గురువుకు అవమానం!

గురువుకు అవమానం!


విశ్లేషణ

స్కూలుకు రావడం ఏడు నిమిషాలు ఆలస్యమైందని ఒడిశాలో ఒక ఉపాధ్యాయురాలికి ఆరేళ్లు వేతనం నిలిపివేశారు. మన వ్యవస్థలోని నేరాల్లోకెల్లా ఘోర నేరమిది. కానీ ఆమె అసాధారణ నిబ్బరంతో ఆరేళ్లూ పనిచేశారు.

ఉపాధ్యాయులకు తదుపరి దశ అవార్డులను అందించేటప్పుడు భారత ప్రభుత్వం భిటిప్రవ పటేల్‌ను విస్మరించకూడదు. ఆమె ఒడిశా సందేర్గాహ్‌ జిల్లాలో పనిచేసే ఉపాధ్యాయిని. ఒడిశా ప్రభుత్వం సిగ్గుపడేలా రెండు పనులు చేసిందామె. అవేమిటంటే, ఆరేళ్లు తనకు రావలసిన వేతనం చెల్లించకపోయినా ఆమె ఏమాత్రం లెక్క చేయలేదు. పైగా ఆరేళ్లుగా పాఠశాలకు హాజరుకావడమే కాకుండా విద్యాబోధనను కొనసాగించింది.



మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం, స్కూలు ను విద్యాశాఖ అధికారి తనిఖీ చేసిన రోజున ఆమె ఏడు నిమిషాలు ఆలస్యంగా వచ్చారట. అందుకని గత ఆరేళ్లుగా ఆమెకు జీతం చెల్లించకుండా శిక్షిం చారు. ఇది నేరాల్లోకెల్లా ఘోరమైన నేరచర్యగా పరి గణించాల్సిన ఘటన. ఎందుకంటే ఆరేళ్లు వేతనం పొందకుండా ఆమె భారీ మూల్యం చెల్లించింది. మరో మాటలో చెప్పాలంటే ఆమె ఆలస్యంగా వచ్చిన ప్రతి నిమిషానికి ఒక సంవత్సరం పూర్తి వేతనాన్ని తనకు చెల్లించడాన్ని నిరాకరించారు. ఒక నిమిషం లేటుకు మూల్యం సంవత్సరం వేతనంతో సమానం.



విషయం వెలుగులోకి వచ్చాక భిటిప్రవ పటేల్‌ తనకు రావలసిన బకాయిలను పొందవచ్చు కానీ ఇక్కడా చిక్కు ఉంది. ఒక సంవత్సరం వేతనాన్ని ఆమెకు వెంటనే చెల్లించాలని అధికారులు ఆదేశించారు. కానీ మిగిలిన అయిదేళ్ల జీతం చెల్లింపుకోసం ప్రత్యేక బడ్జెటరీ ఏర్పాటు చేయవలసి ఉంది కనుక ఆమె వేచి ఉండాల్సిందేనట. ఎందుకంటే నిబంధనలు,  ప్రభుత్వంలోని గుమాస్తా మనస్తత్వం అలా ఉన్నాయి.

ఆ టీచర్‌ వేతనాన్ని అలా నిలిపి ఉంచినప్పుడు, అలాంటి శిక్షలను నిబంధనలు అనుమతించవని విద్యాశాఖ అధికారులు గుర్తించలేదు. అసాధారణ మనోనిబ్బరంతో ఆమె ఆ శిక్షను భరించింది. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ శిక్షాకాలంలోనే రెండేళ్ల తర్వాత ఆమెకు ప్రధాన ఉపాధ్యాయురాలిగా పదోన్నతి కల్పించారు. వాస్తవానికి ఆమె పాఠశాలకు ఆలస్యంగా వచ్చినందుకు ఒక రోజు వేతనం ఇవ్వకుండా ఉంటే సరిపోయేది.



ఈ ఘటనకు వెనుక మనం తెలుసుకోలేని పూర్తి భిన్నమైన కథ ఉంటే తప్ప, ఆ ఉపాధ్యాయురాలు తాను చేస్తున్న వృత్తి పట్ల అపార గౌరవాన్ని ప్రదర్శించారనే చెప్పాలి. ఆమె సంపన్నురాలే కావచ్చు. కానీ ఆమె పొందవలసిన వేతనాన్ని ఇంత హీనంగా తొక్కిపెట్టకూడదు. ఈ ఘటనలో నిజంగా శిక్షకు పాత్రులు ఎవరంటే, ఆమె వేతనాన్ని చెల్లించకుండా తొక్కిపెట్టిన వాళ్లే. ఈ ఉదంతంపై చాలా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆమె వేతనాన్ని చెల్లిం చడం మాత్రమే కాదు. ఎవరో ఒకరు ఈ అంశంలో శిక్షకు గురవ్వాల్సిందే.

ఉపాధ్యాయులు, బాలల విద్య అంటే అధికారులకు ఎప్పుడూ చిన్నచూపే. తల్లిదండ్రులు, సమాజం విద్యావ్యవస్థలో చేసిన మార్పులను తెలుసుకోవడం గగనమే. ఒక ప్రభుత్వం తర్వాత మరొక ప్రభుత్వం కాంట్రాక్టు ప్రాతిపదికన నామమాత్రపు జీతాలు చెల్లిస్తూ పారా టీచర్లను నియమిస్తున్నాయి. తమనుంచి జరుగుతున్న ఈ లోపాన్ని దాచిపెట్టడానికి సహాయశిక్షక్, శిక్షామిత్ర వంటి పెద్ద పెద్ద పేర్లను ఉపయోగిస్తుంటారు. వీరు పార్ట్‌ టైమ్‌ టీచర్లు కాదు. చాలా తక్కువ వేతనాలకు పనిచేసే టీచర్లన్నమాట.



సాధారణ వేతనాలను చెల్లించలేని ప్రభుత్వాలు ఉపాధ్యాయుల ఉపాధి అవసరాన్నే కొల్లగొడుతున్నాయి. విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తే మానవవనరులకు సంబంధించి కలిగే ఫలి తాలు పరమ విషాదకరంగా ఉంటాయి. దీని తొలి పర్యవసానం ఏమిటంటే తల్లిదండ్రులు ప్రైవేట్‌ స్కూళ్లనే ఎంచుకుంటారు.

ప్రైవేట్‌ పాఠశాలలు రాష్ట్ర పర్యవేక్షణలోనే ఉండవచ్చు కానీ వారికి చెల్లిస్తున్న వేతనాలు సిఫార్సు చేసిన రీతిలో ఉండకపోవచ్చు. ప్రైవేట్‌ స్కూళ్లు కాబట్టి అవి మెరుగైన  స్థితిలో ఉంటాయని అర్థం చేసుకోవలసిన అవసరం లేదు. వీటికి వస్తున్న అధిక ఫీజులు మెరుగైన వేతనాలను అందించకపోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్‌ పాఠశాలలు ఇప్పుడు పూర్తి వ్యాపార దృక్పథంతో నడుస్తున్నాయి.



రాష్ట్ర ప్రభుత్వం లేదా పారా–ప్రభుత్వ సంస్థల ద్వారా నియమితం కాకుండా, మన దేశంలో ఆరవ పే కమిషన్‌ సిఫార్సుకు సమానంగా ఉపాధ్యాయులందరూ వేతనాలు పొందుతారని భావించడం కూడా తప్పే. కొంతమంది ఎంతో కొంత వేతనం కల్పించి తమను ఉద్యోగాల్లోకి తీసుకున్నందుకే గొప్పగా ఫీలవుతుంటారు. కానీ విద్యా లక్ష్యానికి ఇదేమాత్రం మంచిది కాదు. ప్రత్యేకించి పాఠశాల విద్యలో 12 సంవత్సరాలు గడిపిన తర్వాత కూడా మెడికల్‌ లేదా ఇంజనీరింగ్‌ కోర్సులో ప్రవేశాల కోసం మెరుగైన గ్రేడ్‌ పొందడానికి విద్యార్థులు అత్యధిక ఫీజులు చెల్లించి మళ్లీ ట్యుటోరియల్‌కు వెళ్లవలసి వస్తోంది. వీటన్నింటినీ పక్కన బెట్టి చూస్తే, ఒడిశా టీచర్‌ భిటిప్రవ పటేల్‌ ఉదంతం మన వ్యవస్థ సిగ్గుతో తలవంచుకునేలా చేసింది.



వ్యాసకర్త

మహేష్‌ విజాపృకర్‌

సీనియర్‌ పాత్రికేయులు

ఈ–మెయిల్‌ : mvijapurkar@gmail.com

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top