ఏలినోరి బాధ్యత ఎండల్లో ఆవిరి

ఏలినోరి బాధ్యత ఎండల్లో ఆవిరి


సమకాలీనం



ఉమ్మడి ఏపీలో ఏటా సంభవించినన్ని వడదెబ్బ మరణాలు తెలంగాణ, ఏపీలలో విడివిడి గానే నమోదవుతున్నాయి. శాస్త్ర సాంకేతికత పెరిగి కచ్చితమైన ముందస్తు హెచ్చరికలు అందు తున్నా నివారణ చర్యలుండటం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అరకొర చర్యలు మరీ మొక్కుబడిగా, కాగితాలకు పరిమితమైనవిగా ఉంటున్నాయి. మనిషి ప్రాణానికి విలువిచ్చే చిత్తశుద్ధి ఉంటేనే, వడదెబ్బ మరణాల్ని సర్కార్లు నిలువరించగలుగుతాయి. సగటు మనిషి ప్రాణాలతో పాటు, సర్కార్ల పరువూ నిలబడుతుంది. ఇది మీ దయ కాదు, బాధ్యత!



పట్టపగటింటి సూర్యుని పగిది కర్ణు

డుగ్రమూర్తిౖయె చెలరేగుచున్నవాడు,

మాధవా! మన రథంబిప్డు మరలనిమ్ము,

బతికి యుండిన సుఖముల బడయవచ్చు!



కురుక్షేత్ర యుద్ధభూమిలో ప్రత్యర్థి కర్ణుడు మిట్ట మధ్యాహ్నపు సూర్యుడిలా చెలరేగుతున్నాడని బెంబేలెత్తి పోయాడు అర్జునుడు. ‘బావా! మన రథాన్ని ఇక వెనక్కి మళ్లించు, మున్ముందు సుఖాలు పొందొచ్చేమో కానీ, ముందు బతికుండాలి కదా!’ అని కృష్ణుడ్ని వేడుకుంటాడు. సూర్యుడిలా కర్ణుడు చెల రేగుతుంటేనే విజయుడు అంత జడిసినప్పుడు, ఇక సూర్యుడే విజృంభిస్తే సాధారణ మనుషుల పరిస్థితేమిటి? మనం చాటింపు వేసుకునే అభివృద్ధి– సంక్షేమాలు తర్వాత, ముందు ఈ సూర్య ప్ర‘తాపం’ నుంచి బడుగు జీవులు బతికి బయటపడటం కదా ముఖ్యం! కానీ, ఇవేవీ ఈ రోజున ప్రభుత్వాలకు, వ్యవస్థలకు, పట్టడం లేదు. వృద్ధులు, పిల్లలు, యువకులు, పెద్దలు.. ఇలా అన్ని వయస్సుల వారూ ఎండదెబ్బకి పిట్టల్లా రాలుతున్నారు.



ఏయేటికా యేడు ఎండలు తెగ ముదురుతున్నాయి. కిందటేడు, ఈ ఏడు దేశంలో ఎండలు రికార్డు స్థాయిలో ఉండటంతో వడదెబ్బకు లక్షల మంది జబ్బుల బారిన పడుతుంటే, వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విపరీతపు ఎండలకు జనం అల్లాడిపోతున్నారు. ఇంటా, బయటా, పని ప్రదేశాల్లో, ఎక్కడబడితే అక్కడ వెంటాడి వేధిస్తున్న ఎండ వేడికి, వడదెబ్బకు ఏటా వందలాది మంది దిక్కులేని చావు చస్తు న్నారు. మార్కెట్లో ధాన్యపు రాశి మీదే ఓ రైతు, ఫ్యాక్టరీ పనిచేస్తూనే ఓ కార్మి కుడు, రాత్రి నిద్రలోనే ఓ పెద్దమనిషి, బడి నుంచి నడిచొచ్చి వాంతులు చేసు కొని ఒక బాలిక... ఇలా ఎందరెందరో వడదెబ్బకు వడలి, రాలిపోతున్నారు. ఇంటి పెద్ద దిక్కు అకాల మృత్యువు వాతబడటం కుటుంబాల్ని కల్లోలపరు స్తోంది. తిండిపెట్టే దీపమారి ఇంటిల్లిపాదీ ఘొల్లుమంటున్నారు. మనిషి స్వార్థం, నిర్లక్ష్యం వల్ల భూమ్యావరణం కాలుష్యమై, భూతాపం పెరిగి పోతోంది.



వాతావరణం తీవ్ర మార్పులకు గురవుతోంది. ఫలితంగా అసా« దారణంగా ఎండలు పెచ్చు పెరిగి నిండు బతుకుల్ని నుసి చేస్తున్నాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి జీవులు, మరీ ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బలి అవుతున్నారు. తాగునీరు లేక, వడదెబ్బకు తట్టుకోలేక ప్రాణాలు వదిలే  పశువులకు లెక్కే లేదు. సమస్య తీవ్రతను ప్రభుత్వాలు తగు రీతిన గుర్తిం చడం లేదు. అధిగమించే శాస్త్రీయ పంథాను అనుసరించడం లేదు. విపత్తు నివారణ శూన్యం. మానవతా దృక్పథం కొరవడగా స్పందించడమే లేదు.



ధ్రువాల్లో పచ్చగడ్డి మొలుస్తోంది

భూతాపోన్నతి విశ్వ సమస్య. ప్రపంచ వ్యాప్త పరిణామాలే ఈ మార్పులకు కారణం. గత కొన్ని దశాబ్దాల్లో హెచ్చిన వేడి వల్ల ధ్రువాల మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఇది దీవులు, ద్వీపకల్పాలు, తీర నగ రాలు, పట్టణాల జనాభా మనుగడకే పెను సవాల్‌గా మారుతోంది. ధ్రువాల్లో మంచు కరగటం ఎంత ప్రమాదకర స్థితిలో ఉందంటే, సూర్యరశ్మి సోకి అక్కడ పసరిక పెరుగుతోంది. అంటార్కిటికా కన్నా ఆర్కిటిక్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. రమారమి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఇంకా అనేక సమ స్యల్ని సృష్టిస్తున్నాయి. అందులో ఈ వడదెబ్బ చావులు ఒక ఘోరం. ఈ పాపంలో అంతో ఇంతో అందరి పాత్రా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు వారి ప్రగతి క్రమంలో ఇన్నాళ్లూ చేసిన నిర్వాకాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఇక కట్టడి విధిస్తే జరుగబోయే నష్టం తదితరాలపై ఇటీవల పారి స్‌లో లోతైన చర్చే జరిగింది.



ఈ అసమతుల్యతల్ని అధిగమించడానికే ‘ఉమ్మడి సమస్య భిన్న బాధ్యతలు’ (సీపీడీఆర్‌) అన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 2030 నాటికి భూతాపోన్నతిని 2 సెంటీమీటర్లకు మించి పెర క్కుండా చేయడమే లక్ష్యంగా దాదాపు 190 ‘భాగస్వామ్య దేశాలు’ బాధ్యత తీసుకున్నాయి. స్వీయ నియంత్రణకు కార్యాచరణను ప్రకటించాయి. ఈ దిశలో మరింత వేగంగా అడుగులు పడాలి. అప్పుడే ఈ భూతాపోన్నతి నియంత్రణలోకి వస్తుంది. లేకుంటే ఈ మితిమీరిన ఎండలు మనుషులతో పాటు సకల జీవవైవిధ్యాన్నీ నాశనం చేస్తాయి. విపత్తు తొలగించేందుకు ప్రపంచస్థాయి యత్నాలు ఇప్పుడిప్పుడే బలపడుతున్నాయి. అంతమాత్రాన, వడదెబ్బ చావుల్ని నియంత్రించేందుకు స్థానికంగా పరిష్కారాలు లేవనీ కాదు. వ్యక్తులు, పౌర సంఘాలు, ప్రభుత్వాల స్థాయిలో స్థానికంగా చేపట్టే ఉపశమన చర్యల వల్ల ఎంతోకొంత మేలు జరుగుతుంది. కానీ, ఈ విపత్తు తీవ్రతను, విపరిణామాలను పాలకులు గుర్తించడం లేదు. వారిలో దూరదృష్టి కొరవడటం, చిత్తశుద్ది లోపం వల్ల ఇప్పుడిదొక తీవ్ర సమస్యగా మారుతోంది.



దేశంలో రికార్డుల మోత

సగటు మనిషి జీవితాన్ని దుర్భరం చేస్తున్న ఎండల్ని, వడగాలుల్ని ప్రభు త్వాలు ప్రకృతి విపత్తుగా పరిగణించాలి. ముందు జాగ్రత్త, సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలి. ఒక వైపు శాస్త్ర సాంకేతిక పెరిగి కచ్చితమైన ముందస్తు హెచ్చరికలు అందుతున్నా నివారణ చర్యలుండటం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు చేసే అరకొర చర్యలున్నా అవి మరీ మొక్కుబడిగా, కాగితాలకు పరి మితమైనవిగా ఉంటున్నాయి. భారత వాతావరణ విభాగం (ఐఎమ్డీ) గత సంవత్సరం నుంచి వడగాలి హెచ్చరికలిస్తోంది. 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణో గ్రత దాటితే ఈ హెచ్చరిక వస్తుంది. సాధారణం కన్నా 4–5 డిగ్రీలు పెరిగితే దాన్ని ‘వడగాలి’గా, 6 డిగ్రీలు దాటితే ‘తీవ్ర వడగాలి’గా పరిగణిస్తారు. ఏడాదిలో సగటు తీవ్ర వడగాలి రోజుల సంఖ్య దేశంలో క్రమంగా పెరుగు తోంది.



1971–80 దశకంలో ఏడాదికి సగటున ఈ రోజుల సంఖ్య 34 కాగా, 1981–90 లలో 45గా, 1991–2000 లలో 48గా నమోదయింది. 2001–10 లలో ఏటా సగటున 98 రోజులు తీవ్ర వడగాలి రోజులుగానే నమోదయ్యా యంటే తాపోన్నతి పెరుగుదల క్రమం ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. అంటే, ఏడాదిలో మూడు నెలలపైనే! ప్రస్తుత దశాబ్దిలో (2010 తర్వాత) ఇది ఏటా మరింత పెరుగుతోంది. ఉష్ణోగ్రత–వడగాలి గణనకు సంబంధించి శాస్త్రీ యమైన లెక్కలు మొదలైన్నుంచి, అంటే గత 116 ఏళ్లలో అత్యధిక వేడి సంవత్సరంగా కిందటి ఏడాది (2016) నమోదయింది. ప్రపంచ అధ్యయ నాలు కూడా గత ఏడాది ఏప్రిల్‌–మే మాసాలు అత్యధిక ఉష్ణ మాసాలుగా చరిత్ర సృష్టించినట్టు పేర్కొన్నాయి. మన దేశ చరిత్రలోనే ఈ ‘మే’ (2017) అత్యంత వేడి మాసంగా చరిత్ర సృష్టించనుందని (ఇప్పటికైతే గత ఏప్రిల్‌ నెలే రికార్డు) ‘గ్లోబల్‌ క్లయిమేట్‌ రిపోర్ట్‌’ తెలిపింది. దేశంలోని పట్టణాలు, ఓ మోస్తరు నగరాలు, మహానగరాల్లో కన్నా శీతల విడిది పర్వత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నట్టు మరో అధ్యయనం తెలిపింది. సిమ్లా, కొడైకెనాల్, డార్జిలింగ్, మడికెరి, శ్రీనగర్‌లలో 1970 నుంచి ప్రతి దశాబ్దంలో సగటున 0.4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ కొండ ప్రాంతాల్లో నాలుగు దశాబ్దాల్లో సగటున 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినట్టు లెక్క. ఇది చాలా ప్రమాదకర పరిణామం.



తెలుగు రాష్ట్రాల్లో తెంపరితనం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏటా సంభవించినన్ని వడదెబ్బ మరణాలు ఇప్పుడు తెలంగాణ, ఏపీలలో విడివిడిగానే నమోదవుతున్నాయి. వాస్తవిక మరణా లకు అంతకన్నా చాలాఎక్కువే. రెవెన్యూ అధికారులు ఈ మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తారనేది స్థిర విమర్శ. గడచిన నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 4,620 మంది తీవ్ర వడదెబ్బతో మరణిస్తే, అందులో 4,246 మంది (దాదాపు 90 శాతం) రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మరణించినట్టు కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. వడగాలులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు పెరిగి పౌరులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని తెలిసినా నిర్దిష్ట చర్యలుం డటం లేదు. వడగాలులు వీస్తున్నపుడు పాటించాల్సిన ప్రొటోకాల్‌ నిబంధన లున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు, తదనంతర చర్యలూ ఉన్నప్పటికి అత్య ధిక సందర్భాల్లో అవి కాగితాలకే పరిమితం. తీవ్ర వడగాలులు ఉన్నపుడు మధ్యాహ్నం 12, సాయంత్రం 4 గంటల మధ్య ఆర్టీసీ బస్సులు నడపొద్దని ఉంది.



బస్టాండ్లలో ప్రయాణికులకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పంచాలని ఉంది. ప్రాథమిక వైద్య కేంద్రాల్లో ప్రత్యేక పడకలు, వడదెబ్బ తగిలి ప్రమాదకర స్థితిలో వచ్చే వారి కోసం ఖాళీగా ఉంచాలనీ ఉంది. 104 సదుపాయాన్ని అందుబాటులో ఉంచి, ఒక ‘హెల్ప్‌లైన్‌’ను నిరంతరాయంగా నిర్వహించాలి. వడదెబ్బ తగిలినపుడు ‘‘ఏం చేయాలి? ఏం చేయరాదు?’’ సామాన్యులకు తెలిసేలా కరపత్రాలు తదితర మార్గాల్లో విస్తృత ప్రచారం చేయాలనీ ఉంది.  ఇవేవీ అమలు కావు, పాలకులెవరికీ ఆ ధ్యాసే అంతగా ఉండదు.



ఇది సర్కారు బాధ్యత కాదా?

వడగాలి సమస్య ప్రధానంగా దక్షిణాదిన ఉండటంతో కేంద్రం పెద్దగా పట్టిం చుకోదనే విమర్శ ఉంది. చలి తీవ్రతతో మరణిస్తే ప్రకృతి వైపరీత్యంగా పరి గణించి, నష్టపరిహారం చెల్లిస్తున్నపుడు వడగాలి మృతులకు అదెందుకు వర్తిం పచేయరనే ప్రశ్న తరచూ వస్తోంది. వడదెబ్బతో మరణించిన వారి కుటుంబా లకు ఆపద్బంధు పథకం కింద రూ. 50వేలు ఇస్తున్నారు. కానీ, అధికారులు ల(య)క్ష ప్రశ్నలతో బాధితుల కుటుంబాలను విసిగించి, ఇతర మరణాలుగా నమోదు చేయిస్తారు. దాంతో ఆ పరిహారమూ దక్కదు. చాలా సందర్భాల్లో, పుట్టెడు దుఃఖంలో ఉండే కుటుంబానికి ఆ పాటి సహాయం దక్కించుకోవ డమూ గగనమౌతోంది. ఆరోగ్యశాఖ, తాగునీటి విభాగం, విపత్తు నివారణ సంస్థ.. ఇలా వివిధ అనుబంధ విభాగాల చర్యల్ని సమీకృతం చేయాల్సిన అవసరం ఉంది.



తెలుగు రాష్ట్రాల్లో కొత్తగూడెం, రామగుండం, రెంటచింతల తదితర ప్రాంతాల్లో అక్కడి బొగ్గు, అబ్రకం, నాపరాళ్ల గనుల వల్ల విపరీత మైన వేడి ఉంటుంది. పెద్ద సంఖ్యలో వడదెబ్బ మరణాలు నమోదవుతున్నా.. ఆ ప్రాంతాల్లో ముమ్మరంగా మొక్కలు పెంచి, హరితమయం చేసేందుకు ఏనాడూ ప్రభుత్వాలు పూనుకోలేదు. చెట్లు బాగా ఉండే ఇందిరా పార్కు, తార్నాకా, లింగంపల్లి (బీహెచ్‌ఈఎల్‌) వంటి ప్రాంతాల్లో చుట్టూ కొన్ని కిలో మీటర్ల పరిధి విస్తరించే చెట్ల చలువ వడదెబ్బకు ఓ గొప్ప విరుగుడు. ప్రాథ మిక వైద్య కేంద్రం యూనిట్‌గా ప్రతి వేసవిలో వడదెబ్బను అధిగమించే ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. తాగునీరు లేని గ్రామాలకు ట్యాంక ర్లతో నీటి సరఫరా చేయాలి. గంజి, అంబలి, నీళ్ల కేంద్రాల్ని నడపాలి. కొన్ని గ్రామాల్ని కలపి ఒక క్లçస్టర్‌గా చేసి అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలి.



తుపాను హెచ్చరికల్లా వడగాలి తీవ్రతపై గ్రామీణులకు హెచ్చరికలు చేస్తూ, తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం కల్పించాలి. పౌరుల్ని చైతన్య పరచి శరీరంలో ద్రావకాల సాంద్రత తగ్గకుండా చూసుకునేలా సమాయత ్తపరచాలి. వడగాలిని ఎదుర్కోవడానికి ఏం చేయాలో/చేయకూడదో తెలిసొ చ్చేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇదంతా ఓ మూడునెల్ల పాటు జరిపితే సరిపోతుంది. ఏ రకంగా చచ్చినా మనిషి ప్రాణం ప్రాణమే! మనిషి ప్రాణానికి విలువిచ్చే చిత్తశుద్ధి ఉంటేనే, వడదెబ్బ మరణాల్ని సర్కార్లు నిలు వరించగలుగుతాయి. సగటు మనిషి ప్రాణాలతో పాటు, సర్కార్ల పరువూ నిలబడుతుంది. ఇది మీ దయ కాదు, బాధ్యత!

వ్యాసకర్త ఉమ్మడి ఏపీ సమాచార పూర్వ కమిషనర్‌

దిలీప్‌ రెడ్డి

ఈమెయిల్‌:dileepreddy@sakshi.com


 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top