తప్పించుకు తిరిగిన ‘ధన్యుడు’

తప్పించుకు తిరిగిన ‘ధన్యుడు’ - Sakshi




 ‘ఎప్పటికెయ్యది ప్రస్తుత/మప్పటికి కా మాటలాడి అన్యుల  మనముల్ నొప్పింపక, తానొవ్వక,/ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ!’ నలుగురు నడిచే దారిలోనే వెళుతూ, చనిపోయిన వారి ఔన్నత్యాన్ని ఆకాశానికి ఎత్తివేయడం మన దేశంలో, సంస్కృతిలో కనిపిస్తుంది. అంటే ఒక మనిషిని అంచనా వేయడంలో ఆయన ఆచరణను కొద్దిగా అయినా పరిగణన లోనికి తీసుకునే లక్షణం మనకు దాదాపు లేదనే చెప్పాలి. ఇటీవల పరమ పదించిన ప్రసిద్ధ శాస్త్రవేత్త, రోదసీ శాస్త్ర నిపుణుడు, క్షిపణి ప్రయోగ సాంకేతిక నైపుణ్యంలో ఉద్దండుడు, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విషయంలో ఇలాగే జరగడం ఆ లక్షణం కొనసాగింపే.

 

 వెలుగూ... చీకటీ...

 ఎంతటి వ్యక్తి అయినప్పటికీ మానవీయ సంబంధాల గురించి ఆయన సామా జిక స్పృహ, దృక్పథం; అదే విధంగా మానవతా దృష్టికోణం; ధనస్వామ్య, పాలకవర్గాల నుంచి బహుజనులు ఎదుర్కొంటున్న సమస్యలు- అనుభవి స్తున్న అత్యాచారాల పట్ల ఆయన వైఖరి ఏమిటి అనే కోణాల నుంచి విధిగా అంచనా వేయాలి. అబ్దుల్ కలాం శాస్త్ర పరిశోధనల పట్ల, సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంతో చేసిన దార్శనికతకు సంబంధించి మనకు ఎలాంటి పేచీ ఉండ వలసిన అవసరం లేదు. ఆయన కన్న కలలతో గానీ, ‘కలలు కనండి’ అంటూ దేశ యువతకు ఆయన ఇచ్చిన నినాదంతో గానీ ఎవరికీ విభేదాలు ఉండనవ సరం లేదు. ఆయన దగ్గరకు చేర్చుకుని చిన్నారుల పట్ల చూపిన ముద్దు మురి పాలు, ప్రదర్శించిన అనురాగ ఆప్యాయతలు ముచ్చట గొలిపేవే కూడా. దేశ రక్షణలో అంతర్భాగంగా ఆయన నాయకత్వంలో జరి గిన ప్రయోగాలతో విభేదించవలసిన అవసరం లేదు. కానీ కొన్ని అంశాలలో కలాం వైఖరితో మనం దూరంగా ఉండక తప్పదు.

 

 శాస్త్ర విజ్ఞానంతో, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మానవుడు తనలో మరింత ఆత్మీయత, మమేకత్వం పెంచుకోవాలి. మానవీయత పరిఢవిల్లాలి. కానీ ఆయన రాష్ట్రపతి పదవికి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే తరఫున ఎం దుకు, ఏ పరిస్థితులలో పోటీకి దిగవలసివచ్చింది? జాతీయస్థాయిలో మైనా రిటీ పట్లగానీ, వారు పాలకవర్గాల వల్ల అనుభవించిన వేధింపులు, ఎదు ర్కొన్న అత్యాచారాలు, వివక్ష వంటి అంశాల పట్ల కలాం జీవితకాలంలో ఏ రోజూ గొంతెత్తి ఖండించిన ఉదాహరణలు కనిపించవు. కలాం ప్రధానంగా ముస్లిం మైనారిటీ వర్గానికీ, పేదవర్గానికీ చెందిన వారు. అయినా గుజరాత్ లో మోడీ హయాంలో (2002) రెండు వేల మందిపై జరిగిన మైనారిటీల ఊచకోత పట్ల నోటిమాటగా అయినా నిరసన తెలియచేయలేదు. బాల బాలి కల, యువకుల మనసులను ‘రగిలించగలిగిన’వారు కలాం. కానీ తన మెజా రిటీ దళితవర్గానికి చెందిన అభాగ్యుల మీద ఊచకోత జరిగితే తన మనసు ఎందుకు స్పందనతో రగలలేకపోయిందన్నది ప్రశ్న. ఆయన అంత ర్జాతీయ స్థాయి కలిగిన శాస్త్రవేత్త. కానీ రాష్ట్రపతి హోదాలో బాబాలకూ, కుహనా స్వాములకూ భక్తుడెలా కాగలిగారు?

 

 కర్ణాటక సంగీతమంటే ఇష్టపడే హృద యమున్న కలాం, నాగపూర్ కేంద్రంగా ఉన్న ఒక మత సంస్థ కేంద్ర కార్యాల యానికి వెళ్లి దాని వ్యవస్థాపకులను పొగ డ్తలతో ఎలా ముంచెత్త గలిగారు? మైలాపూర్ (చెన్నై) తాళ వాద్య కచేరీలలో పాల్గొనే సంస్కృతీ పరునిగా కలాం పేర్గాంచారు. కానీ శాంతి సౌమనస్యాల కంటే దేశాన్ని ఆధునిక ఆయుధీకరణ జరిగినశక్తిగా, అణ్వస్త్ర దేశంగా రూపొందించాలన్న తలంపు ఉన్న వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ సర్కారుకు ఎందుకు శాస్త్రసాంకేతిక అంశాల సలహా దారుగా పనిచేశారు? ఇవన్నీ కాకున్నా, వాజపేయి ప్రభుత్వం ఏ పరిణామాల ఫలితంగా కలాంను ప్రథమ పౌరుని పదవికి తమ అభ్యర్థిగా ప్రకటించవలసి వచ్చింది? గుజరాత్ మైనారిటీల మీద జరిగిన హత్యాకాండ దరిమిలా పార్టీ ఎదుర్కొన్న తీవ్ర విమర్శల నుంచి బయటపడవేసే యత్నంలో భాగంగానే కలాంను బీజేపీ ‘తురుపు’గా వాడుకుంది!

 

 ప్రజా వ్యతిరేకత పట్టలేదు

 1997లో వాజపేయి ప్రభుత్వం కలామ్‌కు ‘భారతరత్న’ పురస్కారం అందిం చింది. ఆ ఊపులో కలాం చేసిన పని- తమిళనాడులో కూడంకులమ్ అణు విద్యుత్ కర్మాగారానికి ప్రభుత్వ సలహాదారుగా పచ్చజెండా ఊపారు! ఇది యాదృచ్ఛికమనుకోవాలా? ఐచ్ఛికమనుకోవాలా? ప్రజాబాహుళ్యం నుంచి, స్థానిక శాస్త్రవేత్తలు, ప్రజలు నిరసనలు సాగిస్తున్నా కూడా కలాం అణు విద్యు త్ కేంద్రానికి ఆమోదం తెలిపారు. ఒడిశాలో ‘వేదాంత అల్యూ మినియం’ ప్రాజెక్టు విషయంలో కలాం ప్రభుత్వ చర్యలకు మద్దతు పలికారు. ఇక్కడ కూడా ప్రజలు వ్యతిరేకత, అక్కడి డోంగ్రియా ఆదివాసీ ప్రజల జీవి తాలకు అది ప్రాణాంతకంగా తయారవుతుందని పరిశోధకులూ నిపుణులూ చేసిన హెచ్చరికలు ఉన్నాయి. రాష్ట్రపతి పదవికి  ఎంపిక కాకముందు ‘మరణశిక్ష రద్దు కావాలని’ కలాం మాట్లాడారు. ఈ మరణశిక్షలకు గురైన వ్యక్తుల జీవి తాల వెనక, ‘సామాజిక ఆర్థిక కోణాలు’ ఉండి ఉంటాయని వాస్తవికంగా మాట్లాడిన కలాం రాష్ట్రపతి పదవిలో స్థిరపడిన తరువాత భిన్న ధోరణిని కన పరిచారు.

 

 2004లో ధనంజయ్ ఛటర్జీ (పశ్చిమబెంగాల్) అనే నిరుపేద కాప లాదారునికి మరణశిక్ష విధించారు. 1990 నాటి ఒక కేసులో (‘అత్యాచారం, హత్య’) ఈ శిక్ష పడింది. తరువాత కొలది రోజులకే భారత కేంద్ర గణాంక శాఖకు చెందిన ఇద్దరు పరిశోధక పండితులు దేవాసిస్ సేన్‌గుప్త, ప్రబాల్ చౌధురి జరిపిన సరికొత్త విశ్లేషణ వివరాలను ప్రజాస్వామ్యహక్కుల పరి రక్షణా జాతీయసంస్థ ‘పీపుల్స్ యూనియన్’ బహిరంగ పరచింది: హత్య అభియోగంపై అరెస్టయి, ఉరిశిక్ష పడిన ధనంజయ్ నిర్దోషి అనీ, శిక్ష కోసమే ‘వాస్తవాల’ పేరిట విచారణ కథలు అల్లారనీ అప్పుడు వెల్లడైంది. సాక్ష్యాధా రాలను సృష్టించడంలో పోలీసుల పాత్ర ఉందని పరిశోధకులు ఆరోపించారు.

 

 మనసు విప్పిన సందర్భం ఏదీ?

 కాశ్మీర్ పౌరుడు అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష ‘సమాజ పౌరుల అంతరాత్మను / మన స్సాక్షిని’ (కలెక్టివ్ కాన్షన్స్ ఆఫ్ ది సొసైటీ) తృప్తిపరచడం కోసం అవసరమని ధర్మాధర్మ విచారణ చేయవలసిన న్యాయస్థానమే చెప్పడం మనమూ, మన చట్టాలూ ఎటు ప్రయాణిస్తున్నాయో తెలిసిపోతోంది! అంతేగాదు, చివరికి మొన్న ఉరితీసిన యాకుబ్ మెమన్ విషయంలో కూడా అన్ని వర్గాలకు చెం దిన వారు మతాతీతంగా స్పందించినా, కలాం రాష్ర్టపతిగా కొలువు చాలిం చుకున్నా గాని స్పందించలేకపోయారు!

 

 ఈ అంశంలో  మాజీ రాష్ర్టపతుల సామాజిక స్పృహకు, ఆర్డినెన్స్‌ల విష యంలో వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడంలో పాటించిన మానవీయ కోణాలకు, కలాం వహించిన వైఖరికి మధ్య తేడా స్పష్టమైపోయింది. చివరికి 1998లో రెండవసారి బీజేపీ హయాంలో జరిపిన అణుశక్తి పాటవ పరీక్ష (పోఖ్రాన్-2) కలాం ఆధ్వర్యంలోనే జరిగినా, దాని వాస్తవ ఫలితాన్ని గురిం చి ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. బాబా అణు పరిశోధన కేంద్రం లగా యితూ పలువురు అణు శాస్త్రవేత్తలు ఈ రెండు ప్రయోగ ఫలితాన్ని చూసి పెదవి విరిచారు. అంతేగాదు, ఇందిరా గాంధీ హయాంలో మొదటి పాటవ పరీక్ష నూరు శాతం విజయవంతం కాగా రెండవ ప్రయోగ ఫలితం తర్వాత అణుశక్తి వినియోగానికి అభ్యంతరాలు పెడుతూ, ఆంక్షలు పెట్టేందుకు ఒప్పం దంపై సంతకాలు చేయించేందుకు అమెరికా పాలకులు భారత పాలకులపై ఒత్తిడి తీసుకురావడమూ తెలిసిందే!   

 

 పెట్టుబడి వ్యవస్థ ఎజెండా

 అణుశక్తిని శాంతికాల ప్రయోజనాలకు వినియోగించడంలో ఇక భారత పాల కులు అమెరికా కనుసన్నల్లోనే మెలగవలసి వస్తుంటుంది! మన దేశీయ  విదే శాంగ విధానాలు అమెరికా సన్నాయి నొక్కులకు లోబడే జరుగుతాయన్న వాస్తవాన్ని మరవరాదు! భారత పాలనా వ్యవస్థలో రాష్ట్రపతి ఆచరణలో ఒక రబ్బరు స్టాంపుగానే మిగిలిపోయినంత కాలం, పదవిని కోల్పోవడాన్ని తన ఆస్తినే కోల్పోయినట్టుగా ఆ ‘స్టాంపు’ భావించుకున్నంత కాలం ఉరిశిక్షలను గాని, రాజకీయ ఆర్థిక రంగాలలో పెట్టుబడిదారీ వ్యవస్థలో విపరిణామాలను గానీ నివారించగల శక్తి ఆ ‘స్టాంపు’నకు ఉండదు గాక ఉండదు.

 

దళిత నాయ కులు కొందరిని కాంగ్రెస్, బీజేపీ పాలకవర్గాలు పావులుగా వాడుకుని అధి కార స్థానాలకు సంపన్న వర్గాలే ఎగబాకుతున్నాయి. ఈ ప్రత్యక్ష దాడి బొం బాయి నియోజకవర్గం నుంచి దళిత అభ్యర్థిగా డాక్టర్ అంబేడ్కర్ పోటీ చేసి నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మరో దళితుడ్ని రంగంలోకి దిం చింది! ఈ ‘ఆట’కు నేటికీ విడుపులేదని గ్రహించాలి. రాజకీయ శాస్త్రం నుంచి ఆర్థికశాస్త్రాన్ని సామాజిక సమస్యల నుంచి సెక్యులరిజం నుంచి ప్రజానుకూ లమైన ఎజెండా నుంచి శాస్త్రీయ దృక్పథాన్నీ వేరు చేయటం పెట్టుబడి వ్యవస్థ అసలు ఎజెండా!

 (వ్యాసకర్త మొబైల్: 9848318414)

 - ఏబీకే ప్రసాద్

 సీనియర్ సంపాదకులు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top