విపత్తుల ముంపులో విశ్వనగరి

విపత్తుల ముంపులో విశ్వనగరి - Sakshi


ఎన్ని ఆకాశహర్మ్యాలు నిర్మించినా, ఎన్ని స్కైవేలు కట్టినా నేల నీట మునుగుతుంటే అది విశ్వనగరం ఎట్లా అవుతుంది? ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆయింట్‌మెంట్ పూస్తే, మందు గోలీ వేస్తే తగ్గే స్థితి దాటిపోయింది. జబ్బు ముదిరింది, ఆపరేషన్ ఒక్కటే మార్గం. ఆపరే షన్ మధ్యలో ఆపితే రోగి ప్రాణాలకే ముప్పు అని ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు. ప్రతిపక్షాలు, మీడియా కూడా ఈ ఆపరేషన్ విజయవంతం కావాలని కోరుకోవాలి, అందుకోసం ప్రభుత్వానికి సహకరించాలి.

 

 నాలుగు వందల ఇరవై ఐదేళ్ల పైబడిన చరిత్ర గల హైదరాబాద్ నగరం పదిరోజుల పాటు ఆగమాగమైంది. అతలాకుతలమైంది. అడ్డగోలు మాటలు పడ్డది. ఉక్కిరిబిక్కిరైంది. ఇప్పుడిప్పుడే కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నది. అతి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో చాలా ప్రాంతాలు జలమయమ య్యాయి. నగర జీవనం అస్తవ్యస్తమైంది. వేల సంఖ్యలో ప్రజలు రోజుల తరబడి ఆకలిదప్పులతో అలమటించవలసి  వచ్చింది. భయంతో నిద్రాహారాలు మానుకుని గడపాల్సివచ్చింది. హైదరాబాద్‌కు గడచిన 108 ఏళ్ల చరిత్రలో ఇంత దారుణమైన పరిస్థితి కనీసం నాలుగు సందర్భాలలో ఎదురైంది. ఇది ఐదో అనుభవం. 1908లో మూసీ నదికి వచ్చిన వరదల్లో 15 వేలమంది చనిపోయారు. ఆ తరువాత 1970, 2000 ,2008 సంవత్సరాల్లో కూడా హైదరాబాద్ నగరం భారీ వర్షాల కారణంగా అస్తవ్యస్తమైంది.

 

 నూట ఎనిమిదేళ్ల క్రితం

 సరిగ్గా 108 సంవత్సరాల క్రితం ఇదే రోజున, అంటే 1908, సెప్టెంబర్ 28వ తేదీన మూసీకి వరదలు వచ్చి 15 వేలమందికి పైగా చనిపోయారు. భారీ వర్షాల కారణంగా 1908 కంటే ముందు కూడా దాదాపు 18 సార్లు మూసీ నది పొంగినా అంత తీవ్ర నష్టం వాటిల్లలేదు. 1908 నాటి ఘోర విపత్తు, ఆ తరువాత హైదరాబాద్ నగరం ప్రణాళికా బద్ధమైన అభివృద్ధికి బాటలు వేయ డానికి దారి చూపింది. జంట నగరాలకు మంచినీరు అందించేందుకు అవ సరమైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల నిర్మాణం ఆలో చనా, కార్యాచరణ  ఆ వరదల తరువాతే జరిగింది. 108 ఏళ్ల క్రితం నాటి ఆ ఉప ద్రవాన్ని చూసినవారు బహుశా ఇప్పుడు ఎవరూ లేక పోవచ్చు, కానీ చరిత్ర అయితే ఉంది. చినుకు చినుకుగా మొదలై, కుండపోతగా, ఆకాశం బద్దలయిన రీతిలో కురిసిన భారీ వర్షం కారణంగా మూసీకి వచ్చిన నాటి వరద అన్ని వేల మందిని పొట్టన పెట్టుకున్నది.



80 వేల మంది నిరాశ్రయు లయ్యారు. ఆనాటి నిజాం పాలకుడు మీర్ మహబూబ్ అలీ ఖాన్ తన రాజ మహళ్ల ద్వారాలు తెరిచి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాడు. 15 రోజుల్లో ఆరు లక్షలమందికి ఆయన వంటశాలల్లో భోజనం తయారు చేయించి పెట్టాడు. ఆ తరువాత మూడు సందర్భాల్లో ఇటువంటి విపత్తు సంభవించిన ప్పుడు కూడా ప్రభుత్వాలు కొన్ని ఆలోచనలు చేశాయి, కొన్ని ప్రణాళికలు రచించాయి, కార్యక్రమాలు రూపొందించాయి, కమిటీలు వేశాయి. ఆ కమి టీల నివేదికలు కొన్ని అమలయ్యాయి, ఎన్నో యథావిధిగానే మూలన పడ్డారుు.

 

 1970లో ఒక్కరోజులో పడిన భారీ వర్షానికే నగర జనజీవనం స్తంభించి పోయింది. అప్పటికైతే హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజలకు గుర్తుండే ఉంటుంది. ‘పానీ ఆరా భాగో’(నీళ్ల్లొస్తున్నాయి, పరుగెత్తండి) అన్న మాటతో, గండిపేట తెగిందన్న పుకారు వ్యాపించి నగర ప్రజలంతా రోడ్ల మీదికి వచ్చి దిక్కుతోచక పరుగులు పెట్టారు. నగరం మునిగిపోతుందన్న భయంతో పెద్ద సంఖ్యలో జనం నౌబత్ పహాడ్ (ఇప్పుడు బిర్లా మందిర్ కట్టిన స్థలం) ఎక్కి కూర్చున్నారు. అది పుకారే అని జనాన్ని నమ్మించి మామూలు పరిస్థితులు నెలకొల్పడానికి ఆనాటి ప్రభుత్వానికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఒక జాతీయ ఆంగ్ల దినపత్రిక బ్యూరో చీఫ్ ఈ పుకార్లను విశ్వసించి మద్రాస్‌లోని తన కేంద్ర కార్యాలయానికి వర్తమానం కూడా పంపేశాడు. హైదరాబాద్ కొట్టుకుపోతున్నది కాబట్టి ఆఫీసు మూసేస్తున్నా అనే సందేశం పంపించి తాళాలు వేసుకుని ఇంటికి వెళ్లిపోయారు.

 

 ఫలితంగా మరునాడు ఆయన ఉద్యోగం ఊడింది. అది పుకారో, నిజమో తెలుసుకుని ప్రజలకు సమాచారం అందించాల్సిన జర్నలిస్ట్ దుకాణం మూసేస్తే ఎట్లా అని ఆనాటి ఆ పత్రిక సంపాదకులు ఆగ్రహించారు. ఈ సంఘటన జరిగింది కూడా సెప్టెంబర్ నెల లోనే, అయితే 24న. గండిపేట తెగింది, నీళ్లొస్తున్నాయి పరుగెత్తండి అనే పుకారు ఎవరు సృష్టించారో కానీ జనం భయపడటానికి మాత్రం కారణం ఉంది. అంతకు మూడురోజుల ముందు సెప్టెంబర్ 21, 22 తేదీల్లో హైదరా బాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా 100 మందికి పైగా చనిపోయారు. ఆ ఘటన నుండి తేరుకోక ముందే ఈ పుకారు పుట్టడంతో జనం నమ్మారు.

 

 నేడూ అదే దుస్థితి

 హైదరాబాద్ నగరాన్ని నేనే అభివృద్ధి చేశానని పదే పదే ఊదరగొట్టే  చంద్ర బాబునాయుడు  ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలోనే, అంటే  2000 సంవత్స రంలో మరొకసారి ఆగస్టు 24న హైదరాబాద్ భారీ వర్షాలకు నీట ముని గింది. ఆయన మాట్లాడితే హైటెక్ సిటీ కేసి చూపిస్తారు తన మార్కు అభి వృద్ధికి కొండగుర్తుగా. అదే హైటెక్ సిటీ చుట్టుపక్కల ఇటీవలే నిర్మించిన లేదా అభివృద్ధి చెందిన విలాసవంతమైన ప్రాంతాలు కూడా నీట మునిగాయని ఆనాటి పరిస్థితి మీద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన నివే దికలో పేర్కొన్నారు.



ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం సమస్యను పట్టించుకో కుండా అరకొర, తాత్కాలిక చర్యలు చేపట్టిందే తప్ప శాశ్వత పరిష్కారాల మీద దృష్టి పెట్టలేదు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని బుకాయించడం తప్ప మౌలిక సమస్యల మీద ఆయన దృష్టి పెట్టిన దాఖలాలే లేవు. 2000 సంవత్సరం ఘటన తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కిర్లోస్కర్ కమిటీ తన నివేదికను మూడేళ్ల తరువాత సమర్పించేసరికి ఆనాటి ప్రభుత్వం ఎన్నికల హడావుడిలో పడి, దాన్ని అటకెక్కించింది.

 

 2008లో మరొకసారి భారీ వర్షాల కారణంగా హుస్సేన్‌సాగర్‌లో నీటిని వదలాల్సి వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మళ్లీ ఇటీవలి భారీవర్షాలకు, ఎనిమిదేళ్ల తరువాత మరొకసారి హుస్సేన్‌సాగర్ నీటిని వదలాల్సివచ్చింది. నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం ఆరులక్షల జనాభా కోసం ఉద్దేశించిన నగరం ఇవాళ కోటిమందికి ఆవాసమైంది. మరి పెరిగిన జనాభాకు అనుగుణంగానే మౌలిక సదుపా యాల కల్పన కూడా జరిగిందా? జరగలేదు. దానికి ఎవరు బాధ్యత వహిం చాలి? రెండున్నరేళ్ల క్రితం తెలంగాణ  రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్ నాయ కత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ రాష్ట్రాన్ని పాలించిన రాజకీయ పార్టీలు బాధ్యత వహించాలా?  కొన్నిమాసాల క్రితం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఘన విజయం తరువాత మున్సిపల్ శాఖను చేపట్టిన యువమంత్రి కేటీ రామారావు బాధ్యత వహించాలా?

 

 అధికారుల అసంబద్ధ వైఖరి

 నిర్ణయాలు చేసేది రాజకీయ నాయకత్వమే అయినా, సరైన ప్రణాళికలు రూపొందించి వాటిని సక్రమంగా అమలు పరచాల్సిన అధికార యంత్రాంగం ఈ విపత్తులన్నిటికీ జవాబుదారీ కావాలి. హైదరాబాద్ నగరంలో చెరువులన్నీ ఆక్రమణలకు గురయ్యాయి, నాలాలు మూసేసి నిర్మా ణాలు జరిపారు, అనుమతిని మించి బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. వీటన్నిటికీ బాధ్యులు ఎవరు? ఈ నిర్మాణాలన్నిటికి అనుమతులు ఇచ్చింది ఎవరు? వారు కదా శిక్షార్హులు! ఆశ్చర్యం కలిగించే రెండు విషయాలు ఇక్కడ మాట్లాడుకోవాలి.

 

 అక్రమ నిర్మాణాల కారణంగా ఈ ఉప ద్రవం ఏర్పడిందని ఒకపక్క మొత్తుకుంటున్న సమయంలోనే, ప్రజలు ఇంకా  ఇక్కట్లు పడుతున్న సమయంలోనే ఒక టౌన్ ప్లానింగ్ అధికారి భారీ వర్షా ల్లోనే లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడని వార్తలొచ్చారుు. కక్కుర్తికి హద్దులు న్నాయా? ప్రజాసేవ చెయ్యాల్సిన ఒక ఐపీఎస్ అధికారిణి తన అధికార బలం చూపి వాన నీటిని మళ్లించి ఒక కాలనీ నీట నానడానికి కారణమైందట. నాలాల మీద అక్రమ కట్టడాలను కూల్చబోతే ఒక అధికార పార్టీ కార్పొరేటర్ స్వయంగా అడ్డుపడ్డాడట. ఇటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఉంటే ముఖ్యమంత్రి ఎంత చండశాసనుడైతే మాత్రం ఏం లాభం? అక్రమ కట్టడా లకు బాధ్యుల మీద చర్యలు తీసుకుంటే జీహెచ్‌ఎంసీలో ఒక్క అధికారి కూడా మిగలడు అని ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

 

 మరోపక్క రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రజలు తప్పు దిద్దుకోవాలి, ఇల్లుకట్టుకున్నది మనం, ప్రభుత్వం కాదు కదా అని హితవు చెపుతున్నారు. నిజమే, మరి ప్రజలు ఆ తప్పు చెయ్యకుండా నిలు వరించడం కోసం ప్రజాధనాన్నే జీతాలుగా తీసుకుంటున్న అధికార యంత్రాంగం అవినీతికి అలవాటుపడి అడ్డగోలు నిర్మాణాలను చూస్తూ ఊరుకుంటే వారికేం బాధ్యత లేదా? గవర్నర్ గారు నిందించవలసినది వారిని కదా! నాలాల మీద ఇల్లు కట్టుకోడానికి పర్మిషన్ ఎందుకు తీసుకున్నా రని ప్రజలను ప్రశ్నించే బదులు పర్మిషన్ ఎందుకు ఇచ్చారని ప్రభుత్వ అధి కారులనూ, సిబ్బందినీ గవర్నర్ గారు నిలదీస్తే బాగుంటుంది.

 

 ప్రస్తుతం ఉత్పన్నమయిన పరిస్థితి నుంచి మనం నేర్చుకుంటున్న పాఠం ఏమిటి? అని ప్రభుత్వ యంత్రాంగాన్నీ, మంత్రులనూ, నగర మేయర్‌నూ అడిగానని ముఖ్యమంత్రి చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. పాలకులు పదే పదే తమకు తాము వేసుకోవాల్సిన ప్రశ్న. పరిస్థితి మారి మళ్లీ ఇటువంటి విపత్కర పరిస్థితి రాకుండా చూడటానికి కఠినంగా, నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం, ఎవరినీ వదలం అని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించిన నిర్ణయాలన్నిటిని తరతమ భేదాల్లేకుండా, బీదా గొప్ప తేడాల్లేకుండా అమలు చేసినట్టయితే ఆయన పదే పదే చెపుతున్న విశ్వనగరం రూపుకడుతుంది.

 

ఎన్ని ఆకాశహర్మ్యాలు నిర్మించినా, ఎన్ని స్కైవేలు కట్టినా  నేల నీట మునుగు తుంటే అది విశ్వనగరం ఎట్లా అవుతుంది? ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆయింట్‌మెంట్ పూస్తే, మందు గోలీ వేస్తే తగ్గే స్థితి దాటిపోయింది. జబ్బు ముదిరింది, ఆపరేషన్ ఒక్కటే మార్గం. ఆపరేషన్ మధ్యలో ఆపితే రోగి ప్రాణాలకే ముప్పు అని ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు. ప్రతిపక్షాలు, మీడియా కూడా ఈ ఆపరేషన్ విజయవంతం కావాలని కోరుకోవాలి, అందు కోసం ప్రభుత్వానికి సహకరించాలి. మరోసారి హైదరాబాద్ నీట నానడానికి వీల్లేదు. ఇది ఎవరూ విస్మరించకూడని సత్యం.

 - దేవులపల్లి అమర్

 datelinehyderabad@gmail.com

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top