కట్టుబడతారా? చిచ్చుపెడతారా?

కట్టుబడతారా? చిచ్చుపెడతారా? - Sakshi


కాపుల కోరికలను  తీర్చడం సాధ్యం కాదన్నట్టు మాట్లాడిన  చంద్రబాబు వారం తిరిగే సరికి అన్నిటికి సరే అంటున్నారు. ఇవి, కాపుల ఉద్యమం సద్దుమణిగేలా చేసేందుకు చెబుతున్న మాటలేనా లేక నిజాయితీగా పరిష్కారానికి ప్రయత్నిస్తారా? కాపు సామాజిక వర్గం భావోద్వేగాలతో ఆటలాడుకోవడం ప్రభువులకు మంచిది కాదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి రాజ్యాంగ సవరణ ద్వారా కాపులను బీసీలలో చేర్పించడమా? లేదా 2019 ఎన్నికల్లో ఆ వర్గం ఆగ్రహాన్ని చవి చూడ టమా? చంద్రబాబు తేల్చుకోవాలి.

 

 ఎన్నికల సందర్భంగా ఒక రాజకీయ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ మీద మరో మారు హామీని పొందడానికి ఒక రైలు తగలబడాల్సి వచ్చింది. లెక్క లేనంత మంది మీద దొమ్మీ, దహనం వగైరా కేసులు పెట్టాల్సి వచ్చింది. ఒక పెద్దాయన నాలుగు రోజులపాటు భార్యా సమేతుడై నిరవధిక నిరాహార దీక్ష చేయాల్సివచ్చింది. అంతేకాదు భార్యాభర్తలిద్దరూ స్వచ్ఛంద గృహ నిర్బం ధంలో గడపాల్సి వచ్చింది. మరో ఇద్దరు ఆత్మహత్యలు చేసుకోవడమూ తప్ప లేదు.  2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా, ఇప్పుడు కాకపోతే మరెన్నటికీ కాదు అనే దిక్కు తోచని స్థితిలో, పదేళ్లు అధికారానికి దూరమై పరితపిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలవికాని హామీలను  తమ ఎన్నికల ప్రణాళికలో గుప్పించేశారు.

 

 అవన్నీ అమలు చేయడం తన వల్ల కాదని ఆయనకు బాగా తెలుసు. అయినా గెలవడం ముఖ్యం కానీ విశ్వస నీయతేమిటి ‘‘మై ఫుట్’’ అనేది మొదటి నుంచి చంద్రబాబు సిద్ధాంతం. కాబట్టి ఆయన అలవోకగా హామీలు ఇచ్చేశారు. అటువంటి హామీలను గురించి ఈ 19 మాసాల్లో చాలాసార్లు మీడియాలో రాసుకున్నాం, మాట్లాడు కున్నాం. అందుకే ఆయన మీడియా మైండ్‌సెట్ మారాలని చెప్తూ ఉంటారు.

 

 ‘మైండ్‌సెట్’ బాబు రుబాబు

 దాదాపు రెండేళ్లు గడుస్తున్నా రైతు రుణమాఫీ జరగలేదేమని అడిగితే ఆయ నకు కోపం వస్తుంది. ఇంటికో ఉద్యోగం ఏది? అంటే చికాకు ఎత్తుతుంది. డ్వాక్రా రుణ మాఫీ ఊసే ఎత్తొద్దు. ఎవరూ ఏమీ అడగకుండా, ఆయన చూపే అమరావతి చిత్రాలను తిలకించి పరవశిస్తుంటే చాలు.... ఆయనే ఆంధ్రప్ర దేశ్‌ను అభివృద్ధి చేసిపారేస్తారు. ఆయన చేయబోయే ఆ అభివృద్ధికి ప్రతి పక్షాలు, ప్రజలు అడ్డంకి కాబట్టి వారెవరూ అవసరం లేదు. రైతు రుణ మాఫీ గురించి మొన్న ఒక విలేకరి ప్రశ్నిస్తే... అత్యాశ ఉండటం మంచిది కాద న్నారు. మొత్తం రుణాలు మాఫీ చేస్తానన్నానా? నీ కలలోకి వచ్చి చెప్పానా? అని ఆ విలేకరిని దబాయించి పారేశారు. విశాఖపట్నంలో అత్యద్భుతమైన అంతర్జాతీయ వైమానిక దళ విన్యాసాలు జరుగుతుండగా... పనికిమాలిన కాపు ఉద్యమాన్ని పదే పదే చూపిస్తారా? అని టీవీ వాళ్ల మీద ఆగ్రహం వ్యక్తం చేశారాయన.

 

 ఇదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుత మైండ్‌సెట్. ఆయన మైండ్‌సెట్ ఎలాంటిదో చెప్పడానికి... ముద్రగడ పద్మనాభం నిరా హార దీక్ష విరమణతో తాత్కాలికంగా విశ్రాంతి కార్డు పడ్డ కాపు ఉద్యమం పట్ల ఆయన వ్యవహరించిన తీరే చాలు. కాపులను బీసీలలో చేర్చడం, కాపుల సంక్షేమానికి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి దానికి ఏడాదికి వెయ్యి కోట్లు కేటా యించడం ఎన్నికల సమయంలో టీడీపీ ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒకటి. ‘ఆ హామీని అమలు చెయ్యకుండా రెండేళ్లు గాడిదలు కాస్తున్నావా బాబూ?’ అని కమ్యూనిస్ట్ నాయకుడు నారాయణ వ్యాఖ్యానించడంలో తప్పేముంది? ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన వాడిన భాష సముచితమైనది కాకపో వచ్చు.

 

 కానీ అంతిమ అర్థంలో జరిగింది అదే కదా! ముద్రగడ తునిలో కాపు గర్జన నిర్వహించిన నాడు విధ్వంసం జరుగుతుండగానే మీడియాను పిలిచి మాట్లాడిన బాబు... ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బు లేదు, కేంద్రం నుంచి సరైన సహకారం అందడం లేదన్నారు. మరి ముద్రగడ దీక్షను విరమింపజేయడానికి ఏటా వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తాం అని మళ్లీ ఎలా చెప్పారు? తొమ్మిది నెలల్లో మంజునాథ కమిషన్ నివేదికను ఇప్పిస్తాం, కేంద్రం ముందుపెట్టి రాజ్యాంగ సవరణ చేయించి తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్పిస్తాం అన్న మాటలు ముద్రగడ దీక్షకు ముందు ఏమయ్యాయి?

 

 కేంద్రం వద్ద అంత పలుకుబడుందా?

 ఇలా బీసీ కులాలకు నష్టం జరగకుండా కాపులకు కూడా రిజర్వేషన్లను కల్పిం చాలంటే రాజ్యాంగ సవరణ జరగడం తప్పనిసరి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అందుకు ఒప్పించగలరా? రాజకీయంగా తనకు ఎలాంటి చిక్కులు రాని పరిస్థితుల్లో మాత్రమే బీజేపీ అందుకు ఇష్టపడుతుందని అందరికీ తెలుసు. కేవలం టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ వ్యాప్తంగా అది మరిన్ని తలనొప్పులను ఎందుకు తెచ్చిపెట్టుకుంటుంది? కాబట్టి ఆ హామీని చంద్రబాబు కచ్చితంగా నెరవేర్చగలరన్న నమ్మకం ఎవరికీ లేదు. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి లొంగి వచ్చేట్టు చెయ్యగల బలం టీడీపీకి లేదు. ఆ మాటకొస్తే కేంద్రంలో ఇవాళ బీజేపీకి ఏ మిత్ర పక్షం అవసరమూ లేదు. మరి కాపు సామాజిక వర్గం చంద్రబాబు మాటలను ఎలా నమ్మాలి? పోనీ బీసీలను సముదాయించి సమస్య పరిష్కారానికి కృషి చేయగలరా? అంటే అదీ సాధ్యం కాదని తేలిపోయింది. టీడీపీ శాసనసభ్యుడు ఆర్ కృష్ణయ్య స్వయంగా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటున్నారు. బీసీ జాబితా ఏమన్నా ధర్మసత్రం అనుకు న్నారా? అని కృష్ణయ్య కన్నెర్ర చేశారు కూడా.

 

 తన  సొంత పార్టీ శాసన సభ్యుడి మైండ్‌సెట్‌నే చంద్రబాబు ఎందుకు మార్చలేక పోతున్నట్టు? బహి రంగంగా సవాలు చేస్తున్న కృష్ణయ్య మీద ఎటువంటి చర్యా తీసుకోకపోవ డమే కాదు, కనీసం మందలించకుండా మౌనం వహిస్తున్న ముఖ్యమంత్రి వైఖరిని చూసి చాలా మంది ఆయనే కృష్ణయ్య చేత అలా మాట్లాడిస్తున్నా రేమో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కరవమంటే కాపులకు కోపం, విడవమంటే బీసీలకు కోపం అన్న చందంగా తయారైంది. ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా వెనకా ముందు ఆలోచించకుండా చేసే వాగ్దానాలు చాలా వరకు ఇటువంటి తల నొప్పులే తెచ్చి పెడతాయి. నిజానికి ఈ పాపం కాంగ్రెస్ పార్టీదే. కాపులను గతంలో రెండుసార్లు బీసీల జాబితాలో నుంచి తొలగించి పుణ్యం కట్టుకున్నది కాంగ్రెస్ ముఖ్యమంత్రులే.

 

 కాపుల భావోద్వేగాలతో ఆడుకోవడం చేటు

 ఇక మొదటి రోజున ఇది సాధ్యం కాదు అన్న ధోరణిని  వ్యక్తం చేసిన చంద్ర బాబు వారం తిరిగే సరికి ముద్రగడ దీక్ష తదనంతర పరిణామాల కారణంగా అన్నిటికి సరే అంటున్నారు. ఇవి, కాపుల ఉద్యమం సద్దుమణిగేందుకు చెబుతున్న మాటలేనా లేక నిజాయితీగా పరిష్కారానికి ప్రయత్నిస్తారా? అన్న సందేహం చాలా మందిలో కలుగుతున్నది. ఇప్పటికి నలుగురు ఆత్మ బలి దానాలకు పాల్పడ్డారు. ఆ సామాజిక వర్గం భావోద్వేగాలతో ఆటలాడుకో వడం ప్రభువులకు మంచిది కాదు. మొదట్లోనే చెప్పినట్టు ముద్రగడ దంపతుల చేత దీక్షను విరమింపజేయడం కోసం పాత హామీలపై ఇచ్చిన సరికొత్త హామీల వల్ల ప్రస్తుతానికి కాపు సామాజిక వర్గం కొద్ది మాసాల పాటూ శాంతించవచ్చు. కానీ వాటిని నెరవేర్చకపోతే మాత్రం కథ మళ్లీ మొదటికే వస్తుంది. అదలా ఉంటే, రేపటి నుంచి రోడ్డెక్కనున్న బీసీలను చంద్రబాబు  ఎలా సముదాయిస్తారో చూడాలి.

 

 ఇంతకూ ముద్రగడ దీక్ష ఎందుకు విరమించినట్టు? తన మీద ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తి వేయించుకోడం తప్పించి మరేమీ లేదు అని మరో కాపు నాయకుడు మాజీ మంత్రి హరిరామ జోగయ్య వ్యాఖ్యానించారు. నిజానికి అది సాధ్యం కాని పని. తుని కాపు గర్జన సందర్భంగా జరిగిన విధ్వంసంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు తగలబడిన ఘటన, పోలీస్ స్టేషన్లపై దాడులు, పోలీసులను గాయపర్చటం వంటి ఘటనల మీద కేసులు ఉండవు అని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి లేదా ఆయన తరఫున రాయబారం నెరపిన మంత్రులు, నాయకులు ఎవరయినా ఇచ్చారా? అట్లా ఇచ్చి ఉంటే మళ్లీ ఒక మోసానికి తెర లేచినట్టే లెక్క. అదలా ఉంటే, తుని ఘటనలపై దర్యాప్తు చేయించి బాధ్యులపై కేసులు పెడతామని చంద్రబాబు  అన్నారు. ఆ దర్యాప్తు ఏ కోణ ంలోంచి జరగబోతోందో. అందులో ఎవర్ని బాధ్యులను చేసి ఎవరిని అక్రమంగా కేసులలో ఇరికించబోతున్నారో ముఖ్యమంత్రి మాటల్లోనే స్పష్టం అవుతున్నది. అసలు దోషులను వదిలేసి, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలను  తప్పుడు కేసుల్లో ఇరికించడం టీడీపీ అధినేతకు కొత్తేమీ కాదు. అందుకే ఆయన తొలిరోజు నుంచీ పదేపదే పులివెందుల, వైఎస్సార్ కాంగ్రెస్ రెండు పేర్లే పలవరిస్తున్నారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఇప్పుడు రెండు మార్గాలు న్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి రాజ్యాంగ సవరణ ద్వారా కాపులను బీసీలలో చేర్చి ఆ వర్గాన్ని శాంతింపజేయడం లేదా 2019 ఎన్నికల్లో ఆ వర్గం ఆగ్రహాన్ని చవి చూడ టం. ఇప్పటికే చంద్రబాబు వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న బీజేపీ ఈ సమస్య నుంచి ఆయనను గట్టెక్కిస్తుందా?

 - దేవులపల్లి అమర్

 datelinehyderabad@gmail.com

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top