తరలింపులో తొందరొద్దు

తరలింపులో తొందరొద్దు - Sakshi


తుది నివేదికలో...  ఉమ్మడి రాజధాని పదేళ్లు ఉందన్న సంగతి మరవద్దు

తాత్కాలిక కార్యాలయాల కోసం గుంటూరు - విజయవాడను పరిశీలించవచ్చు

అలాగే, తక్షణావసరాల కోసం నూజివీడు - గన్నవరం - ముసునూరు ప్రాంతాన్ని చూడొచ్చు

కొత్తగా(గ్రీన్‌ఫీల్డ్) సూపర్ సిటీ నిర్మించే హడావుడి వద్దు

హైకోర్టుకు విశాఖ బెస్ట్..  హైకోర్టు, సచివాలయం ఒకే చోట ఉండాలని లేదు


 

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక, ఇతర అంశాలపై సూచనలు చేయడానికి నియమించిన శివరామకృష్ణన్ కమిటీ గడువుకు రెండు రోజుల ముందే నివేదికను సిద్ధం చేసింది. ఇంతకాలం సాగిన ‘విజయవాడ రాజధాని’ ఊహాగానాలకు ఇందులో ఎలాంటి ముగింపు లేదు. అభివృద్ధి అంతా ఒక్కచోట కేంద్రీకరించరాదన్న సూత్రానికి మాత్రం పెద్ద పీట వేశారు. తక్షణావసరాలను దృష్టిలో ఉంచుకుని పరిమిత సిబ్బంది, చిన్న కార్యాలయాలతో సీఎం, మంత్రుల కార్యాలయాలు, సచివాలయం ఏర్పాటు చేయడానికి వీజీటీఎం(విజయవాడ గుంటూరు, తెనాలి, మంగళగిరి), దాని వెలుపల ఉన్న అవకాశాలను పరిశీలించవచ్చునని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. హైదరాబాద్‌లో పని చేస్తున్న కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించే ప్రక్రియలో తొందరపాటు తగదని నిష్కర్షగా చెప్పింది. అదే జరిగితే అనర్థమేనని, కొన్ని అనుభవాలను ఉటంకించింది.  

 

 హైకోర్టును విశాఖపట్నంలో నెలకొల్పే ప్రతిపాదనకు కమిటీ ఓటు వేసింది. ఎలాంటి శషభిషలూ లేకుండా కమిటీ వెల్లడించిన అంశం ఇదొక్కటే.  ప్రస్తుత పరిస్థితులలో గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నగరం ఏర్పాటుకు బృందం సానుకూలత వ్యక్తం చేయడంలేదు.  రాజ్‌భవన్, అసెంబ్లీ, హైకోర్టులకు స్థలాలను ఎంపిక చేయడానికి తొందరేమీ లేదనీ, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఇందుకు పదేళ్లు వ్యవధిని ఇస్తోందని కమిటీ అభిప్రాయపడింది. అయినా ఏ కార్యాలయం ఎక్కడికి తరలించాలన్న అంశం మీద సత్వర నిర్ణయాలు మాత్రం జరగాలని పేర్కొన్నది. తుది నివేదికలో పలు ఆసక్తికర సూచనలను కమిటీ చేసింది. నివేదికలోని ప్రధానాంశాలు...

 

 కొత్త రాజధాని ఏర్పాటుకు సంబంధించిన వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ పునర్వ్య వస్థీకరణ చట్టం 2014 కింద కేసీ శివరామకృష్ణన్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ ఏడాది మార్చి 28న ఏర్పడిన ఈ కమిటీ ఆరు నెలల్లోగా  (ఆగస్టు 31) తన నివేదికను సమర్పించాల్సి ఉండగా రెండు రోజుల ముందే 29న సమర్పించింది. సార్వత్రిక ఎన్నికలు, నూతన రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు తదితర కారణాల వల్ల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సందర్శించడానికి వాస్తవంగా కమిటీకి లభించిన సమయం దాదాపు పన్నెండు వారాలు మాత్రమే. ఈ తక్కువ వ్యవధిలోనే కమిటీ మొత్తం 13 జిల్లాల్లో 11 జిల్లాలను సందర్శించగలిగింది. రాష్ట్ర  ముఖ్యమంత్రి, తదితర మంత్రులతోనూ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ, ప్రభుత్వేతర సంస్థలతోనూ, ఇంకా ఇతరులతోనూ సంప్రదింపులను జరిపింది. ఈ-మెయిల్ ద్వారా అందిన 4,728  సూచనలను కూడా కమిటీ పరిశీలించింది.

 

 మునుపటి ఉమ్మడి రాష్ట్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించడం ఒకవంక పలు సమస్యలను సృష్టించింది, మరోవంక 13 జిల్లాలతో కూడిన రాష్ర్టం అంతటా సంతులిత అభివృద్ధిని సాధించడానికి అమూల్యమైన అవకాశాలను కూడా అందించిందని కమిటీ అభిప్రాయపడింది. ఒకప్పటి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అందుకు సార్వత్రిక మద్దతు లభించినట్టుంది. కానీ తెలంగాణ ఏర్పాటు మాత్రం ఏపీలో కొంత అసంతృప్తికి దారితీసింది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ప్రాంతీయ, ఉపప్రాంతీయ ఆకాంక్షలు గణనీయంగా పెరుగుతున్నాయని, తరచుగా అవి అసంతృప్తి, ఆందోళనల రూపంలో వ్యక్తమవుతున్నాయని కమిటీ గుర్తించింది.

 

 అంధ్రప్రదేశ్ అంతటా అభివృద్ధి సముచితమైన రీతిలో పంపిణీ అయ్యేట్టుగా చూడటం, రాజధాని నిర్వర్తించాల్సిన వివిధ విధులకు ఆ ప్రాంతం ఎలా తోడ్పడేదిగా ఉండటం అనేదే నివేదిక రూపకల్పనలోని ప్రధాన లక్ష్యమైంది. రాయలసీమలోని పలు ప్రాంతాలను సందర్శించినప్పడు రాజధానిని ఆ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే అభిప్రాయాలు  కమిటీకి వినవచ్చాయి. అందుకోసం ఆందోళనలను చేపడతామనే బెదిరింపులను సైతం దాని ముందు వ్యక్తమయ్యాయి. అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైతం ప్రభుత్వ కార్యాలయాల స్థాపనకు, భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఒకటి లేదా రెండు భాగాల పట్ల పక్షపాతం చూపుతారనే భయం రాయలసీమలో ఇప్పటికీ ఉంది. అందువల్లనే మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి నేపథ్యంలో రాజధాని విధులను నిర్వహించే ప్రాంతం అనేది కమిటీ ప్రధాన లక్ష్యంగా మారింది.

 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందున్న సవాళ్లు: ఆర్థికాభివృద్ధి ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని సుగమం చేయడానికి ఉద్దేశించిన ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని శివరామకృష్ణన్ కమిటీ స్ఫూర్తిగా తీసుకున్నది. ప్రారంభం నుంచి ఈ కమిటీ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక ఉత్పాదనలో 20 శాతం మాత్రమే వ్యవసాయం, దాని అనుబంధ రంగాల నుంచి వస్తుండగా, 14 శాతం ఉత్పాదన ఫైనాన్స్, స్థిరాస్తి రంగంనుంచి, మరో 14 శాతం ఉత్పాదన వాణిజ్యం, హోటల్స్, రెస్టారెంట్ల నుండి వస్తున్నట్లు తెలిసింది.

 

 వస్తూత్పత్తి రంగం దోహదం చాలా తక్కువ. మొత్తం శ్రామిక శక్తిలో 52 శాతం వ్యవసాయం, అనుబంధ రంగాల్లోనే ఉండగా వస్తూత్పత్తి రంగంలో కేవలం 10 శాతం శ్రామికులు మాత్రమే ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్ర (తెలంగాణేతర) జనాభా 4.94 కోట్లు కాగా 2051 నాటికి ఈ ప్రాంత జనాభా 6.7 కోట్లకు చేరుకుంటుంది. పెరగనున్న ఈ అదనపు శ్రామిక శక్తికి ఉద్యోగాలు వెదికిపెట్టడమే ఆంధ్రప్రదేశ్ ఎదుర్కోనున్న అతి పెద్ద సవాలు. ఈ కోణం నుంచే తన పని మొదలు పెట్టవలసి ఉంటుందని కమిటీ గుర్తించింది. రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, ఉప ప్రాంతాలు అభివృద్ధి అయ్యేలా వ్యూహాన్ని సూచించడమే తన కర్తవ్యంగా కమిటీ భావించింది. రాజధాని పాలనా నిర్వహణకు సాధ్యమయ్యే ప్రాంతాన్ని విశ్లేషించడానికి కమిటీ దీన్నే దృష్టిలో ఉంచుకుంది.

 

 ఆర్థిక వృద్ధి, ఉపాధి, ఆదాయ సృష్టి, అభివృద్ధి అవకాశాల సమాన పంపిణీ అనేవి ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి అత్యవసరమైనవని కమిటీ దృఢ అభిప్రాయం. వ్యవసాయంపై దాదాపు 55 శాతం మంది ఆధారపడి ఉండటం, సాపేక్షంగా తక్కువ అక్షరాస్యత (65 శాతం), స్వల్ప పట్టణీకరణ (29శాతం) తోపాటు, పెరుగుతున్న యువ శ్రామిక శక్తి, వస్తూత్పత్తి-సేవల రంగంలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం వంటివి సవాలుగా ఉన్నాయి. సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలను రాష్ట్రం సృష్టించాల్సి ఉంది. ఉత్పాదకత అధికస్థాయికి చేరుకున్నాక ఏటా మూడు లక్షల ఉద్యోగాల కల్పన అవసరమవుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడానికి, ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడానికి శివరామకృష్ణన్ కమిటీ జిల్లా వారీ సామాజిక, ఆర్థిక డేటాను సేకరించింది. కమిటీ చర్చల నేపథ్యాన్ని, వాటి హేతుబద్ధతను అర్థం చేసుకోవడానికి ఈ నివేదిక దోహదపడుతుంది.

 

రాజధాని విధులు

ఒక నగరాన్ని ప్లాన్ చేయడం, రూపొందించడం, కార్యకలాపాలను నిర్వర్తించడం అనేది సుదీర్ఘ ప్రక్రియ. కేవలం అయిదు నెలల స్వల్ప కాలంలో రాజధానికి సంబంధించి మూడు వైఖరులను కమిటీ పరిశీలించింది.

 

 1. గ్రీన్‌ఫీల్డ్ ప్రాంతం. ఇక్కడ ఒకే నగరం/సూపర్ సిటీని నిర్మించవచ్చు

 2. ప్రస్తుతం ఉన్న నగరాలను విస్తరించడం.

 3. అన్నిప్రాంతాలకూ అభివృద్ధి పంపిణీ

 గ్రీన్‌ఫీల్డ్ రాజధానీ నగరం ఏర్పాటు

 

 ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ‘ప్రపంచ స్థాయి నగరం’ గురించి పదే పదే సూచిస్తున్నారు. రాజధానికి అనువైన ప్రాంతాల పరిశీలనకు, రాజధాని రూపకల్పనను నిర్ణయించేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అధ్యక్షతన ప్రభుత్వ స్థాయిలో ఒక కమిటీని కూడా నియమించింది. ప్రభుత్వ విధులు అత్యంత వైవిధ్యభరితంగా, సృజనాత్మకంగా ఉంటున్న నేటి కాలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోట ఉంచాలనుకోవడంలో ప్రత్యేక కారణమేదీ కనబడదు. స్వాతంత్య్రానంతర ప్రత్యేక పరిస్థితుల్లో చండీగఢ్‌ను 115 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, గాంధీనగర్‌ను 177 చ.కి.మీలలో, భువనేశ్వర్‌ను 419 చ.కి.మీలలో కొత్త నగరాలుగా నిర్మించారు.

 

  మొత్తంగా నేటి ఏపీ అభివృద్ధి సాంద్రతను దృష్టిలో ఉంచుకుంటే ఇంత భారీ స్థాయిలో భూములు లభ్యంకావటం కష్టమే. రాష్ట్రంలోని వివిధ నగరాలకు ఉన్న రోడ్డు, రైలు మార్గాల సదుపాయాలను, వాటిని మరింతగా అభివృద్ధి చేయడానికి, విస్తరించడానికి ఉన్న అవకాశాలను గమనంలోకి  తీసుకుంటే  ఒకే ప్రాం తంలో సూపర్ నగరానికి అనువైన ప్రదేశం కోసం అన్వేషిం చడం అనవ సరం. పైగా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల వ్యవస్థ అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి. ఆధునిక కమ్యూనికేషన్ల వ్యవస్థతో భౌగోళిక దూరాల అడ్డంకిని అధిగమించిన రాష్ట్రంగా ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. అందువలన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాలను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయడానికి దూరాలనేవి పెద్దగా ఆటంకం కావు.  

 

 ప్రభుత్వం, దాని కార్యకలాపాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కావడంలోని సాధ్యాసాధ్యాలను ఈ కమిటీ పరిశీలించింది. విభజన అనంతర ఆంధ్రప్రదేశ్‌కు ఒకే పెద్ద రాజధాని నగరం అవసరం ఉంటుందని కమిటీ భావించటం లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేంద్రీకృతమై  ఉన్న శాసనసభ, కోర్టులు, వివిధ మంత్రిత్వ శాఖలు, కమిషనరేట్లు, డెరైక్టరేట్లతో  కూడిన పరిపాలనా విభాగం వగైరాలన్నీ దశాబ్దాల తరబడి అభివృద్ధి చెందినవి. ఈ కేంద్రీకరణే విభజన సమయంలో అత్యంత వివాదాస్పదంగా మారింది.

 

 2014 జూలై మొదట్లో పట్టణ, గ్రామీణ ప్లానింగ్ శాఖ నుంచి రాజధానికి అనువైన ఎనిమిది ప్రాంతాల గురించిన సమాచారాన్ని కమిటీ అందుకుంది. ఈ ఎనిమిది ప్రాంతాలు ‘మధ్య ఆంధ్ర’ అని కమిటీ ప్రస్తావించిన సాధారణ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇవి విజయవాడ, గుంటూరు పట్టణాలకు మరీ దూరంగా లేవు. వీటిలో ముసునూరు ప్రాంతం ఏలూరు పట్టణం పక్కనే ఉంది. పులిచింతల ప్రాంతం విజయవాడ స్టేషన్‌కు 40 కి.మీ దూరంలో, మాచర్ల ప్రాంతం విజయవాడకు 100 కి .మీ దూరంలో ఉంది.

 

 మాచర్ల, పులిచింతల తెలంగాణ సరిహద్దులో ఉన్నందున రాజధాని ఏర్పాటుకు ఇవి ఆకర్షణీయంగా కనిపించవచ్చు. ప్లానింగ్ శాఖ సూచించిన మరో నాలుగు ప్రాంతాలు బొల్లాపల్లి, వినుకొండ, మార్టూరు, దొనకొండ. వీటిలో మార్టూరు ప్రాంతం గుంటూరు-ఒంగోలు 5వ జాతీయ రహదారిపై ఉండగా, వినుకొండ ప్రాంతం గుంటూరు- నరసరావుపేట మీదుగా కర్నూలుకు వెళ్లే రాష్ట్ర హైవేతో అనుసంధానంలో ఉంది. దొనకొండ ప్రాంతం వినుకొండకు దక్షిణాన రోడ్‌తో అనుసంధానమై ఉంది. బొల్లాపల్లి ప్రాంతం నల్లమల రిజర్వ్ ఫారెస్టు సమీపంలో ఉంది. ఈ ప్రాంతాల న్నింటిలో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ భూమి, క్షీణించిన అట వీ భూములు, సాగుకింద ఉన్న భూమి తదితర వివరాలను పట్టణాభివృద్ధి శాఖ పూర్తిగా సేకరించింది. అయితే ఈ వివరాలు కేవలం లాంఛనప్రాయమైనవేనని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం చెప్పడంతో వీటి  సమగ్ర పరిశీలనలోకి కమిటీ వెళ్లలేదు.

 

 రాయలసీమ, ఉత్తరాంధ్రలోని మరికొన్ని ప్రాంతాలను సూచించాలని, ప్రభుత్వ కార్యాలయాలను ఒకేచోట నిర్మించడానికి అనువైన భూభాగాల వివరాలను తెలపాలని కమిటీ, ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దురదృష్టవశాత్తూ ఏపీ ప్రభుత్వం ఈ సమాచారాన్ని కమిటీకి పంపలేదు. అయితే పలు జిల్లా కేంద్రాలకు సంబంధించి పది కిలోమీటర్ల పరిధిలో 10 నుంచి 25 ఎకరాల మేరకు ఉన్న విడి ప్రాంతాలపై సమాచారాన్ని ఈ ఆగస్టు 18న ప్రభుత్వం పంపింది. విశాఖపట్నం, అనంతపురం ఇందుకు అనువైన ప్రాంతాలుగా సూచించింది కూడా. జిల్లా కేంద్రాల సమీపంలో ఉండే ఈ విడి ప్రాంతాలు వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువుగా ఉంటాయి. కానీ భూమిలేని పేదలకు వీటిని ఇప్పటికే అప్పగించినందున కనీస మొత్తం ఇచ్చి వీటిని వెనక్కు తీసుకోవడం సాధ్యం కాకపోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం కమిటీకి తెలిపింది. దీనిపై సమగ్ర పరిశీలన అవసరమని కమిటీ అభిప్రాయం.

 

నగరాల విస్తరణ

 కొత్త ప్రాంతంలో ఒకే నగరాన్ని నిర్మించడంపై కమిటీ అభిప్రాయాలకు భిన్నంగా, గ్రీన్ ఫీల్డ్ నగరం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేనట్లు కనబడుతుంది. వైజాగ్, తిరుపతి, విజయవాడ-గుంటూరు వంటి ప్రస్తుతం ఉన్న నగరాలను మెగా సిటీలుగా విస్తరించవచ్చని, మరో 13 - 14 నగరాలను పదిలక్షలు అంతకు మించిన జనాభా కలిగిన నగరాలుగా విస్తరించవచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే చెబుతూ వస్తున్నారు. అయితే కేవలం కార్యనిర్వాహక కసరత్తుతో పట్టణాల విస్తరణ సాధ్యపడదు. మౌలిక సదుపాయాలు, పర్యావరణ అంచనా ప్రాతిపదికనే వీటి విస్తరణను పరిశీలించవలసి ఉంటుందని కమిటీ భావన.

 

 మధ్య ఆంధ్ర ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకే రాజధాని నగరం ఏర్పడవచ్చుననే అభిప్రాయం ఇటీవలి కాలంలో ప్రబలింది. అది కూడా విజయవాడపైనే ప్రధానంగా కేంద్రీకరించింది. అది ఉత్తరాంధ్ర, రాయలసీమలకు భౌగోళికంగా మధ్యలో ఉంటుందనే సామాన్యాభిప్రాయమే దీనికి తావిచ్చింది. అయితే ఆ ప్రాంతం ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ఎంత అనువుగా ఉన్నా,  విజయవాడ-గుంటూరు మధ్య జరిగే కేంద్రీకరణ దీర్ఘకాలంలో ఆర్థిక, పర్యావరణపరమైన దుష్ఫలితాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలను దెబ్బతీస్తుంది. పైగా, భౌగోళికంగా అన్ని ప్రాంతాలతో కనెక్ట్ అయి ఉండటం, రాష్ట్రం మధ్యలో ఉండటం, సామీప్యం అనేవి మాత్రమే అభివృద్ధిని సాధించలేవు.

 

 పైగా కమిటీకి ముందుగానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శక సూత్రాలు ఈ ప్రాంత వ్యవసాయ వ్యవస్థ సాధ్యమైనంతవరకు దెబ్బతినకుండా చూడాలని ప్రత్యేకంగా పేర్కొన్నాయి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దేశంలోనే అత్యుత్తమమైన వ్యవసాయ భూములున్నాయి. దేశ వరి సాగులో ఒక శాతం పంట ఇక్కడినుంచే వస్తోంది. జాతీయ వరి ధాన్యాగారంగా దీన్ని పేర్కొంటున్నారు. మరోవైపున గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జనాభా అత్యధికంగా ఉంది. పైగా శ్రామిక జనాభాలో వరుసగా ఆ జిల్లాల్లో 65%, 56% మంది రైతులుగా, వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. వ్యవసాయ భూములను ఇతర అవసరాల కోసం మార్చే ఏ ప్రయత్నమైనా వారిని నిరుద్యోగులుగా మారుస్తుంది. విలువైన సాగుభూములను కోల్పోవాల్సి వస్తుంది. చిన్న కమతాలు అంతర్ధానమౌతాయి.పౌరులకు నష్టం వాటిల్లి రియల్ ఎస్టేటర్లకు లాభాలు చేకూరుతాయి.

 

 ఈ ప్రాంతంలో నీటిమట్టం చాలా ఎక్కువ. ఇక్కడి మట్టి చాలా పెళుసుగా ఉంటుంది. అందుకనే ఇక్కడ ఆకాశహర్మ్యాలు, ఎత్తై భవనాలు కనిపించవు. ఇక్కడి నిర్మాణాల పునాదులు బలహీనంగా ఉంటాయి. విజయవాడ-గుంటూరు పట్టణ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నిర్మాణానికి స్వాగతం పలికితే నిర్మాణరంగం పంట పడుతుంది కాని ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులపై ఇది తీవ్రమైన ఒత్తిడి కలిగించక మానదని కమిటీ అభిప్రాయం. ఇప్పటికే నీటి సరఫరా, మురికినీటి కాలువలు, రోడ్లు ఈ ప్రాంతంలో తక్కువగా ఉన్నాయి. మెట్రోరైలు, కమ్యూనికేషన్లు వంటి ప్రతిపాదనలు అమలయితే సమస్యలు మరింత పెరుగుతాయి. ఏపీ ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు ఆ రెండు జిల్లాల్లో సాగులో లేని భూములు లేదా క్షీణించిపోయిన అటవీ భూములు చెప్పుకోదగినంతగా లేవు.

 

 ఈ కమిటీ కొద్దిగా భూమి అందుబాటులో ఉన్న రెండు మూడు ప్రాంతాలను పరిశీలించింది. 5వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న మంగళగిరి రిజర్వు అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉంది. కానీ అక్కడ ఇప్పటికే టీబీ శానిటోరియం, ఏపీఎస్‌పీ బెటాలియన్ గృహసముదాయం ఉన్నాయి. పైగా 200 ఎకరాల్లో అక్కడ ఎయిమ్స్ తరహా వైద్య విజ్ఞాన సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. గన్నవరంను కూడా కమిటీ పరిశీలించింది. ఇప్పటి కే ప్రతిపాదించినట్టు అక్కడి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేయడానికే అక్కడి భూములు బొటాబొటిగా సరిపోతాయి. విజయవాడకు ఉత్తరాన కృష్ణా ఇరు ఒడ్డులలోని స్థలాన్ని గుర్తించే ప్రయత్నాలు కూడా కమిటీ చేసింది. కానీ ఇక్కడి భూముల్లో అత్యధికభాగం ప్రైవేటు భూములు. భూముల విలువ ఎక్కువ కావడంతో ఏ ప్రాజెక్టు

 ఖర్చైనా విపరీతంగా పెరిగిపోతుంది.

 

 విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాల అభివృద్ధి కోసం వీజీటీఎమ్ అభివృద్ధి సంస్థ ఇప్పటికే సమగ్ర అభివృద్ధి ప్రణాళికను తయారు చేసింది. 7,060 చ.కి.మీ.ల విస్తీర్ణంలోని ఈ ప్రాంతంలో మొత్తం జనాభా 17.22 లక్షలదాకా ఉంది. అందులో 9 లక్షలమంది పనిచేసే జనాభా. వారిలో 82 శాతం వ్యవసాయంపై ఆధారపడినవారు. స్థానిక ట్రాఫిక్ మాత్రమేగాక, ప్రాంతీయ ట్రాఫిక్ రద్దీ సైతం అక్కడ ఎక్కువే. వ్యవసాయ భూములు ఎక్కువ కావడం వల్ల హైదరాబాద్‌లోలాగా అక్కడ రింగ్ రోడ్డు నిర్మాణమూ తీవ్ర సమస్యే.

 

 వీజీటీఎమ్‌లో పలు ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయడం అభిలషణీయమూ, ఆచరణ సాధ్యమూ కాదు. పైగా హైదరాబాద్‌లాగా అది కూడా పెద్ద ఆకర్షణగా మారి రాష్ట్రంలోని ఇతర కేంద్రాల వృద్ధి అవకాశాలు దారిమరలిపోయేలా చేసే అవకాశాలు గణనీయంగా ఉన్నాయి. ప్రభుత్వ కమిషనరేట్లు, డెరైక్టరేట్లు సృష్టించే అభివృద్ధి, ఉపాధి కల్పన తక్కువే. వీటికంటే సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు, పర్యావరణ సంబంధిత రంగాలు, విద్య, ఇతర సంస్థలను నెలకొల్పితే మరింత ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని కమిటీ భావన.

 

అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి పంపిణీ

రాష్ట్రంలోని వివిధ భాగాలు విభిన్నమైన సహజ వనరులకు నిలయాలుగా ఉన్నాయి. వాటిని అభివృద్ధి పరచడం  ఆవశ్యకం. ఉదాహరణకు, రాష్ట్రంలో దేశంలోనే అత్యంత సారవంతమైన వ్యవసాయ భూములున్నాయి. వాటిలో నీరుపారుదల సౌకర్యాలతో పలుపంటల సాగు జరుగుతోంది. చెరకు, పొగాకు, పళ్లతోటలు, చేపల పెంపకం వగైరా వైవిధ్య భరితమైన వ్యవసాయ కార్యకలాపాలు సాగుతున్నాయి. రాయలసీమలో గణనీయంగా ఖనిజ వనరులున్నాయి. దేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులలో కోస్తాంధ్ర వాటా 40% గా ఉంది. అందుచేత రాజధాని కార్యకలాపాలు, ఇతర సంస్థలను మూడు ప్రాంతాలు లేదా ఉపప్రాంతాలలో పంపిణీ చేయడానికి అనువైన స్థలాలను కమిటీ గుర్తించింది. ఈ ఉప ప్రాంతాలు 1. ఉత్తరాంధ్రలోని వైజాగ్ రీజియన్. 2. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరుతో కూడిన రాయలసీమ. 3. కాళహస్తి - నడికుడి రైల్వే లైన్.

 

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు

 నివేదిక కోసం ఆంధ్రప్రదేశ్‌ను స్థూలంగా ఈ జిల్లాలూ, ప్రాంతాలుగా పేర్కొనడం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలను కలిపి ఉత్తరాంధ్ర లేదా ఉత్తర కోస్తాగా పేర్కొనడం జరిగింది. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలను మధ్యాంధ్రగా; కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలను రాయలసీమగాను, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కోస్తాంధ్రగాను విభజించడం జరిగింది.

 

విశాఖ ప్రాంతం

ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిశ్రమలు, వస్తువుల తయారీ, నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణం, పెట్రో కెమికల్స్ వ్యవహారాలను చూసే  కార్యాలయాలను ఇక్కడ నెలకొల్పవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న  పరిశ్రమలు, మత్స్య సంపద, ఉద్యోగ కల్పన పనులు చూసే కార్యాలయాలు లేదా డెరైక్టరేట్లను కూడా ఈ ప్రాంతానికి తరలించాలి. ఈ ప్రాంతం హైటెక్ జోన్‌గా వృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఉత్తరాన శ్రీకాకుళం, దక్షిణాన కాకినాడ ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని చిరకాలంగా భారీ పరిశ్రమల, నౌకాశ్రయాల, సాంకేతిక సంస్థల కేంద్రంగా పిలుస్తున్నారు.

 

రాయలసీమ

 రాజధాని కార్యకలాపాలకు అవసరమైన వ్యవస్థలను రాయలసీమలో  నెలకొల్పాలి. అనంతపురం, తిరుపతి మీదుగా  కడప సహా కర్నూలు నుంచి చిత్తూరు వరకు అర్థచంద్రాకారంలో ఉండే ఈ ప్రాంతం రైల్వే సౌకర్యం ద్వారా రవాణాకు నెలవుగా ఉంది. ఇందులోని ముఖ్య నగరాలలో ఒకటైన కర్నూలు ఆంధ్రరాష్ట్రం ఏర్పడినపుడు రాజధాని. ఇక్కడ నుంచే రాజధానిని హైదరాబాద్‌కు తరలించారు. ఈ చారిత్రక తప్పిదంతో జరిగిన నష్టాన్ని పూరించాలని రాయలసీమ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

 

రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు ఉంటాయనీ, నిరంతరం నీటి కొరతతో ఇబ్బంది పడుతూ ఉంటుందని పేరున్నప్పటికీ, వాస్తవానికి అనంతపురం-కర్నూలు, కడపలలో నిర్మాణంలో ఉన్న జల పథకాలు, నిర్మాణాలు పూర్తి చేసుకున్న పథకాలు చాలా ఉన్నాయి. తుంగభద్ర కర్నూలు గుండా ప్రవహిస్తుంది. అలాగే కృష్ణా జలాల కేటాయింపును పునస్సమీక్షించాలి.

 

కాళహస్తి ప్రాంతం కూడా అభివృద్ధికి అవకాశం ఉన్న జోన్‌గా అవతరిస్తుంది. 2014-15 రైల్వే బడ్జెట్‌లో కాళహస్తి-నడికుడి రైల్వే లైను నిర్మాణం ప్రతిపాదనలు ఉన్నాయి. 300 కిలోమీటర్ల ఈ లైను వల్ల గుంటూరు జిల్లా వినుకొండ ముఖ్య రైల్వే కూడలిగా మారుతుంది. వైజాగ్-చెన్నై కారిడార్‌కు ఉన్న ప్రకృతి వైపరీత్యాల  సమస్యల వల్ల కాళహస్తి ప్రత్యామ్నాయంగా చూసుకోవచ్చు. ప్రభుత్వ కార్యకలాపాలు నడిపే వివిధ డెరైక్టరేట్లు, ఇతర కార్యాలయాలను ఏయే ప్రాంతాలకు తరలించాలో సాధ్యమైనంత తొందరగా నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయం తరువాతే అభివృద్ధి చెందవలసిన ఆయా జోన్లకీ, జిల్లాలకీ ఆ కార్యాలయాలను తరలించే పని చేపట్టడానికి వీలు కలుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పని చేస్తున్న 200 ప్రభుత్వ కార్యాలయాలూ, ప్రభుత్వం అధీనంలో పని చేసే వ్యవస్థలూ భవిష్యత్‌లో ఎక్కడకు తరలాలన్న అంశాన్ని నిర్ణయించుకునే కార్యక్రమం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవలసినది ఏపీ ప్రభుత్వమే.

 

రాజధానిలో రాజ్యాంగ వ్యవస్థలు

 రాజధానిలో రాజ్‌భవన్, అసెంబ్లీ, హైకోర్టు- ఈ మూడు రాజ్యాంగ ప్రతీకాత్మక వ్యవస్థలుగా భావిస్తారు. రాజ్‌భవన్ ప్రాంగణం ఏర్పాటుకు 15 ఎకరాల స్థలం అవసరమైనట్టు కనిపిస్తుంది. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ వ్యవస్థ పదేళ్లు కొనసాగాలని రాష్ట్ర పునర్‌విభజన చట్టంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజ్‌భవన్ ఎక్కడ నిర్మాణం కావాలనే అంశం తేల్చడానికి ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు కొంత సమయం అవసరం. శాసనసభ నిర్మాణానికి 80 నుంచి 100 ఎకరాల స్థలం కావాలి. చట్టసభను తక్షణం తరలించవలసిన అవసరం లేదు. కాబట్టి కొత్త సభను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశానికి కూడా చాలా సమయం ఉంది. అయితే, తాత్కాలిక ఏర్పాట్లు చేసినా అవి పాతుకుపోయే రీతిలో ఉండరాదని మాత్రం బృందం సూచిస్తోంది. హైకోర్టు ప్రాంగణం, ఇందుకు సంబంధించిన న్యాయ వ్యవహారాల కార్యాలయాల స్థాపనకు 100 నుంచి 140 ఎకరాల భూమి కావాలి. పునర్ విభజన చట్టం మేరకు హైదరాబాద్‌లో హైకోర్టును నాలుగు లేదా ఐదేళ్లు ఉమ్మడిగా వినియోగించుకోవచ్చు. రాష్ట్రంలో హైకోర్టు నిర్మాణం ఏర్పాటు గురించి యోచించినపుడు మాత్రం విశాఖపట్నాన్ని పరిగణనలోనికి తీసుకోవచ్చు.  అసెంబ్లీ, సచివాలయం ఉన్నచోటే హైకోర్టును ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు.

 

ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల కార్యాలయాలకు, సచివాలయ నిర్మాణానికి 15 నుంచి 20 ఎకరాలు అవసరం. అత్యవసర కారణాల దృష్ట్యా ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయాల ఏర్పాటుకు నూజివీడు, గన్నవరం, ముసునూరులలో ఒక దానిని పరిశీలించవచ్చు. ఐటీ పార్కు కోసం గన్నవరంలో కట్టిన భవనం ఇప్పటికీ ఖాళీగానే ఉంది కూడా. గుంటూరు, విజయవాడలలో తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేసుకోమంటూ ప్రభుత్వ శాఖలను ఆహ్వానిస్తే అది విపత్కర పరిణామాలకు దారి తీస్తుంది. భవిష్యత్తులో వాస్తవ రాజధానికి వాటిని తరలించడం కష్టసాధ్యం. ఇందుకు ఉత్తరాఖండ్ నిదర్శనం.

 

 అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలి

 ఏ తరహా కార్యాలయాలను ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో నిర్ణయం తీసుకునే అధికారం ఏపీ ప్రభుత్వానిదే అయినా, బృందం కొన్ని సూచనలు మాత్రం చేసింది. పశు సంవర్థక శాఖ, మత్స్య శాఖ, వ్యవసాయం, పరిశ్రమలు, గనులు వంటి వ్యవహారాలు చూస్తే శాఖల కార్యాలయాలను సీఎం కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు. వీటి సేవలు అవసరమైన చోట నెలకొల్పవచ్చు. ఐటీ, పరిశ్రమల శాఖలను విశాఖలో; వ్యవసాయ సంబంధిత కార్యాలయాలను ప్రకాశం జిల్లాలో; పశు సంవర్థక శాఖను ఒంగోలులో; విద్యా శాఖ వ్యవస్థలను అనంతపురంలో; నీటి సరఫరా, ఆరోగ్యవ్యవహారాల శాఖలను నెల్లూరులో, సంక్షేమ కార్యాలయాలను కడపలో నెలకొల్పడం సముచితం. అలాగే 9వ షెడ్యూలులో పేర్కొన్నట్టు ప్రభుత్వ కార్యాలయాలు నలుమూలలా విస్తరించాలి.

 

 సంగ్రహ స్వరూపం

 - ప్రస్తుత పరిస్థితులలో గ్రీన్‌ఫీల్డ్‌లో రాజధాని నగరం ఏర్పాటుకు బృందం సుముఖత వ్యక్తం చేయడం లేదు. అయినా ఈ అంశాన్ని పరిశీలించదలుచుకుంటే సర్కారు భూమి పుష్కలంగా దొరికే ప్రాంతాన్ని అన్వేషించాలి.

 - నేటి నగరాలను విస్తరించే యోచనలో ఉంటే, పర్యావరణం, మౌలిక వ్యవస్థలను దృష్టిలో ఉంచుకోవాలి.

 - ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటును తాత్కాలిక ప్రాతిపదికను చేపడితే అదంతా అసంగతంగా, వృథా వ్యవహారంగా మిగిలిపోతుంది.

 - పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో తొమ్మిదో షెడ్యూలులో పేర్కొన్న 89 అంశాలలో  సమగ్ర అభివృద్ధి కోసం కొత్త రాష్ట్రానికి వాటిలో ఎన్ని అవసరమో జాబితాను రూపొందించుకోవాలి. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే క్రమంలో  ఇప్పుడు హైదరాబాద్‌లో పని చేస్తున్న వివిధ డెరైక్టరేట్లు, కమిషనరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల జాబితాను కూడా తయారుచేయాలి.

 - విద్యా సౌకర్యాల కల్పన కోసం ప్రతిపాదించే ఆయా ప్రాంతాలపై కూడా పూర్తి స్పష్టతను సాధించాలి.

 - నగరాల విస్తరణకు లేదా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచనకు గానీ ప్రభుత్వానికి అన్ని చోట్ల ఇతరత్రా భూమి అవసరం. అన్ని జిల్లాలలోను, జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల లోపులోనే 25 హెక్టార్ల వరకు  ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండవచ్చు.

 - రాజ్‌భవన్, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటి విషయంలో పునర్ విభజన చట్టం పదేళ్లు వెసులుబాటు ఇచ్చిన సంగతిని, హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

 - తక్షణావసరాలను దృష్టిలో ఉంచుకుని పరిమిత సిబ్బంది, కార్యాలయాలతో సీఎం, మంత్రుల కార్యాలయాలు, సచివాలయం ఏర్పాటు చేయడానికి వీజీటీఎం, దాని వెలుపల ఉన్న అవకాశాలను పరిశీలించవచ్చు.

 - ప్రాధాన్యం కల్పించవలసిన మౌలిక సదుపాయాల కల్పన పథకాల కొనసాగింపు గురించి ఆలోచించాలి.

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top