ఆ ఇద్దరు సబలలకు సలాం

ఆ ఇద్దరు సబలలకు సలాం


విశ్లేషణ

ఇతడిని జైలుకు పంపిన న్యాయాధికారి జగ్దీప్‌సింగ్‌ ఒక బ్రహ్మోస్‌ అయితే ఓట్ల కోసం నేరాన్ని సహించొద్దని చెప్పి, మీరు పార్టీకి చెందిన పాలకులా దేశ పాలకులా అని నిలదీసిన హైకోర్టు న్యాయమూర్తులు ఫిరంగులు.




కళ్లలో నీళ్లు తిరుగుతూ ఉంటే సుదీర్ఘ పోరాటాన్ని తలచుకుంటూ రాంరహీం బాబా అత్యాచార బాధితులు అన్నమాట ఇది: ‘‘డబ్బున్న అత్యంత శక్తిమంతులపైన యుద్ధం ఎంతో కష్టం, న్యాయం దాదాపు అసాధ్యం, అయినా ‘‘ఉమీద్‌ కీ కిరణ్‌ హై’’ (ఆశాకిరణం ఉంది). నేరగాడికి శిక్ష తప్పదని నమ్మాం’’.



దారుణమైనదంటూ పాత ప్రభుత్వాన్ని ఓడిస్తే, కొత్త ముఖ్యమంత్రి సహా మంత్రిమండలి రేప్‌ కేసులలో ప్రథమ నిందితుడికి మోకరిల్లింది. సార్వభౌమత్వాన్ని అతని పాదాక్రాంతం చేసిన దశలో, అధికార, ప్రతిపక్ష తేడా లేకుండా  ఈ ముఠా నాయకుడికి దాసోహం అంటున్న దుర్దశలో ఏటికి ఎదురీదుతూ, పోలీసులకు, న్యాయస్థానానికి నిజాన్ని నివేదిస్తూ, సాక్ష్యాలు చూపుతూ, చాలా సులువుగా వచ్చి పడుతున్న అపారమైన మురికి డబ్బు లక్షలకు లక్షలు తీసుకుని నేరగాడిని రక్షించడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్న న్యాయవాదుల అవమానకరమైన క్రాస్‌ ఎగ్జామినేషన్‌తో పాటు అనేక దుర్మార్గాలను సహిస్తూ బోనులో కూలిపోకుండా నిలబడి న్యాయ పోరాటం చేసిన ఆ ఇద్దరు సాధ్వీల సాహసాన్ని ఏ విధంగా ప్రశంసించాలి?  సరిహద్దులో నిలబడి, భయానకమైన చలిలో చలించకుండా, ఆకాశం నుంచి పిడుగులు కురిపిస్తున్నా, ఎదురుగా శత్రువు ఫిరంగులు పేలుతున్నా పోరాడుతున్న సైనికుని ధైర్యం కన్న గొప్ప ధైర్యం వారిది.



అధికార పార్టీ ఏజెంట్‌ అన్న నిందను భరించే సీబీఐ  ఈ కేసు పరిశోధనలో చూపిన నిజాయితీ వల్లనే న్యాయం బతికింది. పేరు దాచి రాసిన ఫిర్యాదును ఎవరూ పట్టించుకోరు. కాని సాధ్వి నాటి ప్రధానికి, పంజాబ్‌ హరియాణా చీఫ్‌జస్టిస్‌కు రాసిన ఉత్తరం పనిచేసింది. సిర్సా జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి నుంచి నివేదిక తెప్పించుకుని హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడం కీలకమైన మలుపు. 150 మంది బాధితులున్నారని తేల్చి, వారిలో 130 మందిని కనిపెట్టినా ఇద్దరు సాధ్వీలు మాత్రమే నిజం చెప్పే సాహసం చేశారు.  2008లో సీబీఐ కోర్టు రేప్‌ ఆరోపణలు నిర్ధారించింది. ఉత్తరం అజ్ఞాతంగా రాయడమే సాహసం. కాని బహిరంగంగా సాక్ష్యం చెప్పడం మరింత సాహసం. తరువాత వారి జీవితం దుర్భరమైంది. బతకడమే సాహసమైంది. డేరా బాబా అనుమతి లేకుండా ఏదీ జరగని రాష్ట్రం, ఏదీ చేయని రాజ్యం.  మరోవైపు నేర డేరాను ఒక్క మాటన్నా చంపి పారేసే లక్షల నేరభక్తులు. ఒక నేరగాణ్ణి దేవుడనీ, వాడు చెప్పేది దైవ సందేశమనీ నమ్మే పిచ్చి జనం.  కూతుళ్లు చెప్పే నిజాలు నమ్మక డేరాబాబాను మాత్రమే నమ్మి, బాబా దుర్మార్గాలను వివరిస్తే తప్పు చేస్తున్నావని మందలించే తల్లిదండ్రులు. పారిపోవాలనుకున్నా వెళ్లనీయని టెర్రర్‌.



డేరా నడిపే పాఠశాలలో ఆమె ఉపాధ్యాయురాలు. 1999లో అమాయక బాలికలపై బాబా అత్యాచారాలు ఆమెకు అర్థమయ్యాయి. బాబాకు ఒక గుఫా (గుహ) ఉంటుంది. గుఫా ప్రవేశ ద్వారానికి కాపలాగా ఈ ఆడవారిని నియమిస్తారు. ఈ టీచర్‌ బాధితురాలు కూడా ఒక కాపలాదారు. లోపలికి వెళ్లి కొంతసేపటికి ఏడుస్తూ వచ్చిన అమ్మాయిలను ఈ టీచర్‌ గమనించారు. ఆమెపై కూడా అత్యాచారాలు జరిపారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను సొంత గ్రామానికి పంపించారు. చివరకు మొత్తం కుటుంబం 2001లో వెళ్లి పోయింది. అప్పటి నుంచి బెదిరింపుల మధ్య భయం భయంగా బతుకుతున్నారు. 2002లో డేరా గూండాలు ఆమె తమ్ముడిని కాల్చి చంపారు. దుర్మార్గాన్ని వెల్లడించిన జర్నలిస్టు రాంచందర్‌ ఛత్రపతిని డేరా మనుషులే చంపేశారు. ఇది నేరగాళ్లు–రాజ్యం కలిసి పన్నిన పద్మవ్యూ హం, అభిమన్యుడివలె అందులోనే చావకుండా పోరాడి బతికి బయటపడి, ఎలుగెత్తి అన్యాయాన్ని చాటిన ఆ ఇద్దరిలో ఒకరు ధైర్యలక్ష్మి, మరొకరు సాహసలక్ష్మి (అసలు పేర్లతో పనిలేదు).



ఈ కీచకబాబా వందలాది మహిళలపై అత్యాచారం చేశాడు. కుటుంబంలో కుల సమాజంలో పరువుపోతుందని భయపడి నోరువిప్పని వారే అందరూ. ‘‘2002 నుంచి రాజకీయ ప్రభుత్వాలన్నీ నేరవిచారణను, ప్రాసిక్యూషన్‌ను నీరు గార్చడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కనుక ఈ డేరాబాబా దేన్నయినా మాయచేయగలడనుకున్నాం, అయినా న్యాయం గెలిచింది’’ అని సాధ్వి అన్నారు. 28 మంది సాక్షులు, 14 పత్రాల వల్ల నేరం రుజువైంది. అవతార్‌ సింగ్, ఇందర్‌ సింగ్, కిషన్‌ లాల్‌ అనే బాబా ఆంతరంగికులైన సహ నిందితులు లై డిటెక్టర్‌ పరీక్షలో అసంబద్ధంగా మాట్లాడడం, పాలిగ్రాఫీ పరీక్షలో బాబా ప్రేలాపన నేరగాడిని పట్టించింది. ఇతడిని జైలుకు పంపిన న్యాయాధికారి జగ్దీప్‌సింగ్‌ ఒక బ్రహ్మోస్‌ అయితే ఓట్లకోసం నేరాన్ని సహించొద్దని చెప్పి, మీరు పార్టీకి చెందిన పాలకులా దేశపాలకులా అని నిలదీసిన హైకోర్టు న్యాయమూర్తులు ఫిరంగులు.



వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌

professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్‌

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top