మూడు రాజధానులైతే మేలు

మూడు రాజధానులైతే మేలు - Sakshi


కొత్త రాష్ట్రంలో కనీసం మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు వీలుంది. గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు నగరాలకు ఈ హోదా కల్పిస్తే మూడు ప్రాంతాల ప్రజలు సంతృప్తి చెందుతారు. ఈ నగరాలను విస్మరిస్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయి.

 

ఆంధ్రప్రదేశ్‌కు సింగపూర్ స్థాయి రాజ ధానిని నిర్మిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు చాలా కాలంగా చెబుతున్నారు. కొత్త రాజధాని ఎలా ఉండబోతున్నదో తెలియదు కానీ, దానిని ఎంపిక చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం ఉరుకులూ పరు గులూ పెట్టడం చాలా మందిలో గుబులు పుట్టిస్తున్నది. గుంటూరు దగ్గర  రాజధాని నిర్మాణం కాబోతున్నదని వార్తలు వస్తు న్నాయి. చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన మరుక్షణం నుంచి గుంటూరు పేరు తెరపై వచ్చింది.

 

చంద్రబాబు, ఆయన వ్యాపార సలహాదారులు సాగి స్తున్న గుంటూరు మార్కెటింగ్‌లో రాజధాని కంటే ‘రియల్ ఎస్టేట్’ మర్మమే ఎక్కువగా కనపడుతున్నదన్న విమర్శ ఉంది. కాంగ్రెస్ నాయకులంతా గుంటూరు దరిదాపుల్లో భారీగా భూములు కొనుగోలు చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ కూడా ఆరోపించారు. రాజధాని ఎంపిక కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ భూముల ధరలు విపరీ తంగా పెరిగిన విషయం అంగీకరించారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఆంధ్ర ప్రదేశ్‌కు ‘సూపర్ క్యాపిటల్’ వద్దని సలహా ఇస్తున్నారు.

 

పదిహేనేళ్ల కిందట ఏర్పడిన  ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్త రాంచల్ రాష్ట్రాలకు రాజధానుల ఏర్పాటులో వాటి సర్కార్లు ఒక్కొక్క మార్గం ఎంచుకున్నాయి. రాష్ట్రంలో పెద్ద నగరమైన రాయ్‌పూర్‌ను ఛత్తీస్‌గఢ్ రాజధానిగా ఎంచుకుంది. జార్ఖండ్ లో పెద్ద నగరమైన రాంచీ ఆ రాష్ట్ర రాజధాని అయింది. ఉత్త రాంచల్‌లో రాజధాని సెగ రగులుతూనే ఉంది. కుమావ్ ప్రాంత ప్రజలను తృప్తి పరిచేందుకు కొత్త ప్రభుత్వం హైకో ర్టును అక్కడి నైనిటాల్‌లో ఏర్పాటు చేసింది. గాయిర్‌సెయిన్‌లో అసెంబ్లీని నెలకొల్పారు. డెహ్రాడూన్ తాత్కలిక రాజ ధాని. ఆంధ్రప్రదేశ్ కంటే ఉత్తరాంచల్ చాలా చిన్నది. ఆ చిన్న రాష్ట్రమే మూడు రాజధానులను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అలాంటి ప్రయోగం ఎందుకు చేయకూడదు?

 

కాశ్మీర్‌కు శీతాకాలంలో జమ్మూ, వేసవిలో శ్రీనగర్ రాజ ధానిగా ఉంటాయి. ఉత్తరప్రదేశ్‌లో రాజధాని లక్నోలో ఉంటే, హైకోర్టు అలహాబాద్‌లో ఉంది. పక్కనున్న మహా రాష్ట్రలో ముంబై రాజధాని అయితే, ప్రతి సంవత్సరం నాగపూర్‌లో కూడా అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉంటాయి.

 

నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక ఉరుకుల పరు గుల మీద చేయాల్సిన అవసరం లేదు. కొత్త రాజధానికి తర లిపోయేందుకు పదేళ్ల గడువుంది. ఈ కాల పరిమితిని పొడి గించే వీలు కూడా ఉంది. రాజధాని ఎంపిక ప్రాంతీయ ఉద్రి క్తతలకు దారి తీయకుండా, రాజకీయ సమస్య కాకుండా  టీడీపీ ప్రభుత్వం మొదట 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి చర్య లు మొదలు పెట్టాలి. అప్పుడు రాజధాని సూపర్ క్యాపిటల్ అయ్యే అవకాశమే ఉండదు.

 

గతంలో వలెనే కర్నూలును రాజధానిని చేయాలని కోరుతున్న వారూ ఉన్నారు. కొత్త రాష్ట్రంలో కనీసం మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు వీలుంది. గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు నగరాలకు ఈ హోదా కల్పిస్తే మూ డు ప్రాంతాల ప్రజలు సంతృప్తి చెందుతారు. ఈ నగరాలను విస్మరిస్తే, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో సమస్యలు వస్తాయి.

 

విశాఖపట్నంలో 20వేల ఎకరాల దాకా ఉక్కు కర్మా గారం భూములున్నాయి. ఈ భూములను రాజధాని కోసం వెనక్కు తీసుకోవచ్చు. కర్నూలు సమీపంలో కూడా సమృ ద్ధిగా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని చెబు తున్నారు. గుంటూరు భౌగోళికంగా శ్రీకాకుళం, అనంత పురం మధ్య ఉంటుంది. రాజధాని విషయంలో ఒక్క గుంటూరుకే ప్రాధాన్యం ఇస్తే చంద్రబాబు ఉద్దేశాలను రాయలసీమ ప్రజలు శంకించే ప్రమాదం ఉంది.

 

పరిపూర్ణ రాజధానికి గుంటూరు అర్హమైనది కాదు. అం దువల్ల గుంటూరు రాజధానిని చేసే అంశం మీద రాష్ట్రమం తా చర్చ జరగాలి. అన్నిప్రాంతాల ప్రజల ప్రతిపాదనల మీద చర్చ జరిగాక అప్పుడు సూపర్ క్యాపిటల్ కాకుండా బహుళ రాజధాని విధానాన్ని పాటించి అన్నిప్రాంతాల అభివృద్ధికి సహకారం అందించవచ్చు. ఒక రాష్ట్రానికి రెండు మూడు రాజధానుల ఉండరాదనే నియమమేమీ లేదు. చంద్రబాబు వ్యాపార సలహాదారులను పక్కన బెట్టి ప్రజలతో సంబంధాలున్న వారి సలహాలను తీసుకోవాలి.



(వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)

 

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top