బలవంతపు కౌగిలింత!

బలవంతపు కౌగిలింత! - Sakshi


అక్షర తూణీరం

లాలూ కేజ్రీవాల్‌ని ఏకపక్షంగా ఆలింగనం చేసుకుని వార్తల్లో కెక్కాడు. కేజ్రీవాల్ ఈ ఘటనలో నాకే పాపం తెలియదన్నాడు. అయినా అమలిన ఆలింగనానికి ఇంత రాద్ధాంతం అవనరమా?

 

సృష్టిలో ఆలింగ నానికి ఒక అర్థం, పరమార్థం కల్పించి, సార్థకం చెందిన ఆద్యుడు మార్కండేయుడు. శివలింగాన్ని గాఠ్ఠిగా కౌగిలించుకుని, మరి వదల్లేదు. దాంతో మార్కండేయుడు మృత్యుంజయుడైనాడు. తదాది ఆలింగనం ఒక సదాచారంగా, సేవగా, మర్యాదగా ప్రబలింది. శృంగారపు కౌగిలింతలు వేరు. నేను మాట్లాడేది అమలిన ఆలింగనాల గురించి- కొందరు అమృతమూర్తులు ప్రేమగా ఆలింగనం చేసుకుని సాంత్వన పరుస్తారు. కొన్ని మత సంప్రదాయాలలో ఇది పరిపాటి.



మూడుసార్లు మార్చిమార్చి హత్తుకుని తమ ఆత్మీయతను వ్యక్తపరుస్తారు. కొందరు స్వామీజీలు గాఢంగా ఆలింగనం చేసుకుని, భక్తుడి తల గుండెలకు పొదువుకుని, ‘నీ స్థానం ఇదిరా’ అని భరోసా ఇవ్వడం నాకు తెలుసు. అప్పుడు రుద్రాక్షలు బుగ్గలకు గుచ్చుకోవడం; గంధం, చెమట కలసిన వాసన ముక్కుకి తగలడం తప్పదు. ఆలింగనంలో ఒక రకమైన విద్యుత్ పుడుతుందని పరిశోధనల్లో తేలింది. రెండు శరీరాలు ఆపాదమస్తకం హత్తుకున్నప్పుడు ఆ దేహాల్లో, మెదళ్లలో ఉన్న నెగెటివ్ కరెంట్స్ యావత్తూ ఎర్త్ అయిపోతాయట. కావచ్చు. కొన్ని ఉత్తమజాతి వృక్షాలు మాంచి వయసులో ఉన్న కన్నెపిల్లలు కౌగిలించుకుంటే కానీ పూయవట. వృక్షాలు ప్రాణులే కదా! మనకున్న రకరకాల కౌగిళ్లలో ధృతరాష్ట్ర కౌగిలి ఒక ప్రత్యేకం. ఇది కూడా అప్రస్తుతం. ఎన్నికల తరుణంలో అభ్యర్థులు ఎదురైన వారందరినీ విచక్షణారహితంగా పొదువుకుంటారు. ఉత్తర భారతానికి హత్తుకునే అలవాటు ఎక్కువ అంటారు. బహుశా చలిప్రాంతం వల్ల కావచ్చు.



ఆలింగనం అంటే నాకు ఒక ఉదంతం గుర్తుకు రాకుండా ఉండదు. మా ఆఫీసు టైపిస్ట్  విజయ తల మీద ఉన్నట్టుండి బల్లి పడింది. ఆఫీసంతా కలకలం రేగింది. పైగా శిరస్సు ప్రాణగండం అన్నాడు శాస్త్రకారుడు. అసలెట్లా పడింది, కొంచెం పక్కన కూచోవలసింది, నడినెత్తిన పడిందా, చెంపకు జారిందా లాంటి ప్రశ్నలలో ఆ పిల్ల తలప్రాణం తోకకు వచ్చింది. పైగా నిలువెల్లా భయం. ఏం ఫర్వాలేదు, వెళ్లి కంచి బల్లిని తాకివస్తే ఏ దోషమూ లేదని సెక్షనాఫీసరు ధైర్యం చెప్పాడు. విజయకి ఎక్కిళ్లు ఆగడం లేదు. స్ప్రింగ్‌డోర్‌లోంచి బయటకొచ్చిన పెద్దాయన, దీనికంత రాద్ధాంతమా? ఎవరైనా కంచిబల్లి తాకొచ్చిన వారిని తాకితే చాలు అనగానే, అందరూ చిత్తరంజన్ వైపు చూపులు తిప్పారు. ఎందుకంటే ఆ కుర్రవాడు చిన్నతనంలో కంచికి వెళ్లొచ్చిన కథనం పలుమార్లు పలువురికి చెప్పి ఉన్నాడు. విజయ దుఃఖభారంతో ఇంటికెళ్లి, మర్నాడు తల్లిగారిని వెంటబెట్టుకు వచ్చింది. మా విజయ చెయ్యి పట్టుకుని ప్రాణదానం చేయమని కోరగా, పాణిగ్రహణానికి చిత్తరంజన్ నిరాకరించాడు.



విజయ జాలిగా, ‘లైఫ్ అండ్ డెత్ కొశ్చన్’ అన్నట్టుగా చూసింది. ‘దేహాన్ని పూర్తిగా స్పృశిస్తే తప్ప ఫలితం ఉండదని జాగంటి వారు మొన్ననే రేడియోలో ప్రవచించారు. ఒక ఎండు ఖర్జూరం, ఒక వక్క తెప్పించండి! పూర్తి విరుగుడుకి ఉపాయం ఉందన్నా’డు చిత్తరంజన్. క్షణంలో కోరినవి వచ్చాయి. ఒకరి ఎంగిలి ఒకరు చవి చూస్తే తప్ప బల్లిపాటు దిగదుట- అంటూనే విజయ చేత కొరికించి తను నోట్లో వేసుకున్నాడు. తను వక్క కొరికి ఇచ్చాడు. తర్వాత చాలా సిగ్గుపడుతున్న విజయని చిత్తరంజన్ మెడిసినల్‌గా కౌగిలించుకున్నాడు. రెండేళ్లకు వారిద్దరికీ పెళ్లి అయింది. బల్లిపాటు ఒక ఐడియా మాత్రమేనని కొందరికే తెలుసు. లాలూ కేజ్రీవాల్‌ని ఏకపక్షంగా ఆలింగనం చేసుకుని వార్తల్లోకెక్కాడు. కేజ్రీవాల్ ఈ ఘటనలో నాకే పాపం తెలియదన్నాడు. అయినా అమలిన ఆలింగనానికి, చిన్న అల్లాయ్ బల్లాయ్‌కి ఇంత రాద్ధాంతం అవనరమా?    



శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top