పాక్‌ను ఏకాకిని చేయడమెలా?

పాక్‌ను ఏకాకిని చేయడమెలా? - Sakshi


దౌత్యపరంగా పాకిస్తాన్‌ను ఏకాకిని చెయ్యడమనేది పైకి చెప్పినంత సులభం కాదు. అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు పావుగా ఉన్న పాకిస్తాన్‌పై చర్యలు తీసుకోవాలంటే మన విదేశీ విధానం తీవ్ర కసరత్తు చేయాల్సి ఉంది.

 

 ఉడీ సైనిక స్థావరంపై ఉగ్ర వాదుల దాడిలో 19 మంది భారత సైనికులు తమ ప్రాణా లను బలి చేసిన తర్వాత భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరాకాష్టకు చేరుకుంది. ఈ దాడి ఐక్య రాజ్యసమితి సాధారణ సభలో తీవ్ర చర్చకు తావిచ్చింది. కశ్మీర్‌లో భారత సైనికుల దాడిలో హతమైన హిజ్బుల్ ఉగ్రవాది బర్హాన్ వానిని ఐరాస సభలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమరుడిగా వర్ణించారు. అంతే కాకుండా కశ్మీరులో ప్రజలను వధించడం, అంధత్వానికి గురిచేయడం, గాయపర్చటం ద్వారా భారత భద్రతా బలగాలు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని షరీఫ్ ఆరోపించారే తప్ప, సరిహద్దుల్లో చొరబాటు గురించి, పాక్ ఆక్రమిత కశ్మీరులో ఉగ్రవాద శిబిరాల మూసివేత విషయంలో తామేం చర్యలు తీసుకున్నా మన్న అంశంపై పల్లెత్తు మాట అనలేదు.

 

 ఈ రెండు అంశాలకు సంబంధించి తగు చర్య తీసు కుంటామంటూ వివిధ సందర్భాల్లో పాకిస్తాన్ ప్రభు త్వాలు వాగ్దానం చేస్తూవచ్చాయి. ప్రత్యేకించి కశ్మీర్ అధీన రేఖ  వద్ద ఉగ్రవాదుల కదలికలను అడ్డుకుంటా మని నాటి పాక్ అధ్యక్షుడు ముషారఫ్.. 2002లో పాక్‌ను సందర్శించిన అమెరికా విదేశాంగ శాఖ ఉప కార్యదర్శి రిచ్చర్డ్ ఆర్మిటేజ్‌కు వాగ్దానం చేశారు. ఆర్మి టేజ్ 2003లో మళ్లీ పాక్‌లో పర్యటించినప్పుడు కూడా ముషారఫ్ హామీ ఇస్తూ పీఓకేలోని ఉగ్రవాద శిబి రాలను మూసివేస్తామని చెప్పారు. కానీ ముషారఫ్ ఇచ్చిన ఆ వాగ్దానాలు ఏమయ్యాయి? భారత్‌కు పాక్ ఇచ్చిన హామీల విషయం సరే.. అమెరికన్ అత్యున్నతా దికారుల ముందు చేసిన వాగ్దానాలను కూడా పాకిస్తాన్ గౌరవించలేదు, బాధ్యతగా వ్యవహరించలేదు. వాటిని నేటికీ అమలు చేయలేదు. ప్రత్యేకించి ఈ అంశంపైనే వివిధ అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌ను వేలెత్తి చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

 ఉడీ నేపథ్యంలో పూర్తి స్థాయి దాడి చేయటం నుంచి దౌత్యపరంగా పాకిస్తాన్‌ను ఒంటరిని చేయడం వరకు భారతప్రభుత్వం పలు చర్యలు చేపట్టనుందని పలువురు భావిస్తున్నారు. భారత పాకిస్తాన్ రెండు దేశాలూ అణ్వస్త్ర దేశాలే కాబట్టి యుద్ధం జరిగితే అపార నష్టం, అధిక మరణాలు చోటుచేసుకునే ప్రమాదం ఉన్నందున సైనిక చర్యకు తనదైన పరిమితులున్నాయి. పైగా, ఒకసారి సైనిక ఘర్షణ మొదలైతే, యుద్ధంలో మునిగిన రెండు దేశాలే కాకుండా ఇతర అగ్రరాజ్యాలు కూడా తమ అనుకూల దేశానికి మద్దతుగా కలిసివచ్చేం దుకు అవకాశాలున్నాయి. కాబట్టే పాకిస్తాన్‌ను దౌత్య పరంగా ఏకాకిని చేయడ మే ఉత్తమమని చాలామంది భావిస్తున్నట్లుంది. అయితే పాక్‌ను దౌత్యపర ఏకాకి  తనంలోకి నెట్టడం పైకి చెప్పినంత సులభం కాదు.

 

 ఆర్థిక ఆంక్షలు, వాణిజ్య నిబంధనలు విధించడం, అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తున్న దేశానికి.. అంతర్జాతీయ కమ్యూనిటీ లేదా ఐరాసలోని అధిక దేశాలు ఆర్థిక సహాయాన్ని నిలిపివేయటం వంటి చర్య లను దౌత్యపరమైన ఏకాంతంగా చెబుతున్నారు. అయితే దౌత్యపరంగా పాక్‌ను ఏకాకిని చేయడానికి ముందుగా కొన్ని కఠిన వాస్తవాలను, చారిత్రిక సత్యా లను పరిగణించాల్సి ఉంది. ఆర్థికంగా సుస్థిరంగా ఉన్న పాకిస్తాన్ అటు అమెరికా ప్రయోజనాలకూ, ఇటు మొత్తం ఆగ్నేయాసియా సుస్థిరతకూ కీలకమైనది.

 

 సోవియట్ యూనియన్ 1979లో ఆప్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన నాటినుంచి సోవియట్ విస్తరణవాదాన్ని అడ్డుకోవడానికి పాకిస్తాన్‌ని ఒక ప్రాబల్య ప్రాంతంగా అమెరికా గుర్తిస్తూ వచ్చింది. నాటి రీగన్ ప్రభుత్వం 1981లో పాకిస్తాన్‌కు 3.2 బిలియన్ డాలర్ల మేరకు ఆర్థిక, సైనిక సహాయ ప్యాకేజీని అందించింది. నాటి  నుంచి ఆప్ఘనిస్తాన్‌లో సైనికచర్యలకుగాను అమెరికా, దాని మిత్రులకు కీలకమైన సైనిక సామగ్రి సరఫరా దేశంగా పాకిస్తాన్ మారిపోయింది. ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయడంలో పాకిస్తాన్ పాత్రను గుర్తిస్తున్నప్ప టికీ పాక్‌ను, అమెరికా తన కుడిభుజంగానే  చూస్తోంది.

 

 పైగా భారత్‌కు చిరకాలంగా మిత్రదేశంగా ఉన్న రష్యా విదేశీ విధానం గత ఏడాది కాలంగా పాకిస్తాన్      వైపు మొగ్గు చూపుతోంది. ఇరుదేశాలు సైనిక విన్యాసా లకు కూడా సిద్ధపడ్డాయి. అమెరికా-భారత్ మధ్య స్నేహం పెరుగుతున్న క్రమంలోనే ఈ పరిణామం నెలకొంది మరోవైపున తొలినుంచీ పాక్‌ను శాశ్వత మిత్ర దేశంగా పేర్కొంటున్న చైనా కూడా సైనిక దాడి జరిగితే తాను పాక్‌ను బలపరుస్తానని బహిరంగంగా ప్రకటించింది. అంటే  ప్రపంచ ఆధిపత్య శక్తులతో పాక్ నెరుపుతున్న సంబంధాలను జాగ్రత్తగా అంచనా వేయవలసి ఉంది. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్ర వాద సంస్థలపై, దాని అణు కార్యక్రమాలపై నిషేధం విషయంలో పలు అంతర్జాతీయ, ప్రాంతీయ వేదికలను సంప్రదించాల్సి ఉంది.

 

మొత్తం మీద చూస్తే పాక్‌ను దౌత్యపరంగా ఏకాకి చేయడం అనేది పైకి చెప్పినంత సులభం కాదు. ప్రపంచ, రాజకీయ, ఆర్థిక, సైనిక సంక్లిష్టతల మధ్య ఈ అంశాన్ని ముందుపీటికి తీసుకురావటంలో భారత విదే శాంగశాఖ అత్యంత నైపుణ్యంగా వ్యవహరించవలసి ఉండటం అవశ్యం.

 

- వ్యాసకర్త రిటైర్డ్ ఐపీఎస్ అధికారి,

ఐక్యరాజ్యసమితి పూర్వ ప్రధాన భద్రతా సలహాదారు 

మొబైల్: 08801-676660

 - కేసీ రెడ్డి

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top