తామర పూవు


భారతీయ సంస్కృతికీ తామరపూవుకూ అవినాభావ సంబంధం. ఒకప్పుడు మన దేశంలో సౌందర్యానికీ, శోభకూ, సమృద్ధికీ తామరపూవు ఒక చిహ్నంగా ఉండేది. ప్రాచీన సాహిత్యంలో అడుగడుగునా కని పించే పద్మాల ప్రస్తావన గురించి పదుల కొద్దీ పరి శోధన వ్యాసాలు రాయవచ్చు.

 శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మీదేవి ఇలా మన దేవతలందరికీ తామర పూలంటే ఎంత ఇష్టమో!ఇక సాహిత్యంలో అయితే ఆదికవి వాల్మీకి నుంచి ఆచంట జానకిరాంగారి దాకా అందరూ పద్మప్రియులే. ఈ లోకంలో ఇన్ని పూలుం డగా తామర పూలకే ఎందుకింత లోక ప్రియత?

 ప్రాచీన భారతదేశంలో ప్రతి జనావాసంలోనూ పెద్ద పెద్ద చెరువులుండేవి. ఆ చెరువుల్లో విస్తారంగా తామరలు ఉండేవి. వేళ్లూ, దుంపలూ ఎక్కడో నీటి అడుగున నేలలో ఉన్నా, వెడల్పాటి ఆకులు మాత్రం నీటి ఉపరితలం మీద నీటుగా పరచుకొని ఉండేవి. ఆ ఆకుల మీద పేర్చినట్టు అందమైన పూలు. వాటి అసా ధారణమైన సౌందర్యం, లావణ్యం వల్లే తామర పూలు లోకప్రియమైన సాహిత్య వస్తువులైపోయాయి.

 జన సమ్మర్థం తక్కువగా ఉన్న, ప్రశాంతమైన ప్రాంతాలలో వికసించే తామర పూల కొలనులు భావుకుల మనసులను దోచుకొని తీరతాయి. కేవలం బుర దలో నుంచి అలాంటి సౌందర్యం ఆవిర్భవించటం ఎప్పటికీ అర్థం గాని ప్రకృతి విలాసం, అందీ అందని తత్తశాస్త్ర రహస్యం. అందుకే అరవిరిసిన సరోజాలను స్వచ్ఛతకూ, సౌంద ర్యానికీ, పరిపూర్ణతకూ చిహ్నాలుగా గుర్తించారు.

 అనువైన పరిస్థితుల్లో తామర దుంప వెయ్యేళ్ల దాకా సజీవంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతు న్నారు. ఆ మధ్యన చైనాలో 1200 ఏళ్ల నాటి తామర గింజలు లభించాయి. వాటిని నాటి చూడగా అవి చక్కగా మొలకెత్తాయని వార్త. ఇటీవల ఆస్ట్రేలియాలో పరిశోధకులు తామరపూలకు తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకొనే శక్తి ఉందని కనుక్కొన్నారట. పరిస రాల ఉష్ణోగ్రత పది డిగ్రీల లోపు ఉన్నప్పుడు కూడా తామర మొగ్గలలో ఉష్ణోగ్రత ముప్ఫై డిగ్రీల దాకా ఉన్నట్టు గమనించారట. ఈ శక్తివల్లే తామర పూలు తుమ్మెదలను బాగా ఆకర్షించగలుగుతాయట.

 తామర పూలూ, ఆకులూ, కాడలూ, వేళ్లూ, దుం పలూ ఇలా అన్ని భాగాలకూ వాటి వాటి ఔషధి విలు వలు ఉన్నాయి. తామర పూల కేసరాలను తేయాకుతో కలిపి చైనాలో తేనీరు తయారు చేసి ఔషధంగా సేవిస్తారు. తామర పూలూ, గింజలూ తింటే ప్రాపం చిక విషయాలపై తీవ్ర అనాసక్తి కలుగుతుందని ప్రాచీన గ్రీకుల నమ్మిక. అవి తిన్నవారు లోకంలో ఏ విషయం కోసం, బంధాల కోసం తాపత్రయ పడకుండా, వ్యర్థ శ్రమ లేని విశ్రాంతి జీవితం గడపటం ఇష్టపడతారట.

 ఎం. మారుతిశాస్త్రి

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top