రైతు విత్తనహక్కుపై దాడి

రైతు విత్తనహక్కుపై దాడి - Sakshi


 తొలకరి వానలు పడిన తర్వాత  రైతులు మంచి విత్తనాలకోసం వేట మొదలెట్టారు. దేశ, విదేశీ విత్తన కంపెనీలు ‘భక్తి’తో ‘త్రిష’, ‘బన్నీ’,‘‘రాశి’, ‘బ్రహ్మ’లకు ‘పూజ’లు చేస్తూ ‘జాదూ’ వేషాలన్నీ వేస్తూవున్నాయి. మరో వంక నకిలీ, నిషిద్ధ విత్తనాల స్వాధీనం వార్తలూ వెల్లు వెత్తుతున్నాయి. గత ఏడాది కొన్నిచోట్ల విత్తనాలు మొలకెత్త లేదు. మొలకెత్తిన చోట పంట రాలేదు. బిల్లులతో వెళ్లి రైతులు షాపులకు, వ్యవసాయ అధికారులకు విన్నవించుకున్నా ఒరిగిందిలేదు. రైతులకు నష్ట పరిహారాన్ని ఇప్పిస్తామని మంత్రులు శుష్క వాగ్దానాలు చేశారు. బిల్లు వున్నా లేకపోయినా ఒకటే అనే స్థితికి తీసుకొని వచ్చారు.


ప్రభుత్వం, ఈసారి ముందు జాగ్రత్తలను తీసుకొంటున్నానంది. తీరా అమాయకులైన రైతులపై çపడింది. మీ వద్ద వున్న విత్తనాలు నకిలీవనీ, నాసివనీ, నిషిద్ధమైనవనీ, లూజు విత్తనాలు వుండటం నేరమనీ పోలీసులు రైతులను అరెస్టు చేసి, బెయిల్‌ రాకుండా ఏవేవో కేసులు పెట్టి నానా హింసలు పెడుతూ వున్నారు. తమకు నమ్మకం వున్న వారివద్ద విత్తనాలు తెచ్చుకోవటం వారు చేసిన మొదటి తప్పు. పెద్ద కంపెనీల వద్ద విత్తనాలు కొనకపోవటం రెండవ తప్పు. విత్తన రైతులు నమ్మకమైన విత్తనాలను తయారుచేసి రైతులకు, కం పెనీ ధరలకన్నా తక్కువకు అమ్మటం మూడవ తప్పు!


కంపెనీలకు విత్తనాలను తయారుచేసి ఇచ్చేది విత్తన రైతులేనని మరుగు పరుస్తున్నారు.  విత్తన రైతుల వద్ద నుండి విత్తనాలను తీసుకొని రూ. 100 విత్తనాలను ఎకరానికి రూ. 3 వేలకు అమ్ముతున్నారు. 2002 సంవత్సరం తర్వాత మోన్సాంటో కంపెనీ విత్తన రంగంలో ప్రవేశించిన తర్వాత విత్తన రంగంలో పెను మార్పులు సంభవించాయి.  రైతులెవరూ విత్తనాలు తయారుచేయకూడదని పోలీసుల చేత చెప్పిస్తున్నారు.


రాయల్టీ పేరున భారత రైతుల శ్రమను మోన్సాంటో లాటి విదేశీ కంపెనీల దోపిడీకి, దాడికి అప్ప చెప్పారు. రైతుల విత్తన హక్కుపై దాడి చేయటమే గాక, వారిని దొంగలుగా, సంఘ విద్రోహ శక్తులుగా, అరాచక ముఠాలుగా చిత్రించటం హేయం. 2001 పీవీపీ చట్టం ప్రకారం, 1966 విత్తన చట్టం ప్రకారం రైతు స్వయంగా విత్తనాలు తయారు చేసుకోవచ్చు. రైతులకు విత్తనాలు అమ్ముకోవచ్చు. కాబట్టి ప్రభుత్వం రైతుల విత్తన హక్కుపై దాడి చేయవద్దని మనవి. – డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌‘ రైతు రక్షణవేదిక, గుంటూరు, నల్లమడ రైతు సంఘం,

చిలకలూరిపేట‘ 9000657799

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top