ఏడు పదుల్లో ఏమి సాధించాం?

ఏడు పదుల్లో ఏమి సాధించాం?


త్రికాలమ్‌

ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత దేశం సాధించింది ఏమిటి? స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకోవడం ప్రధానమైన విజయం. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడు కోవడం, గడువు ప్రకారం ఎన్నికలు జరుపుకోవడం, శాంతియుతంగా ప్రభు త్వాలు మారిపోవడం మరో ఘనవిజయం. మూడో విజయం పేర్కొనాలంటే కష్టమే. దారిద్య్రం తగ్గింది. అక్షరాస్యత పెరిగింది. జీవన ప్రమాణాలు గణనీ యంగా పెరిగాయి. వైద్యవసతి పెరిగింది. కానీ ఈ రంగాలలో సాధించవలసిన లక్ష్యాలను సాధించలేకపోయామనే అభిప్రాయం సర్వత్రా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఆక్సిజన్‌ లభించక 63మంది చిన్నారులు ప్రాణాలు వదలిన ఘటన మనం ఆరోగ్యరంగంలో ఏ స్థాయిలో ఉన్నామో సూచిస్తున్నది. మనం చేసుకున్న చట్టాలనే మనం తుంగలో తొక్కడం కూడా ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతమే.



సమాచార హక్కు చట్టం చేసుకున్నాం. కానీ ప్రభుత్వాలు సమాచార కమి షనర్లను నియమించవు. సమాచారం అందించవు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం చేశాం. కానీ ఫిరాయింపులను నిస్సంకోచంగా, నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తాం. నంద్యాల ఎన్నికల ప్రచారం చూస్తే ఎన్నికలు జరుగుతున్న విధానం తెలుస్తుంది. ప్రజాస్వామ్యం అంటే క్రమం తప్పకుండా ఎన్నికలు జరగడం మాత్రమే కాదు. అది జీవనవిధానం కావాలి. 1947 ఆగస్టు 14–15 అర్ధరాత్రి భారత పార్ల మెంటులో నాటి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన చారిత్రక ప్రసంగం ‘ట్రిస్ట్‌ విత్‌ డెస్టినీ’ స్పూర్తి క్రమంగా ఆవిరైపోతున్నదనే ఆవేదన వెన్నాడుతోంది. పాలనాధికారం కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి మారిన నేపథ్యంలో దేశంలో సంభవిస్తున్న పరిణామాలు ఎటు దారితీస్తాయోనన్న గుబులు పట్టి పీడిస్తోంది. కాలక్రమేణా ఈ భయ సందేహాలు నిరాధారమైనవనీ, నిర్హేతు కమైనవనీ తేలవచ్చు. అదే జరిగితే అంతకంటే ఆనందం ఏముంటుంది? అట్లా జరుగుతుందా, లేదా  అన్నదే ఆలోచనాపరులను అనుక్షణం వేధిస్తున్న ప్రశ్న.



స్వప్నం చెదురుతోందా?  

‘ది ఐడియా ఆఫ్‌ ఇండియా’ (భారతస్వప్నం) చెదిరిపోతోందని కొందరి ఫిర్యాదు. మత ప్రాతిపదికన ఏర్పడిన పాకిస్తాన్‌ కంటే సర్వమత సమానం, సహనం ప్రాతిపదికగా ఏర్పడిన ఇండియాకు నైతికంగా ఆధిక్యం ఉన్నదనే విశ్వాసం క్రమంగా సడలుతోంది. చివరికి ఇండియా కూడా పాకిస్తాన్‌ బాటలోనే ప్రయాణం చేస్తున్నదా? ఇదేనా ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం సాధించింది? దేశ విభజన సృష్టించిన అది పెద్ద వివాద హేతువు కశ్మీర్‌ సమస్య ఇన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాకపోగా కొరకరాని కొయ్యగా తయారై రావణకాష్టంగా రగులుతోంది. ట్రిపుల్‌ తలాక్, 370వ అధికరణ రద్దు వంటి ప్రతిపాదనలు ముందుకు రావడంతో మైనారిటీవర్గాలలో అభద్రతా భావం పెరుగుతోంది. లౌకికవాదం అనే పదమే హాస్యాస్పదమైనప్పుడు, నిందా త్మకమైనప్పుడు ఇంతకాలం పాటించిన, విశ్వసించిన విలువలు అగ్నిపరీక్ష ఎదు ర్కోవడం అనివార్యం. రెండు భావజాలాల మధ్య సంఘర్షణను ఇప్పుడు చూస్తున్నాం.



కాంగ్రెస్, బీజేపీ రెండు భావజాలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ పార్టీలు. కాంగ్రెస్‌ పతనం– బీజేపీ ఉత్థానం ఏకకాలంలో సంభవిస్తున్న పరిణామాలు. కాంగ్రెస్‌ బలహీనపడినప్పుడే బీజేపీ బలపడుతుంది. ఇందిర హత్యానంతరం జరిగిన ఎన్నికల తర్వాత మండల్, కమండల్‌ రాజకీయాల కార ణంగా, అడ్వానీ రథయాత్ర ఫలితంగా ఉత్తరాదిలో బీజేపీకి ఆదరణ గణ నీయంగా పెరిగింది. బీజేపీకి లోక్‌సభ ఎన్నికలలో గౌరవప్రదమైన సంఖ్యాబలం లభించాక బీజేపీ నాయకులలో ఉదారవాదిగా పేరు తెచ్చుకున్న వాజపేయి నాయకత్వంలో తొలి ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఈ కూటమి బీజేపీ– సంఘపరివార్‌ భావజాలాన్ని రాజకీయ, సామాజిక రంగాలలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించలేదు. అందరినీ కలుపుకొని పోయే విధంగా పాలన సాగింది. ఒక విధంగా నెహ్రూ బాటలోనే నడించింది.  పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలనే, ఆయన ఆచరించిన విదేశాంగ విధానాలనే కొనసాగించారు. ఇజ్రేల్‌తో దౌత్యసంబంధాలు పెట్టుకున్నది కూడా పీవీ నరసింహారావు హయాం లోనే. కాంగ్రెస్‌ విధానాల నుంచి వాజపేయి ప్రభుత్వం దూరంగా పోయిందని, రాడికల్‌గా వ్యవహరించిందని నిరూపించే ఉదంతం ఒక్కటీ లేదు. అందువల్ల ఆయన హయాంలో భావజాలాల మధ్య ఘర్షణ జరగలేదు. మోదీ ప్రధానిగా ప్రమాణం స్వీకరించిన తర్వాతనే కాంగ్రెస్, బీజేపీ మధ్య సైద్ధాంతిక సమరం ప్రారంభమైంది. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ను ఆవిష్కరించాలనే సంకల్పాన్ని నరేంద్రమోదీ 2014 ఎన్నికల ప్రచారంలో ప్రకటించినప్పుడే భావసంఘర్షణ మొదలయింది.



నెహ్రూ నుంచి వాజపేయి వరకూ

వాజపేయి గద్దె దిగేవరకూ దేశం ఒక మార్గంలో పయనించింది. ప్రభుత్వ పగ్గాలను మోదీ స్వీకరించిన తర్వాత కాంగ్రెస్‌ సంస్కృతికంటే భిన్నమైన సంస్కృతిని ప్రవేశపెట్టే ప్రయత్నం బలంగా జరుగుతోంది. కాంగ్రెస్‌ను ఎన్ని కలలో ఓడించడంతో సరిపెట్టుకోకుండా ఆ పార్టీకి కానీ, దాని దిగ్గజాలకు కానీ ప్రాసంగికత లేకుండా చేయాలన్న ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే పాఠ్యాంశాలలో మార్పులు చేయడం. క్విట్‌ ఇండియా ఉద్యమానికి 75 సంవ త్సరాలు నిండిన సందర్భంగా మోదీ నెహ్రూ పేరు ప్రస్తావించకపోవడం, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రసంగంలో నెహ్రూ ప్రసక్తి ఒకటికి రెండు సార్లు రావడం గమనార్హం. తొలి ప్రధాని నెహ్రూ సోషలిస్టు సమాజం కోసం పరితపించినా, మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించినా, ఇందిరాగాంధీ ఈ విధానాలనే కొనసాగించడంతో పాటు దళితులలో ఆత్మవిశ్వాసం పెంపొం దించేందుకు ప్రత్యేక చట్టాలు చేసినా, నిర్దిష్టమైన విధానాలు రూపొందించినా దేశం మౌలిక స్వభావంపైన వాటి ప్రభావం పడలేదు. ఈ దేశం అన్ని జాతుల, భాషల, మతాల, సంస్కృతుల, ఆచారవ్యవహారాల సమాహారం అనే భావనకు ప్రమాదం ఏర్పడలేదు.



నెహ్రూ నుంచి వాజపేయి దాకా ఈ  విషయంలో అటు ఇటుగా ఒకే అభిప్రాయం కలిగినవారుగా నిర్ధారించవచ్చు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం అధికార పీఠంపైన కూర్చు న్నదనే అభిప్రాయం జనసామాన్యంలో ఏర్పడింది. ఒక దేశం గమనంలో ఏడు దశాబ్దాలు గడచిన తర్వాత ఇటువంటి పెనుమార్పు సంభవించడంలో వింతలేదు. స్వాతంత్య్ర సమరంలో అగ్రగామి పాత్ర పోషించి, స్వతంత్ర భారత నిర్మాణానికి సారథ్యం వహించిన కాంగ్రెస్‌ క్రమంగా బలహీనమై, భ్రష్టుపట్టి పోయింది. ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీ జాతీయ స్థాయిలో ఎదిగింది. ఈ క్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ది గురుతరమైన బాధ్యత. అడ్వానీని పక్కన పెట్టి మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నిర్ణయించింది ఆర్‌ఎస్‌ఎస్‌ అనడంలో సందేహం లేదు. ఇప్పుడు మోదీతో పాటు రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా–అందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖీయులు కావడం యాదృచ్ఛికం కాదు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ప్రస్తుత పాలనావ్యవస్థను నడిపిస్తున్నదనడానికి ఇది నిదర్శనం.



మోదీ ప్రధానిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాతనే ఘర్‌వాప్సీ, అవార్డ్‌ వాప్సీ, గోరక్షక్, ట్రిపుల్‌ తలాక్‌ వంటి పదాలు దక్షిణాదివారికి కూడా అర్థం అవుతున్నాయి. ఏ పౌరుడికైనా దేశభక్తిని చాటుకోవలసిన అవసరం కల గడం కంటే అవమానకరం మరొకటి లేదు. మీడియా సంస్థలు సైతం బీజేపీ– ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నట్టు వ్యవహరించడం విచిత్రం. మొన్న ఉపరాష్ట్రపతి అన్సారీ వీడ్కోలు సమావేశంలో ప్రధాని ప్రసంగించిన విధం కానీ , అన్సారీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యను బీజేపీ నాయకులు అసం దర్భంగా ప్రచారం చేసిన పద్ధతి కానీ, దానికి వెంకయ్యనాయుడు స్పందించిన తీరు కానీ దేశంలో కొన్ని నెలలుగా కొనసాగుతున్న అసహన ధోరణిని చాటు తున్నాయి. కాంగ్రెస్, ఇతర ‘సెక్యులర్‌’ పార్టీలు ఇంతకాలం మైనారిటీలను

ఓటు బ్యాంకులుగా వినియోగించుకున్న తీరును ఖండిస్తూ బీజేపీ పరోక్షంగా అదే పని చేస్తున్నది. మైనారిటీలపైన ఒత్తిడి పెంచడం ద్వారా మెజారిటీ సమాజాన్ని సంఘటితం చేసి పెద్ద ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నంలో బీజేపీ సఫలమైనదని చెప్పవచ్చు. ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్‌లో 403 అసెంబ్లీ స్థానాల లోనూ ఒక్క స్థానంలోనైనా ముస్లిం అభ్యర్థిని నిలబెట్టకుండా ముస్లిమేతర వర్గాలను ఆకట్టుకోవడం వెనుక అమిత్‌షా పకడ్బందీ ప్రణాళిక లేకపోలేదు. మదర్సాలు స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడమే కాకుండా ఆ కార్యక్రమాలను వీడియో తీసి ప్రభుత్వానికి సమర్పించాలన్న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ జారీ చేసిన ఆదేశం బీజేపీ విధానాన్ని స్పష్టం చేస్తున్నది.



బీజేపీ ఉద్దేశం ఏమిటి?  

సమాజాన్ని మతప్రాదిపదికపైన రెండుగా చీల్చడం అధికార బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ ఉద్దేశమా? 2019లో సైతం బీజేపీ అధికారంలోకి సునాయాసంగా వస్తుందని అందరూ భావిస్తున్న దశలో ఇటువంటి ప్రమాదకరమైన రాజకీయం అవస రమా? తెగేవరకూ లాగాలనే అభిప్రాయం మోదీకి లేదనే విషయంగా స్పష్టంగా తెలుస్తోంది. కశ్మీర్‌లో అన్ని రాజకీయ పక్షాలూ 370వ అధికరణ కొనసాగవల సిన అవసరాన్ని నొక్కివక్కాణించిన తర్వాత ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రధానిని ఢిల్లీలో కలుసుకున్నారు. దాన్ని రద్దు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మోదీ స్పష్టం చేశారు. గోరక్షకుల ఆగడాలను ఉపేక్షించేది లేదంటూ ప్రధాని ఒకటికి రెండు సార్లు హెచ్చరించారు. అవార్డ్‌ వాప్సీ సందర్భంలో సైతం మోదీ నిగ్రహం పాటించారు.  



2014 వరకూ దేశంలో వ్యాప్తిలో ఉన్న కాంగ్రెస్‌ సంబంధ భావజాలానికి ప్రత్యామ్నాయమైన బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంపై చర్చ జరగాలన్నది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నది. చర్చలో కొన్ని ఆచరణ సాధ్యం కానివిగా తేల వచ్చు. మరికొన్ని దేశ సమైక్యతకు ముప్పు తెచ్చేవిగా కనిపించవచ్చు. ఈ పరీ క్షలో నిలబడని విధానాలను పక్కన పెట్టి, నిలబడే విధానాలను ఆచరించాలన్న సంకల్పం ఉండవచ్చు. నేటి భారతంలో మైనారిటీల స్థానం ఏమిటో చూపించా లన్న ప్రయత్నం కావచ్చు. భిన్నమతాలూ, జాతులూ, భాషావర్గాలూ, కులాలూ సహజీవనం చేయవలసిన దేశంలో ఏ మతమూ మరో మతపైన, ఏ ప్రాంతం మరో ప్రాంతంపైన, ఏ భాషావర్గం మరో భాషావర్గం పైన, ఏ కులం మరో కులంపైన ఆధిక్యం ప్రదర్శించడం సాధ్యం కాదు. అటువంటి ప్రయత్నం జరి గితే అది దేశ సమైక్యతకే ప్రమాదంగా పరిణమిస్తుంది. సమాజంలో అశాంతికి దారితీస్తుంది. ఆ స్థాయి వరకూ వ్యవహారాన్ని తీసుకొని వెళ్ళకపోవచ్చు.



శతా బ్దాలుగా పరమత సహనానికీ, శాంతియుత సహజీవనానికీ అలవాటు పడిన ప్రజలు ఈ విలువలకు పూర్తిగా తిలోదకాలు ఇవ్వడాన్ని ఆమోదించరు. కొన్ని సర్దుబాట్లకూ, సవరణలకూ అంగీకరించవచ్చు. అధికార కూటమి ప్రయత్నం ఆ దిశగానే జరుగుతున్నదని భావించాలి. ఇందుకు భిన్నంగా జరిగితే ప్రతిఘటన తథ్యం. 1975లో ఇందిరాగాంధీ ఆత్యయిక పరిస్థితి ప్రకటించినప్పుడు జాతి ఒక్క తాటిపైన నిలిచి ప్రజాస్వామ్య వ్యవస్థను ఏ విధంగా  రక్షించుకున్నదో అదే విధంగా  లౌకిక భావజాలానికి భంగం వాటిల్లినా ప్రజలు తిరగబడి తీరుతారు. అటువంటి పరిస్థితే ఏర్పడితే దేశం అనూహ్యమైన మూల్యం చెల్లించలవసి వస్తుంది. ఈ సంగతి మోదీ ప్రభృతులకు లె లుసు. అందుకే ప్రత్యామ్నాయ భావ జాలంపైన చర్చను అవధులు మీరనీయరు. చర్చ జరుగుతుంది. కానీ తెగదు. ముడిపడదు.



కె. రామచంద్రమూర్తి

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top