మైనారిటీలు లెక్కలోకే రారా?

మైనారిటీలు లెక్కలోకే రారా?


జాతిహితం

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల తర్వాత మైనారిటీ ఓటు బ్యాంకులు లెక్కలోకి వచ్చేవి కాకుండా పోయాయి. అయినా, మన ప్రభుత్వం వారి రక్షణకు హామీని కల్పిస్తుంది, వారి సామాజిక పరిస్థితులను మెరుగుపరుస్తుంది. అంతేగానీ, దయచేసి అధికారంలో వాటాను మాత్రం అడగకండి. కాకపోతే ఎప్పటికో ఒకప్పటికి మన సొంత సంకేతాత్మకతా ఏర్పడవచ్చు. అప్పుడు మన సొంత దర్శన్‌ లాల్‌ తయారవుతాడు. అదే జరిగితే, పాక్‌లాగే మనమూ మైనారిటీలు లెక్కలోకి రానే రారు అనే సమాధానాన్నే ఎంచుకున్నట్టు అవుతుంది.



కోర్టుల్లోని మన న్యాయమూర్తుల పద్ధతిని అరువు తెచ్చుకుని నా వాదనను ముందుగా ఉత్త వాస్తవాలను ఏకరువు పెట్టడంతో మొదలెడదాం. ఆ తర్వాత వాదనతో అది మంచి విషయమా లేక చెడ్డ విషయమా అని నిర్ధారిద్దాం. భారత ఉపరాష్ట్రతి పదవి నుంచి మొహమ్మద్‌ హమీద్‌ అన్సారీ నిష్క్రమణ, భారత రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని తెరచింది. గత యాభై ఏళ్లలో మన మైనారిటీలలో ఒక మతం వారు ఒక్కరైనా రాష్ట్రపతి, ఉప రాష్ట్ర పతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, అగ్రశ్రేణి మంత్రులు (హోం, రక్షణ, విదేశాంగ శాఖలు)గా పనిచేసినవారు లేరు. నేను చెప్పింది తప్పని  గూగు ల్‌లో శోధించి నిరూపించాలని మీరు ఉబలాటపడవచ్చేమో. కానీ, నేను పలు స్వల్పకాలిక ప్రభుత్వాలతో సహా నేను ఆ చరిత్రనంతటినీ తిరగేయడమే కాదు, లోతుగా జల్లెడ పట్టేసి మరీ చూసేశాను. మైనారిటీలంటే ముస్లింలే కాదు, క్రైస్తవులు, సిక్కులు కూడానని మరచిపోకండి.



గూగుల్‌ శోధనకు బదులు నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఉన్న వారి పేర్లను పరిశీలించండి. స్వాతంత్య్రానంతర కాలచరిత్రలోనే విశిష్టమైన రీతిలో నేడు మైనారిటీకి చెందిన క్యాబినెట్‌ మంత్రి ఒక్కరే ఉన్నారు. ఆమె, ఎన్‌డీఏ భాగస్వామి అకాలీదళ్‌కు చెందిన హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌. ఆమెకు, అతి ముఖ్యమైన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖను (లేదా అందుకు అసంతృప్తితో ఉన్న ఆమె విధేయులు పిలిచేట్టుగా పచ్చళ్లు, ఊరగాయలు, జామ్‌లు, జ్యూస్‌ల శాఖ) అప్పగించారు. ఇంకా దిగువ స్థాయికి పోయి జూనియర్‌ మంత్రులను పరిశీలిస్తే, మరి కొన్ని పేర్లు కనిపిస్తాయి. సహాయ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ కనిపిస్తారు. సహాయ మంత్రులలోకెల్లా ఆయనే అత్యంత సీనియర్‌.  ఆయనది మైనారిటీ వ్యవహారాల శాఖని గమనించండి. విదేశీ వ్యవహారాల  సహాయ మంత్రిగా ఉన్న ఎంజే అక్బర్‌ పేరు కూడా కనిపిస్తుంది.



పేర్లు, ప్రత్యేకించి క్రైస్తవుల పేర్లు ఒక్కోసారి తప్పుదారి పట్టించొచ్చు గానీ, నాకు మరే ఇతర పేర్లూ కనిపించలేదు. కాబట్టి క్రైస్తవులు ఎవరూ లేకపోవడం కూడా ఈ మంత్రివర్గపు విశిష్టత కాదా? అది కూడా, ప్రధానంగా క్రైస్తవులే ప్రధానంగా ఉండే ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్న ప్పటి పరిస్థితి ఇది. పైగా, దాదాపు పూర్తి క్రైస్తవ రాష్ట్రాలైన మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌లూ, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లూ తప్ప దేశంలోని 24 ఇతర రాష్ట్రాలలో ఎక్కడా మైనారిటీ ముఖ్యమంత్రి లేరు. దీన్ని మరింతగా పొడి గించి చూద్దాం. ఇందిరాగాంధీ ప్రాభవం వెలిగిన కాలం తర్వాత, అత్యంత బలమైన జాతీయ పార్టీగా ఉన్నది మోదీ–అమిత్‌షాల బీజేపీయే. ఆ పార్టీ పదవులలో ప్రముఖంగా కనిపించే మైనారిటీవారు ఎవరు? షానవాజ్‌ హుస్సేన్, ఎస్‌ఎస్‌ ఆహ్లూవాలియా, బహుశా ఆ తర్వాత తేజిందర్‌పాల్‌ బగ్గా. లౌకికవాద పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్, వామపక్షాలు, హిందీ మాట్లాడే ప్రాంతంలోని పార్టీల తీరు కూడా ఈ విషయంలో ఇంతేనంటూ మీరు దీనికి బదులు చెప్పొచ్చు. అయితే అది, భారత మైనారిటీలు అధికార చట్రానికి ఇంత దూరంగా ఎన్నడూ లేవనే నా మొదటి నిర్ధారణను బలో పేతం చేసేదే. దీనికి సంబంధించి మైనారిటీలలో అభద్రతాభావం ఉండటం సమంజసమే.



మెజారిటీలో ఆత్మన్యూనత

వాస్తవాలలో వేళ్లూనుకుని, కాల్పనికతలతో అల్లుకున్న అద్భుతమైన పలు వైచిత్రులను మన రాజకీయాలు ఆవిష్కరిస్తుంటాయి. ఎల్‌కే అద్వానీ, అటల్‌ బిహారి వాజ్‌పేయి (ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్న వరుస క్రమం) తమ పార్టీని 1984 నాటి శిథిలాల నుంచి తమ పార్టీని పునరుజ్జీవితం చేశారు. మైనారిటీల పట్ల హిందూ మెజారిటీలో ఉన్న ఆత్మన్యూనతా భావం అనే అంశాన్ని కేంద్రంగా చేసుకుని వారు ఆ పనిని చేపట్టారు. అది కాల్పనిక మైనదిగానీ లేదా విజయవంతంగా సాగించిన ప్రచారంతో రేకెత్తించిన తమపై తాము జాలిపడే «సామూహిక ధోరణిగానీ కాదు.



దశాబ్దాల తరబడి సాగిన కాంగ్రెస్‌ పాలనలో నెహ్రూ, దృఢమైనదే అయినా సాపేక్షికంగా సులువైనదిగా ఉండే మైనారిటీవాదాన్ని అనుసరిం చారు. అది ఇందిరాగాంధీ, దూకుడుతనపు మైనారిటీవాదంగా పరిణమిం చింది. ఆ తర్వాత అది, షా బానో కేసులో రాజీవ్‌ గాంధీ చరిత్రాత్మకమైన లొంగుబాటుగా  పరిణమించింది. అది, వారి సొంత పార్టీలోని ఉదారవాద ముస్లింలు సైతం భ్రమలను కోల్పోయేటంత నాటకీయంగా జరిగింది. అప్పట్లో ముస్లింల ప్రముఖ నేతగా ఎదుగుతున్న ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ అందుకు నిరసనగా పార్టీని వీడారు కూడా. అలీఘర్‌ విశ్వవిద్యాలయం విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగిన ఆయన సహాయ మంత్రిగా ఉండేవారు. మితవాద హిందువులు (వారు బీజేపీ ఓటర్లే కానవసరం లేదు) దీన్ని, అదే సంస్కరణోత్సాహంతో హిందూ కోడ్‌ బిల్లులను తేవడంతో పోల్చి చూశారు. అదే పార్టీ, ముస్లిం మత పెద్దలను ఇలా ఎలా బుజ్జగిస్తుంది? అది అద్వానీకి అవకాశాన్ని తెరిచింది. మైనారిటీ అంటే మెజారిటీలో ఉన్న ఈ ఆత్మన్యూనతా భావం భారత రాజకీయాలను మౌలికమైన రీతిలో మార్చేసింది. ఫలితమే నేటి మైనారిటీ–ముక్త్‌ భారత్‌ సర్కార్‌.



అన్సారీ అక్షింతలు అవసరం కాదా?

1993–94 నాటి ‘‘ఇండియా రీడిఫైన్స్‌ ఇట్స్‌ రోల్‌’’ అనే నా రచనలో, బీజేపీ ఇలా భారత రాజకీయాల్లో ప్రధాన శక్తిగా ఆవిర్భవించడం గురించి ఊహించి, చర్చించాను. ప్రధానిగా తన మొదటి అవిశ్వాస తీర్మానానికి జవాబు చెబుతూ వాజ్‌పేయి దాని నుంచి ఉల్లేఖిస్తూ, తీవ్ర విచారం ధ్వనించే స్వరంతో ఇలా అన్నారు: కొంత అసాధారణమైనదే జరిగింది. మైనారిటీ లంటే హిందూ మెజారిటీ ఆత్మన్యూనతా భావాన్ని ఏర్పరచుకుంది. నిరుత్సా హంతో ఆయన ఆ అంశాన్ని గుర్తించి, దాని గురించి తాను ఏమైనా చేస్తానని వాగ్దానం చేశారు. 1988లో మెజారిటీలోని ఈ ఆందోళన గురించి ఆయన నొక్కి చెప్పినప్పుడు ప్రశంసలు లభించాయి. రెండు దశాబ్దాల తర్వాత హమీద్‌ అన్సారీ మైనారిటీలలో ఉన్న అదే ఆందోళన గురించి మాట్లాడినం దుకు ఆయనపై దాడి చేస్తున్నారు. మనం వాజ్‌పేయి మాటలు విన్నంత శ్రద్ధగా ఆయన మాటలూ వినాలి. వాజ్‌పేయి చెప్పినదే సరైనదైతే, మనం ఆ తర్వాతి కాలంలో మన రాజకీయాలను అతిగా సరిదిద్దామా? అలా జరిగి ఉంటే, అన్సారీ అక్షింతలు వేయడం న్యాయమైన ఆందోళనతోనే కాదా? దిద్దుబాటు అవసరం లేదా? చివరిగా, అసలు మైనారిటీలు లెక్కలోకే రారా?



విలక్షణమైన మూడు ఆసియా ప్రజాస్వామ్య దేశాలు ఈ సమస్యతో తంటాలు పడ్డాయి. బంగాళాఖాతం నుంచి మధ్యధరా సముద్రం వరకు ఉన్న సువిశాల ప్రాంతంలో ముస్లిం మైనారిటీలుసహా పౌరులందరికీ ఓటింగ్‌ హక్కును అనుమతించే దేశాలు ఇజ్రాయెల్, భారత్‌ మాత్రమేనని ఇజ్రాయెల్‌ నేత షైమన్‌ పెరెస్‌ 1992లో నాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు. కాబట్టి ఆయన దేశం కూడా మైనారిటీలకు ప్రాధాన్యం ఇస్తుంది గానీ, వారికి యూదు పౌరులకుండే పూర్తి ప్రజాస్వామిక హక్కులను, ఎంపిక అవకాశా లను ఇవ్వదు.



జాన్‌ లై కారె, తన ‘‘ద లిటిల్‌ డ్రమ్మర్‌ గర్ల్‌’’ అనే గూఢచార నవలలో ఖలీల్‌ అనే పాత్రతో.. ఇజ్రాయెల్‌ తన యూదు రాజ్య భావజాలాన్ని, ఆధు నిక ఉదారవాద ప్రజాస్వామ్యంతో సమం చేయడంలో ఎదుర్కొంటున్న సందిగ్ధాన్ని తెలిపారు. వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతాలను ఇజ్రాయెల్‌ తనవిగా ఉంచు కోవాలంటే, అరబ్బులందరికీ ఓటింగ్‌ హక్కు ఇవ్వాలి, ఇస్తే అది యూదు రాజ్యమే కాకుండా పోతుంది. అందువల్లనే ఇజ్రాయెల్, అందరికీ ఓటున్నా సమానత్వం లేని విచిత్ర ప్రజాస్వామ్యం అయింది. అరబ్బు పౌరులు ఉన్నత స్థానాలను అందుకోలేకపోతే ప్రశ్నించే వారు లేరు.



పాకిస్తాన్‌ మనకు ఆదర్శమా?

ఆ తర్వాత, పాకిస్తాన్‌ కూడా పెరెస్‌ రెండు ప్రజాస్వామ్యాల (ఆ ప్రజా స్వామ్యం వచ్చి పోతుండేదే అయినా) దేశంగా మారింది. ఇజ్రాయెల్‌లాగే అది కూడా ఒక భావజాల రాజ్యం, అదీ అదే ప్రశ్నను ఎదుర్కొంటోంది. మైనారిటీలకు సమాన రాజకీయ హక్కులు ఉండేట్టయితే, అది ఇస్లామిక్‌ రిపబ్లిక్‌గా ఉండగలదా? ఆ దేశ వ్యవస్థాపకులు ఆకుపచ్చ జెండాపై మైనారిటీ లకు ప్రాతినిధ్యం వహించేలా తెల్ల పట్టీని ఉంచారు. కానీ రాజకీయాలకు వచ్చేసరికి వలసవాద శైలిలో మైనారిటీలకు రిజర్వుడ్‌ నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు. అది ఆసక్తికరమైన సంకేతాత్మకతలకు దారితీసింది. కొత్తగా ఏర్పరచిన, రాష్ట్రాల మధ్య సమన్యయ మంత్రిత్వ శాఖ మంత్రిగా దర్శన్‌ లాల్‌ నియామకం లేదా పాక్‌  సైన్యంలోని మొదటి సిక్కు అధికారి హర్‌చరణ్‌ సింగ్‌ సంస్మరణను పాటిస్తూ తమ క్షణిక లౌకికవాదానికి గర్వంతో ఉప్పొం గడం లేదా తాజాగా హిందూ అమరవీరుడు లాన్స్‌ నాయక్‌ లాల్‌ చాంద్‌ రబారీని కీర్తించడం అలాంటి సంకేతాత్మకతలే. అదే సమయంలో,   హిందూ మైనారిటీ బాలికలను కిడ్నాప్‌ చేసి, బలవంతపు మత మార్పిడులు చేయిం చిన ఒక రాజకీయవేత్తను సత్కరించడమూ చేశారు. హిందువులను పార దోలి వారి జనాభాను క్షీణింపజేయడం కోసం విస్తృతంగా వారిపై వేధింపు లకు పాల్పడుతూనే ఉన్నారు. హిందువులే గాక, సిక్కులు, క్రైస్తవులు, అహ్మదీ యులను కూడా నాస్తిక మతభ్రష్టులని దూషిస్తూ, వేధింపులకు పాల్పడు  తున్నారు.  



మునుపటి కాంగ్రెస్‌–లౌకికవాద ప్రభుత్వాలు మైనారిటీ ఓటు బ్యాంకుల రాజకీయ క్రీడ సాగించాయని భారత మితవాదం అనడంలో వాస్తవముంది. మైనారిటీలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చేస్తూ కాంగ్రెస్‌ను, దాని మిత్రులను అధికారంలోకి తెచ్చిన మాటా నిజమే. కానీ ఇప్పుడు, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల తర్వాత వారి ఓటు బ్యాంకులు ఇక లెక్కలోకి వచ్చేవి కాకుండా పోయాయి. అయినా, మన ప్రభుత్వం వారి రక్షణకు హామీని కల్పిస్తుంది, వారి సామాజిక పరిస్థితులను మెరుగుపరచడం చేస్తుందను కోండి. అంతేగానీ, దయచేసి అధికారంలో వాటాను మాత్రం అడగకండి. కాకపోతే ఏదో ఒక సమయానికి మనం కూడా సంకేతాత్మకతను సృష్టించ  వచ్చు. అప్పుడు మన సొంత దర్శన్‌ లాల్‌ తయారవుతాడు. అలాంటప్పుడు, ఈ సమస్యకు పాక్‌ చెప్పుకున్న.. మైనారిటీలు లెక్కలోకి రానే రారు అనే సమా ధానాన్నే మనమూ ఎంచుకున్నట్టు అవుతుంది. ఈ ప్రశ్నతో దీన్ని ముగిద్దాం: మనం మన జాతీయవాదాన్ని పునర్నిర్వచించుకునే సమయంలో మనకు స్ఫూర్తి, చివరకు పాకిస్తాన్‌ అవుతుందా?



వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌

శేఖర్‌ గుప్తా

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top