్లు కొట్టాన’ని గర్వంగా చెప్పుకున్న తర్వాత తాను ‘వినమ్రత’ కలిగిన వ్యక్తినని శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ చెప్పిన మాటలను యథాతథంగా తీసుకోవడం ఎవరికైనా కష్టమే అవుతుంది.



ఎయిర్‌లైన్స్‌ వ్యవహారంలో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ గండం నుంచి బయటపడినట్లే. ఈ మరాఠా ఎంపీకి అనువుగా ఉండటం కోసం పుణె–ఢిల్లీ మార్గంలో బిజినెస్‌ క్లాస్‌ సీట్లు ఉన్న విమానాన్ని ఎయిరిండియా ప్రవేశపెట్టనున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఎంపీ గైక్వాడ్‌ తన వైఖరిని పూర్తిగా సమర్థించుకున్నట్లు కనిపించింది, అదే సమయంలో ఆయన ప్రత్యర్థులు మొదట్లో దృఢవైఖరిని అవలంబించినప్పటికీ ఆ తర్వాత మాత్రం లొంగుబాటు ప్రదర్శించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.



మొత్తంమీద ఈ వివాదంలో శివసేన ఎంపీ గెలి చారు. పైగా ఈ మొత్తం ఉదంతంలో అవసరమైతే పార్టీ వైపు నుంచి న్యాయ సహాయం అందిస్తామని, కానీ భవిష్యత్తులో మాత్రం ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి సరిగా వ్యవహరించాలని సూచిస్తూ పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే తమ పార్లమెంట్‌ సభ్యుడికి వత్తాసుగా నిలిచినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. రవీంద్ర గైక్వాడ్‌ ముందుగా క్షమాపణ చెప్పాల్సిందేనంటూ ఎయిర్‌లైన్స్, విమానయాన మంత్రి గట్టిగా చేసిన డిమాండ్‌తో పోలిస్తే ఇది పట్టించుకోవాల్సిన పని లేనంత చిన్న విషయంగా అయిపోయింది. ఎయిర్‌లైన్స్‌ సీనియర్‌ ఉద్యోగిపై దాడికి సంబంధించి జరిగిన దానికి సారీ చెబుతూ శివసేన ఎంపీ చివరకు సభలో పశ్చాత్తాపం వ్యక్తపరిచారు. కానీ మీడియా మాత్రం దాన్ని క్షమాపణలాగా చూడనేలేదు.



రాజకీయాధికార వర్గానికి చెందిన ప్రతిపక్షాలు లేదా వాటిలోని కొన్ని సెక్షన్లకు చెందిన వారు రవీంద్ర గైక్వాడ్‌ ప్రవర్తన చెడుగా ఉందని భావించినప్పటికీ, విమాన ప్రయాణం చేయడం నుంచి ఆయనను నిషేధించడం అనేది (సామాన్య ప్రయాణీకుడు ఇలా వ్యవహరించి ఉంటే ఇప్పటికే తను జైల్లో ఉండేవాడు) ఒక ఎంపీగా తన హక్కులను అతిక్రమించినట్లవుతుంది అనే ప్రాతిపదికన ఎంపీకి కల్పించాల్సిన హక్కులను భంగపరిచినట్లవుతుందన్న అభిప్రాయం కల్గించడానికి వీరు ప్రయత్నించారు. పైగా దీనికి సంబంధించి శివసేన పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెడతానని బెదిరించింది కూడా. కానీ,  ఎంపీగా అతని ప్రత్యేకహక్కును అది ఉల్లంఘించినట్లేనా?.



ఎయిరిండియా తన విమానాలలో ప్రయాణించకుండా ఆయనను తక్షణమే దూరం పెట్టేసినప్పుడు, ఒక ఎంపీని తన విధులు నిర్వర్తించకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నిస్తూ శివసేన.. ఇది అన్యాయమంటూ ఆక్రోశించింది. నిజమే.. చట్టసభలో కానీ, ఆయన ఏవైనా కమిటీలలో గానీ ఉన్నట్లయితే, ఒక ఎన్నికైన ప్రతినిధిగా తన విధులు తప్పక నెరవేర్చవలసే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఆ నిషేధం తన పార్లమెంట్‌ విధులను నిర్వహించకుండా అడ్డగించడమే అవుతుంది.



తన విధులు నిర్వర్తించకుండా శివసేన ఎంపీని అడ్డగించడం బహుశా తప్పే కావచ్చు. వాస్తవంగా కూడా ఏ ఎంపీని తన విధులను నిర్వర్తించడం నుంచి ఈ రూపంలో తప్పించకూడదు. ఇక్కడ ‘పనిచేయటం’, ‘విధులు’ అనే పదాలకే ప్రాధాన్యత ఉంది. లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ జరిగిన ఉదంతం అసౌకర్యాన్ని కలిగించిందంటూ చాలా జాగ్రత్తగా పదప్రయోగం చేశారు. అది హక్కుల ఉల్లంఘన అని చెప్పకుండా ఆమె చాలా జాగ్రత్త వహించారు.



అయితే విస్తృతార్థంలో.. ఎంపీ చేయవలసిన విమాన ప్రయాణాలపై విమానయాన సంస్థ నిషేధం విధించడం అంటే పార్లమెంటుకు హాజరు కాకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం అని అర్థం కాదు. కానీ ఎయిరిండియా ఉద్యోగిని తాను తన చెప్పుతో పాతిక పర్యాయాలు కొట్టినట్లు టీవీ కెమెరాల ముందు శివసేన ఎంపీ స్వయంగా అంగీకరించారు కాబట్టి, అది హక్కులను అడ్డుకోవడంలాగా కాకుండా పూర్తిగా విభిన్నమైన ఘటనకు చెందిన ఒక పాయలాగా మారిపోయింది. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ తన చర్యను సమర్థించుకోవడమే కాదు (ఆ వీడియో ఫుటేజీని మీరు చూసినట్లయితే) తాను చేసిన పనికి ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పారు. ఆ గర్వం కూడా కొట్టడం తన చట్టపరమైన హక్కు అనే భావన నుంచి వచ్చిన గర్వం.



విమానంలో ఉన్న ప్రయాణీకుల భద్రత రీత్యా ఆ ఎంపీ భవిష్యత్‌ విమాన ప్రయాణంపై ఎయిరిండియా ఆంక్షలను కూడా విధించింది. పౌరవిమానయాన మంత్రి అశోక్‌ గజపతిరాజు కూడా దాదాపుగా ఈ విషయాన్నే లోక్‌సభలో ప్రకటించారు. విమానయాన సిబ్బంది ఆగ్రహానికి కూడా ప్రాతిపదిక ఇదే. ‘చెప్పుతో 25 సార్లు కొట్టాన’ని గర్వంగా చెప్పుకున్న తర్వాత తాను ‘వినమ్రత’ కలిగిన వ్యక్తినని గైక్వాడ్‌ చెప్పిన మాటలను య«థాతథంగా తీసుకోవడం ఎవరికైనా కష్టమే అవుతుంది.



ఈ మొత్తం వ్యవహారంలో కొట్టొచ్చినట్లుగా కనపడుతున్న తన దుష్ప్రవర్తన ఫలితంగానే ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ ఈ ఉదంతంలో కాస్త మెట్టు దిగాల్సి వచ్చింది. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ప్రివిలెజ్‌ కేసు ఉల్లంఘనకు సంబంధించిన నివేదికను పేర్కొంటూ, కౌల్‌ –షక్దర్‌ తమ ‘ప్రాక్టీస్‌ అండ్‌ ప్రొసీజర్‌ ఆఫ్‌ పార్లమెంట్‌’ అనే రచనలో.. ఇలాంటి తరహా ఉల్లంఘనలు, ‘ఇతర పౌరులకు మల్లే తనకూ వర్తించే సామాజిక విధుల నుంచి ఏ గౌరవ సభ్యుడినీ తప్పించలేవ‘ని చెప్పారు.




వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

ఈ–మెయిల్‌ : mvijapurkar@gmail.com

మహేష్‌ విజాపృకర్‌

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top