హక్కును హరిస్తే, బతుకు బజారే!

హక్కును హరిస్తే, బతుకు బజారే! - Sakshi


సమకాలీనం



బతుక్కు సంబంధమున్న పలు అంశాల్లో హక్కులుండీ, రాజ్యాంగ భద్రత కలిగీ, చట్టాలేర్పడి, ప్రత్యేక సంస్థలున్నచోటే రక్షణ కరువవుతోంది. నట్టింట చిచ్చు పెట్టిన ‘డ్రగ్స్‌’ మహమ్మారిని చూస్తూనే ఉన్నాం. హక్కులు ఒక్కొక్కటే హరించి, సమాజాన్ని పాలనా సంకెళ్లలో బంధించడం సరికాదు. వ్యక్తిగత గోప్యత హక్కునూ హరిస్తే పిల్లలు, మహిళలతో సహా సామాన్యుల బతుకులు రోడ్డున పడతాయి. పరస్పర ప్రయోజనాలతో ప్రభుత్వాలతోఅంటకాగే బహుళజాతి సంస్థలు, కార్పొరేట్లు, ప్రయివేటు శక్తుల ఆగడాలకు హద్దుండదు.



కుక్క తోకనూపడమా? తోకే కుక్కనూపడమా? ఏం జరుగుతోందన్నది ముఖ్యం! విశిష్ట గుర్తింపు కార్డు, ఆధార్‌లో పాటించే పద్ధతుల చట్టబద్ధతను రాజ్యాంగం కల్పించిన ‘వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ) హక్కు’ పరిధిలో పరిశీలించాలా? లేక, ఆధార్‌ ఓ మంచి ప్రక్రియ గనుక దాని నీడలో, అసలు భారత పౌరులకు గోప్యత ప్రాథమిక హక్కేనా అని నిర్ణయించాలా? ఇదీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చల సారం. సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు ఏర్పరచిన తొమ్మండుగురు జడ్జీల ధర్మాసనం ముంది పుడు వాదనలు సాగుతున్నాయి.



అవి ముగింపునకు వస్తున్న తరుణంలో, ఈ సంవాదం రేపుతున్న సందేహాలెన్నో! ‘ఆధార్‌’ను కాసేపు పక్కన పెట్టి చర్చిం చినా, పౌరులకు బోలెడంత వ్యక్తిగత జీవితం ఉంటుంది. దానికనేక పార్శా్వ లుంటాయి. అవి గోప్యంగా ఉంచుకోవాలనే స్వేచ్ఛా భావన ఉంటుంది. సదరు గోప్యతను ప్రభుత్వాలు కాపాడాలనే ఆశ, అనుచితంగా అందులోకి చొరబడే వాళ్లని శిక్షించాలనే ఆకాంక్ష సహజం! వాదనలెలా ఉన్నా ఓ హక్కు, హక్కు కాకుండా ఎలా పోతుంది? పైగా, మారుతున్న కాలమాన పరిస్థి తుల్లో... ఉన్న హక్కులకు భద్రత కల్పిస్తూ, చట్టాలకు పదును పెట్టాల్సింది పోయి వాటిని నీరు గార్చడం దారుణం!



సర్కారు కనుసన్నల్లో సమాచార వ్యవస్థను గుప్పిట పట్టిన ప్రయివేటు శక్తులు పౌరుల గోప్యతను గాలికొదిలి, సగటు మనిషిని నిలువునా గుడ్డలిప్పి నడిబజార్లో నిలబెడుతున్న సంధికాల మిది! శాస్త్రసాంకేతికత పుణ్యమా అని ఇతరుల వ్యక్తిగత సమాచార వ్యవస్థ (డాటా) పరిధిలోకి ఎవరైనా చొరబడటం తేలికైన రోజులివి. గోప్యత పౌరుల ప్రాథమిక హక్కే కాదంటే, దీనికొక రాజ్యాంగ భద్రతే లేదంటే, కార్పొరేట్‌ శక్తులు అనుచితంగా చొరబడటం ఒక ఆటవిడుపవుతుంది. కేంద్రీకృతంగా అధికారాన్ని గుప్పిట పట్టాలనుకునే సర్కార్లకు ఇక అడ్డూ అదుపుండదు. తమ వర్తక, వాణిజ్య, రాజకీయార్థిక ప్రయోజనాల కోసం పౌరుల కనీస హక్కుల్ని కాలరాచే తీరు విలువల పతనానికే దారితీస్తుంది. పౌరులది, ముఖ్యంగా బల హీనులది... తమదైనదేదీ కాసింత గోప్యంగా ఉంచుకోలేని బజారు బతుకవు తుంది. వారేదైనా ఎంపిక చేసుకునే అవకాశాలు కూడా సన్నగిల్లుతాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని సమగ్ర తీర్పు చెప్పాల్సిన గురుతర బాధ్యత ఇప్పుడు సుప్రీం ధర్మాసనంపైనే ఉంది. గత అనుభవాల నేపథ్యంలో ఓ చరిత్రాత్మక తీర్పు కోసం దేశం నిరీక్షిస్తోంది.



పరిమిత దృష్టితోనే ప్రమాదం

హక్కు అప్రతిహతం కాదంటే, పరిమితులు విధించవచ్చు. ఎవరి హక్కులైనా ఇతరుల హక్కులకు భంగం కలిగించకూడదన్నదే రాజ్యాంగ స్ఫూర్తి. దానికి లోబడి సహేతుకమైన పరిమితుల్ని వ్యక్తిగత గోప్యత హక్కుకూ విధించ వచ్చు. ఆధార్‌ కోసం పౌరుల నుంచి సేకరించిన బయోమెట్రిక్, ఇతర ముఖ్య సమాచారం యథేచ్ఛగా జనబాహుళ్యంలోకి రావడం పట్ల పలువురు అభ్యం తరం వ్యక్తం చేశారు. దురుపయోగమయ్యే ప్రమాదాన్నీ శంకించారు. ఈ విష యమై సుప్రీం సమక్షానికి పలు వినతులు, ప్రజాప్రయోజన వ్యాజ్యాలు రావ డంతో ఇది వార్తలకెక్కింది. వ్యక్తిగత గోప్యత అసలు ప్రాథమిక హక్కే కాదని గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. పౌరులకు సంక్రమించిన రెండు హక్కుల మధ్య హెచ్చు–తగ్గుల పోటీ పెట్టి చోద్యం చూసే వింత పంథాను కేంద్రం ఎంచుకుంది.



‘ఏదో కొందరు తమ వ్యక్తిగత గోప్యత హక్కు గురించి మాట్లాడుతున్నారు, మరో వైపు మేం ‘ఆధార్‌’ ఆసరాతో 27 కోట్ల మందికి ఆహార భద్రత కల్పిస్తున్నాం, ఆహారపు హక్కు కన్నా వ్యక్తిగత గోప్యత హక్కు గొప్పదా?’ అన్న ప్రభుత్వ న్యాయవాది మాటల్లోనే సర్కారు వాదన డొల్ల తనం బయటపడింది. ఆధార్‌తో ఎంతో ప్రయోజనం ఉన్నందున, ఆ ప్రక్రియలో తప్పిదాల్ని ప్రశ్నించే మరొకరి హక్కులకు లెక్కే లేదనే వాదన తప్పు. ఆరున్నర దశాబ్దాల మన రాజ్యాంగ చరిత్రలో వ్యక్తిగత గోప్యత అంశం పలు మార్లు ఉన్నత న్యాయస్థానం సమక్షానికి వచ్చింది. ఇది ప్రాథమిక హక్కు కాదని రెండు మార్లు సుప్రీం ధర్మాసనం తీర్పు చెప్పింది.



1954లో ఎంపీ శర్మ కేసులో 8 మంది న్యాయమూర్తుల ధర్మాసనం, తర్వాత 1962లో ఖరక్‌ సింగ్‌ కేసులో ఆరుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. తదనంతర కాలంలో విచారణకు వచ్చిన గోవింద్‌–మనేక (1975) కేసులో, గోప్యత రాజ్యాంగం నిర్దేశించిన హక్కు అని సుప్రీం తీర్పు స్పష్టం చేసింది. అధికరణం 21లోని జీవించే హక్కుతో పాటు అధికరణం 19లోని పలు ప్రాథమిక హక్కుల్లోనూ వ్యక్తిగత గోప్యత మూలాలు, ఆనవాళ్లు ఉన్నా యని చెబుతూ ఇది రాజ్యాంగపు హక్కని స్పష్టం చేసింది. ఇంకా పలు సందర్భాల్లో, మలక్‌(1981), రాజగోపాల్‌ (1994), పీయూసీఎల్‌ (1997), డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌ (2005), సుచిత (2009), సెల్వీ(2010), నల్సా (2014) కేసుల్లోనూ వ్యక్తిగత గోప్యతను రాజ్యాంగం కల్పించిన హక్కుగా గుర్తిస్తూ తీర్పులు వెలువడ్డాయి. కానీ, రాజ్యాంగంలో ఏదైనా అంశంపై స్పష్టత కొరవడి, సందిగ్ధత నెలకొన్నపుడు సుప్రీంకోర్టు తీర్పులే ప్రామాణికమౌతాయి. గోప్యత ప్రాథమిక హక్కు కాదని అంతకు ముందు తీర్పిచ్చినవి విస్తృత ధర్మాసనాలయినందున, తదనంతర కాలంలో తక్కువ మంది న్యాయమూర్తులతో ఏర్పడ్డ ధర్మాసనాలిచ్చిన గోప్యత అనుకూల తీర్పులు కాల పరీక్షకు నిలువలేదు. ఇప్పుడు విచారిస్తున్నది 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కనుక, ఈ తీర్పు ఇకపై శిరోధార్యమౌతుంది.



మాట మార్చింది అందుకేనేమో!

గోప్యత ప్రాథమిక హక్కు కాదని తీర్పిచ్చిన సందర్భాలు వేరు. ఎంపీ శర్మ (1954) కేసు, దర్యాప్తు అధికారులు దాల్మియా సంస్థల్లో జరిపిన సోదాలను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌. ఖరక్‌ సింగ్‌ (1962) కేసు, నేరారో పణలు ఎదుర్కొంటున్న ఖరక్‌ సింగ్‌పై దర్యాప్తు బృందం ఏర్పాటు చేసిన నిఘా, నియంత్రణ, తనిఖీలను సవాల్‌ చేస్తూ కోర్టుకెక్కిన సందర్భం. అవన్నీ, ఆరోపణలెదుర్కొంటున్న వారిపై దర్యాప్తు సంస్థలు జరిపే నిఘా, నియంత్రణ, సోదాలకు సంబంధించిన వ్యవహారాల్లో గోప్యత విషయమై వెలువరించిన తీర్పులు. ఆ తీర్పే అన్ని సందర్భాలకూ సరిపోతుందను కోవడం సరికాదు.



సగటు మనిషి వ్యక్తిగత గోప్యత హక్కు ప్రాధాన్యతను, అందుకవసరమైన పరిమితుల్ని నిర్ణయించడమే ప్రస్తుతం ధర్మాసనం ముందున్న కర్తవ్యం. అందుకే, మొత్తానికిది ప్రాథమిక హక్కు అవునా? కాదా? అన్నది తేలితే తప్ప తాము తదుపరి తీర్పు వెలువరించలేమన్న ధర్మాసనం అభిప్రాయానికి అర్థముంది. 2012 నుంచి ఆధార్‌ వివాదంపై కేసు విచారణ సాగుతోంది. దీని చట్టబద్ధతను కర్ణాటకకు చెందిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి కె.ఎస్‌. పుట్టుస్వామి లోగడ ఓ సందర్భంలో సవాల్‌ చేశారు. తదనంతరం 2016లో చట్టం తీసుకువచ్చి ఆధార్‌కు చట్టబద్ధత కల్పించిన తీరే ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. కేవలం ఆధార్‌ దృష్టి కోణంలోనే కాకుండా, విస్తృతార్థంలో గోప్యత హక్కును నిర్వచించి, పౌరుల హక్కును నొక్కిచెప్పి, ఏ మేరకు పరిమితులు విధించే హక్కు–అధికారం ప్రభుత్వానికుందో తేల్చాల్సిన సందర్భం వచ్చింది. రెంటి మధ్య సమతు ల్యత సాధించాలి.



ఇన్నాళ్లూ ఇది ప్రాథమిక హక్కే కాదంటూ వచ్చిన కేంద్రం గొంతు మార్చింది. ప్రాథమిక హక్కు అయితే అయివుండవచ్చు, కానీ, పరిమితులేలేని సంపూర్ణ హక్కేం కాదనే తాజా వాదన వినిపిస్తోంది. వ్యక్తిగత గోప్యతలోని పలు అంశాలు, ఉప అంశాల్లో కొన్ని అప్రతిహత హక్కే అయినా, ఇంకొన్నిటికి దాన్ని య«థాతథంగా వర్తింపజేయలేమనే వాదనను తెరపైకి తెచ్చింది. ఇలా అన్ని అంతర్గత అంశాలు, ఉప అంశాలకు ఒకే స్థాయి కల్పిస్తే, అవి ఇతర ప్రాథమిక హక్కుల అమలుకు భంగం కల్గించే ప్రమా దముందన్నది కేంద్ర ప్రభుత్వ భావన!



ఐటీతో ప్రపంచమే మారింది

ఆధునిక శాస్త్రసాంకేతికత వల్ల సమాచార వ్యవస్థే సమూలంగా మారి పోయింది. వ్యక్తిగత గోప్యతకు అర్థం, ప్రాధాన్యం, ప్రభావం అన్నీ మారాయి. ప్రతి వ్యక్తి తన శరీర, ఆరోగ్య, ఆస్తి, ఆలోచన, భావన, సంబంధాలు తదితర వ్యక్తిగత అంశాల్లో గోప్యత ఆశించడం సహజం. అందులో జోక్యం–దానిపై నియంత్రణ ఏదైనా తనకు తెలిసి, తన స్పృహ–ప్రమేయంతో జరగాలనుకోవడమూ న్యాయబద్ధమే!గోప్యతకు చట్ట బద్ధమైన రక్షణ లేకుంటే సగటు మనుషులు తీవ్రంగా నష్టపోతారు.



ఆర్థిక, సామాజిక, హోదా–గౌరవపరమైన అంశాల్లో ఇబ్బందులెదురవుతాయి. ఎవ రితో పంచుకోకుండా తమతోనే అట్టేపెట్టుకోగల సొంత విషయాలే లేని దుస్థితి దాపురిస్తుంది. ‘వ్యక్తిగత గోప్యత హక్కు అంటే, తన మానాన తనని బతకనివ్వడం’ అనే ఓ ప్రసిద్ధ నిర్వచనం కూడా ఉంది. ఇది వ్యక్తి గౌరవం, స్వేచ్ఛకు ప్రతీక! ఒకవైపు గోప్యతకు రక్షణ కరువై, మరోవైపు అందులోకి ఇతరులు సులువుగా చొరబడే, అనుచితంగా జోక్యం చేసుకునే, ‘డాటా’ను య«థేచ్ఛగా వాడుకునే ఆస్కారం పెరగటమన్నది ఏ రకంగా చూసినా ప్రమా దకరమే! హక్కు భద్రత లేనపుడు, అటువంటి అనుచిత జోక్యాలు తనకు నిక రంగా నష్టం కలిగించినా, కారకులైన సదరు వ్యక్తులు, సంస్థలు, ప్రభు త్వాల నిర్వాకాల్ని ప్రశ్నించలేని స్థితి పౌరుడికి  ఎదురౌతుంది.



ఇంటర్‌నెట్‌ విస్తృతి పెరిగి, ఫేస్‌బుక్, వాట్సాప్, ట్వీటర్‌ తదితర సామాజిక మాధ్యమాలు మనిషి జీవితంలోకి అతి లాఘవంగా చొచ్చుకు వచ్చాక ‘డాటా’ భద్రత తీరే మారి పోయింది. పోటీ పెరిగిన వ్యాపార ప్రపంచంలో రకరకాల పద్ధతుల్లో వ్యక్తి గోప్యతలోకి చొరబడే యత్నం నిరంతరం సాగుతోంది. ఉచితాల మోజులో పడి మనమే ఎందరెందరికో ఆ ఆస్కారం కల్పిస్తున్నాం. దారపు పోగులా ఓ చిరుబంధం ఏర్పడ్డా చాలు, మనకు సంబంధించిన ఎంత వ్యక్తిగత సమా చారాన్ని జనబాహుళ్యంలోకి లాగుతారో? ఎంతలా మన బతుకును తెరచిన పుస్తకం చేస్తారో? ఆ లెక్కకు అంతే ఉండదు. బహిరంగ వేదిక ‘ఫేస్‌బుక్‌’ కన్నా, పరస్పర సమాచార వాహిక ‘వాట్సాప్‌’ కాస్త సురక్షితం అనుకున్న వారు తమ వ్యక్తిగత సమాచారాన్ని అక్కడ పంచుకున్నారు. వాట్సప్‌ను ఫేస్‌ బుక్‌ స్వాధీనపరచుకున్న తర్వాత అంతా బహిరంగమే అయి వినియోగ దారులు భంగపడ్డారు. ఇటువంటివెన్నెన్నో!



సంకెళ్లు సరికాదు

తరం మారింది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన తొలిరోజుల నాటి నాయకులు, పాలకులు, వారి ఆలోచనా ధార, హక్కులకై పోరాడే పంథా, విలు వలు... క్రమంగా అన్నీ నశిస్తున్నాయి. ఇప్పుడవేమీ లేవు. మనిషి బతుక్కు సంబంధమున్న పలు అంశాల్లో హక్కులుండీ, రాజ్యాంగ భద్రత కలిగీ, చట్టాలేర్పడి, ప్రత్యేక సంస్థలున్న చోటే రక్షణ కరువవుతోంది. నట్టింట చిచ్చు పెట్టిన ‘డ్రగ్స్‌’ మహమ్మారిని కళ్లారా చూస్తూనే ఉన్నాం. హక్కులు ఒక్కొక్కటే హరించి, సమాజాన్ని పాలనా సంకెళ్లలో బంధించడం సరికాదు. ఇక వ్యక్తిగత గోప్యత హక్కునూ హరిస్తే పిల్లలు, మహిళలతో సహా సామాన్యుల బతుకులు రోడ్డున పడతాయి. పరస్పర ప్రయోజనాలతో ప్రభుత్వాలతో అంటకాగే బహుళజాతి సంస్థలు, కార్పొరేట్లు, ప్రయివేటు శక్తుల ఆగడాలకు ఇక హద్దుం డదు. వ్యక్తిగత గోప్యతను విస్తృతార్థంలో చూసి, సమాజ విశాల హితంలో అన్వయించి ఆ సర్వోన్నత న్యాయస్థానమే గోప్యత హక్కును కాపాడాలి.


 






- దిలీప్‌ రెడ్డి

ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top