ఐదు దశాబ్దాల మేఘగర్జన

ఐదు దశాబ్దాల మేఘగర్జన - Sakshi


కోల్‌కతాలోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల నుంచి వందలాది మంది విద్యార్థులు నక్సల్బరీ పోరుకు మద్దతుగా నిలిచారు. అలాగే ‘దేర్‌ ఈజ్‌ నో కన్‌స్ట్రక్షన్, వితౌట్‌ డిస్ట్రక్షన్‌’ (పాతని «ధ్వంసం చేయకుండా నూత్నంగా దేన్నీ నిర్మించలేం) అనే మావో నినాదాన్ననుసరించి చైనా విప్లవంలో మాదిరిగానే పాత సంస్కృతికి చిహ్నాలైన నాయకుల విగ్రహాలను కోల్‌కతాలో ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. నిర్బంధం వల్ల నక్సలైట్‌ పోరాటం పశ్చిమ బెంగాల్‌లో ఎంతో కాలం సాగకపోయినప్పటికీ ఉద్యమాలపైన, సాహితీ సాంస్కృతిక రంగాల పైన చివరకు సినీరంగంపైన అది చూపిన ప్రభావం గాఢమైనదని కంచన్‌ వ్యాఖ్యానించారు.



‘‘నక్సల్బరీ ఏకీ రస్తా’’... ‘‘నక్సల్బరీ గతం కాదు. వర్తమానం, భవిష్యత్తు కూడా.’’ గొంతు వణుకుతున్నా తొట్రుపాటు లేకుండా 92 ఏళ్ల్ల వృద్ధుడు కొకొణ్‌ మజూందార్‌ వ్యాఖ్యానించిన తీరు ఇది. నక్సల్బరీ విప్లవోద్యమ ముద్దుబిడ్డ చారూ మజూందార్‌ అందించిన పోరాట పంథాని అనుసరించి, చైనా విప్లవోద్యమ మహానేత మావోసేటుంగ్‌ లాంగ్‌మార్చ్‌ స్ఫూర్తితో నక్సల్బరీ నుంచి (పశ్చిమ బెంగాల్‌లోని కుగ్రామం) చైనాకు నడిచి వెళ్లి, ఆయుధ శిక్షణ తీసుకుని, మావోతో చర్చలు జరిపి తిరిగొచ్చిన నాటి నవయువకుడూ, నేటి వయోవృద్ధుడే కొకొణ్‌. తెలుగుగడ్డ నుంచి తొలిసారి ‘నక్సల్బరీ’లో అడుగుపెట్టిన ఏకైక తెలుగు పత్రిక ‘సాక్షి’తో ఆయన అన్న మాటలవి.



నక్సల్బరీ ఒక గ్రామం కాదు. ఓ సంగ్రామ సిద్ధాంతానికి జన్మభూమి. ప్రపంచం నలుమూలలా వెల్లువెత్తుతున్న ప్రజా పోరాటాలూ, జాతుల విముక్తి ఉద్యమాలతో ప్రభావితమై విప్లవాన్ని వర్షించిన వసంత మేఘగర్జన నక్సల్బరీ. యాభై వసంతాలను పూర్తిచేసుకుంటున్న ఆ నక్సల్బరీలోనికి అడుగుపెట్టిన ‘సాక్షి’కి ఆ విప్లవోద్యమం, నాటి నిర్బంధం, ఆదివాసీ, రైతాంగ పోరాటాలూ, భూస్వామ్య వ్యతిరేక తిరుగుబాట్లలోని అనుభవాలను పలువురు వివరించారు. పదిహేను రోజుల పురుటి గుడ్డును పొత్తిⶠ్లకెత్తుకుని పోరాటంలో పాల్గొన్న ఆదివాసీ యువతి, ఇప్పుడు పండు ముసలి శాంతి ముండా ఆ పోరాట జ్ఞాపకాలను ఆవిష్కరించారు. నాలుగక్షరాల ఆ నక్సల్బరీ ఐదు దశాబ్దాల విప్లవోద్యమ మహాచరిత్రలో తొలి వాక్యం. అందులో శాంతి ఓ చిరు సంతకం. నా ప్రశ్నలకు సమాధానంగా ఆమె నోరు విప్పింది.



నిరసనలతో మొదలై...

నక్సల్బరీ ప్రాంతంలోని సిలిగురికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న హత్‌ ఘిస్సాకు చెందినది శాంతి. 1967లో ఎగసిన నక్సల్బరీ తిరుగుబాటులో ముందువరుసన నిలిచినవారిలో ఆమె ఒకరు. కానూ సన్యాల్‌తోనూ, ఆయన సిద్ధాంతంతోనూ తుదకంటా నడిచిన కూనూ దాదా అనుచరురాలు సాక్షితో తన అనుభవాలను పంచుకుంటూ ‘‘రెండు బీగాల (ఆరెకరం) పంట తిండికే చాలేది కాదు. భూస్వాముల దగ్గర తెచ్చుకున్న రుణానికి పండిన పంట మొత్తం చెల్లయ్యేది. తాలు గింజలను చీపురుతో పోగుచేసుకుని తెచ్చుకుని గంజి తాగి బతికే పరిస్థితి మాది. హత్‌ఘిస్సా చుట్టుపక్కల మెజారిటీ ప్రజ లందరిదీ అదే పరిస్థితి. రోజురోజుకీ శ్రుతిమించిపోతున్న పెత్తందార్ల, జోతేదార్ల పోకడలకు వ్యతిరేకంగా చిన్న నిరసనలుగా ప్రారంభమైన మా పోరా టం దావానలమైంది. 1946 నుంచి 1951 వరకు సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మా పోరాటాలకు స్ఫూర్తినిచ్చింద’’ని శాంతి చెప్పారు.



నక్సల్బరీ ప్రాంతంలో 1960 దశాబ్దం ప్రారంభం నుంచే సీపీఎం నాయకత్వంలో∙పోరాట బీజాలు పడ్డాయి. 1967 మార్చి 3న డార్జిలింగ్‌ జిల్లాలోని నక్సల్బరీకి సమీపంలోని హత్‌ఘిస్సా ప్రాంతంలో భూస్వాముల, జోతేదార్ల దోపిడీకి వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమం ప్రారంభమైంది. పంట మొత్తాన్ని భూస్వాములే దోచుకుంటుంటే కడుపు మండిన రైతాంగం ఆ భుముల్లో ఎర్రజెండాలు పాతి పంటను కోసుకోవడం ప్రారంభించారు. ఆ తరువాత రైతాం గాన్ని సంఘటిత పరిచి సాయుధ పోరాటం చేయాలని నాటి సీపీఎం స్థానిక విభాగం నిర్ణయించింది.



నిజానికి నక్సల్బరీ పోరాటానికి ముందే 8 డాక్యుమెంట్లు పేరుతో చారు మజూందార్‌ ఒక కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దీని ప్రభావంతో నక్సల్బరీ, కరీబరీ, ఫాన్సీదేవ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 274 చదరపు మైళ్ల ప్రాంతంలో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో 60కి పైగా పోరాట ఘట నలు జరిగాయి. గ్రామగ్రామంలో రైతులు కమిటీలుగా ఏర్పడి జోతేదార్ల భూములను ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. దాదాపు 20 వేల మంది రైతులు పూర్తికాలం కార్యకర్తలుగా చేరారు. ఈ క్రమంలోనే జరిగిన సంఘటన నక్సల్బరీ సాయుధ రైతాంగ పోరాటం.



మే 24న జోతేదార్లకు మద్దతుగా వస్తున్న పోలీసులకూ అక్కడి రైతాంగానికీ, ఆదివాసీలకూ మధ్య ఘర్షణ జరిగింది. సోనం వాంగ్డే అనే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై ఆదివాసీలు బాణాలతో దాడిచేశారు. దానికి ప్రతీకారంగా మరునాడు పోలీసులు బెంగాయ్‌ జోతె ప్రజలపై పెద్ద ఎత్తున జరిపిన కాల్పుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, ఒక పురుషుడు మరణించారు. ఇదే ప్రసాద్‌జోతె మారణకాండ. నక్సల్బరీ పోరాటానికి నాందీ ప్రస్థావన. దీనితో పోలీసుల నిర్బంధం తీవ్రమైంది. చారు మజూందార్‌తో పాటు అనేకమంది అజ్ఞాతంలోకి వెళ్లారు.



మావోతో మాటా–మంతీ

ఆ సమయంలోనే కానూ సన్యాల్, కొకొణ్‌ మజూందార్, కుదన్‌లాల్‌ మాలిక్, దీపక్‌ బిశ్వాస్‌లతో కూడిన నాయక బృందం చైనా వెళ్లింది. 1967 సెప్టెంబర్‌లో బయలుదేరిన ఆ బృందం డిసెంబర్‌ 24 వరకు అక్కడే ఉంది. మావోసేటుంగ్‌ని కలసి నాటి భారత విప్లవ రాజకీయాలను చర్చించింది. ఆయుధ శిక్షణ తీసుకుంది. మావోను కలుసుకోవడం తమకెంతో ఉత్తేజాన్నిచ్చిందనీ, నక్సల్బరీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు అశేష ప్రజానీకాన్ని ఇందులో భాగస్థులను చేయాలనీ, లేదంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణచివేసినట్టే రాజ్యం అణచివేస్తుందని ఆయన హెచ్చరించారనీ కుదన్‌లాల్‌ మాలిక్‌ గుర్తుచేసుకున్నారు. లక్షలాది మందిలో విప్లవాగ్నులూ, భావాలూ రగిలించిన నక్సల్బరీ ఉద్యమాన్ని సాయుధ పథం పట్టించిన చారు మజూందార్‌ ఏకైక కుమారుడు అభిజిత్‌ మజూందార్‌ జ్ఞాపకాలివి– ‘‘చైనా చైర్మన్‌ ఈజ్‌ అవర్‌ చైర్మన్‌. మావో సేటుంగ్‌ ఈజ్‌ అవర్‌ లీడర్‌– చిట్టి చేతులతో మేం రాసిన గోడరాతలవి. అప్పటికి నాకు ఏడేళ్లుంటాయేమో! నిజానికి విప్లవోద్యమ ఆటలవి. మాటలైనా, పాటలైనా, చివరకు ఆటలైనా నాడు విప్లవమే.’’



చారు మజూందార్‌ సంతానంలో చిన్నవాడు అభిజిత్‌. ఆయనకు ఇద్దరక్కలు–అనిత, మధుమిత. చిన్ననాటి ఆ ఘటనలన్నీ గుర్తులేకున్నా నాటి నిర్బంధం అభిజిత్‌ మీద గాఢమైన ముద్రనే మిగిల్చింది. ‘‘సమానత్వం కోసం సాయుధ పోరాటాన్ని ఎంచుకున్న నాన్నని ఓ హంతకుడిలా చూసిన సమాజంలో అమ్మ చాలా చేదు అనుభవాలను ఎదుర్కొంది. నాన్న రహస్య జీవితంలోనికి వెళ్లిపోయాక పోలీసుల టార్చర్‌ తీవ్రమైంది. అర్థరాత్రులూ, అపరాత్రులూ అని లేకుండా మా ఇంటిపైన దాడి చేసేవారు. అటువంటి సందర్భాల్లో అమ్మ చూపించిన ధైర్యానికి అంతా అవాక్కయ్యేవాళ్లు. పోలీసులను లోనికి అనుమతించేది కాదు. అరెస్టు వారంట్‌ అడిగేది. అది చూపించినా తెల్లవారే వరకూ ఇంట్లోకి రానిచ్చేది కాదు. వచ్చే ముందు వాళ్ల చేతిలో ఉన్న ఆయుధాలను కూడా బయటే పెట్టి రమ్మని ఆదేశించేది. లేదంటే వాళ్ల జేబుల్లో ఆయుధాలు మా ఇంట్లో దొరికినవిగా నమోదయ్యేవి.’’అని చెప్పారాయన.



నాన్నని చంపేసాక అంతా నిశ్శబ్దం...

చారు మజూందార్‌ చరమాంకం గుర్తుకు రావడంతోనే అభిజిత్‌ గొంతులో జీర. ‘‘1972 జూలై 16న అరెస్టు చేసి కోల్‌కతాలోని అలీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టి జూలై 28న నాన్నను చంపేశారు. ఆయన భౌతికకాయాన్ని చూసిన క్షణాలు నాకింకా గుర్తే. నాన్న నిర్జీవ శరీరాన్ని చూసి కూడా పోలీసులూ, పాలకులూ భయభ్రాంతులయ్యారు. నిశ్శబ్దంగా కదులుతున్న మనుషుల మధ్యలోంచి మమ్మల్ని మాత్రమే పోలీసులు నాన్న భౌతికకాయం దగ్గరికి తీసుకెళ్లారు. అంత నిర్బంధంలోనూ హోరుగాలి ఎక్కణ్ణుంచో మోసుకొచ్చిన నినాదం నా చెవుల్లో మార్మోగింది. ‘చారుబాబూ అమర్‌ రహే!’ నినాదాన్ని మోసుకొచ్చిన గాలి సైతం గంభీరంగా కదిలింది–అమ్మలాగే...’’ కళ్లల్లో నీటి తెరతో ఆ జ్ఞాపకం నుంచి బయటపడలేక పోయారు అభిజిత్‌.



భారత ఉద్యమ చరిత్రలో ‘ఫ్రాంటియర్‌’ పత్రిక పాత్ర చిరస్మరణీయమైనది. నక్సల్బరీ ఉద్యమ కాలం నుంచి ఆ పత్రికలో పనిచేసి, ప్రస్తుతం అదే పత్రికకు సంపాదకుడిగా ఉన్న తిమిర్‌ బసును వెతుక్కుంటూ వెళ్లాం. మావో నినాదాన్ని పలవరించిన నాటి పశ్చిమ బెంగాల్‌ పల్లెల, పట్టణాల దృశ్యాన్ని ఆవిష్కరించారు తిమిర్‌. ‘గ్రామాలకు తరలిరండి’– ఇది మావో నినాదం. ఆ నినాదాన్ని నక్సల్బరీ అందిపుచ్చుకుంది. ‘బూర్జువా చదువులు మాకొద్దు’– ఇది చారు మజూందార్‌ ఇచ్చిన నినాదం. నాడు దేశవ్యాప్తంగా ఎందరో మేధావులను, డాక్టర్లను, ఇంజనీర్లను చదువులను వదిలి నక్సల్బరీ ఉద్యమంలో మమేకమయ్యేలా చేసింది.



నక్సల్బరీ ప్రభావం గాఢమైనది

ఎనభై ఏళ్లు పైబడినా తొణకని ఆత్మవిశ్వాసంతో మావోయిజమే సరైన విప్లవ మార్గమనీ, మరో నక్సల్బరీ ఉద్యమ ఆవశ్యకతనీ అరగంట పాటు అనర్గళంగా వివరించారు కోల్‌కతా జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ పరిసరాల్లో నివసిస్తున్న తొలి సాంస్కృతికోద్యమ నాయకుడు కంచన్‌కుమార్‌. కోల్‌కతాలోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల నుంచి వందలాది మంది విద్యార్థులు నక్సల్బరీ పోరుకు మద్దతుగా నిలిచారు. అలాగే ‘దేర్‌ ఈజ్‌ నో కన్‌స్ట్రక్షన్, వితౌట్‌ డిస్ట్రక్షన్‌’ (పాతని «ధ్వంసం చేయకుండా నూత్నంగా దేన్నీ నిర్మించలేం) అనే మావో నినాదాన్ననుసరించి చైనా విప్లవంలో మాదిరిగానే పాత సంస్కృతికి చిహ్నాలైన నాయకుల విగ్రహాలను కోల్‌కతాలో ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. నిర్బంధం వల్ల నక్సలైట్‌ పోరాటం పశ్చిమ బెంగాల్‌లో ఎంతోకాలం సాగకపోయినప్పటికీ ఉద్యమాలపైన, సాహితీ సాంస్కృతిక రంగాల పైన చివరకు సినీరంగంపైన అది చూపిన ప్రభావం గాఢమైనదని కంచన్‌ వ్యాఖ్యానించారు.



నాటి నక్సల్బరీ తరం నేడేం కోరుకుంటోంది? దాని గురించి శాంతి ముండా ఇలా చెప్పారు. ‘‘సాయుధ పోరాట చైతన్యం ప్రజల మనసుల నుంచి చెదిరిపోలేదు. పాత దోపిడీ విధానాల స్థానంలో కొత్త విధానాలు వచ్చాయి. అప్పుడు జోతేదార్ల ఆక్రమణలో ఉన్న భూములను రైతాంగం పోరాడి సాధించుకున్నది. కానీ ఇప్పడవే భూములను విమానాశ్రయాలూ, టీ తోటల అభివృద్ధి పేరుతో ఆక్రమిస్తున్నారు. దీంతో వేలాది మంది భూమి నుంచి వెలివేయబడి, నిరాశ్రయులుగా మారుతున్నారు. నక్సల్బరీ చూపిన పోరాట మార్గం ఇక్కడి ప్రజల హృదయాల్లో సజీవంగానే ఉంది. ఉంటుంది. దీనికి మరణం లేదు. దోపిడీ ఉన్నంత కాలం ఆ పోరాట స్ఫూర్తి ఇక్కడి ప్రజ లనే కాదు, యావత్‌ దేశ ప్రజానీకాన్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది.’’

(నక్సల్బరీ ఉద్యమానికి నేటితో 50 ఏళ్లు)

అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్‌ కరస్పాండెంట్, సాక్షి


 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top