వ్యవస్థల వైఫల్యానికి పరాకాష్ట

వ్యవస్థల వైఫల్యానికి పరాకాష్ట


సందర్భం

గుర్మీత్‌ వ్యవహారం మన రాజకీయ వ్యవస్థ వైఫల్యం లోతుగా విస్తరించినదని తేల్చింది. ఇది, బీజేపీకి, డేరా సచ్చా సౌదాకు మధ్య కుమ్మక్కు మాత్రమే కాదు. కాంగ్రెస్, అకాలీలు, ఐఎన్‌ఎల్‌డీ సహా హరియాణా, పంజాబ్‌లోని అన్ని ప్రధాన పార్టీలూ ఎప్పుడో ఒకప్పుడు డేరాతో అంటకాగినవే. ఆ పార్టీల నేతలలో ఏ ఒక్కరూ ఈ తీర్పును స్వాగతించ సాహసించ లేదు. అంటే మన రాజకీయ వ్యవస్థ అవకాశవాదపూరితమైనది, విలువలపరంగా రాజీపడి నది. ఏ చిన్న ఓటు బ్యాంకుపైనైనా ఆధారపడటానికి సిద్ధంగా ఉండేంత బలహీనమైనది.



‘రామ్‌ రహీమ్‌’గుర్మీత్‌ సింగ్‌కు శిక్ష విధించడం మనందరికీ ఎంతో కొంత సంతోషాన్ని కలిగించింది. ఒక దొంగ బాబా గుట్టు బట్టబయలైంది. అతగాడి సామ్రాజ్యాన్ని కుప్ప కూల్చనున్నారు. రాజకీయ వేత్తలు–బాబాల కుమ్మక్కు బంధంలో కనీసం ఒక్క పోగయినా తెగిపోయింది. చట్టబద్ధ పాలనను ఉల్లంఘించినవారిపై ప్రభుత్వం గట్టి చర్యలను తీసుకోవాల్సిన పరిస్థితి కలిగింది. చివరిగా, ఆలస్యంగానే అయినా చట్టం సుదీర్ఘ బాహువులకు మహా ఘరానా నేరగాడు పట్టుబడ్డాడు. చూడబోతే ఇది సరైన దిశగా వేసిన ముందడుగని అనిపిస్తోంది. ఇది కేవలం చాలా చిన్న ముందడుగే కాదు, తాత్కాలికమైనది, సంతృప్తితో అలసత్వం వహించడానికి ఏ మాత్రం వీల్లేనిది కూడా. అందువల్లనే నేను ఈ ఆశావాదాన్ని మీకు పంచబోవడం లేదు. గుర్మీత్‌ సింగ్‌ను శిక్షించినది కేవలం మొదటి ట్రయల్‌ కోర్టు మాత్రమే.



సుదీర్ఘకాలం పాటూ సాగే అప్పీళ్ల తర్వాత చివరకు తుది తీర్పు వెలువడుతుంది. అతగాడు త్వరలోనే బయటకు వచ్చి, అంత వరకు బయటే గడిపినా గడపవచ్చు. ఇప్పటికైతే అతగాడు జైల్లోనే ఉన్నాడు. కానీ, జైళ్లలో సైతం వీఐపీల కోసం ప్రత్యేక మార్గం ఉంటుందని శశికళ, సంజయ్‌దత్‌ల అనుభవం మనకు గుర్తుచేస్తుంది. వారికి ప్రత్యేక సదుపాయాలు, ఆసుపత్రులలో సుదీర్ఘంగా గడిపే అవకాశం, అసాధారణమైన పెరోల్స్, ఇంకా ఏమి ఉండవని చెప్పగలం. గుర్మీత్, తన వారసురాలిని ఎంపిక చేసినా గానీ, భారీ ఎత్తున అతనికి ఉన్న అనుచర గణం, భౌతిక ఆస్తులు క్షీణిస్తున్నట్టు మనకు ఇంకా కనబడటం లేదు. ఏదిఏమైనా, ఇదంతా నిజం, గుర్తుంచుకోదగినది. అయితే, నాలోని అశాంతికి ప్రధాన కారణం ఇది కాదు.



వ్యవస్థాగత వైఫల్యానికి సంకేతం

నాకు సంబంధించి ‘రామ్‌ రహీమ్‌’వ్యవహారం, మన వ్యవస్థాగత వైఫల్యానికి సంకేతంగా నిలుస్తుంది. గత వారం రోజుల ఘటనలు ఈ వైఫల్యానికి ఉన్న నాలుగు పార్శా్వలను వెల్లడి చేశాయి. అవి: క్రిమినల్‌ న్యాయ వ్యవస్థ వైఫల్యం, ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యం, రాజకీయ అధికార వ్యవస్థ వైఫల్యం, ఆధ్యాత్మిక సంరక్షణ వ్యవస్థ వైఫల్యం. ఎవరో ఒక వ్యక్తి సాధించిన అసాధారణమైన సాఫల్యత గురించి మనం ఎంత ఎక్కువగా మాట్లాడుతుంటే, అది అంతగా వంటబట్టిపోయిన మన వైఫల్యాలను నొక్కి చెబుతుంది.



న్యాయవ్యవస్థ ఒక్కటే తన స్వతంత్రతను నిలుపుకున్న ఈ వారంలోనే మనం... మన నేర న్యాయ వ్యవస్థ వైఫల్యం గురించి మాట్లాడుకోవాల్సి రావడం విచిత్రమే. సీబీఐ కోర్టు న్యాయమూర్తి జగదీప్‌ సింగ్‌ ధైర్యాన్ని, నైతిక రుజువర్తనను సమంజసంగానే ప్రస్తుతించారని అందరమూ అంగీకరిస్తాం. పంజాబ్, హరియాణా హైకోర్టు, చట్టబద్ధ పాలనను ఎత్తిపట్టడం అనేది రాజ్యాంగపరమైన క్రమబద్ధత పట్ల చాలా మంది పౌరులలో విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పగలిగి ఉంటుంది. అది పంచకుల వాసులకే పరిమితం కాదు. ఇది, సుప్రీం కోర్టు మూడు తలాక్‌ల పద్ధతి చెల్లదని తీర్పు చెప్పి, సంచలనం రేకెత్తించిన వారం మాత్రమే కాదు. వ్యక్తిగత గోప్యత హక్కు కింద పౌరులకు ఉండే వ్యక్తిగత స్వేచ్ఛల విషయంలో అతి విస్తృత పర్యవసానాలను కలిగించే నిశితమైన తీర్పును కూడా ఇదే వారంలో సుప్రీం కోర్టు వెలువరించింది.



అయినాగానీ, ఒక న్యాయమూర్తి తాను నిర్వర్తించవలసిన సాధారణ విధిని నిర్వహించినందుకు దేశం మొత్తం కీర్తించాల్సి వస్తే, అది కొంత విచిత్రమైనదే. దోషిగా ఆరోపణకు గురైనది గుర్మీత్‌ సింగ్‌ అంతటి శక్తివంతుడు ఎవరైనా అయితే, అలవాటుగా క్రమానుసారంగా ఇలా ఎప్పుడూ న్యాయాన్ని అందించడం చాలా అరుదు అనే వాస్తవానికి ఇది గుర్తింపు పత్రం అవుతుంది. మొదట ఫిర్యాదు చేశాక పదిహేనేళ్లు, కేసును న్యాయ విచారణకు చేపట్టినాక దాదాపు పదేళ్లు న్యాయం జరగడానికి పట్టాయనే అంశాన్ని మనం విస్మరించలేం.



మన నేర న్యాయ వ్యవస్థలో ఉన్న లోటు పాట్లు ఇవి : బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం పట్ల విముఖత చూపడం, తొలుత చేసిన ఫిర్యాదును అసలు పరిశీలించడానికే తిరస్కరించడం, మరణశయ్యపై ఉన్న ధైర్యవంతుడైన ఒక పాత్రికేయుని మరణ వాంగ్మూలం నమోదుకు మూడురోజుల పాటూ నిస్సిగ్గుగా తిరస్కరించడం, శక్తివంతులు చట్టాన్ని వంచడానికి వాడే సుదీర్ఘమైన జాప్యాలు, అప్పీళ్లు తదితర పద్ధతులు. నిర్భయంగా ముందుకు వచ్చి నిలిచిన బాధితురాలు, అత్యంత సునిశితమైన పరిశీలన, నిజాయితీ గల దర్యాప్తు అధికారి, రుజువర్తనుడైన న్యాయమూర్తి ఒక్క చోట కలవడం యాదృచ్ఛికంగా సంభవించింది. కాబట్టే గుర్మీత్‌ సింగ్‌కు శిక్షపడింది. ఈ కేసు, మన నేర న్యాయ వ్యవస్థకు ఉన్న అడ్డగోలు నడత స్వభావాన్ని బట్ట బయలు చేస్తుంది. ఏ మంచి న్యాయవాది అయినా చెప్పేట్టు అది ఒక లాటరీ.



అత్యున్నత నాయకత్వం కళ్లు మూసుకుంటే...

పాలనా వ్యవస్థల వైఫల్యం మరీ కొట్టవచ్చినట్టుగా కనిపిస్తూ విస్మరించలేనిదిగా ఉంది. ముఖ్యమంత్రి మోహన్‌ లాల్‌ ఖట్టర్‌ నేతృత్వంలోని హరియాణా ప్రభుత్వం, నిలకడగా పరిపాలనా స్థాయిని, శాంతిభద్రతలకు విఘాతాన్ని సహించగలిగే స్థాయిని నిరంతరాయంగా దిగజారుస్తూ వస్తోంది. బాబా రామ్‌పాల్‌ను ఎదుర్కొనాల్సి వచ్చినప్పుడు మొదట అది చచ్చుబడి పోయింది. దాన్ని పరిపాలనాపరమైన అనుభవరాహిత్యంగా లేదా అసమంజసత్వంగా తీసిపారేయవచ్చు. ఇక రెండవసారి పరిపాలన చచ్చుబడిపోవడం, జాట్ల రిజర్వేషన్ల ఆందోళన సందర్భంగా సంభవించింది. తమలో తాము కలహిస్తున్న మంత్రివర్గపు అలసత్వం వల్లనే అది జరిగిందనేది సుస్పష్టమే. ప్రభుత్వం, పౌరులకు కనీస స్థాయి శాంతిభద్రతలకు సైతం హామీని కల్పించలేనంతటి ఘోర వైఫల్యానికి గురైన వైనాన్ని ప్రకాశ్‌ సింగ్‌ కమిషన్‌ నివేదిక వివరంగా వెల్లడించింది. ఆ నివేదిక వెలువడ్డాక కూడా ఖట్టర్‌ ప్రభుత్వం కొనసాగడం ఏ మాత్రం సమంజసం కాదు.



ఖట్టర్‌ ప్రభుత్వ పాలనాపరమైన వైఫల్యం పంచకులలో మరింత లోలోతులకు పతనమైంది. 25 నాటి హింసాకాండకు సంబంధించి ప్రతిదీ ముందుగా తెలిసినదే. తేదీ, సమయం, స్థలం, పాత్రధారులు అందరికీ తెలుసు. కాబట్టి, రాజకీయాభీష్టం కొరవడటం, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి పాటించాల్సిన అత్యంత ప్రాథమికమైన పద్ధతులను చేపట్టడానికి నిరాకరించడం మాత్రమే ఈ ఘటనలన్నిటికీ బాధ్యత వహించాలి అని చెప్పాల్సి వస్తుంది. ఉదాహరణగా చెప్పాలంటే అవి పంజాబ్‌లో కనిపించాయి. అత్యున్నత స్థాయి నాయకత్వం కళ్లు మూసుకుంటే, ఇక ఆ దిగువన ఉన్న వారంతా కునికిపాట్లు పడుతుండటమనే మరో వ్యవస్థాగతమైన సమస్య పెరుగుతుండటాన్ని ఈ వ్యవహారం పట్టి చూపింది. హరియాణా ప్రభుత్వం నిర్వా్యపకత్వం ప్రభుత్వ వైఫల్యంలోని ఒక అంశం మాత్రమే. చెలరేగిన అల్లరి మూకలను అదుపు చేయడానికి పోలీసులు పాటించాల్సిన అన్ని పద్ధతులూ పాటించాకే కాల్పులు జరి పారా? 38 మంది మృతి చెందడం అంటే మాటలా? నిర్వా్యపకత్వం తర్వాత అనవసర బలప్రయోగం జరిగిందా? డేరా ప్రతిష్ట దిగజారి ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ప్రశ్నలు ఎవరూ అడగడం లేదు. కానీ అవి శేష ప్రశ్నలై నిలుస్తాయి. మొత్తంగా చూస్తే, హరియాణా ప్రభుత్వ నేరపూరితమైన క్రియాశూన్యత, క్రియాత్మకతా ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి తాత్కాలికంగానైనా క్షీణిస్తున్నట్టు చూపుతుంది. కేంద్ర ప్రభుత్వానికి సిబ్బంది, యంత్రాం గం, లక్ష్యమూ ఉన్నా, క్రమబద్ధమైన పాలనకు తగిన వ్యవస్థలు లేవు.



అంతా డేరా అంటకాగిన వారే

రాజకీయ వ్యవస్థ వైఫల్యం మనం అనుకుంటున్న దానికంటే బాగా లోతుగా విస్తరించి ఉంది. ఇది, ముఖ్యమంత్రి ఖట్టర్‌తోపాటూ, ఆయన్ను గద్దె దించాలని నిరంతరం ఆశపడుతోన్న ఆయన సహచరుల హాస్యభరితమైన, విషాదకర వైఫల్యం మాత్రమే కాదు. ఇది కేవలం అధికార బీజేపీకి, డేరా సచ్చా సౌదాకు మధ్య ఉన్న కుమ్మక్కు మాత్రమే కాదు. కాంగ్రెస్, అకాలీలు, భారత జాతీయ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ)సహా హరియాణా, పంజాబ్‌లోని అన్ని ప్రధాన పార్టీలూ, ఇటీవలి చరిత్రలో ఎప్పుడో ఒకప్పుడు ఆ డేరా అంటకాగిన వేనని విస్మరించరాదు. 2014లో గుర్మీత్‌ డేరా తమకు ఇచ్చిన మద్దతుకు బీజేపీ ఇప్పుడు బదులు తీర్చుకుంటోందనేది స్పష్టమే. 2009లో కాంగ్రెస్‌ చేసినది, అంతకు ముందు ఐఎన్‌ఎల్‌డీ చేసినది కూడా అదే. ఈ ప్రాంతంలో ఎన్నికలపరంగా పరిగణనలోకి తీసుకోదగిన పార్టీల జాతీయ నేతలలో ఏ ఒక్కరూ ఈ తీర్పును స్వాగతించ సాహసించలేదు. ఏ ఒక్కరూ డేరాతో భావి ఒప్పందాలను పూర్తిగా నిరాకరించేవారు కారనేది స్పష్టమే. మన రాజకీయ వ్యవస్థ అవకాశవాద పూరితమైనది మాత్రమే కాదు, విలువల పరంగా రాజీపడినది, పైగా అది చేతికి అందివచ్చే ఏ చిన్న ఓటు బ్యాంకుపైన అయినా ఆధారపడటానికి సదా సిద్ధంగా ఉండేంత బలహీనమైన వ్యవస్థ.



చివరగా, ఈ వ్యవహారం మన ఆధ్యాత్మిక పరిరక్షకుల డొల్లతనాన్ని బట్టబయలు చేస్తుంది. ఒకరి తర్వాత ఒకరుగా ఒక్కో బాబా బండారం బయటపడుతుంటే అసలు ఆధ్యాత్మిక సంరక్షణ అనే భావనే నవ్వి పారేసేదిగా మారుతుంది. అంతేకాదు, ఆధ్యాత్మిక గురువులను సాంప్రదాయక మార్మికవాదపు అవశేషాలుగా చూడటం కూడా సులువు అవుతుంది. అయితే, అలాంటి దృష్టి కార్పొరేట్‌ బాబాలు పెరుగుతుండటమనే అంశం నేది అత్యంత ఆధునికమైన పరిణామం అనే దాన్ని విస్మరించేలా చేస్తుంది. అది మన ఆధునికత హృదయంలోని రంధ్రాన్ని ప్రతిబింబిస్తుంది. ఆధునిక అభివృద్ధి మనకు భౌతికమైన సుఖసౌఖ్యాలను ఇవ్వవచ్చు కానీ, అది, మన ఆధ్యాత్మికమైన ఆకలిని తీర్చడంలో విఫలమైంది. అందువల్లనే మన బాహిర, అంతర జీవితాలతో అనుబంధాన్ని ఏర్పరచుకోగల ఆధ్యాత్మిక గురువులు సమాజానికి అవసరం అవుతున్నారు. మన ఆధునికత రామ్‌ లేదా రహీమ్‌లతో అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో విఫలమైనప్పుడు... గుర్మీత్‌ సింగ్‌ ఆ శూన్యంలోకి ప్రవేశించి తానే ‘రామ్‌ రహీమ్‌’ కాగలుగుతాడు.



వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యులు

యోగేంద్ర యాదవ్‌ ‘ మొబైల్‌: 98688 88986

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top