కొందరు జడ్జిలెందుకవుతారు?

కొందరు జడ్జిలెందుకవుతారు?


విశ్లేషణ



మన గొప్ప దేశంలో ఎవరిని జడ్జీలుగా ఎవరు ప్రతిపాదిస్తారో, ఎందుకు ప్రతిపాదిస్తారో, చివరకు కొందరి పేర్లు ఎందుకు రాలిపోతాయో, కొందరి భాగ్యవంతుల పేర్లు ఎందుకు రాలిపోవో బ్రహ్మకు కూడా అంతుబట్టదు.



ఆర్టీఐలో తేలని అద్భుతమైన ప్రశ్నఇది. అంతుపట్టని సమస్య ఏమంటే న్యాయస్థానంలో న్యాయమూర్తులే తప్పు చేస్తే ఏం చేయాలని? మహాభిశంసన తప్ప మరో మార్గం లేదు.  అనుచితంగా ప్రవర్తిం చారనే ఫిర్యాదు అంది, విచారణ జరిగి, సాక్ష్యాలు దొరికి రుజు వైనా తొలగింపు కష్టమే.  మహాభిశంసన తీర్మానం ఆర్టికల్‌ 124(4) కింద ఆమోదిస్తేనే తొలగిస్తారు. తమ అహాన్ని దెబ్బతీసే తీర్పులిచ్చిన న్యాయమూర్తులపై మహాప్రభువులు కోపించి పీకేయడానికి వీల్లేకుండా ఈ నియమాలు నియంత్రణలు. నిజానికి పాలకులకు న్యాయమూర్తులకు కూడా జవాబుదారీ తనం ఉండాలి. మేం గద్దెనెక్కాం కనుక ఏమైనా చేస్తాం అనే విధానానికి సంవిధానంలో స్థానం లేదు. సమపాలన, న్యాయవ్యవస్థమీద విశ్వాసం, సంస్థాగత బాధ్యత ఉండాలంటే ఏంచేయాలి.



సైకిల్‌ దొంగను మూడు సంవత్సరాలు జైల్లో పెట్టిపోషిస్తాం కానీ న్యాయస్థానం సోఫా కొనుగోలులో వేల రూపాయలు భోంచేసిన న్యాయమూర్తిని యువర్‌ ఆనర్, మై లార్డ్‌ షిప్‌ అని సగౌరవంగా సత్కరిస్తామంటే దాన్ని రూల్‌ ఆఫ్‌ లా అని మాత్రం అనరు. ఆ పెద్దలకు ఒక్కోసారి లా తెలియకపోయినా ఫరవాలేదు. తినగ తినగ వేము తీయనైనట్టు కాలప్రవాహంలో అన్నీ సర్దుకుంటాయి. అంత పెద్ద వారు తప్పులు, పొరబాట్లు, అనుచిత ప్రవర్తన, దుర్మార్గం, లంచగొండితనం, కొనుగోళ్లలో వేళ్లు గోళ్లు పెట్టడం వంటి పాపాలకు పాల్పడరని, న్యాయవితరణ దైవికమైన సత్కార్యం అని, అందులో ఉన్న వారు దైవాంశ సంభూతులని జనం పెంచుకున్న నమ్మకాన్ని ఒక తులమెత్తయినా నిలబెట్టే బాధ్యత మన వ్యవస్థలో కనిపించాలన్నతపనే జవాబుదారీతనం గురించిన చర్చ. పాలకుల దుర్మార్గాలను కడిగేసే న్యాయవ్యవస్థే లేకపోతే మన జనుల అవస్థలు దారుణంగా ఉండవూ? తప్పులు రుజువైన తరువాత కూడా న్యాయమూర్తులు కె వీరాస్వామి, పీడీ దినకరన్, సౌమిత్రసేన్‌ విషయంలో మన సంవిధానం అస్త్రసన్యాసం చేసింది.  మహా లేదూ, అభిశంసన అంతకన్నా లేదు. న్యాయపాలనలో నిర్లక్ష్యం చేస్తే నష్టపోయిన కక్షిదారుడికి నష్టపరిహారం ఇప్పించే నియమాలు రోమన్‌ చట్టాల్లో ఉన్నాయి. స్వీడన్‌లో చిన్న చిన్న శిక్షలు కూడా ఈ న్యాయపెద్దలమీద విధించే వీలుంది. డెన్మార్క్‌లో అయితే వారిమీద ఫిర్యాదులు వినడానికి ఏకంగా ఒక ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేశారు మరి.



మనకూ జడ్జీల విచారణ చట్టం 1968 ఉంది. జడ్జీ గారిమీద ఫిర్యాదును స్వీకరించాలంటే వంద లోక్‌సభ లేదా 50 రాజ్యసభ సభ్యులు అధ్యక్షుల వారికి మహజరివ్వాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంబంధిత హైకోర్టు చీఫ్‌ లేదా సుప్రీంకోర్టు చీఫ్‌ల కమిటీ విచారించి తొలగించమని పార్లమెంటుకు సిఫారసు చేస్తే మహాభిశంసన తీర్మానాన్ని చర్చిస్తారు.  ముద్దాయి న్యాయమూర్తిగానీ, వారి లాయర్‌ గానీ తన వాదాన్ని వినిపించాలి. ఉభయ సభల్లో మూడింట రెండువంతుల మంది సభ్యులు అవునంటేనే ఉద్వాసన. (ఇంతమంది పార్లమెంటు సభ్యుల మద్దత్తు ఉంటే ఏకంగా దేశప్రధానే కావచ్చు మరి) ఇది అసాధ్యమని తేలిపోయింది. దీని కన్న ఆ న్యాయమూర్తికి 62 లేదా 65 ఏళ్లు నిండేదాకా నోరుమూసుకుని ఎదురుచూడడం చాలా మంచిదని కొందరి అభిప్రాయం.



మన రాజ్యాంగంలో న్యాయవ్యవస్థకు సంబంధించిన గొప్ప నియమం ఏదంటే వారి రిటైర్మెంట్‌ వయో నిర్ధారణ. కొన్ని దేశాల్లో ఒకసారి గద్దెనెక్కితే చాలు జీవిత పర్యంతం న్యాయమూర్తే.  చక్రాలకుర్చీల్లో వచ్చి న్యాయచక్రం తిప్పుతుంటారు. ఆ యావజ్జీవ జడ్జిలను వదిలించుకోవడానికి హతమార్చడం ఒక్కటే మార్గమని కుట్ర చేసే థీమ్‌తో ఓ మహారచయిత థ్రిల్లర్‌ నవల కూడా రాసి పారేశాడు.  ఈ నేపథ్యంలో జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్‌ చట్టాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం నానాతంటాలుపడి తెచ్చింది. కాని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఒక్క మన చలమేశ్వర్‌ గారు తప్ప మిగిలిన నలుగురు జడ్జీలు అది రాజ్యాంగ విరుద్ధమని సెలవిచ్చారు. అదిపోయింది. అయితే ఈ అయిదుగురూ ఒక విషయంలో ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. అదేమిటంటే అన్నింటి మూలం నియామకాల్లోనే ఉంది.



అది అత్యంత రహస్యంగా జరుగుతున్నది. అందులో పారదర్శకత తెచ్చామా.. ఇహ మనమంతా బాగుపడిపోతామన్నారు. కానీ దాన్ని తేవడం ఎలా? కేంద్రం ఒక ప్రతిపాదన పంపింది. అందులో లోపాలున్నాయని  సుప్రీం న్యాయమూర్తులు తిప్పి పంపారు. మళ్లీ సవరించి పంపారు. మన మహామహిమాన్విత దేశంలో ఎవరిని జడ్జీలుగా ఎవరు ప్రతిపాదిస్తారో, ఎందుకు ప్రతిపాదిస్తారో, చివరకు కొందరి పేర్లు ఎందుకు రాలిపోతాయో, కొందరి భాగ్యవంతుల పేర్లు ఎందుకు రాలి పోవో బ్రహ్మకు కూడా అంతుబట్టదు. పోనీ ఫలానా వ్యక్తి తాను అర్హుడనని నమ్మితే జడ్జీ పదవికి దరఖాస్తు ఎక్కడ పెట్టుకోవాలో ఎవరూ చెప్పరు. ఎవరికీ తెలి యదు. మన 70 ఏళ్ల రాజ్యాంగంలో న్యాయశాస్త్ర విశారదులనుంచి కూడా సుప్రీంకోర్టు జడ్జీలను ఎంపిక చేయాలని ఉంది. జిల్లాల్లో పనిచేసిన న్యాయాధికారుల్లో కొందరు, హైకోర్టులో పనిచేసే న్యాయవాదుల్లో కొందరు హైకోర్టు జడ్జీలవుతారు.



వారిలో కొందరు సుప్రీంకోర్టుకు వెళ్తారు. చాలామంది వెళ్లరు. ఎందుకో తెలియదు. అడగొద్దు. అడిగి తెలుసుకోవడానికి ఆర్టీఐ ఉపయోగపడుతుందో లేదో తెలియదు. అవన్నీ వారి వారి ప్రయివసీ పదార్థాలు కావచ్చు. కొందరు లాయర్లను నేరుగా సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమిస్తారు. కానీ న్యాయశాస్త్ర కోవిదులకు ప్రవేశ మార్గమే లేదు. ఎలా నియమిస్తారో తెలియక తొలగించే మార్గంలేక తప్పులు రుజువైనా చర్యలు ఉండక... ఏమిటిది? ఈ న్యాయమూర్తులు తమ తీర్పుల్లో చెప్పినంతకాలం సైకిల్‌ దొంగలు జైల్లో ఉంటూ జనం పన్నుల ఖర్చు మీద ఆధారపడి తింటుంటారు. దీనికి ఆర్టీఐ ఏం చేస్తుంది చెప్పండి. (సుభాష్‌ చంద్ర అగ్రవాల్‌ వర్సెస్‌ లా మంత్రిత్వ శాఖ ఇఐఇ/V /అ/2014/000989– అ కేసులో 3.5.2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా).

వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌

professorsridhar@gmail.com


 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top