ఆ దుష్ప్రచారంతోటే దెబ్బతిన్నాం..!

ఆ దుష్ప్రచారంతోటే దెబ్బతిన్నాం..! - Sakshi


మనసులో మాట


కొమ్మినేని శ్రీనివాసరావుతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

రాత్రి పగలూ తేడా లేకుండా ప్రజల కోసం కష్టపడుతున్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై జరిగినంత దుష్ప్రచారం ఏ నాయకుడిపైనా జరగలేదని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నారు. 2014 ఎన్నికల్లో తగినంత ప్రచారం చేయలేక, ఖర్చుపెట్టలేక తాము ఓడిపోలే దని, జగన్‌ ముందు ఎవరూ కూర్చోకూడదని, పెద్దలంటే గౌరవం లేదని, అందరూ తనను సార్‌ అని పిలవాలని కోరుకుంటాడని టీడీపీ తన అనుకూల మీడియాలో చేసిన దుష్ప్రచారం వల్లే దెబ్బ తిన్నామని చెప్పారు. జగన్‌పై వ్యక్తిగతంగా చేసిన పచ్చి వ్యతిరేక ప్రచారం వల్లే కేవలం అయిదు లక్షల ఓట్ల తేడాతో తాము అధికారాన్నే  కోల్పోయామంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి మద్దతు లేకుండానే మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తామంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభి ప్రాయాలు ఆయన మాటల్లోనే...



చంద్రబాబు మీరు ఒకేచోట చదివారు. ఆయన సీఎం అయ్యారు. మీరిలాగే ఉన్నారే?

ఆయన కంటే అద్వాన్నమైన వ్యక్తులు ముఖ్యమంత్రులు అయ్యారు కదా. వాళ్లనే జనం స్వీకరిస్తున్నప్పుడు చంద్రబాబు సీఎం కావడం పెద్ద విషయమా? పైగా ఎన్టీరామా రావు వంటి వారు నాకు కూడా మామ అయి ఉంటే నేను కూడా ముఖ్యమంత్రిని అయ్యే వాడిని. ఎందుకంటే మామను మోసం చేయడం చాలా ఈజీ కదా.



ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రమ్మని చెప్పింది తానే అని చంద్రబాబు అంటున్నారు కదా?

కూతురుని ఇచ్చిన మామ తండ్రితో సమానం. మరి మామతోనే పోటీ చేస్తానని చంద్ర బాబు చెప్పారు కదా. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి ఎందుకు రమ్మం టారు. ఆయన చెప్పేవన్నీ మీరు నమ్ముతుంటారా? ఆయన సత్యం ఎప్పు డన్నా చెప్పి ఉంటే కదా అసత్యం చెప్పడనడానికి. సింధును కూడా నేనే తయారు చేశానని అంటున్నారు కదా. నిజమేనా?



కిరణ్‌కుమార్‌రెడ్డిని సీఎం చేయడానికి మీరు తీవ్రంగా వ్యతిరేకించారట?

సోనియాగాంధీని స్వయంగా కలసి చెప్పాను. కిరణ్‌ను సీఎంను చేస్తే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. 1994లో కాంగ్రెస్‌కు 26 సీట్లు మాత్రమే వచ్చాయి. కిరణ్‌ను సీఎంచేస్తే ఆరుసీట్లు కూడా మనకు రావు అని చెప్పేశాను. ఈ విషయం మీరు రాహుల్‌తో, అహ్మద్‌ పటేల్‌తో చెబితే మంచిది అని ఆమె సూచించారు. 1998 నుంచి మీతో నాకు సన్నిహిత పరి చయం ఉంది మేడమ్, వారికి చెప్పేటంత చనువు నాకు లేదు అని చెప్పి వచ్చేశాను. చివరికి అలాగే జరిగింది కదా.



వైఎస్‌ జగన్‌ని సీఎం చేయాలని మెజారిటీ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టినా అధిష్టానం వినలేదేం?

పోగాలం దాపురించినప్పుడు ఎవరికైనా మంచి బుద్ధి పుట్టదు కదా. ఇప్పుడు సైతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కాంగ్రెస్‌ పార్టీని నాశనం చేసేంతవరకు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ నిద్ర పోయే పరిస్థితి కనిపించటం లేదు. అప్పట్లో కూడా ‘కిరణ్‌ను సీఎంని చేయవద్దు. అలా చేస్తే పార్టీ ఇంకా మునిగిపోతుంది. జగన్‌ని సీఎంగా చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బతు కుతుంది. లేకపోతే బతకదు’ అని ఆనాడే అధిష్టానానికి చెప్పాను. కానీ వినలేదు. ఆ తర్వాతే నేను పార్టీ మారాను.



జగన్‌పై అన్ని కేసులు పెట్టడానికి ఎవరు ప్రేరణ? ఈ విషయంలో మీ అభిప్రాయం?

కిరణ్‌ కుమార్‌ ముఖ్యమంత్రి అవుతున్నప్పుడే అధిష్టానంతో మాట్లాడి ఉండవచ్చు. జగన్‌ని ఇబ్బంది పెడదాం. అలా అయితే మనవద్దకు మళ్లా పరుగెత్తుకుని వస్తాడు. అలా వచ్చేలా నేను చేస్తాను అని కిరణ్‌ ఢిల్లీలో చెప్పి ఉంటాడు. పైగా.. జగన్‌ మీద పెట్టిన కేసులు ఒక కిరణ్‌ కుమార్‌ లేదా అధిష్టానం మాత్రమే చేసి ఉంటారని కూడా నేననుకోవడం లేదు. చంద్రబాబుతో కిరణ్‌ కుమ్మక్కయ్యాక ఇద్దరూ కలిసే సీబీఐని ముందుకు తీసుకురావడం జరిగిందని అనుకుంటున్నా. జగన్‌ని 16 నెలలు జైల్లో పెట్ట డమే చాలా కుట్రపూరితంగా జరిగింది.



జగన్‌కు అంత పాపులారిటీ ఉండి కూడా ఎలా అధికారం నుంచి దూరమయ్యారు?

మాలాంటివాళ్లం వైఎస్‌ జగన్‌కి మద్దతు ఇస్తున్నామంటే కారణం... అతడు చాలా కష్టపడుతున్నాడు. రాత్రి పగలూ తేడా లేకుండా ప్రజల్లో తిరుగుతున్నాడు. అలాంటి వ్యక్తిపై ఇంత చెడు ప్రచారం చేసింది మొదట్లో కిరణ్‌కుమార్‌రెడ్డి అయితే తర్వాత దాన్ని పెంచి పోషించింది చంద్రబాబు. గత ఎన్నికల సమయంలో ఈ ప్రచారం ఏ స్థాయికి వెళ్లిందంటే జగన్‌ ముందు ఎవరూ కూర్చోకూడదని, పెద్దలంటే గౌరవం లేదని, అందరూ సార్‌ అని పిలవాలని కోరుకుంటాడని అంత తీవ్రంగా ప్రచారం చేసారు.



మరి జగన్‌ని సార్‌ అని పిలవాల్సి ఉంటుందంటే మాలాంటి వాళ్లం ఒక్క క్షణం ఆయన పార్టీలో ఉండేవారమా? జగన్‌పై ప్రచారం ఎంత స్థాయికి వెళ్లిందంటే కేవలం అయిదు లక్షల ఓట్ల తేడాతో మేం అధికారాన్నే కోల్పోయాం. డబ్బులు సరిగా ఖర్చు పెట్టకో, మరొక దానికో మా పార్టీ దెబ్బతినలేదు. కేవలం జగన్‌పై చేసిన వ్యతిరేక ప్రచారం వల్లే ఓడిపోయాం. ఈ దుష్ప్రచార ప్రమాదాన్ని ముందే గమనించి పైనుంచి కింది వరకు పార్టీ దాన్ని ఎదుర్కొని ఉంటే గత ఎన్నికల్లో ఓడిపోయేవాళ్లేమే కాదు.



మరి 21 మందిని మీ పార్టీలోంచి లాగేశారు కదా... దానిపై మీ అభిప్రాయం?

బాబుకు నిజంగా దమ్ముంటే వారిచేత రాజీనామా చేయించి ఉపఎన్నికలు పెట్టి గెలిపిం చండి చూద్దాం. మా నాయకుడే సవాలు చేస్తున్నాడు. సవాలు స్వీకరించండి మరి. సత్తా తేలుతుంది.. ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడానికే భయపడుతున్న బాబు ఇక  ఎన్నికలకు పోవడం కూడానా.



సమైక్యవాదాన్ని బలపర్చిన మీరేమో ఓడిపోయారు. రెండు కళ్ల సిద్ధాం తాన్ని చెప్పిన  బాబు గెలిచాడు. ఎలా?

ఈ రాష్ట్రం విడిపోయినా నాకు ఇబ్బంది లేదు అని చంద్రబాబు లేఖ రాశాడు. ఆ లేఖతోనే  ఈ రాష్ట్రం విడిపోవడానికి ప్రక్రియ మొదలైంది. విడగొట్టింది ఆయనే. విడగొట్టమని చెప్పింది ఆయనే. అలాంటి వ్యక్తి గెలిచాడంటే.. తప్పుడు వాగ్దానాలు చేస్తే నేను కూడా సీఎం అయిపో తాను. తప్పుడు వాగ్దానాలు చేసి మోసం చేసి తండ్రికున్న పేరు చెడ గొట్టవద్దు అని జగన్‌ కట్టుబడ్డారు. రుణమాఫీ విషయంలో ఏదైనా వాగ్దానం చేద్దామని ఎన్నికల ముందు జగన్‌కి పదే పదే చెప్పాను. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్‌ మాపీ అన్నాడు. ఇక్కడేమో బాబు రైతులకు, మహిళలకు అంద రికీ రుణమాఫీలు అంటున్నాడు. కాబట్టి అన్ని రుణాలూ మాఫీలు చేస్తామని చెప్పవద్దు కానీ కనీసం మహిళలకు చెందిన రుణా లైనా మాఫీ చేస్తామని హామీ ఇద్దాం అని నేను చెప్పాను.



జగన్‌ అన్నీ లెక్కలువేసి బేరీజు వేసుకుని మహిళా సంఘాల రుణాల మాఫీ విషయం చేర్చుదాం అంతే కాని మిగతావి అస్సలు  చేయలేము. హామీ ఇస్తే 52 వేల కోట్ల రూపాయలు ఎక్కడినుంచి తెస్తాం? అన్నారు.  అయితే  మనం ఇబ్బంది పడతా మని జగన్‌కి చెప్పాను. అయినా ఫర్వాలేదు అధికారంలోకి  వచ్చిన తర్వాత అసమర్థు డినని అనిపించుకోవడానికి బదులు ప్రతి పక్షంలో ఉండటానికైనా ఒప్పుకుంటాను కానీ ఈ తప్పుడు వాగ్దానాలు చేయలేనని జగన్‌ కరాఖండీగా  చెప్పేశాడు. ఆయన స్థానంలో నేను ఉంటే అలా వాగ్దానాలు చేసేసే వాడిని. ఈరోజు రైతుల  బాధలు మనం చూస్తూనే ఉన్నాం. రెయిన్‌ గన్స్‌తో ఆరున్నర లక్షల ఎకరాల పంటను  కాపాడినామని ఎక్కడైనా ఎవరైనా చెప్పుకుంటారా అండి.



మరి మీరు బీజేపీతో కలుస్తారని, విలీనం ప్రతిపాదన కూడా జరిగిందని ప్రచారం?

వైఎస్‌ జగన్‌ తనపై ఎవరు ఏం రాసినా, మాట్లాడినా ఊరుకుని ఉంటారు కాబట్టి ఆయనపై ఏదో  ఒకటి రాస్తుంటారు. మేము బీజేపీతో కలిసే ఆవకాశమే లేదు. ఎందు కంటే చంద్రబాబు మోదీని గట్టిగా పట్టుకుని ఉంటారు. ఒకవేళ మోదీ ఆయనను తోసే శారనుకోండి... వెంటనే కిందపడిపోయి కాళ్లకు మొక్కుతారు. మరి జగన్‌ ఆ పని చేయ లేరు కదా. కాబట్టి ఆ పరిస్థితి లేదు. ఎవరి మద్దతూ లేకుండానే ఈసారి ఎన్నికల్లో మూడింట రెండొంతుల  మెజారిటీ సాధిస్తాం చూస్తూ ఉండండి.



అమరావతిని చూపి గెలిచేస్తామని చంద్రబాబు అనుకుంటున్నారే..?

ఈమధ్య మిమ్మల్ని అసెంబ్లీలో చూశాను. మీరు అక్కడ భోంచేశారా. కనీసం తినే తిండి  సరిగా లేదక్కడ. ఒక మంచి హోటల్‌ కట్టడానికి, మంచి ఆసుపత్రి కట్టడానికి, విద్యా  సంస్థ రావాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో మరి? అమరావతిని చూపి గెలి చేస్తామనే ధైర్యం చంద్రబాబుకు ఉందా? మూడు సంవత్సరాల కాలం వృధా చేసి తాత్కాలిక శాసనసభ, తాత్కాలిక సచివాలయం కట్టగలిగారు. ఈ మూడేళ్లలో ఆరు లక్షల చదరపు అడుగుల్లో నాలుగురెట్ల ఖర్చుతో వాటిని కట్టారు. ఇక అమరావతిని సింగపూర్‌ చేస్తాను, జపాన్‌ చేస్తాను అని చెబితే నమ్మేవాళ్లు ఉండాలి కదా?!

(పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఇంటర్వూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)

https://goo.gl/QbXqDI

https://goo.gl/MCWyrh

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top