రైతు పోరాటానికి కొత్త దిశ

రైతు పోరాటానికి కొత్త దిశ - Sakshi


రైతులు, ప్రత్యేకించి నేటి తరం రైతు నాయకులు కనీస మద్దతు ధరల పరిధికి మించి ఆలోచించాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ కనీస మద్దతు ధరలలో మరింత పెంపుదలను వ్యతిరేకిస్తోంది. కాబట్టి మద్దతు ధరలను పెంచడానికి విధానపరమైన అవకాశాలు కుచించుకుపోయాయని అర్థం చేసుకోవాలి. పైగా, ప్రభుత్వాలు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రైతాంగాన్ని ప్రాథమికమైన పనిముట్టుగా వాడుకుంటున్నాయి. అందువలన రైతాంగం మద్దతు ధరల నుంచి కనీస ఆదాయ హామీ దిశకు మరలాలి.



 ఇటీవల దేశవ్యాప్తంగా ఆగ్రహంతో రైతుల ఆందోళనలు వెల్లువెత్తాయి. మధ్యప్రదేశ్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు రైతులు మరణించారు కూడా. ఇంత జరిగినా తీరా చూస్తే, దేశంలోని రైతు సంఘాలన్నిటి డిమాండు వ్యవసాయ రుణాల మాఫీకి, స్వామినాథన్‌ కమిషన్‌ సూచించినట్టు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)తోపాటూ 50 శాతం పెంపుదలను కోరడానికి కుచించుకుపోయింది.


ఈ కీలక తరుణంలో వైవిధ్యభరితమైన వివిధ రైతు బృందాల సంఘాలు ఒక్కటిగా కలవడం ఆనందదాయకమైన విషయం.  అయినా, ఈ ఆందోళనలు, నిరసనలన్నీ కేవలం 6 శాతం వ్యవసాయదార్ల కోసమేనా? అని కొన్నిసార్లు అనుమానం కలుగుతుంటుంది. రైతులలోని ఈ స్వల్ప శాతం గురించి పేర్కొనడానికి కారణం లేకపోలేదు. శాంతాకుమార్‌ కమిటీ అంచనాల ప్రకారం కనీస మద్దతు ధరల వల్ల లబ్ధి కలిగేది 6 శాతం  రైతులకే. అదే నిజమైతే, స్వామినాథన్‌ కమిటీ సూచించిన ఎంఎస్‌పీతో పాటూ 50 శాతం లాభం, మిగతా 94 శాతం రైతాంగానికి సంబంధించినంత వరకు అర్థరహితమైనదే అవుతుంది.


ఆర్థికవేత్తలకు మింగుడుపడని వాస్తవం

ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను(ఎఫ్‌సీఐ) పునర్వ్యవస్థీకరించడం కోసం శాంతాకుమార్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన అత్యున్నతస్థాయి కమిటీ పలువురు నిపుణులను, సంస్థలను అభిప్రాయాలను తెలపడం కోసం పిలిచింది. వారిలో నేనూ ఉన్నాను. ఆ సందర్భంగా నేను ఏటా పండే గో«ధుమ, వరిలో 30 శాతాన్ని ప్రభుత్వం సేకరిస్తున్నందున, కనీస మద్దతు ధరల ప్రయోజనాలు ఇంచుమించు 30 శాతం రైతులకే దక్కుతాయని చెప్పాను. కనీస మద్దతు ధరలు రైతులందరికీ  లభిస్తాయనే అంతా భావిస్తుంటారు. అందువల్లనే నేను చెప్పింది విని, శాంతాకుమార్‌ స్పష్టంగానే ఆశ్యర్యాన్ని వెలిబుచ్చారు.


నా అంచనాలకు ప్రాతిపదిక ఏమిటో తెలుపమని ఆయన కోరారు. నిజమైన అంచనాలంటూ ఏవీ లేనందున, అది నేను ఉజ్జాయింపుగా వేస్తున్న అంచనాయేనని చెప్పాను. కనీస మద్దతు ధరలకు తమ ఉత్పత్తులను అమ్ముకోగలిగే రైతులు కేవలం 6 శాతమేనని చివరికి  శాంతా కుమార్‌ కమిటీ లెక్కగట్టింది.


రైతులలోని అతి కొద్ది శాతానికే ఎంఎస్‌పీ లభిస్తుందనే విషయం ప్రధాన స్రవంతి ఆర్థికశాస్త్రవేత్తలకు, విద్యావేత్తలకు సైతం మింగుడుపడేది కాదు. సుధీర్ఘ కృషి ఫలితమైన ప్రభుత్వ సేకరణ వ్యవస్థను మొత్తంగా చాపలా చుట్టి పారేయాలని గత కొన్నేళ్లుగా మన విధానకర్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కనీస మద్దతు ధరలు ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని సృష్టించాయని, అందువలన రైతులు మెరుగైన ధరలను రాబట్టుకోలేకపోతున్నారని వారి వాదన. నిజానికి,  సేకరణ ధరలను లెక్కగట్టే వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషనే (కమిషన్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ కాస్ట్స్‌ అండ్‌ ప్రైసెస్‌–సీఏసీపీ) స్వయంగా కనీస మద్దతు ధరలను రద్దు చేసి, వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయాన్ని మార్కెట్లకే వదిలేయడాన్ని అనుమతించాలనే ప్రచారోద్యమానికి నాయత్వం వహిస్తోంది.


మార్కెట్లే గనుక అంత సమర్థవంతమైనవైతే, రైతులు ఎంఎస్‌పీతో పాటూ 50 శాతం లాభాన్ని ఎందుకు డిమాండు చేస్తారో నాకు అంతుపట్టడం లేదు. ఏదిఏమైనా, కనీస మద్దతు ధరలకు వ్యవసాయ ఉత్పత్తిని సేకరించడమనేది పంటకు మెరుగైన ధర దక్కడానికి ప్రాథమికమైన ముందు షరతు. దీన్ని అర్థం చేసుకోవడానికి పంజాబ్, బిహార్‌లను సరిపోల్చి చూద్దాం. పంజాబ్‌లో చక్కగా ఏర్పాటు చేసిన మండీల (మార్కెట్ల) వ్యవస్థ, గ్రామాలను అనుసంధానించే లింకు రోడ్లు ఉన్నాయి. ఫలితంగా, ఈ ఏడాది రైతులు క్వింటాలు గోధుమకు రూ. 1,625 సేకరణ ధరను పొందగలిగారు. మరోవంక, బిహార్‌లో 2007 నుంచి ఏపీఎంసీ(అగ్రికల్చరల్‌ ప్రొడ్యూస్‌ మార్కెట్‌ కమిటీ) నియంత్రణలోని మండీలు లేవు. బిహార్‌ రైతులు కూడా ఈ ఏడాది పుష్కలంగా గోధుమ పంటను తీయడం కోసం కష్టపడి  పనిచేశారు. అయినా ఏపీఎంసీ మండీలు లేకపోవడంతో కనీస మద్దతు ధరలను పొందలేకపోయారు.


చాలా మంది రైతులకు కారు చౌక ధరలకు అమ్ముకోవడం తప్ప గత్యంతరం లేకపోయింది. ఉత్తరప్రదేశ్‌లో సైతం కేవలం 3 శాతం రైతులకే మద్దతు ధరలు దక్కాయి. మిగతా వారంతా అత్యధిక భాగం గోధుమను  క్వింటాలుకు రూ. 1,200 నుంచి రూ. 1,500 మధ్య ధరలకు అమ్ముకోవాల్సి వచ్చింది.


మద్దతు ధరల పరిధిని దాటి ఆలోచించాలి

అందువలన, రైతులు కనీస మద్దతు ధరలతో పాటూ 50 శాతం లాభాన్ని కోరినా అది ఏపీఎంసీ మండీలు అందుబాటులో ఉండే 6 శాతం రైతులకే లభిస్తాయి. మరి మిగతా 94 శాతం రైతుల మాటేమిటి? అనే సమస్య తలెత్తుతుంది. వారంతా పేదరికంలో మగ్గుతూ ఉండటం కొనసాగాల్సిందేనా? వారు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండరా?


కాబట్టి రైతులు, ప్రత్యేకించి నేటి తరం రైతు నాయకులు ఈ కనీస మద్దతు ధరల పరిధికి మించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)  భారత్‌ కనీస మద్దతు ధరలలో మరింత పెంపుదలను వ్యతిరేకిస్తోంది. దాని నిబంధనలను అనుసరించి అభివృద్ధి చెందుతున్న దేశాలేవీ అనుమతించదగిన కనీస మద్దతు ధరలకు మించి పెంచడానికి వీల్లేదు. ఇలాంటి సమయంలో పంటల మద్దతు ధరలను పెంచడానికి ఉన్న విధానపరమైన అవకాశాలు కుచించుకుపోయాయని రైతులు, రైతు నేతలు అర్థం చేసుకోవాలి. పైగా, ప్రభుత్వాలు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రైతాంగాన్ని ప్రాథమికమైన పనిముట్టుగా వాడుకుంటున్నాయి. కాబట్టి స్వామినాథన్‌ కమిటీ నివేదికకు అనుగుణంగా ఎంఎస్‌పీని పెంచడం సాధ్యం కాదనే చెప్పాలి. రైతులకు 50 శాతం లాభాన్ని చేకూర్చజాలమని, అది మార్కెట్‌ ధరలను వక్రీకరిస్తుందని ఈ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టుకు చెప్పింది. మరోవిధంగా చెప్పాలంటే ఆహారాన్ని పండిస్తున్నందుకుగానూ రైతులను శిక్షిస్తున్నారు.


ఇది అర్థం చేసుకోవడానికి ఈ ఖరీఫ్‌లో తాజాగా ప్రకటించిన మద్దతు ధరలను చూద్దాం. దేశంలో రైతుల ఆందోళనలు సాగుతుండగా సేకరణ ధరలను ప్రకటించారు. కనీస మద్దతు ధరపై 50 శాతం లాభం కోసం వెల్లువెత్తుతున్న డిమాండుకు చలించకుండా ప్రకటించిన ఖరీఫ్‌ ధరలు ఉత్పత్తి వ్యయానికి బొటాబొటిగా సరిపోతాయి. వరికి కొత్త ధర క్వింటాలుకు రూ. 1,550. అంటే క్వింటాలుకు రూ. 80 పెరుగుదల. గత ఏడాది «ధరతో పోలిస్తే 5.4 శాతం పెరుగుదల. అలాగే పత్తి, మొక్కజొన్న, సన్‌ఫ్లవర్‌ విత్తనాల విషయంలో కూడా గత ఏడాదితో పోలిస్తే వాటి ధరలను 4.4 శాతం మేరకు పెంచారు. ఇక ఖరీఫ్‌ పప్పు ధాన్యాలు... కంది, మినుము, పెసర ధరలను 6.7 నుంచి 7.0 శాతం వరకు పెంచారు.

‘మింట్‌’ పత్రిక విశ్లేషణను బట్టి చూస్తే, ఈ ధరలలో పెరుగుదల ఉత్పత్తి వ్యయాలపై కేవలం నామ మాత్రపు శాతం మాత్రమే. ప్రభుత్వం ఇప్పుడు తమ బఫర్‌ స్టాక్‌ కోసం మాత్రమే పప్పుధాన్యాలను సేకరించి, మిగతా రైతులను మార్కెట్‌లోని ఒడిదుడుకులకు వదిలేస్తుండటమనే సమస్యను ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. గత ఏడాదిలాగే మార్కెట్‌ ధరలు బహిరంగ మార్కెట్లో భారీ ఎత్తున పడిపోయినప్పుడు, ఇప్పుడు కూడా అదే దౌర్భాగ్య పరిస్థితిని రైతులు ఎదుర్కొనవలసి వస్తుందని నా భయం.   


విధానపరమైన మౌలిక మార్పు అవసరం

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కోసం కనీస మద్దతు ధరలను ఉద్దేశపూర్వకంగానే ఇన్నేళ్లుగా తక్కువగా ఉంచుతున్న పరిస్థితుల్లో, పైగా ఆ కనీస ధరలు సైతం 94 శాతం రైతులకు దక్కకుండా ఉన్న స్థితిలో... రైతాంగం ‘ధరల విధానం’ కాలం నుంచి ‘ఆదాయ విధానం’ కాలానికి మరలాల్సిన సమయం ఆసన్నమైంది. రుణమాఫీ సైతం, రుణాలు పేరుకు పోకుండా ఉండటానికి హామీని కల్పించే విధానాలను వెన్నంటి జరగాల్సిందే. నేటి వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారం... ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి మాసికలు వేయడం కాదు. ఒక సర్వసమగ్ర వైఖరి, ఆర్థిక చింతనలో సమూలమైన మార్పు అందుకు అవసరం. సాగుబడిని ఆర్థికంగా లాభదాయకమైనదిగా చేయడానికి సాగించే కృషే అందుకు ప్రారంభ స్థానం.


1. కనీస మద్దతు ధరలను లెక్కగట్టే వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌ గృహవసతి, విద్య, వైద్యం, రవాణా బత్తాలను  (అలవెన్స్‌లను ) పరిగణనలోకి తీసుకుని రైతులకు చెల్లించే ఎంఎస్‌పీలను నిర్ణయించాలి. కనీస మద్దతు ధరలు ఇంతవరకు ఉత్పత్తి వ్యయాలకు సరిపడేవిగా మాత్రమే ఉంటున్నాయి. 108 బత్తాలను పొందే ప్రభుత్వ ఉద్యోగులతో ఒక్కసారి రైతుల స్థితిని పోల్చి చూడండి.


2. కనీస మద్దతు ధరలు కేవలం 6 శాతం రైతాంగానికే మేలు చేస్తాయి కాబట్టి, ఎంఎస్‌పీపై 50 శాతం లాభం కావాలంటూ చేసే డిమాండు 6 శాతం రైతులకే లబ్ధిని కలుగజేస్తుందని అర్థం చేసుకోవాలి. మిగతా 94 శాతం రైతులు దోపిడీమయమైన మార్కెట్లపై ఆధారపడాల్సి వస్తోంది. కాబట్టి, జాతీయ రైతు ఆదాయ కమిషన్‌ను (ఎన్‌ఎఫ్‌ఐసీ) ఏర్పాటు చేయడం అవసరం. ఆ కమిషన్‌కు ఒక్కో రైతు కుటుంబానికి కనీసం రూ. 18,000 నెలసరి ఆదాయ ప్యాకేజీని అందించే అధికారాన్ని ఇవ్వాలి.


3. తక్షణమే ఏపీఎంసీ మండీలను, సరుకు నిల్వ గోదాములను నిర్మించడానికి ప్రభుత్వరంగ పెట్టుబడులను పెట్టాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో కేవలం 7,700 ఏపీఎంసీ మండీలు మాత్రమే ఉన్నాయి. ప్రతి 5 కిలో మీటర్ల పరి ధికి ఒకటి చొప్పున దేశంలో 42,000 మండీలను నిర్మించడం అవసరం. బ్రెజి ల్‌లో రైతులు మార్కెట్‌కు తెచ్చిన వస్తువులను సేకరించడం  తప్పనిసరి. ఏపీఎంసీ మండీలు కూడా అది చేయగలిగే విధంగా వాటిని సంసిద్ధం చేయాలి.




వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు

దేవిందర్‌శర్మ

ఈ మెయిల్‌ :hunger55@gmail.com

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top