అత్యున్నత రాజకీయాల్లో అనుచిత వ్యాఖ్యలా?

అత్యున్నత రాజకీయాల్లో అనుచిత వ్యాఖ్యలా? - Sakshi


అవలోకనం

మన అత్యున్నత రాజకీయాలు ఇప్పటికీ మర్యాదపూర్వకంగా, ఔచిత్యభరితంగా ఉంటున్నాయి. భారత ఉప రాష్ట్రపతిపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఆ సాంప్రదాయాన్ని భగ్నం చేశాయని నా నమ్మకం. అన్సారీ అరబ్బు ప్రపంచంలో వృత్తి దౌత్యవేత్తగా గడపడాన్ని, విద్యావేత్తగా పనిచేయడాన్ని మోదీ ఉద్దేశపూర్వకంగానే.. తమ మతం పట్ల అసహనంపై అన్సారీ ఆలోచనలతో ముడిపెట్టారు. తద్వారా ఆయన అన్సారీని, ముస్లింగా ఆయనకున్న గుర్తింపు స్థాయికి కుదించి వేస్తున్నారు.



తరచుగా మన దేశంలో ఎవరైనా ఏదైనా విషయాన్ని చెప్పినపుడు, దాన్ని ఎవరు చెప్పారనేదానికంటే ఆ విషయం ఏమిటనే దానికి తక్కువ ప్రాముఖ్యత లభిస్తుం టుంది. భారతదేశంలోని ఎక్కువ అసాధారణమైన విషయాలలో ఇది ఒకటి. ప్రపంచంలోని చాలా భాగాల విషయంలో కూడా ఇది కొంత వరకు నిజమే. కానీ, మన దేశంలో వివాదాస్పదమైన అంశాన్ని దేన్నయినా చెప్పినప్పుడు దాని ప్రధాన ఉద్దేశ్యాన్ని ఆ అభిప్రాయాన్ని గలిగిన వ్యక్తి గుర్తింపునకు ఆపాదిస్తారు. అందువల్లనే, నేను పాటీదార్ల రిజర్వేషన్లను సమర్థిస్తే, అందుకు కారణం నేను పటేల్‌ను కావడమేనని, నా సొంత కులస్తుల తరఫున మాట్లాడుతున్నానని అంటారు. నిరసనకారులపై తుపాకులు ప్రయోగించొద్దంటే, అతడు లేదా ఆమె కశ్మీరీ కావడం వల్లనే, వారు మొత్తం దేశ ప్రయోజనాన్ని విస్మరించి తమ వారికి మద్దతు తెలుపుతున్నారని అంటారు. సంకుచిత దృక్పథం కలవారిగా పిలవడం పరిపాటిౖయెన భారత ముస్లింలే అతి ఎక్కువగా ఆలాంటి ఆరోపణలకు గురయ్యే అవకాశం ఉంది.



 అసలు వారు ఏమి చెబుతున్న దేమిటో పరిశీలించకుండానే ఇది జరిగిపోతుంటుంది. నేను చెబుతున్న ఈ విషయం నిత్యం మన రోజువారి జీవితాల్లో, టీ వీ వార్తల్లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి దాన్ని నేను మరింతగా వివరించాల్సిన పని లేదు. అయితే, ఈ ధోరణి, మర్యాదపూర్వకంగానూ, ఔచిత్యభరితంగానూ ఉండే మన అత్యున్నత స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించడాన్ని మనం ఇంకా చూడలేదు. భారత ఉపరాష్ట్రపతిపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఆ సాంప్రదాయాన్ని భగ్నం చేశాయని నా నమ్మకం.



ఉపరాష్ట్రపతి రాజ్యసభ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్‌ థాపర్‌ ‘‘...ముస్లింలలో భయం నెలకొంది, వారు అభద్రతతో ఉన్నట్టు భావిస్తున్నారు. భారత్‌ ముస్లింల మనోభావాల గురించి ఇది సరైన అంచనాయేనా లేక అతిశయీకరించినదా? ’’ అని ప్రశ్నించారు. హమీద్‌ అన్సారీ : ‘‘దేశంలోని విభిన్న వర్గాల నుంచి వినవస్తున్న వాటినన్నిటినీ బట్టి చూస్తే నిజమే. అది సరైన అంచనాయే. బెంగళూర్‌లో కూడా నేను అదే విషయాన్ని వింటున్నాను, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా విన్నాను. ఉత్తర భారతంలో మరింత ఎక్కువగా విన్నా. ఇబ్బందిలో ఉన్న భావన, అభద్రతా భావం మెల్లగా వ్యాపిస్తున్నాయి.’’ ఈ వాక్యాన్ని పట్టుకుని, మొదటి పేజీ వార్తను చేసేశారు. అన్సారీ ఆ ఇంటర్వ్యూలో ఎంత ఆచి తూచి, జాగ్రత్తగా మాట్లాడారో పూర్తిగా తెలుసుకోవాలంటే ఆ ఇంటర్వ్యూను చూడటమో లేక చదవడమో చేయాలి. ఆయన చెప్పినదాన్లో ఏ మాత్రమూ తప్పు లేదు. ఆయన, తాను చూస్తున్న, వింటున్న వాటి గురించిన తన అంచనాను చెబుతున్నారు. ఆయన ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదు కూడా. కానీ, బీజేపీ నుంచి వచ్చిన ప్రతిస్పందన అత్యంత దుర్మార్గమైనది, తీవ్ర మతతత్వ పూరితమైనది. మోదీ మాటలు కలతపరచాయి, విచారం కలిగించాయి. అన్సారీ పదవిలో ఉన్న ఆఖరు రోజున మోదీ ఆయనను అపహాస్యం చేశారు. మొదటి నుంచి అన్సారీ బీజేపీ దాడులకు ఎరగానే ఉండేవారని పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ఆ పార్టీ కార్యదర్శి రామ్‌ మాధవ్, అన్సారీ నడవడికపై కొన్ని అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలను చేశారు. మాధవ్‌ చెప్పినది తప్పని తేలినాక ఆయన వాటిని తన ట్విటర్‌ ఖాతాను తొలగించారు.



ఇదంతా జరుగుతుండగా కూడా అన్సారీ మర్యాదపూర్వకంగా, హుందాగానే కనిపించారు. ఆయన పదవీ కాలం ఆఖరు రోజన, మోదీ ఆయన మొహం మీదే ఇలా మాట్లాడారు. ‘‘వృత్తి దౌత్యవేత్త కరచాలనానికి లేదా నవ్వుకు అర్థం ఏమిటో వెంటనే అవగతం చేసుకోవడం కష్టం కాబట్టి, వృత్తి దౌత్యవేత్తలంటే అర్థం ఏమిటో ప్రధానమంత్రి అయినాకే’’ తెలుసుకున్నానని అన్నారు. అన్సారీ కుటుం బానికి కాంగ్రెస్‌తోనూ, ఖిలాఫత్‌ ఉద్యమంతోనూ సుదీర్ఘమైన అనుబంధం ఉందని అన్నారు. దౌత్యవేత్తగా ఆయన మధ్యప్రాచ్యంపైనే దృష్టిని కేంద్రీకరిం చారు, ‘‘ఒక విధమైన వాతావరణం, ఒకే విధమైన భావజాలం, ఒకే రకమైన మనుషుల’’తో కలసి ఉన్నారని పేర్కొన్నారు. పదవీ విరమణ తర్వాత కూడా అన్సారీ చాలావరకు మైనారిటీ కమిషన్, అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయాలలో పనిచేశారు అంటూ మోదీ కొనసాగించారు. ‘‘కొంత కాలంగా (అన్సారీ ఉపరాష్ట్రపతిగా ఉన్న పదేళ్లు) మీరు లోలోపలే కొంత మధన పడుతూ ఉండి ఉంటారు. ఇక మీదట మీరు ఆ సందిగ్ధాన్ని ఎదుర్కోవాల్సి రాదు. మీరిక స్వేచ్ఛగా ఉన్నాననే భావనతో ఉండవచ్చు, మీకు పనిచేసే అవకాశమూ దొరుకుతుంది, మీ భావజాలానికి అనుగుణంగా ఆలోచించుకోండి, మాట్లాడండి’’అనే ఎత్తిపొడుపు మాట లతో మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.



ప్రధాని అభిప్రాయం ప్రకారం అన్సారీకి ఉన్న భావజాలం ఏదై ఉంటుంది? మోదీ అది చెప్పలేదు. అయన ఆ విషయాన్ని చెప్పి ఉండాల్సిన అవసరమూ లేదు. మోదీ మాటల ఉద్దేశం ఏమిటో గ్రహించలేకపోవడం అసాధ్యం. అన్సారీ అరబ్బు ప్రపంచంలో వృత్తి దౌత్యవేత్తగా గడపడాన్నీ, విద్యావేత్తగా పనిచేయడాన్నీ మోదీ ఉద్దేశపూర్వకంగానే తమ మతం పట్ల ఉన్న అసహనం గురించిన ఆయన ఆలోచనలతో ముడిపెట్టారు. తద్వారా ఆయన అన్సారీని, ముస్లింగా ఆయన కుండే గుర్తింపు స్థాయికి తగ్గించివేస్తున్నారు. మోదీ మద్దతుదార్లు ఆయన చెప్పినదాన్ని పట్టుకుని అన్సారీని అత్యంత అసభ్యకరమైన రీతిలో దాడిని సాగించారు.



‘‘ముజ్‌పే ఇల్జామ్‌ ఇత్నే లగాయే గయే, బేగునాయీ కె అందాజ్‌ జాతే రహే’’ నాపై ఎన్ని ఆరోపణలు చేశారంటే, ఇప్పుడిక నిర్దోషినని రుజువు చేసుకోవడమే అసాధ్యం అని అర్థం. పదవిని వీడుతున్న ఒక ఉపరాష్ట్రపతి నోట ఇలాంటి మాటలు వస్తే భారతీయులంతా ఆందోళన చెందవద్దా? బహుశా మనం వాటి గురించి పెద్దగా ఆలోచించం. లేదా, ఆలోచించినా, ఆయన చేసిన హెచ్చరికను మనలో చాలా మందిమి విస్మరిస్తాం. ఈ వాతావరణంలో భారత ముస్లింలు అభద్రతను అనుభవించరా? అది లెక్కలోకి రాదు. భారత ఉపరాష్ట్రపతి ఆ మాటలు ఆ హెచ్చరికను చేశారూ అంటే అది ఆయన కూడా ఒక ముస్లిం కాబట్టి మాత్రమే.



వ్యాసకర్త కాలమిస్టు, రచయిత

ఆకార్‌ పటేల్‌

aakar.patel@icloud.com

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top