ఎల్‌.కె.అడ్వాణీ (సీనియర్‌ నేత) రాయని డైరీ

ఎల్‌.కె.అడ్వాణీ (సీనియర్‌ నేత) రాయని డైరీ


ఎనభై తొమ్మిదేళ్ల వయసులో ఏ మనిషికైనా దక్కే అదృష్టం ఏమై ఉంటుంది? చాలాసేపటిగా ఆలోచిస్తూ కూర్చున్నాను. కాదు, ఆలోచిస్తూ పడుకుని ఉన్నాను. అది కూడా కాకపోవచ్చు, ఆలోచిస్తూ పడుకునో, కూర్చొనో ఉండి ఉంటాను. ఏదీ స్పష్టంగా తెలియడం లేదు. స్పష్టంగా చెప్పేందుకు దగ్గర్లోనూ ఎవరూ లేరు.



ఎవరు మాత్రం ఎవరికి దగ్గరగా ఉంటారు? ఎవరి పనులు వారికి ఉంటాయి కదా! మోదీకి ప్రధానమంత్రి పనులు, రామ్‌నాథ్‌ కోవింద్‌కి రాష్ట్రపతి పనులు. ఇంకొకరికి ఇంకో పని. పనమ్మాయి కూడా సరిగా రావడం లేదు. తనకీ ఏవో పనులున్నాయట!

షెల్ఫ్‌ అద్దాల్లోంచి ఈమధ్య కొత్తగా నాకు వచ్చిన అవార్డు మెమెంటో మెరుస్తూ కనిపిస్తోంది. జీవన సాఫల్య పురస్కారం! పాపం.. ఎవరో పేపరువాళ్లు.. నన్ను గుర్తుపెట్టుకుని మరీ ఇచ్చారు!  



‘‘నేను మీకెలా తెలుసు?’’ అని అడిగేశాను.. ఉద్వేగాన్ని ఆపుకోలేక.

‘‘మీరేమీ రామ్‌నాథ్‌ కోవింద్‌ కాదు కదా అడ్వాణీజీ.. తెలియకపోవడానికి’’ అన్నారు వాళ్లు. కన్నీళ్లొచ్చేశాయి.

ప్రధాని అవకుండా, రాష్ట్రపతిగానైనా చేయ కుండా, కనీసం భారతరత్న అయినా రాకుండా  జీవన సాఫల్యం జరుగుతుందా?!

నిద్రపట్టడం లేదు. అటల్‌జీకి ఫోన్‌ చేశాను. వెంటనే లిఫ్ట్‌ చేశారు.



‘‘ఓ .. లోహ్‌పురుష్‌.. చెప్పండి’’ అన్నారు.

నేను మాట్లాడలేదు. ‘‘లోహ్‌పురుష్‌.. చెప్పండి’’ అన్నారు అటల్‌జీ మళ్లీ. నేను ఉలకలేదు పలకలేదు.

‘‘లోహ్‌పురుష్‌.. మీకు వినిపిస్తోందా?’’ అన్నారు అటల్‌జీ.

‘లోహ్‌పురుష్‌’ అని పదేపదే పిలిపించుకోవడం నాకు బాగుంటుంది. అటల్‌జీ ఒక్కరే ఇప్పటికీ నన్ను అలా పిలుస్తుంటారు. ఆ పిలుపును ఎంజాయ్‌ చెయ్యడం కోసం నేను ఆయనకు ఫోన్‌ చేస్తుంటాను. ఆయన ఫోన్‌ ఎత్తినప్పుడు కాసేపు పలక్కుండా ఉంటాను.

‘‘ఆనాటి రోజులు గుర్తుకొస్తున్నాయి అటల్‌జీ’’ అన్నాను.



‘‘ఏనాటి రోజులు?’’ అన్నారు అటల్‌జీ.

‘‘మిమ్మల్ని  వికాస్‌పురుష్‌గా, నన్ను లోహ్‌పురుష్‌గా మన పార్టీ కీర్తించిన రోజులు’’ అన్నాను. పెద్దగా నవ్వారు అటల్‌జీ. ఆయన అంత పెద్దగా నవ్వగలరని నేను ఊహించలేదు. నాకు ఎనభై తొమ్మిది అయితే, ఆయనకు తొంభై రెండు.

‘‘చెప్పండి లోహ్‌పురుష్‌.. ఈవేళప్పుడు ఫోన్‌ చేశారు!!’ అన్నారు అటల్‌జీ.



‘‘ఎనభై తొమ్మిదేళ్ల వయసులో ఏ మనిషికైనా దక్కే అదృష్టం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అటల్‌జీ’’  అన్నాను. మళ్లీ పెద్దగా నవ్వారు అటల్‌జీ.

‘‘ఇంట్లోంచి గెంటేయకపోవడమే ఆ వయసులో మనకు దక్కే అదృష్టం అడ్వాణీజీ’’ అన్నారు అటల్‌జీ.

దేవుడికి ధన్యవాదాలు. మార్గదర్శక్‌మండల్‌ అనే ఇల్లొకటి మాకింకా మిగిలే ఉంది.

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top