ఉరికంబానికీ ఉంది వివక్ష

ఉరికంబానికీ ఉంది వివక్ష - Sakshi


కొత్త కోణం

 


కులంతో పాటు పేదరికం కూడా చాలా మందికి ఉన్నత న్యాయస్థానాల్లో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశాన్ని నిరాకరిస్తోంది. న్యాయం కోసం హైకోర్టు, సుప్రీం కోర్టుల తలుపులు తట్టడమంటే లక్షల రూపాయలతో పని. ధన బలం ఉన్నవారే ఆ పని చేయగలరు. అలాంటి వారే తమ శిక్షలను తగ్గించుకోగలుగుతున్నారు. దేశంలో గత 15 ఏళ్లలో 1,600 మందికి మరణశిక్ష విధించగా, అందులో 5%కు ఆ శిక్ష ఖరారైంది. వారిలో అత్యధికులు దళితులు, మైనారిటీలేనన్న కఠోర వాస్తవం తెలియజేస్తున్నది అదే.

 

‘‘మరణశిక్షను ఖరారు చేయడం రాష్ట్రపతిగా నేను ఎదుర్కొన్న అతి కఠిన మైన సమస్య. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కేసులే ఎక్కు వగా పెండింగ్‌లో ఉన్నాయి.’’ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అన్న మాటలివి. మరణశిక్ష విధింపులో ధన, కుల పక్షపాతం కనిపిస్తున్నదని ఆయన సుస్పష్టంగా తెలిపారు. కలాంను వేనోళ్ల కొనియాడుతున్న వాళ్ళు ఆయనలోని ఆ మానవత్వాన్ని పుణికిపుచ్చుకొని, ఎంతవరకు ఆచరణలో పెట్టగలరనేది అనుమానమే. కనీసం ఆలోచించడం మొదలు పెట్టినా అది ఆయనకు ఘన నివాళే.



 కులం, ధనం కలవారిదే ‘ఉన్నత’ న్యాయం

 కలాం అభిప్రాయం అక్షర సత్యమని ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యా లయం విద్యార్థులు, అధ్యాపకుల అధ్యయనం రుజువు చేసింది. మరణశిక్ష పడ్డ ఖైదీలలో నాలుగింట మూడువంతులు వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలేనని తేల్చింది (93% దళితులు, మైనారిటీలు). 23% నిరక్షరా స్యులు కాగా, మిగతావారిలో చాలా మంది హైస్కూల్ విద్యకు నోచుకోని వారు. వీరిలో చాలా మందిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచనూ లేదు, న్యాయవాదులతో తమ కేసును చర్చించే అవకాశమూ ఇవ్వలేదు. మరీ దుర్మార్గంగా మరణ శిక్షకు గురైనవారిలో చాలా మందిని ప్రత్యేక గదుల్లో బంధించి, ఎవరితో కలవకుండా చేశారు. కులంతో పాటు పేదరికం కూడా చాలా మందికి ఉన్నత న్యాయస్థానాల్లో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశాన్ని నిరాకరించింది. హైకోర్టు, సుప్రీంకోర్టుల తలుపులు తట్టడ మంటే లక్షల రూపాయలతో పని. ధన బలం ఉన్నవారే ఆ పని చేయగలరు. అలాంటి వారే తమ శిక్షలను తగ్గించుకోగలిగారు. దేశంలో గత 15 ఏళ్లలో 1,600 మందికి మరణశిక్ష విధించగా, అందులో 5%కు ఆ శిక్ష ఖరారైంది. వారిలో అత్యధికులు దళితులు, మైనారిటీలేనన్న కఠోర వాస్తవాన్ని ఈ అధ్య యనం బయటపెట్టింది.



 భారత న్యాయవ్యవస్థ... బొమ్మా బొరుసు

 ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరో వైపున ఇంకో కథ ఉంది. దళితులు నిందితులుగా ఉన్న కేసుల్లో శిక్షలు ఖరారై ఉరికంబం ఎక్కితే, దళితులు ఊచ కోతకు గురైన కేసుల్లో నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారు. ఇది, నిగ్గు తేలిన నిజాలు చెబుతున్న కథ. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో దళితులపై జరి గిన రెండు ఘోర దురాగతాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి చర్చను రేకెత్తించాయి. అయినా ఆ రెండు కేసుల్లోనూ నిందితులు నిర్దోషులుగానో, లేదా తక్కువ శిక్షలతోనో బయటపడ్డారు. ఒకటి  ‘చుండూరు’. 1991 ఆగస్టు 6న గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో  అగ్రవర్ణాల వారు దళితవాడపై దాడి చేసి, వేట కొడవళ్ళతో, గొడ్డళ్లతో, బరిసెలతో దళితులను వెంటాడి, వేటాడి చంపారు. ఆ మారణ కాండలో ఎనిమిది మంది దళితులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి, గోనెసంచుల్లో మూటగట్టి, రాళ్ళు కట్టి తుంగభద్రలో పడే శారు. ఇద్దరు అన్నదమ్ములను మల్లెతోటలోనే చంపి భూమిలో తొక్కేశారు. ఒకరిని సజీవంగానే సంచులలో కుక్కి కాలువలో పడేశారు. ఈ ఘోరంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం కారణంగా ఏర్పాటైన ప్రత్యేక కోర్టు 16 ఏళ్ల సుదీర్ఘ విచారణ తదుపరి, 2007లో తీర్పును వెలువరించింది. ఇది అరుదైన వాటిలో కెల్లా అత్యంత అరుదైన కేసు కాదంటూ నిందితులకు మరణశిక్ష గాక, యావ జ్జీవ కారాగార శిక్ష విధించింది.  ప్రత్యేక కోర్టు చేసిన ఈ వ్యాఖ్య నేరం తీవ్ర తను తగ్గించేసింది. ఏడేళ్ల తర్వాత ఏపీ హైకోర్టు... అంతా నివ్వెరపోయేలా ప్రాసిక్యూషన్ నేరాన్ని నిరూపించడంలో విఫలమైందంటూ నిందితులందరినీ విడుదల చేయాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో ఉన్నత న్యాయస్థానాల్లో నిరుపేదలకు, దళితులకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం  సన్నగిల్లింది. చుండూరు కేసు అరుదైనది కాకపోతే, అరుదైనవిగా పేర్కొన్న చాలా కేసులు కూడా అరుదైనవి కాకపోయే ఉండాలి. జరిగిన ఘోర దురంతం కాదనలేనిదై నప్పుడు... ప్రాసిక్యూషన్ విఫలమైతే, ఆ కేసును తిరిగి పరిశోధించాలని, అవసరమైతే అందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని హైకోర్టు ఆదేశించాల్సింది. కానీ అలా చేయలేదు. దీంతో న్యాయస్థానం తన బాధ్యతను విస్మరించిందని విమర్శలు వెల్లువెత్తాయి.



దీనికి సరిగ్గా విరుద్ధమైన పరిస్థితి విజయవాడ శ్రీలక్ష్మి హత్య కేసు. ఆ విద్యార్థినిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపినందుకు మనోహర్ అనే యువకుడికి మరణ శిక్ష విధించాలని పలు మహిళా  సంఘాలు, పార్టీలు డిమాండ్ చేశాయి. నిందితుడి తరఫున వాదించరాదని న్యాయవాదులు ఏకగ్రీ వంగా తీర్మానించారు. న్యాయస్థానం సైతం మనోహర్‌కు మరణ శిక్ష విధిం చింది. మంచిదే అలాంటి దుర్మార్గుడికి ఆ శిక్ష పడాల్సిందే. కానీ ఈ హత్యతో పోలిస్తే, చుండూరు మారణకాండ కొన్ని వేల రెట్లు అమానుషమైనది. మనో హర్ కేసులో ఏడాదిలోగానే విచారణ పూర్తయింది, శిక్ష పడింది. కానీ చుం డూరు కేసు విచారణకు 16 ఏళ్లు పట్టింది, నలుగురు జడ్జీలు మారారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకానికే తొమ్మిదేళ్ళు పట్టింది! సాక్షులు సైతం చాలా మంది చనిపోయారు. ఈ రెండు కేసుల్లో ఎందుకింత వ్యత్యాసం? ఢిల్లీ అధ్యయనం పేర్కొన్నట్టు న్యాయ ప్రక్రియలో, శిక్షల విధింపులో కులం, ధనం ప్రాబల్యం వహిస్తున్నాయనేది సులభంగానే అర్థమవుతుంది.

 

దళితులపై దురాగతాలు ‘అరుదైనవి’ కాలేవు


 ఇక మహారాష్ట్రకు వస్తే, నాగపూర్ సమీపంలోని భండార జిల్లా ఖైర్లాంజిలో ఒక భూవివాదం సాకుతో ఆధిపత్య కులాల వారు భూత్ మాంగే అనే ఒక దళితుని కుటుంబంలోని నలుగురిని కిరాతకంగా చంపేశారు. దాదాపు 40 మంది మారణాయుధాలతో చుట్టుముట్టి మాంగే గుడిసెను తగులబెట్టి, ఆయన భార్యను, ఇద్దరు కొడుకులను, కూతురిని చిత్రహింసలకు గురిచేసి, తల్లీ కూతుళ్ళిద్దరిపై నడిబజారులో అత్యాచారం జరిపి అతి అమానుషంగా చం పారు. ఈ ఘోరాన్ని ఆధిపత్య కులాల మహిళలు ప్రోత్సహించడం ఆశ్చర్యం కలిగించింది. ఇదంతా పొదల మాటున దాగి చూసిన భూత్ మాంగే స్వయంగా కేసుపెట్టారు. 2008లో ఆరుగురు నిందితులకు ప్రత్యేక న్యాయ స్థానం మరణ శిక్ష విధించింది. కానీ తర్వాత బొంబాయి హైకోర్టు దీన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది!  ఇక ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో ఐదుగురు దళిత యువకులు, ఒక జాట్ అమ్మాయిపై అత్యాచారం జరిపి హత్య చేసినట్టు పెట్టిన కేసులో నిందితులకు మరణశిక్ష  విధించారు. కాగా, 1999 డిసెంబర్ 31 అర్ధరాత్రి మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని ఒక హోటల్‌లో పనిచేస్తున్న లక్ష్మి (పేరు మార్చాం) అనే దళిత యువతి అత్యాచారానికి గురైంది. ఆమె నిందితులను గుర్తుపట్టి, జరిగిన దురాగతాన్ని కోర్టులో పూసగుచ్చినట్టు వివ రించింది. అయినా ఆ కేసులోని నిందితులంతా నిర్దోషులుగా బయట పడ్డారు! దీన్ని బట్టి మన దేశంలో అమలవుతున్న నేరము-శిక్ష స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు.



 మనుస్మృతి ఆధారంగానే నేరము-శిక్ష

 ఇలా ఒక్కొక్కటొక్కటిగా చూస్తుంటే న్యాయం త్రాసులో బలిపశువులుగా మారుతున్న వారంతా దళితులు, పేదలేనని రుజువవుతుంది. నేరం చేసిన వారెవ్వరైనా శిక్ష అనుభవించాల్సిందే, తప్పించుకోడానికి వీల్లేదు. నేరస్తుల విచారణ, విధిస్తున్న శిక్షల్లోని అంతరాలను గమనిస్తే నేరం తీవ్రతేగాక కులం, ధనం వంటి ఇతర అంశాల ప్రభావం తీర్పులపై అధికంగా ఉంటున్నట్టు స్పష్టమవుతోంది. ఢిల్లీ అధ్యయనం దీన్ని మరోమారు రుజువు చేసింది. రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రం కేవ లం రాతలకే పరిమితమైంది. వాస్తవంగా అమలవుతున్నది భారత రాజ్యాం గం కాదు. రెండు వేళ ఏళ్ల నాటి మనుస్మృతి. దానిలో 8, 9, 11 అధ్యాయాల లోని నేరము-శిక్షకు సంబంధించిన అంశాలన్నీ పుట్టుకను బట్టి, వర్ణాన్ని బట్టి శిక్షలని నిర్దేశించాయి. చాతుర్వర్ణ వ్యవస్థలోని ప్రజలకు వారి వారి వర్ణ నేప థ్యాన్ని బట్టి మనువు శిక్షలను ఖరారు చేశాడు. ఆ మనుధర్మాన్ని మెదళ్ల నిండా నింపుకొని మనం భారత రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాం. ఆరు దశాబ్దాల స్వతంత్ర భారత న్యాయ చరిత్ర దాన్నే రుజువు చేస్తోంది. ఈ తీరు మారాలి, తీర్పులూ మారాలి. అప్పుడే న్యాయానికి ధనిక, పేద, కుల, మత, ప్రాంతీయ భేదాలుండకూడదన్న అబ్దుల్ కలాం కల నిజమవుతుంది.

 

http://img.sakshi.net/images/cms/2015-07/41438195883_Unknown.jpg



















 మల్లెపల్లి లక్ష్మయ్య

(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213



 

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top