సినిమాలాంటి కథ

రమ్య-సతీష్ కుమార్ - Sakshi


జీవన కాలమ్

 

మాధ్యమంలో ‘నీతి’ త్రివేణీ సంగమంలో సరస్వతి నది లాంటిది. దానికోసం వెదకనక్కరలేదు. అది నిర్మాత, దర్శకుని మనస్సులో ఉంటే చాలు. ప్రేక్షకుడు గుర్తుపడతాడు.

 

ఇది వేడి వేడి కథ. తమిళనాడులోని నాగరకోయిల్‌లో పిళ్లె యార్‌పురంలో ఉన్న సివాంతి ఆదిత్నార్ కాలేజీలో జరిగింది. సుదన్ అనే కుర్రాడు తనకంటే రెండేళ్ల సీనియర్ అమ్మాయితో కాలేజీ క్లాసు గదిలో తలుపులు బిగించుకుని కాలక్షేపం చేశాడు. కాలేజీ యాజమాన్యం అతన్ని సస్పెండ్ చేసింది. కుర్రాడు కోర్టుకెళ్లాడు. ఆ విషయమై ఆ అమ్మాయి ఫిర్యాదు చేయలేదు కనుక సాక్ష్యం లేదని అతని వాదన.


 


అతని తరఫు న్యాయవాది ఏం వాదించాడో తెలుసుకోవాలని ఉంది. ఇద్దరూ కాలేజీ గదిలో తలుపులేసుకుని భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నారా? సీనియర్ అమ్మాయి అతనికి మహాత్మాగాంధీ గురించి వివరిస్తోందా? ఇద్దరూ కలసి వసుైధైక కుటుంబం గురించి ప్రార్థనలు చేస్తున్నారా? దరిమిలాను ఆ కుర్రాడిని యాజమాన్యం కాలేజీ నుంచి డిస్మిస్ చేసింది. కేసు హైకోర్టుకి వచ్చింది. అది అవినీతి చర్య అంటూ హైకోర్టు న్యాయమూర్తి వైద్యనాథన్ కేసు కొట్టేశారు. ఆయన రెండు విషయాలు చెప్పారు.




 ‘చదువు చెప్పే పాఠశాలల్ని దేవాలయాలుగా భావించాలి. ఉపాధ్యాయులు దేవుళ్లు. (ఇదే పత్రికలో మరొక వార్త- విల్లుపురంలో అసిస్టెంటు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల ‘దేవత’-పేరు రమ్య- తన దగ్గర చదువుకుంటున్న సతీష్‌కుమార్ అనే 21 ఏళ్ల కుర్రాడిని పెళ్లిచేసుకుంది!)




ఇవీ న్యాయమూర్తి మాటలు: ‘ఈ రోజుల్లో సినీ మాలు, మాధ్యమాలూ యువతరం మీద ఎక్కువ ప్రభా వం చూపుతున్నాయి. నేరస్తుల కార్యకలాపాలను చూపే సినీమాలు యువతను నేరాల వేపు ప్రోత్సహిస్తున్నాయనడంలో సందేహం లేదు. సెక్స్ మొదలైన సహజ బల హీనతలను ఎత్తిచూపే సినీమాలు మానవ నైతిక ప్రవర్తనను చెడుదారి పట్టిస్తున్నాయి. టీవీలు, సినీమాలు, నాటకాలు, ఇతర ఆధునిక సాంకేతిక వినియోగాలు, మొబైల్ ఫోన్లు యువకుల జీవితాల్ని పెడదారి పట్టించ డానికి మూలకారణాలు అవుతున్నాయి. ఈ కేసు అందు కు సరైన ఉదాహరణ’. ఇలాంటి చర్యల్ని ప్రోత్సహిస్తే - సమాజానికి పీడగా పరిణమించే ప్రమాదముంది - అంటూ కుర్రాడి అప్పీలుని తిరస్కరించారు.



మాధ్యమం- సినీమా కానీ, మరేదయినా కానీ సమాజానికి భూతద్దం. సమాజ నీతికి జనరలైజేషన్. మంచివాడి మంచితనం కన్నా- విలాస పురుషుడి విలా సాలు చాలా ఆకర్షణీయంగా, అందుబాటుగా, అలవరు చుకొనేంత సులువుగా కనిపిస్తాయి. మనిషి బలహీనత- మెజారిటీ ప్రేక్షకులకు దగ్గరగా, అందుబాటులో ఉంటుంది. చెల్లిపోయినంత వరకూ గొప్పగా ఉంటుంది. చెల్లించుకోగలిగితే గర్వంగా ఉంటుంది. అందుకే మాధ్య మాలకు మంచి ఖాతాదారులు - యువత. అరాచకం దాని రుచి.



‘సంసారం ఒక చదరంగం’ సినీమా రిలీజయి 28 సంవత్సరాలయింది. సింగపూర్ నుంచి ఓ కంపెనీ చైర్మన్, చీఫ్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ పోతుల బాలవర్ధన్‌రెడ్డి కిందటివారమే తెలుగులో ఉత్తరం రాశాడు: ‘మీ ‘సంసారం చదరంగం’ అంటే నాకు పంచప్రాణాలు. కొన్ని పదులసార్లు చూసి ఉంటా. వీలుదొరికినప్పుడల్లా చూస్తూనే ఉంటా. ఎందుకంటే అక్కడున్న మీరు ప్రతీ మధ్యతరగతి కుటుంబీకుల నాన్నే. ఆ పాత్రకి హ్యాట్సాఫ్... పాదాభివందనాలతో’. సినీనటుడికి ఒక ప్రేక్షకుడు- అదిన్నీ అంత ఉన్నత పదవిలో ఉన్న ఒక అధికారి ‘పాదాభివందనం’ చేసి ఎన్నాళ్లయింది? మాధ్యమం చెప్పే మంచికి స్పందించిన ఒక వ్యక్తి ఆవేశమది. ఈ అభినందన నటుడిది కాదు - మాధ్యమానిది.




 ఈ మధ్య ఒక సభలోంచి బయటకు వస్తూంటే ఓ వృద్ధురాలు నా ముందుకు వచ్చి నా కాళ్లకు నమస్కారం చేసింది. నేను కంగారు పడిపోయాను. ఏవేవో చెప్పి ‘ఈ నమస్కారం మీరు వేసిన తండ్రి పాత్రకు’ అంది. నేనా చిత్రానికి కథా రచయితని కాను. కేవలం నటుడినే. అయినా ఓ పాత్ర, దాని సౌజన్యం మూడు దశాబ్దాలు ప్రేక్షకుల మనస్సుల్లో మిగిలింది.



దురదృష్టవశాత్తూ మాధ్యమాలు వ్యాపారంగానే నిలదొక్కుకుని- సామాజిక బాధ్యతని అటకెక్కించాయి. ఓ లవకుశ, ఓ ప్రతిఘటన, ఓ సీతారామయ్యగారి మనుమరాలు, ఓ సౌండ్ ఆఫ్ మ్యూజిక్, ఓ మొఘల్-ఏ- ఆజం మంచిని చెప్తూనే వ్యాపారాలు చేశాయి. మాధ్యమంలో ‘నీతి’ త్రివేణీ సంగమంలో సరస్వతి నది లాంటిది. దానికోసం వెదకనక్కరలేదు. అది నిర్మాత, దర్శకుని మనస్సులో ఉంటే చాలు.




 ప్రేక్షకుడు గుర్తుపడతాడు. అలాగే దాని అవసరం లేదని అటకెక్కించేసిన ‘నిజం’ కూడా ప్రేక్షకుడు గుర్తుపడతాడు. ఎలా? నాగరకోయిల్ సుదన్ అనే కుర్రాడిగా.  దురదృష్టం ఏమిటంటే న్యాయమూర్తి విధించేది అధికారంతో పెట్టే ఆంక్ష. మాధ్యమాల విశృంఖలత్వం వాటికి దక్కిన స్వేచ్ఛ దుర్వినియోగం.

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top