సభాపతి స్థానం సమస్యాత్మకం

సభాపతి స్థానం సమస్యాత్మకం


పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీల మనుగడ మీద ఆధారపడి ఉంటుంది. ఆ పక్షాలు రెండు కావచ్చు అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. రెండు పక్షా లైతే నయం. అసలు రాజకీయ పక్షాలు లేని పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఎవరూ ఊహించలేరు. చాలా ప్రజాస్వామిక దేశాలు దిగువ సభల సభ్యత్వం కోసం పోటీ చేయడానికి ఇండిపెండెంట్లను అనుమతించవు. అలాగే పోలైన మొత్తం ఓట్లలో కొంత శాతం, అది ఐదు శాతం అనుకుందాం, కనీసంగా కొన్ని స్థానాలు గెలుచు కుంటే తప్ప సభలో ప్రవేశించడానికి ఆ దేశాలు అనుమతించవు కూడా. పైన ఉదహ రించినట్టు కనీసంగా సభలో కొంత మేర ప్రాతినిధ్యం సాధించే స్థాయికి వచ్చేవరకు రాజకీయ పక్షాలకు అక్కడ ప్రవేశం లభించదు.



ఇది చాలా ఆరోగ్యవంతమైన నిబంధన. ఒకరిద్దరు సభ్యులతో సభలోకి ప్రవేశిస్తూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రాజకీయ పార్టీలను నిరోధించడానికి దీనిని మనదేశంలో ప్రవేశపెట్టవలసిన ఆవశ్యకత కూడా కనిపిస్తుంది. రేపు మూడు వందల మంది ఇండిపెండెంట్లు, పుట్ట గొడుగుల్లాంటి పార్టీలకు చెందినవారు ఒకటి నుంచి పదిమంది వరకు సభ్యులు లోక్‌సభకు ఎన్నికైతే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి! దాని గురించి నేను ప్రత్యేకంగా వివరించనక్కరలేదు.


ఎక్కడైనా ప్రజాస్వామ్యమే గీటురాయి

ఒక పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థకు రాజకీయ పార్టీల మనుగడ అత్య వసరం కాబట్టి, ఆ రాజకీయ పార్టీల అంతర్గత నిర్మాణ వ్యవస్థలు సయితం ప్రజాస్వా మికంగా ఉండడం కూడా అంతే అవసరం. తన అంతర్గత వ్యవహారాలలో ప్రజా స్వామ్యాన్ని అనుమతించని ఏ రాజకీయ పక్షమైనా, అది అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలనా వ్యవహారాలలో ప్రజాస్వామిక విలువలను పాటిస్తుందని ఆశించలేం. అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్ష అభ్యర్థి ఎంపిక తీరుతెన్నులు పరి శీలిస్తే పాఠం నేర్పే ఒక విషయం అవగతమవుతుంది.



అధ్యక్ష అభ్యర్థి మొదట అన్ని రాష్ట్రాలలోను ప్రాథమిక పోరులో విజయం సాధించాలి. ఆ అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ విశ్వాసం పొందాలి. అప్పుడు అసలు పోరాటంలో దిగవలసి ఉంటుంది. అయితే మన దేశంలో ఏ జరుగుతోంది? దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కొందరు పుట్టుకతోనే ఘనులు, కొందరు గొప్పతనాన్ని సాధించుకుంటారు, ఇంకొందరు గొప్పతనాన్ని ఆపాదించుకుంటారన్న మాటను ఇక్కడ చెప్పుకోవచ్చు. కొన్ని దేశాలలో ఎన్నికల నిబంధనలు చాలా నిశ్శబ్దంగా పని చేస్తాయి. జర్మనీ రాజ్యాంగం ఇందుకు ఉదాహరణ. అక్కడి నిబంధనలు పార్టీ పదవు లకు అభ్యర్థుల ఎంపిక, ప్రభుత్వ పదవులకు పోటీపడే అభ్యర్థుల ఎంపికలను అన్ని స్థాయిలలోను అవి ప్రభావితం చేస్తాయి.


మన లోక్‌సభలో కావచ్చు, రాష్ట్రాల శాసనసభలలో కావచ్చు– చట్టసభ ఏదైనా అక్కడ రెండు లేదా అంతకు మించి రాజకీయ పక్షాలు ప్రాతినిధ్యం వహిస్తుంటాయి. ప్రభుత్వానికి సంబంధించిన చట్ట నిర్మాణ వ్యవహారాలన్నీ చట్టసభలలోనే జరగాలి కాబట్టి అధి కార, ప్రతిపక్షాల మధ్య విభేదాలు తలెత్తుతాయి. అవి కొన్ని సమ యాలలో తీవ్ర స్థాయిలో కూడా ఉంటాయి.  కాబట్టి సభా నిర్వహణ సజావుగా, మృదువుగా సాగించేందుకు; పార్టీలతో నిమిత్తం లేకుండా సభ్యులందరికీ సమంగా, నిష్పక్షపాతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి సమయం కేటాయించే ఒక వ్యవస్థ అనివార్యమైంది. ఆ క్రమం లోనే స్పీకర్‌ పదవి ఆవిర్భవించింది. స్పీకర్‌ వ్యవస్థ యూకేలో ఏర్పడింది కాబట్టి, దాని ఆవిర్భావ చరిత్ర గురించి ఇక్కడ నేను చెప్పబోవడం లేదు. అయితే యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ స్పీకర్‌ పదవి అత్యున్నత విలువ కలిగినది.



అలాగే సమున్నత గౌరవ ప్రతిష్టలు కలిగి ఉందన్న మాట చెబితే చాలు. 1980 వరకు మన దేశంలో స్పీకర్‌ పదవికి కూడా అన్ని పార్టీల సభ్యుల నుంచి గౌరవ మర్యాదలు లభించేవి. స్పీకర్‌ పదవికి ఎంపికైతే, ఆ వ్యక్తి పక్షపాత రహితంగా, న్యాయంగా సభ కార్యకలాపాలను నిర్వహించాలి. అనుభవ జ్ఞానాలు, మచ్చలేని వ్యక్తిత్వం కలిగిన వ్యక్తినే స్పీకర్‌ పదవికి అభ్యర్థిగా ఎంపిక చేస్తారని ఆశిస్తాం. నిజానికి ఇంగ్లండ్‌లో ఒక సంప్రదాయం వాడుకలోకి వచ్చింది. అక్కడ స్పీకర్‌ పదవికి ఎంపికవుతున్న సభ్యుడు, తను ఏ పార్టీ టికెట్‌ మీద గెలిచి సభకు వచ్చాడో, ఆ పార్టీకి రాజీనామా ఇస్తాడు.



అయితే, స్పీకర్‌ పదవీ కాలం ముగిసిన తరువాత, ఆ వ్యక్తి మళ్లీ కోరుకుంటే అదే రాజకీయ పార్టీలో చేరవచ్చు. మన దేశంలో ఇలాంటి సంప్రదాయమంటూ ఏదీ అమలులోకి రాకపోయినా, కొన్నేళ్ల క్రితం ఒక ఉదాహరణ కనిపించింది. ఆ సభ్యుడు స్పీకర్‌ పదవికి ఎంపికైన తరువాత తను ఏ పార్టీ టికెట్‌ నుంచి సభకు ఎంపిక య్యారో, ఆ పార్టీకి రాజీనామా చేశారు. నేను సోమ్‌నాథ్‌ చటర్జీ గురించే ప్రస్తావిస్తు న్నాను. స్పీకర్‌గా ఎన్నికైన వారు తన పార్టీకి రాజీనామా చేయడం అనివార్యమని నేను అనుకోవడం లేదు. ఆయన నిష్పక్షపాతంగా, రాజకీయ పార్టీల ఒత్తిడికి లొంగ కుండా స్వతంత్రంగా, న్యాయ నిర్ణేతగా వ్యవహరించ గలిగితే అదే చాలు.


స్పీకర్‌ విధులు సభ నిర్వహణకు పరిమితమై ఉన్నంత కాలం స్పీకర్‌ కేంద్ర బిందువుగా వివాదాలు తలెత్తిన సందర్భాలు ఎక్కువగా కనిపించవు. అయితే 52వ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో పదో షెడ్యూలును పొందుపరిచినప్పటి నుంచి రగడ మొదలయింది. సభ్యులపై అనర్హత వేటుకు సంబంధించిన ఈ సవరణ చట్టాన్ని అదే సమయంలో 102వ (పార్లమెంట్‌), 191వ (రాష్ట్రాల శాసనసభలు) ఆర్టికల్స్‌కు కూడా వర్తింపచేశారు. పదో షెడ్యూలు కొన్ని ఉత్కృష్టమైన మార్గదర్శ కాలను ప్రవేశపెట్టింది, అదే సమయంలో అత్యంత వివాదాస్పదమైన ఇంకొన్ని నిబంధనలను కూడా పొందుపరిచింది.


పదో షెడ్యూలుకు దారితీసిన పరిస్థితులు

ఈ విషయానికి ఇక్కడ ఒకింత విరామం ఇచ్చి, 1985లో పదో షెడ్యూలును ప్రవేశపెట్టడానికి ఉన్న ముఖ్య కారణాలను చెబుతాను. 1967లో సాధారణ ఎన్ని కలు, తరువాత జరిగిన సాధారణ ఎన్నికలు కూడా ఆయారామ్, గయారామ్‌ సంస్కృతిని ముందుకు తెచ్చాయి. ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి సభ్యులు తరచు సాగించిన ఫిరాయింపుల వల్ల పరిపాలనలో దారుణమైన అసమతౌల్యం వచ్చింది. దానితో రాజకీయ బేరసారాలు, అవినీతి, ధనబలం ప్రాబల్యం ఒకటేమిటి ఇలాం టివన్నీ మన రాజకీయ జీవితంలో చొరబడ్డాయి. ఈ దుష్పరిణామాన్ని చూసి, వెంటనే స్వస్తి పలికే విధానం తీసుకురావాలని పార్లమెంట్‌ యోచించింది. ‘ఎవరైనా సభ్యుడు తను ఏ పార్టీ టికెట్‌ మీద గెలిచాడో, ఆ పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా ఇచ్చినా, తన పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఓటు వేయకున్నా, ఓటింగ్‌కు గైర్హాజరైనా; అలాంటి సభ్యుడు అనర్హుడవుతాడు’ అని పదో షెడ్యూలులో రెండో పేరా పేర్కొంటున్నది. మూడో పేరా పార్టీలో చీలిక గురించి ప్రస్తావించింది.



అయితే దీనిని 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 మేరకు ఉపసంహరించారు. నాలుగో పేరా అనర్హత వేటు పడకుండా పార్టీ విలీనం గురించి పేర్కొంటున్నది. ఇంతవరకు బాగానే ఉంది. తరువాత ఆరు, ఏడు పేరాలను కూడా ప్రవేశపెట్టారు. ఆరో పేరా ఉదహరించిన అంశం, ఇప్పటికీ అమలులో ఉన్న అంశం – అది, పదో షెడ్యూలు మేరకు ఒక సభ్యుని అనర్హత అంశం వచ్చినప్పుడు దానిని చైర్మన్‌ లేదా స్పీకర్‌ పరిధి లోనికి వస్తే ఆయనదే తుది నిర్ణయమని పేర్కొంటున్నది.


ఏడో పేరా అయితే, ఈ షెడ్యూలు ప్రకారం అనర్హతకు సంబంధించిన ఏ ఒక్క అంశం ఏ కోర్టు పరిధిలోకి రాదు అని పేర్కొంటున్నది. అయితే కిహోతో హŸల్లోహాన్‌ (1992 సప్‌ (2)ఎస్‌సీసీ 651)కేసులో కలగచేసుకుంటూ పదో షెడ్యూలు రాజ్యాంగ ప్రతిపత్తిని గౌరవిస్తూనే, ఏడో క్లాజును కొట్టివేసింది. ఆ క్లాజులో సుప్రీంకోర్టు, హైకో ర్టుల అధికార పరిధిని అతిక్రమించే ఉద్దేశం ఉన్నదని, ఆర్టికల్‌ 368లోని క్లాజు 2 నిర్దేశించినట్టు ఏడో క్లాజుకు అవసరమైనమేర శాసనసభల సమర్ధన లేదని, ఈ కారణంగానే కొట్టివేయడం జరిగిందని సుప్రీంకోర్టు పేర్కొన్నది.


సమస్యగా మారిన సవరణలు

గడచిన కొద్దికాలంగా జరిగిన సంఘటనలను బట్టి ఆరో పేరా ప్రకారం స్పీకర్‌కు అప్పగించిన అసాధారణ అధికారాలు అత్యంత వివాదాస్పదంగా మారినట్టు అర్థమ వుతుంది. అసంఖ్యాకంగా కోర్టులు కలుగజేసుకోవలసిన పరిస్థితులు కూడా తలె త్తాయి. దురదృష్టవశాత్తూ, దేశంలోని శాసనసభల స్పీకర్లు కొంతమంది తమ బాధ్య తల అవసరాలకు తగినట్లు వ్యవహరించడం లేదు; అధికారంలో ఉన్న రాజకీయ పార్టీని లేదా సభలో ఘర్షిస్తున్న బృందాలను బలపర్చడం లేదా వ్యతిరేకించే చర్యల్లో పాల్గొంటూ వీరు రాజకీయ పార్టీలు తొక్కే అడ్డదారులకు తమవంతు తోడ్పాడు అందిస్తున్నారు. వీరు న్యాయవిరుద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నారు లేదా తమ అధి కారాన్ని వినియోగించడాన్ని అలవోకగా తోసిపుచ్చుతున్నారు.



శాసనసభ సభ్యుల అనర్హతకు సంబంధించి తమముందుకు వస్తున్న ఆరోపణలపై ఎలాంటి నిర్ణ యమూ తీసుకోకుండా కొంతమంది స్పీకర్లు సంవత్సరాలపాటు తొక్కిపెడుతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. తమ అధికార పరిధిని ఉపయోగించుకోవడంలో వైఫల్యానికి ఇదొక స్పష్టమైన ఉదాహరణ. న్యాయవ్యవస్థ జోక్యానికి ఇదే భూమికను అందిస్తోంది. న్యాయస్థానం వ్యాఖ్యానాలు లేక ఆదేశాలు ఉన్నప్పటికీ, స్పీకర్‌ తన దైన నిర్ణయం తీసుకోవడానికి నిరాకరించి, శాసనసభ పూర్తికాలం పనిచేయడాన్ని అనుమతిస్తే మీరేం చేస్తారు? దీనికి ఎలాంటి చికిత్సా లేదు. తరచుగానే చెబుతు న్నట్లుగా, తమ ఆమోదానికి పంపిన బిల్లును రాష్ట్రపతి లేదా గవర్నర్‌ సంవత్సరాల తరబడి తమవద్దే ఉంచుకున్నట్లయితే... ఇలాంటి పలు సందర్భాల్లో ఏం చేయాలో రాజ్యాంగం సూచించలేదు. రాజ్యాంగ వ్యవస్థ స్ఫూర్తి, సంప్రదాయాల మేరకు అత్యున్నత స్థానాల్లోని వ్యక్తులు వ్యవహరించాలని వ్యవస్థ తలుస్తోంది.


పైన ప్రస్తావించినట్లుగా, కిహోతో కేసులో స్పీకర్‌ తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టు/హైకోర్టు జోక్యం చేసుకున్న కారణాల వద్దకు ఇప్పుడు మళ్లీ వెళదాం. ‘అంతి మత్వం’ లేదా అంతిమ నిర్ణయం అనేది శాసనం ద్వారా కాకుండా రాజ్యాంగ నియమం ద్వారా అనుసరిస్తున్నప్పుడు శాసన సంబంధ ట్రిబ్యునళ్ల ఉదంతంలో వర్తింపు అయ్యే ప్రమాణాలు స్పీకర్‌ వంటి రాజ్యాంగబద్ధ అధికారికి కూడా వర్తించ గలవా? ఈ అంతిమత్వాన్ని రాజ్యాంగమే తనకుతానుగా రూపొందించింది. అలాం టప్పుడు న్యాయం, ధర్మవర్తన దృష్టితో సరైన వర్తనను స్థిరంగా అమలు చేయడం ఎలా? సమస్య ఏమిటంటే, ఇవి సంస్థాగత వైఫల్యానికి లేదా మరింతగా నొక్కి చెప్పాలంటే రాజ్యాంగం రూపొందించిన సాధనాల వైపల్యానికి సంబంధించినవి గానే చూడాలి. వీటిలో కొన్నింటికి రాజ్యాంగంలోనే పరిష్కారాలు లేవు.


అత్యంత పాక్షిక పద్ధతిలో అనర్హతలను విధించడానికి సంబంధించిన సమ స్యలు కూడా ఉంటున్నాయి. దీని ఫలితంగా కోర్టులు జోక్యం చేసుకుని, స్పీకర్‌ అధి కారాన్ని క్రమబద్ధీకరించడానికి పలు నిబంధనలను విధించాల్సి వస్తోంది. ముందు గానే ప్రస్తావించినట్లు, సహజ న్యాయాన్ని పరిశీలించకుండానే స్పీకర్‌ ఏదైనా అనర్హత అంశంపై నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ నిర్ణయం చెడుఫలితాన్నిస్తుంది, దాన్ని న్యాయస్థానాలు తోసివేయడానికి కూడా దారితీస్తుంది. అదేవిధంగా, అతడి నిర్ణయం ‘ఎలాంటి ఆధారం లేద’నే ప్రాతిపదికన దురుద్దేశంతో కూడి ఉన్నట్లయితే అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకుని దాన్ని తోసిపుచ్చే వీలుంది. ఇక్కడొక ఆసక్తికరమైన అంశం ఉంది. పదో షెడ్యూల్‌ కింద స్పీకర్‌ వ్యవహరించాల్సిన విధంగా కోర్టు నిజానికి ఒక పద్ధతిని కూడా విధించింది.



రాజేంద్ర సింగ్‌ రాణా వర్సెస్‌ స్వామి ప్రసాద్‌ మౌర్య (2007 (4) సెక్షన్‌ 270) కేసులో జరిగిందేమిటంటే, ఎక్స్‌ పార్టీకి చెందిన 13 మంది సభ్యులు ప్రతిపక్ష పార్టీ వై కి చెందిన నేతను ముఖ్య మంత్రిగా నియమించాలని కోరుతూ ప్రభుత్వాన్ని సంప్రదించారు. ఈ చర్యను ఫిరాయింపుగా ఆరోపించడంతో ఈ వ్యవహారం స్పీకర్‌ వద్దకు వెళ్లింది. కానీ స్పీకర్‌ ఎలాంటి చర్యా తీసుకోలేదు. ఈలోగా, 37మంది సభ్యులు (ఈ 13 మంది సభ్యుల తోపాటు) ఎక్స్‌ పార్టీ నుంచి వేరుపడినట్లు ప్రకటిస్తూ, ఎక్స్‌ పార్టీ మొత్తం సభ్యులలో తాము మూడింట ఒకవంతుగా ఉన్నందున ఫిరాయింపు చట్టంలోని 3వ పేరా ప్రకారం (అప్పట్లో ఇది అమలులో ఉండేది) తమకు అనర్హత వర్తించదని వారు పేర్కొన్నారు. స్పీకర్‌ వీరి అభ్యర్థనను తీసుకుని దాన్ని ఎత్తి పట్టారు.



ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు పార్టీలో చీలికకు సంబంధించిన వ్యవహారాన్ని ఆమో దిస్తూ స్పీకర్‌ చర్య తీసుకుంటూనే, మరోవైపున పెండింగులో ఉన్న 13మంది ఎమ్మె ల్యేల అనర్హతను కోరుతూ వచ్చిన పిటిషన్‌ను అట్టిపెట్టుకోవడంలో తను నిర్వ హించిన పాత్ర సమర్థనీయం కాదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. పార్టీలో చీలిక ఏర్పడినట్లుగా 37 మంది ఎమ్మెల్యేలు చేసిన ప్రకటనకు సమాధానం ఇవ్వ డంలో స్వీకర్‌ పూర్తిగా తప్పుదోవ పట్టినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతకు ముందు తనముందుకొచ్చిన,  13 మంది సభ్యుల అనర్హత అంశాన్ని కూడా స్పీకర్‌ వదిలేశారు. పైగా ఇది తన వద్ద పెండింగులో ఉంది కూడా. ఇది స్పీకర్‌ తన అధికార పరిధిని ఉపయోగించడంలో వైఫల్యంగానే భావించిన కోర్టు జోక్యం చేసుకుంది.



6వ పేరాలో పేర్కొన్న స్పీకర్‌ అధికారాలను క్రమబద్ధీకరించే విషయంలో కోర్టులు ఇతర సూత్రాలను కూడా నిర్దేశించాయి. అనర్హతపై శాసనసభ సభ్యుడు ఆరోపణ చేసినప్పుడు మాత్రమే ఈ అధికారాన్ని స్పీకర్‌ ఉపయోగించుకోవాలని, ఒక సభ్యుడి అనర్హత అంశాన్ని స్పీకర్‌ ఎన్నటికీ సుమోటోగా స్వీకరించరాదని కూడా పేర్కొన్నాయి. ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో స్పీకర్‌ అధికారానికి కీలకమైన పరిమితిని న్యాయస్థానం విధించింది. ఆ రాష్ట్ర శాసనసభలోని కొంతమంది సభ్యులు స్పీకర్‌ను తొలగించాలన్న అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు దాన్ని స్పీకర్‌ నిర్లక్ష్యం చేయలేరు, అదేవిధంగా స్పీకర్‌ను తొల గించాలని పేర్కొన్న సభ్యులను కాని మరే ఇతర సభ్యుడిని కానీ అనర్హులుగా ప్రకటించే చర్యలకు స్పీకర్‌ పూనుకోలేరని కోర్టు స్పష్టీకరించింది. అసెంబ్లీలోని మెజారిటీ సభ్యులు ఇప్పటికీ తనపై విశ్వాసం చూపుతున్నారని స్పీకర్‌ తప్పక నిరూ పించుకోవాలని, ఆ తర్వాతే ఫిరాయింపు/అనర్హత సమస్యపై నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించాలని కోర్టు సూచించింది.



స్పీకర్లు సరైన నిర్ణయం తీసుకోవ డానికి హామీ పడే ఉద్దేశంతోటే కోర్టులు ఈ నిబంధనలను విధించాయి. ఇలాంటి ఘటనల ప్రాతిపదికనే, సమాజంలో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న పలువురు వ్యక్తులు ఈ అధికారాన్ని స్పీకర్‌కు లేకుండా చేసి, ఎన్నికల కమిషన్‌ వంటి స్వతంత్ర సంస్థకు కట్టబెట్టాలని సూచిస్తున్నారు. ఎలక్షన్‌ కమిషన్‌ చరిత్ర ఇంతవరకు పూర్తి స్వతంత్రతతోనూ, న్యాయబద్ధంగాను కొనసాగడం మన దేశం చేసుకున్న అదృష్ట మనే చెప్పాలి. 2000 సంవత్సరంలో రాజ్యాంగ పనివిధాన సమీక్ష కోసం నియ మించిన జాతీయ కమిషన్‌ ఈ సిఫార్సును చేసింది.



జగ్జిత్‌ సింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ హరియాణ (2006 (11) సెక్షన్‌ 1) కేసులో సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై తన అభిప్రాయం ప్రకటించింది. పార్లమెంటరీ సంప్రదాయాల్లో స్పీకర్‌ అత్యున్నత స్థాయిని, గౌరవాన్ని ఆస్వాదిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే అనర్హతకు సంబంధించిన సమస్యపై నిర్ణయాధికారాన్ని స్పీకర్‌కే కల్పించినట్లు సుప్రీంకోర్టు చెబుతూనే అదనంగా ఇలా వ్యాఖ్యానించింది. ‘‘దేశంలోని ఏ ఒక్క స్పీకర్‌ని అగౌరవించకుండానే, ఇటీవల జరిగిన కొన్ని ఘటనలను గమనించాక, ఒక ట్రిబ్యునల్‌గా స్పీకర్‌ తన అధికార పరిధిలో రాజకీయ స్వభావం ఉన్న కొన్ని అంశాలపై తీసుకున్న నిర్ణయాలలో పక్షపాతానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. దీన్ని అడ్డుకోకపోతే, స్పీకర్‌ అత్యున్నత స్థానాన్నే అంతి మంగా ఇది దెబ్బతీస్తుంది.’’


ఈసీకి అప్పగించడమే శరణ్యం

అలాంటి అధికారాన్ని ఎన్నికల కమిషన్‌కు అప్పగించడంపై రాజ్యాంగాన్ని, ఇతర సుప్రసిద్ద న్యాయమూర్తుల అభిప్రాయాలను సమీక్షించేందుకు జాతీయ కమిషన్‌ ఏర్పాటుపై వచ్చిన సిఫార్సును సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది కూడా. వాస్తవానికి శాసన సభల్లోని కొందరు స్పీకర్ల వైపునుంచి జరిగిన వైఫల్యం కారణంగా రాజ్యాంగ వ్యవస్థలో అనేక వక్రీకరణలు కూడా చోటు చేసుకున్నాయి. రాజ్యాంగ వ్యవస్థలో శాసన, న్యాయ వ్యవస్థ పరిధులను సుస్పష్టంగా నిర్దేశించారు. ప్రభు త్వంలోని ఏ అంగమూ మరొక అంగానికి సంబంధించిన అధికార పరిధిని ఆక్రమిం చకూడదని భావించారు. శాసన కార్యాచరణ లేదా విశ్వాస తీర్మానం/అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన వ్యవహారాల్లో శాసనసభలో తలదూర్చే పద్ధతిలో  న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని నా అభిప్రాయం. అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టినప్పుడు దానిపై శాసనసభ నిబంధనల ప్రకారం స్పీకర్‌ నిర్వహించాలి. కానీ స్పీకర్‌ పాత్రే ప్రశ్నార్థకమై నిలిచినప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఏం జరగాలి? మీరు అంగీరించినా, అంగీకరించకున్నా సరే.. అలాంటి పరిస్థితుల్లో కోర్టులు జోక్యం చేసుకున్నాయి. దీంతో శాసనసభకు నిర్దేశించిన రంగాన్ని న్యాయవ్యవస్థ ఆక్రమిం చిందన్న ఆరోపణలు పెరిగేందుకు కూడా అవకాశమేర్పడింది.




ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు వ్యక్తులు తమకుతాముగా ముఖ్యమంత్రిగా పేర్కొంటూ సభా విశ్వాసాన్ని తామే పొందుతున్నామని చెప్పుకున్న ఘటన జరిగింది. ఈ వ్యవ హారం సుప్రీంకోర్టు తలుపులు తట్టినప్పుడు, సభలో వారిద్దరికీ పరీక్ష పెట్టాలని, స్వతంత్ర పరిశీలకుడు వీరికి వచ్చిన ఓట్లను లెక్కించాలని, వచ్చిన ఫలితాన్ని సుప్రీం కోర్టు ప్రకటించి ఆమోదించాలని కోర్టు ఆదేశించింది. ఇలాంటి సందర్భాలు ఇటీవలి సంవత్సరాల్లో ఒకటికి మించే చోటుచేసుకున్నాయి. ఇది సంస్థాగత వైఫల్యమేనని, ఇవి వ్యవస్థాత్మక తప్పిదాలకు దారితీస్తాయని నేను మరోసారి చెబుతున్నాను. ఈ అంశం స్పీకర్‌ కార్యాలయ ప్రమాణాన్ని పెంచవలసిన అవసరాన్ని సూచిస్తోంది. ప్రత్యేకించి విశ్వాస/అవిశ్వాస తీర్మానాల సందర్భంగా స్పీకర్‌ పాత్రే అనుమానా స్పదంగా మారినప్పుడు దీన్ని ఎదుర్కొనే యంత్రాంగాన్ని రూపొందించాల్సి ఉంది.



ఈ సెమినార్‌కు హాజరైనవారిలో పండితులైన మేధావులు ఎందరో ఉన్నారు. వీరిలో కొంతమందికి దశాబ్దాలుగా శాసనసభల్లో గడిపిన అనుభవం ఉంది. తమ జీవితం పొడవునా ఇలాంటి వ్యవహారాల్లో వీరు తలలు పట్టుకున్నారు కూడా. దీనికి సంబం ధించిన పలు వ్యవస్థాగత వైఫల్యాలను అడ్డుకోవడానికి తగిన, సమర్థవంతమైన చర్యలను వీరు సూచిస్తారని నేను భావిస్తున్నాను. (జూలై 31న హైదరాబాద్‌లో ‘ఫిరాయింపులు–స్పీకర్ల పాత్ర’ అన్న అంశంపై జరిగిన గోష్టిలో సమర్పించిన పత్రం)

- జస్టిస్‌ బీపీ జీవన్‌రెడ్డి

వ్యాసకర్త సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top