చంకన ఎత్తుకున్న దేవుడు ఏమయ్యాడు?

రాబందు రెక్కల చప్పుడు


జీవన కాలమ్‌

కోట్లమంది విశ్వాసం పెట్టుబడితో విర్రవీగితే ఏమవుతుంది? డేరా సచ్చా సౌదా అవుతుంది. కోట్లమంది ఓట్లను దండుకునే రాజకీయ పార్టీల కక్కుర్తికి ఆధారమౌతుంది. ఈ మధ్యలో ‘దేవుడు’ అటకెక్కిపోతాడు.




పాపం, దేవుడు నిస్సహాయుడు. అడ్డమయిన వాళ్లకీ కొంగు బంగారమవుతాడు. అయితే, హేతువాదులు కొంగుల్ని మరిచిపోయి బంగారాన్ని తప్పు పడతారు. నిజమైన విశ్వాసం నికార్సయిన సౌందర్యం. పబ్బం గడవడానికి పెట్టుబడిగా ఉపయోగించే విశ్వాసం– భయంకరమైన వికృతం. అందువల్లనే విశ్వాసం పెట్టుబడిగా ఉన్న, ప్రతీదీ వీధిన పడుతోంది. ఇలాంటి విశ్వాసానికి వికటమైన రూపం– డేరా సచ్చా సౌదా గుర్మిత్‌ రామ్‌ రహీమ్‌.



చానళ్ల పేర్లు అనవసరం. ఒకాయన పెద్ద బొట్టుతో, దుశ్శాలువాతో టీవీ తెర అంతా ఆక్రమించి కూచుంటాడు. విశ్వాసాన్ని నమ్ముకున్న ఒక తల్లి ‘రెంట చింతల’నుంచి అడుగుతుంది– మా రెండో అబ్బాయికి ఉద్యోగం రావాలంటే ఏం చెయ్యాలి బాబూ– అని. ఈయన చెప్తాడు– ‘‘ప్రతీ బుధవారం మర్రి ఆకు నెత్తిన పెట్టుకుని, దాని మీద చింతగింజని ఉంచి స్నానం చెయ్యమనండి. ఆరువారాలు చేశాక– కావిరంగు పంచె కట్టుకుని మీ ఊళ్లో ఉన్న మర్రి చెట్టు మొదట్లో ఆ చింతగింజని పాతిపెట్టమనండి. ఆరో రోజుకి ఉద్యోగం రాకపోతే నాదగ్గరికి రండి 1,500 రూపాయల తావీజు కడతాను’’అంటాడు. ఇది విన్నాక–దిక్కుమాలిన జ్యోతిషం మీదా, దేవుడిమీదా నమ్మకం మంటగలవకుండా ఎందుకుంటుంది?



విశాఖపట్నం బీచిలో తెన్నేటి పార్కు ఎదురుగా పేవ్‌మెంట్‌ మీద చిలక జ్యోతిష్కులు ఉంటారు. తోక తెగిన చిలక బోనుల నిస్సహాయంగా బయటికి వస్తుం ది. దానికి రెండే అలవాట్లు– బొత్తిలో కార్డు లాగితే బియ్యం గింజలు వస్తాయి. లాగుతుంది. ఆ కార్డు ఈ ‘మనిషి’ భవిష్యత్తు. ‘‘నీ కూతురి పెళ్లి ఈ సెప్టెంబరులో అవుతుంది’’ అంటాడు చిలకయ్య. అది అయిదు రూపాయల సంతోషం– పల్లెటూరి మనిషికి ఇక్కడ పెట్టుబడి ఏమిటి?– విశ్వాసం. మనిషి ఆశకి ఊతం కావాలి. దాన్ని ఎదుటి వ్యక్తి కలిగిస్తున్నాడన్న నమ్మకం రావాలి. అందుకూ చెల్లింపు. దానికి చిలక స్థాయి చాలు రైతుకి.



దేవుడిని చంకన ఎత్తుకుని తాను దేవుడి ప్రతినిధినంటూ– వెనుకబడిన వర్గాల తరఫున ముందుపడిన ‘రాబందు’ జిగ జిగా మెరిసే కళ్లజోళ్లతో, అమెరికా మార్కు బనీన్లతో, అందంగా దువ్విన గెడ్డంతో, స్ఫురద్రూపంతో, పాప్‌ పాటలతో, సినిమా నిర్మాణ సంరంభంతో, మెర్సిడిస్‌ కార్ల హంగులతో, కోట్లమంది విశ్వాసం పెట్టుబడితో విర్రవీగితే ఏమవుతుంది? డేరా సచ్చా సౌదా అవుతుంది. కోట్లమంది ఓట్లను దండుకునే రాజకీయ పార్టీల కక్కుర్తికి ఆధారమౌతుంది. ఈ మధ్యలో ‘దేవుడు’ అటకెక్కిపోతాడు. ఇప్పుడు చిలక స్థానంలో రాబందు ఉంది. ఇక ‘రాబందు’కి కొదవేముంది?


విశ్వాసాన్ని ఆధారం చేసుకున్న ఎందరు బాబా లు? విశ్వాసానికి కొలబద్ధలు లేవు. ప్రజల ఎగబాటే వారి శక్తి. హర్యానా సత్యలోక్‌ ఆశ్రమాధిపతి రామ్‌పాల్‌ బాబా లీలలు, స్వాధీన్‌ భారత్‌ సుభాష్‌ సేన రామ్‌ వృక్ష యాదవ్, బెంగళూరులో ధ్యాన్‌ పీఠానికి చెందిన నిత్యానంద లీలలు, ఇంకా ఒక కొలిక్కిరాని ఆశారామ్‌ లీలలు, సనాతన్‌ ధన్‌ హుగ్లీ బాలక్‌ బ్రహ్మచారి– ఇలా ఎందరు?



తనని నమ్మ వచ్చిన ఇద్దరు మహిళల్ని మానభంగం చేసి, గర్వంగా 15 సంవత్సరాలు కేసు నడిపి, తన చుట్టూ ఉన్న ‘దన్ను’ కారణంగా తనకేమీ జరగదని గర్వంగా రొమ్ము విరిచి, మొన్నటి తీర్పుకి 300 కార్లతో విహారంగా వచ్చిన ‘గ్లామరు’బాబా 20 ఏళ్లు జైలుశిక్ష పడ్డాక కోర్టులో ‘‘నన్ను క్షమించండి మొర్రో’’అని నిస్సహాయంగా కూలబడి ఏడవడం ఎందుకు? ఇంతకాలం లక్షల మందిని నమ్మించి, చంకన ఎత్తుకున్న దేవుడు ఏమయ్యాడు?



మతాన్ని, దేవుడిని ఎరచూపి– కింద మధ్యతరగతి ప్రజానీకం ‘విశ్వాసా’లను సమీకరించి వ్యవస్థల్ని ఏర్పరచుకున్న ఇలాంటి బాబాలు– ఇంకా మతంలోనూ, సంప్రదాయంలోనూ తమ మాలాలు ఉన్న ‘నిస్సహాయమైన’ వ్యవస్థకి పట్టే చీడపురుగులు.



పాపం, తెన్నేటి పార్కుకి ఎదురుగా పేవ్‌మెంట్‌ మీద చిలక అతి చిన్న నమూనా. ప్రాథమికమైన విశ్వాసం అతని కొంగుబంగారం. ఉపాధి మాత్రమే అతని లక్ష్యం. కాని ఈదేశంలో దేవుడు, మతాన్ని పొగరుగా వ్యాపారం చెయ్యగల–దుర్మార్గమయిన స్వార్థానికి విశ్వరూపం గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌.



పంజాబు కట్టలు తెంచుకునే ఆవేశానికీ, పరిమితి లేని విశ్వాసానికి ప్రతీక. తాము నమ్మిన విలువలకి ప్రాణం ఇచ్చే స్వభావం ఆ జాతిది. ఇక్కడే జైన బౌద్ధ, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, సిక్కు మతాలు విస్తరించాయి, వేళ్లు నిలదొక్కుకున్నాయి. అయితే మధ్య మధ్య కుళ్లు చూపిన ఓ భయంకరమైన ‘వేరు’ కథ ఈ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ది. మరో 20 ఏళ్లు– వెర్రి తలలు వేయించిన విశ్వాసానికి గమ్యాన్ని ఈ ‘రాబందు’ గుర్తు చేస్తూనే ఉంటుంది.



గొల్లపూడి మారుతీరావు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top