జీవితం ఒక గుజరాతీ నాటకరంగం

జీవితం ఒక గుజరాతీ నాటకరంగం


ఈ చివరి సన్నివేశం రోతగా ఉందని కొందరు విమర్శకులన్నారు గానీ, నిర్దిష్ట సమయంలో ఒకపాత్ర ఎట్ల ప్రవర్తిస్తుందో రచయిత తనదైన పద్ధతిలో భావిస్తాడు.  తన భార్య మరణ వార్త తెచ్చిన బావమరిదిని ‘అపూ’ సాచి లెంపకాయ కొడ్తాడు. విమర్శకులకు సమాధానమిస్తూ అపూ ఆ క్షణంలో అట్లానే చేసి ఉంటాడని తన బుద్ధికి తోచిందంటాడు సత్యజిత్‌ రాయ్‌.



‘‘ఒరేయ్‌ కుంటివాడా! నీకు పులగం వద్దా? ఏమి తింటావురా?’’ సాయుధుడైన సిపాయి గద్దించాడు.

‘‘నేను రైతు బిడ్డను. నాకీ బిచ్చం అక్కర్లేదు’’ కాళా సమాధానం.

‘‘పటేలూ, ఏమికథ? నీకు పులగం అక్కర్లేదా?’’ సుందర్‌ సేఠ్‌ అడిగాడు.

కాళా ఏమి జవాబిస్తాడు. వాళ్ళకు రైతు హృదయం తెలియదు.

‘‘ఈ ధాన్యం అంతా మేము పండించిందే అంటే తుపాకులతో బెదిరిస్తారు. ఈ తుపాకులన్నీ నాశనం చేయడానికి చెయ్యెత్త గలిగితే బాగుండును.’’ కాళా మనసులోనే అనుకుంటాడు.



‘‘మీరు రైతులు, భూమిని పాలించేవాళ్లు. మిమ్మల్ని మేం రక్షించగలమా? పిచ్చివాడా, ప్రకృతి ముందు మనమెంత వాళ్ళం. శక్తి హీనులం. రేపటినుంచి నువ్వు ఇక్కడ పని చెయ్యి. శ్రమ చేసి తినడంలో తప్పేమీ లేదు గదా.’’ సుందర్‌ సేఠ్‌ అనునయంగా అంటాడు.



ఏడు దశాబ్దాల కిందట(1947) పన్నాలాల్‌ పటేల్‌ గుజరాతీ భాషలో రచించిన ‘మానవీనీ భవాయీ’ నవల చివరి భాగంలోది ఈ సన్నివేశం. ఆత్మాభిమానాన్ని త్యాగం చెయ్యలేక ఆత్మత్యాగానికైనా సిద్ధపడే రైతు మనస్తత్వాన్ని చాలా ఉదాత్తంగా ఈ నవలలో చిత్రించారు. ఉత్తర గుజరాత్‌ను అతలాకుతలం చేసిన మహాక్షామం(1899–1901) వరకు పాతికేళ్ళ కాళా జీవితాన్ని ఈ నవల చిత్రించింది. పేదరైతుల ఆశనిరాశలు, కష్టనష్టాలు, ప్రతి విషయాన్ని సమదృష్టిలో స్వీకరించే స్థితప్రజ్ఞత నవలలో పడుగు పేకల్లా అల్లుకుపోయాయి. పన్నాలాల్‌ నవలలన్నింటి మీద గాంధీజీ విచారధార ప్రభావం కూడా కన్పిస్తుంది. ఈ నవల తొలి భాగానికి వేమూరి ఆంజనేయశర్మ ‘జీవితం ఒక నాటకరంగం’ పేరుతో చేసిన అనువాదాన్ని నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా 1971లో ప్రచురించింది. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పన్నాలాల్‌ పటేల్‌ మూడు కథా సంకలనాలు, అరవై పై చిలుకు పౌరాణిక, సాంఘిక నవలలు రచించినా, వారి పేరు చాలా ఆలస్యంగా ప్రసిద్ధిలోకి వచ్చింది.



‘మానవీనీ భవాయి’ నవలకు జ్ఞానపీఠ బహుమతి లభించినా, కావ్యశిల్పం దృష్టిలో ఆయన ‘మళేలా జీవ్‌(1941) నవలను పరిపూర్ణమైన విషాదాంత ప్రేమకావ్యంగా విమర్శకులు ప్రశంసించారు. పన్నాలాల్‌కు ఇష్టమైన రచన ఇదే. కులాంతర వివాహాలు ఊహకు గూడా అందని కాలంలో కన్‌జీ పటేల్, మంగలి కులంలో పుట్టిన జీవ్‌ ప్రేమించుకుంటారు. కన్‌జీకి అన్నకుటుంబం పోషించే బాధ్యత ఉంటుంది. తన మిత్రుడు సూచించిన ఉపాయం ప్రకారం ప్రియురాలు జీవ్‌ను ఊరి మంగలికిచ్చి పెళ్ళిచేస్తాడు గానీ పరిణామం వికటిస్తుంది. అనుమాన పిశాచియైన భర్త పెట్టే హింస భరించలేక జీవ్‌ తన ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. పొరపాటుగా విషం తాగిన భర్త మరణించగా మతిభ్రమించిన జీవ్‌ బాధ్యత కన్‌జీ స్వీకరించడంతో నవల ముగుస్తుంది.



‘మళేలా జీవ్‌’ నవలలో మాదిరిగా సర్వాంగణమైన శిల్పం ‘మానవీనీ భవాయీ’లో లేకపోయినా, రచనలో కన్పించే జీవితం అందులోని బలహీనతలను కమ్మి వేసింది. పరిపూర్ణ నవలా శిల్పం కొరవడినా నవల ఇతివృత్తం నవలను గొప్ప రచనగా నిల్పుతుందనడానికి ఈ నవలే నిదర్శనం.



పచ్చిగా, మొరటుగా ఉందని ముద్రపడకుండా, ఉత్తర గుజరాత్‌ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవహారంలో ఉండే పదాలను, అభివ్యక్తిని పన్నాలాల్‌ తన సరళశైలిలో ఇముడ్చుకోగలిగారు. సంపన్నవర్గాల జీవితాలను ఆదర్శీకరించి కృతకమైన ఉద్వేగాలు, నిర్హేతుకమై భావావేశాలతో, సంస్కృత పద భూయిష్ఠమైన కావ్యశైలిలో అప్పటివరకు సాగిన గుజరాతీ కాల్పనిక సాహిత్యాన్ని భూమార్గం పట్టించిన అపర భగీరథుడు, రైతుబిడ్డ, సహజ కథకుడు పన్నాలాల్‌ పటేల్‌. తెలుగు పాఠకులు ఈ నవలను చదువుతున్నప్పుడు అల్లం రాజయ్య నవలలు తప్పక గుర్తుకు వస్తాయి.



‘మానవీనీ భవాయీ’ కాళా, రాజు పాత్రలచుట్టూ పరిభ్రమిస్తూ గుజరాత్‌ పల్లీయుల జీవితాలకు అద్దం పడుతుంది.  కాళా నిమిత్త మాత్రుడు. కాలమే కథను ముందుకు నడుపుతుంది. సడలని మనోధైర్యం, పట్టుదల తల్లి రూపా నుంచి, ఎంత దుఃఖాన్నైనా అధిగమించి ఆశావహంగా జీవించడం తండ్రి వాలాపటేల్‌ నుంచి పుణికి పుచ్చుకున్న కాళా పాత్ర కాలంతో పాటు పరిణతి చెందుతుంది.  



బక్కరైతు వాలా పటేల్‌ అరవయ్యో ఏట భార్య రూపా కాళాకు జన్మనిస్తుంది. వాలాపటేల్‌ మీది అభిమానంతో మంత్రగత్తెగా పేరుపడ్డ పుతామా నాలుగేళ్ల కాళాకు మూడేళ్లు గూడా నిండని రాజుతో పెళ్ళి నిశ్చయిస్తుంది. ఆమెకు ఎదురు చెప్పడానికి ఎవరు సాహసించరు. వాలా తన నాలుగేళ్ళ బిడ్డ కాళాను అన్న పరమా చేతుల్లో పెట్టి కన్నుమూస్తాడు. గయ్యాళి భార్య మాతా ముందు పరమా మంచితనం కొరగాకుండా పోతుంది.



ఈ నవలలో గొప్ప వ్యక్తిత్వం ఉన్న పాత్ర రూపాది. గ్రామీణుల విశ్వాసాలను తృణీకరిస్తూ, తాను వెంట ఉండి  ఎనిమిదేళ్ల కాళా చేతికి మేడి పట్టించి పొలం దున్నిస్తుంది రూపా. ఆడది అరక పట్టినందువల్లే వర్షాలు పడలేదని మాతా, ఆమె కొడుకులు రణచోడుడు, నానా పంచాయితి పెట్టించి పొలంలో రూపాను పడుకోబెట్టి పైన ఎడ్లు తోలాలని తీర్పు చెప్పిస్తారు. రూపా నదురు బెదురు లేకుండా శిక్షకు సిద్ధ పడుతుంది. పొలంలో పడుకుంటుంది. కానీ ఎద్దుల్ని ఆమెపై తోలే లోపలే పెద్ద వర్షం కురిసి ‘‘రూపా పిన్ని మహిమాన్వితురాలు’’ అని జనం ప్రశంసలు పొందుతుంది. పన్నాలాల్‌ ఈ నవలలో గ్రామీణుల అంధవిశ్వాసాలను చిత్రిస్తునే, ధిక్కరించిన రూపాను వీరవనితగా ప్రదర్శించారు.



అసూయాపరురాలు, జిత్తులమారి మాతా కాళా రాజుల పెళ్ళి సంబంధాన్ని చెడగొట్టి రాజును తన కొడుకు నానాకు రెండో భార్యగా చేయడానికి ఎన్ని కుతంత్రాలు పన్నుతుందో! చివరకు గ్రామ పంచాయతీ పెద్దలు కాళా పెళ్ళిని ఠాకూర్‌వాలా గ్రామంలోని భలీ అనే అమ్మయితోనూ, రాజు పెళ్లి భలీ అన్నతోనూ చేయాలని తీర్మానిస్తారు. కాళా రాజుల జీవితాలతో విధి ఆడిన ఆట ఇది.

తాను కాపురానికి వెళితే తప్ప కాళా భార్య కాపురానికి రాదని గ్రహించి రాజు అత్తగారింటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గూడా రాజు వివాహబంధం భగ్నం చేయడానికి కంకణం కట్టుకొన్న మాతాని ఆమె కొడుకులను రాజు ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళ కుట్రలను తిప్పి కొడ్తుంది. కాళా వల్ల భార్యకు ఎటువంటి సంతోషమూ లేదని గ్రహించి, అతడు సన్యాసుల్లో కలిసిపోకుండా ఉండేట్టు ఓదారుస్తుంది.

‘‘అనుకుంటే’ అన్నీ ఉన్నవి’’ అని భావనా ప్రపంచంలో తన ప్రేమను సాగించవచ్చునని ‘‘మనుసులోనే నెమలిని ఆడించి’’ ఆనందించవచ్చునని కాళాకు హితవు చెబుతుంది.



కరువొస్తుంది. భిల్లులు ఉళ్ళమీద పడి దోచుకుంటారు. కాటకం బీదా బిక్కి, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే తేడాలు నిర్మూలించి అందర్నీ సమానం చేసింది. ఇప్పుడు రణచోడుడు, నానా, మొత్తం ఊరూ కాళా నాయకత్వం కిందికి వచ్చింది. ‘‘ఆకలి చెడ్డది. మనిషి చెడ్డవాడు కాడు! ఊరు ఆకలి బాధలో అలమటిస్తోంటే దోపిడీ చేయడం తప్పుకాదని కాళా తీర్మానిస్తాడు. గ్రామం మీదుగా వెళుతున్నా వడ్డీ వ్యాపారి ధాన్యం బండ్ల మీద దాడి చేస్తారు. ఈ కరువు దాడిలో కాళా కుడిభుజం తూటా దెబ్బలు తిని పనికిరాకుండా పోతుంది.



బ్రతుకు దెరువుకోసం ప్రజలందరూ ‘డేగడియా’ గ్రామానికి వలస పోతారు. అక్కడ గౌరవ మర్యాదలు వదులుకొని కూలీనాలీ చేస్తారు. భలీ, రూఖీ వంటి స్త్రీలు రొట్టె ముక్కల కోసం మానం పణం పెడ్తారు.



రెండేళ్ళయినా చినుకు రాలదు. కాళాలో జీవితాశ నశిస్తుంది. శక్తినంతా కూడ దీసుకొని బయల్దేరుతాడు. రాజు అతణ్ని అనుసరిస్తుంది. ‘‘ఇక అడుగు ముందుకు వేయలేను, మృత్యువు తప్పదు’’ అని హీన స్వరంతో అంటూ కాళా కుప్పకూలిపోతాడు. కాళా (మానసిక) దాహాన్ని తీర్చడానికి రాజు తన రొమ్ము అతని నోటికందించి ధైర్యం చెబుతుండగా ఈశాన్య దిక్కున మబ్బులు కమ్మి ఉరుములు మెరుపులతో వాన చినుకులు పడుతాయి.



‘‘లే, పద. చీకటి పడుతోంది’’ రాజు అంటుంది.

‘‘ఇక నా కాళ్లు తడబడవు’’ కాళా సమాధానం. కాళా అంతరాత్మ మాట్లాడుతున్నట్లు రాజు గ్రహిస్తుంది.

ఈ చివరి సన్నివేశం రోతగా ఉందని కొందరు విమర్శకులన్నారు గానీ, నిర్దిష్ట సమయంలో ఒకపాత్ర ఎట్ల ప్రవర్తిస్తుందో రచయిత తనదైన పద్ధతిలో భావిస్తాడు. తన భార్య మరణ వార్త తెచ్చిన బావమరిదిని అపూ సాచి లెంపకాయ కొడ్తాడు (అపూ సంసార్‌–సినిమా). అపూ ఆ క్షణంలో అట్లానే చేసి ఉంటాడని తన బుద్ధికి తోచిందంటాడు సత్యజిత్‌ రాయ్‌.



‘‘శరచ్చంద్రుడు ప్రతిష్ఠించిన స్త్రీ గౌరవం’’ రాజు పాత్రలో మూర్తీభవించింది. ఆమె పాత్ర నవల ఇతి వృత్తానికి ఆత్మ అని భావిస్తే కాళా జీవితాన్ని ప్రభావితం చేసిన రెండు శక్తులు రాజు, క్షామం. గుజరాత్‌లో వీధి భాగవతం వంటి జానపద కళా రూపాన్ని ‘భవాయీ’ అంటారు. కాళా జీవితం భవాయీ నృత్యం వంటిదే. ఈ నవలకు కొనసాగింపుగా పన్నాలల్‌ రెండు మూడు భాగాలు రాశారు గానీ మొదటి భాగానికి వచ్చిన పేరు ప్రఖ్యాతలు వాటికి రాలేదు.

    

డాక్టర్‌ కాళిదాసు పురుషోత్తం

    9247564044

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top