‘నిర్భయ’... నిషేధం!


ఢిల్లీ నడివీధుల్లో ఒక ఆడపిల్ల పట్ల ఆరుగురు దుండగులు అత్యంత అమానుషంగా ప్రవర్తించి ఉసురు తీసిన ఘటన జరిగి రెండేళ్లు దాటుతున్నది. ఆ ఉదంతంలో ప్రాణాలు కోల్పోయిన ‘నిర్భయ’పై ‘ఇండియాస్ డాటర్’ పేరిట బీబీసీ తాజాగా రూపొందించిన ఒక డాక్యుమెంటరీ చుట్టూ ఇప్పుడు వివాదం అలుముకున్నది. ఈ కేసులో ఉరిశిక్షపడి తీహార్ జైల్లో ఉన్న ప్రధాన నేరస్తుడు ముఖేష్ సింగ్ తన చర్యను సమర్థించుకుంటూ, బాధితురాలిపై నిర్దయగా మాట్లాడిన మాటలుసహా అనేక అంశాలు ఆ డాక్యుమెంటరీలో ఉన్నాయి. కనుక దాన్ని నిషేధించాలని కొందరు డిమాండు చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ‘గుర్తు తెలియని వ్యక్తుల’పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

 

 ఆ డాక్యుమెంటరీని ప్రసారం చేయొద్దంటూ కేంద్ర ప్రభుత్వం వార్తా చానెళ్లన్నిటికీ సూచనలిచ్చింది. పార్లమెంటు ఉభయసభల్లో ఈ డాక్యుమెంటరీపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అయితే ఇది దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నమంటూ దుయ్యబట్టారు. దేశంలోనే కాదు... ప్రపంచంలో ఎక్కడా ఇది ప్రసారం కాకుండా ఏంచేయాలో ఆలోచించాలన్నారు. ఈ డాక్యుమెంటరీ ప్రచారంలోకొస్తే మన టూరిజం దెబ్బతింటుందని బీజేపీకి చెందిన ఒక మహిళా సభ్యురాలు ఆందోళన వ్యక్తంచేశారు.

 

 ఏదైనా కేసులో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం, అతని అభిప్రాయాలకు ప్రచారం కల్పించడం అమల్లో ఉన్న చట్టాలకు విరుద్ధమని కొందరు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఆ డాక్యుమెంటరీ చిత్రీకరణకు అనుమతించిన యూపీఏ సర్కారును తప్పుబడుతున్నారు. చిత్రీకరణకు అనుమతిస్తూ విధించిన షరతులను డాక్యుమెంటరీ నిర్మాత లెస్లీ ఉద్విన్ ఉల్లంఘించారని తీహార్ జైలు అధికారులు ఆరోపిస్తున్నారు.

 

 డాక్యుమెంటరీని నిషేధించాలంటున్న వారంతా ఆ నేరస్తుడు వ్యక్తం చేసిన అభిప్రాయాలను అందుకు కారణంగా చెబుతున్నారు. నిజమే... అతని మాటలు అత్యంత దుర్మార్గంగా ఉన్నాయి. ‘మంచి అమ్మాయి అయివుంటే ఆమె రాత్రి 9 గంటల సమయంలో స్నేహితుడితో రోడ్లపై ఉండదు... ఆడపిల్ల ఇంటి పనులు చేసుకోవాలిగానీ, రాత్రుళ్లు డిస్కోలనీ, బార్‌లకనీ తిరగ కూడదు... ఆడపిల్లల్లో 20 శాతంమంది మాత్రమే మంచివాళ్లు...’ ఈ అభిప్రాయాలనే కాదు, ఇలాంటివే ఇంకా చాలా చెప్పాడు. రాయడానికి కూడా సాధ్యంకాని మాటలు మాట్లాడాడు. మృగంతో పోల్చడానికి కూడా అర్హంకానంత రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. ఆడపిల్లల వస్త్రధారణ ఎలా ఉండాలో చెప్పాడు.

 

 అత్యాచారం సమయంలో ప్రతిఘటించకుండా ఉంటే ప్రాణాలు దక్కేవన్నాడు. ఉరిశిక్ష పడి నిబంధనల ప్రకారం ఏకాంత కారాగారవాసం అనుభవిస్తున్న వ్యక్తిలో రెండేళ్లు గడిచింది గనుక కాస్తయినా పశ్చాత్తాపం ఏర్పడి ఉంటుందేమో అనుకున్నవారికి ఈ అభిప్రాయాలు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. వీటికి ప్రచారం కల్పిస్తే సమాజం బండ బారుతుందని, పౌరుల్లో ఉండాల్సిన సున్నితత్వం దెబ్బతింటుందని కొందరంటున్న మాటల్లో వాస్తవం ఉంది. కానీ, ఈ అభిప్రాయాలు ముఖేష్‌సింగ్‌వి మాత్రమేనా? కరుడుగట్టిన నేరస్తుడు గనుక, చదువుసంధ్యలు, సంస్కారం లేవు గనుక ముఖేష్ ఆ తరహాలో మాట్లాడి ఉండొచ్చుగానీ...అలాంటి అభిప్రాయాలనే ‘సంస్కారవంతమైన’ భాషలో వ్యక్తం చేసినవారెందరో! ‘ఎంతైనా మగపిల్లలు కదా...’అన్న ములాయం మొదలుకొని ‘వస్త్రధారణ విషయంలో మహిళలు జాగ్రత్తపడాలి’ అని హితబోధ చేసిన తెలుగుదేశం ఎంపీ మురళీ మోహన్ వరకూ ఈ జాబితాలో ఉన్నారు.

 

 పట్టణాల్లో అబ్బాయిలు, అమ్మాయిలు సన్నిహితంగా మెలిగే అవకాశం ఉన్నందుకూ, ఆడపిల్లలు జీన్స్ వేసుకుంటున్నందుకూ రేప్‌లు చోటుచేసుకుంటున్నాయని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అనడాన్ని ఎవరూ మరిచిపోరు. ఆధునికత చొరబడని పల్లెలు, అడవుల్లో అంతా సవ్యంగా ఉన్నదని కూడా ఆయన ఆ సందర్భంగా చెప్పారు. హర్యానా ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ఖట్టర్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘స్వేచ్ఛకు కూడా హద్దుంటుంది. ఆడపిల్ల చక్కటి వస్త్రధారణతో ఉంటే ఏ మగవాడూ ఆమెవైపు చూడడు’ అని మాట్లాడారు. గతంలో ముఖేష్‌సింగ్ న్యాయవాది ఏపీ సింగ్ కూడా ఆ తరహాలోనే మాట్లాడారు. ‘నా కూతురో, సోదరో ఇలా మగస్నేహితుడితో బయటికెళ్లి కుటుంబానికి చెడ్డపేరు తెస్తే కుటుంబమంతా చూస్తుండగా పెట్రోల్ పోసి ఆమెకు నిప్పెడతాన’ని వ్యాఖ్యానించారు.

 

 డాక్యుమెంటరీ వల్ల దేశ ప్రతిష్ట మంటగలిసిందని గుండెలు బాదుకునే నేతలంతా ముందుగా ఆడవాళ్ల విషయంలో అత్యంత అనాగరికమైన అభిప్రాయాలు సమాజం నిలువెల్లా అలుముకుని ఉన్నాయని గుర్తించాలి. వాటిని సరిచేయడానికి తాము ప్రయత్నించకపోగా...తమ వ్యాఖ్యలతో అలాంటి అభిప్రాయాలకు సాధికారతను కల్పిస్తున్నామని తెలుసుకోవాలి. ఇలాంటి డాక్యుమెంటరీలు నేరస్తుల మనస్తత్వాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడతాయి. ఈ రకమైన నేరస్తులు ఎలా పుట్టుకొస్తున్నారో,అరికట్టడానికి ఏ చర్యలు అవసరమో ఆలోచింపజేస్తాయి.

 

 లైంగిక హింస కేసులను ఎంత తొందరగా తేల్చవలసిన అవసరం ఉన్నదో న్యాయవ్యవస్థలోనివారికి అవగాహన కలిగిస్తాయి. విధానపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పాలకులుగా ఉన్నవారికి తెలుస్తుంది. నిర్భయ కేసుపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనల సమయంలో అత్యాచారాల కేసులపై విచారణలు కాస్త చురుగ్గా కదిలాయిగానీ ఆ తర్వాత ఎప్పటిలానే అవి నత్తనడక నడుస్తున్నాయి.

 

 వివిధ హైకోర్టుల్లో ప్రస్తుతం 31,000 అత్యాచారాల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. నిజానికి వెనువెంటనే శిక్షలు పడకపోవడం వల్లే మరిన్ని నేరాలు జరుగుతున్నాయి. మన పాలకులు డాక్యుమెంటరీని నిషేధించే ఆలోచన విరమించుకొని ఇలాంటి సమస్యలపై దృష్టిపెట్టాలి. సమాజంలో స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించడం వల్ల, మహిళలపై నేరాలు జరగకుండా చూడటం వల్ల దేశ ప్రతిష్ట పెరుగుతుంది తప్ప... ఇలాంటి నిషేధాల వల్ల కాదని గుర్తించాలి.

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top